బ్లాగర్లు!! అందుకోండి నెనర్లు!!

12/07/2011 - రాసింది karthik at Wednesday, December 07, 2011
నవంబర్ 12, 2011

ఉదయం 9:30,
రాజ్ కుమార్ కి ఫోన్ చేశాను.. ఎందుకో మరి ఫోన్ ఎత్తలేదు..  హైదరాబాద్ నుంచీ ఒక బ్యాచ్, బెంగళూరు నుంచీ ఒక బ్యాచ్ వస్తున్నారు.. అందులో చాలామంది సీమ సందుల్లోకి మొదటి సారి వస్తున్నారు..  ఎక్కడున్నారో ఏమో అని టెన్షన్!!  అసలే ఈ సారి అక్టోబర్ లో కూడా ఎండలుగా ఉన్నాయి,  వీళ్ళకు ఎలా ఉందో ఎమో..

హైదరాబాద్ బ్యాచ్ పరిస్థితి ఏంటో కనుక్కుందామని రెహ్మాన్ కు ఫోన్ చేశాను.. రెహ్మాన్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.. ప్రతీ మాటకు పక్కన కౌంటర్ పడుతూ ఉంది.. ఒక నిమిషం తర్వాత నేను మాట్లడలేను బాబూ అని ఫోన్ పెట్టేశాడు.. సో బానే ఎంజాయ్ చేస్తున్నారు, పర్లేదు అనుకున్నాను..

మధ్యాహ్నం 12:40,
మళ్ళీ రాజ్ కే ఫోన్ చేశాను..  ఒక లేడీ వాయిస్ మా సీమ యాసలో జవాబిచ్చింది.. నేను ఆ గొంతు ఎవరిదో కనుక్కున్నాను.. సొ అందరూ కలిశారు ఎంజాయ్ చేస్తున్నారు అని ఊపిరి పీల్చుకున్నాను.. తర్వాత ఒక గంట సేపు ఇంట్లో పనులలో బిజీగా ఉండటం వల్ల ఎవరికీ ఫోన్లు చెయ్యలేదు స్టేటస్ అడగలేదు..

మధ్యాహ్నం 3:15,

ఈసారి మళ్ళీ రహ్మాన్ కు ఫోన్ చేశాను..  టిపికల్ రెహ్మాన్ స్టైల్ లో "బస్సులో కాక బండి తీసుకుని వస్తున్నామండి" అని జవాబిచ్చాడు.. హమ్మయ్య అని కుదుటపడ్డాను.. ఎందుకంటే అనంతపురం నుంచీ పులివెందులకు 3గం. ప్రయాణం అని ఎవరో చెప్పారు.. మూడు గంటలు ఆ డొక్కు బస్సులో జర్నీ చేస్తే వీళ్ళ పరిస్థితి స్త్రీవాద కథ లో హీరోలా తయారౌతుంది..

పులివెందుల పేరు విని వీళ్ళు కూడా "ఓదార్పు యాత్ర" సభ్యులనుకోకండి.. వేదమంత్రాల నడుమ అగ్నిహోత్రుని సాక్షిగా నవంబర్ 13, 2011 నాడు నా పెళ్ళి జరిగింది..  ఆ పెళ్ళికని మన బ్లాగర్లందరూ పులివెందులకు వచ్చారు.. డైరెక్ట్ గా పులివెందులకు ట్రైన్ సదుపాయం లేదు కనుక రెండు బ్యాచులు అనంతపురం లో కలిసి కొంతసేపు జీవని పిల్లలతో ఉండి తర్వాత పులివెందులకు వచ్చారు.. బ్లాగర్లంతా సందడి సందడిగా అల్లరి చేశారు.. నేను పిటల మీద నుండి మధ్య మధ్యలో వీళ్ళని చూస్తున్నాను.. ఎందుకంటే వీళ్ళకు ఆ మొత్తం గుంపులో నేను తప్ప ఇంకెవరూ తెలీదు.. నేనేమో మాట్లాడలేను.. వీళ్ళకు బోర్ కొడుతుందేమో అని కొంచెం ఫీలింగ్.. కానీ బ్లాగర్లా మజాకా.. అందరూ దుమ్ము లేపారు..ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడి కడప.. ఎక్కడ నా సోది, ఎక్కడ వాళ్ళ కవితలు, పాటలు.. కొందరు జిల్లాలు దాటి వచ్చారు.. కొందరు రాష్ట్రాలు దాటి వచ్చారు.. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాంజలి..  ఫ్రెండ్షిప్ కు విలువ ఇచ్చి ఇంత దూరం వచ్చారని మా అమ్మా వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు.. చాలామంది మెయిల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. 

మన వాళ్ళిచ్చిన గ్రీటింగ్ కార్డ్.. ఎంత నచ్చిందో..
పెళ్ళికి వచ్చిన బ్లాగర్లు:
1. భజ్ కుమార్
2. సెగట్రీ
3.  మజ్జిగ చిలికే
4. వెంకట్ గారు
5. తీగ ప్రసాద్
6.  గిన్నెల గరన్
7.  కింకర్. తుస్
8. బంతి గారు ( మా అధ్యక్షులు)
9. అల్లాఉద్దీన్ మిల్క్ షేక్
10. డ్రాగార్జున
11.  జీవని ప్రసాద్ గారూ
12. చిలమకూరు విజయమోహన్ గారు





వస్తామని అనుకుని ఆఖరి నిముషం లో రాలేకపొయిన వాళ్ళు:
1. పప్పు సార్
2. బులుసు గారు
3. కౌటిల్య
4. ఆర్కె
5. ఆండి
6. పవన్ 
7. విజయక్రాంతి (ఈయన ఇప్పుడు నాకు బంధువు అవడం వల్ల వాళ్ళ అమ్మ గారు వచ్చారు)  
8. పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఇండియాకు వచ్చిన మంచు గారు ఆ లోపే మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు.  ఆయనకూడా వచ్చుంటే ఇంకెంత సందడిగా ఉండేదో!!! 
9. ఏకలింగం గారు కూడా ఇండిఆ కు వస్తే పెళ్ళి అటెండ్ అవుతానని చెప్పారు.. కానీ ఆయన ప్లాన్ తర్వాత మారింది..

I very much missed all of you.. your presence means a lot to me..

బులుసు గారు వస్తే కనుక ఆయన్ని ఎలాగోలా మేనేజ్ చేసి ఘృతాచి చేత గానా బజానా ఏర్పాటు చేయించాలని మన కుర్రోళ్ళు ప్లాన్ చేశారట.. అది తెలిసే ఆయన రాలేదు అని బయట టాక్..  ఎంత వరకూ నిజమో నాకైతే తెలీదు.. ఆ స్కాం తో నాకేం సంభంధం లేదు..

వీళ్ళే కాక, వై.యస్. వివేకానంద రెడ్డి, ఒంగోల్ శీను, వై.యస్. భాస్కర్ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా నా పెళ్ళి వచ్చి నన్ను ఆశీర్వదించారు..  కెబ్లాస నుంచీ ఎవరూ రాలేదు.. మరే! ఒంగోల్ శీను ఇప్పుడు బ్లాగర్ స్థాయి నుంచీ ప్రముఖుడి స్థాయికి చేరుకున్నాడు.. :D

-- కార్తీక్

మహిళా బ్లాగర్లకు బొనాంజా ;)

10/12/2011 - రాసింది karthik at Wednesday, October 12, 2011
ఈ మధ్య నాకు లేటుగా తెలిసినా లేటేస్టు గా తెలిసిన విషయం ఏమిటంటే బ్లాగర్లు నన్ను నా వంటల వల్ల గుర్తుపెట్టుకుంటున్నారట. అందుకని వారి అభిమానాన్ని గుర్తిస్తూ వాళ్ళ కోసం మరో వంటకం అందిస్తున్నాను.
ఈరోజు వంటకం పేరు బెంగళూరు వంకాయ పప్పు.. అసలు బెంగళూరు వంకాయ అంటే చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళ సౌకర్యం కోసం కింద క్లోజప్ ఫోటో పెట్టాను అది చూసి మీ జ్ఞాన చక్షువులను తెరిచి ఆ జ్ఞానాన్ని పొందండి.   ఇక అసలు ఈ కూరగాయనే ఎందుకు తీసుకున్నానంటే మా ఇంటి పక్కనున్న షాప్ లో వేరేవి లేవు అందువల్ల..
బెంగళూరు వంకాయ

 పోతే ఈ వంటకానికి కావాల్సిన వస్తువులు: ఒక బెంగళూరు వంకాయ, ఒక కట్ట కరివేపాకు, కొంచెం కొత్తి మీర, 3 చెంచాల నెయ్యి (ఒక చెంచా తిరగవాతలోకి, రెండు చెంచాలు ఆ తర్వాత కలుపుకునేటప్పుడు వేసుకోవడానికి)  మరియూ తిరగవాత సామాన్లు .. వీటన్నిటితో పాటూ కావాల్సింది కొండంత మోటివేషన్..  నా అంత మోటివేషన్ మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ; కాబోయే కుటుంబరావుకు కొవ్వెక్కువ సారీ కసి ఎక్కువ. కనుక "డాక్టర్ సినీ యాక్టర్" సినిమాలో కృష్ణ లా మోటివేట్ అయ్యి కసితో వంట మొదలు పెట్టాను.

ఇకపోతే సామాన్ల తో పాటు పెరుగు ప్యాకెట్ కూడా ఉంది.. అది ఎందుకంటే ఒక వేళ ఈ తిండి అటో ఇటో ఐతే అప్పుడు ఎంచక్కా పెరుగన్నం లాగించెయ్యచ్చు.. మరే!  పడవతో పాటూ లైఫ్ బోట్ కంపల్సరీ కదా..  ఇలా అనుకుని ముందు కూరగాయలు తరిగాను.. ఈసారి పుస్తకాలు చదవలేదు కాబట్టి ఎలా తరగాలి అన్న కంఫ్యూజన్ అస్సలు లేదు..  నాకు ఇష్టం వచ్చినట్టుగా నిలువుగా అడ్డంగా, నా సామి రంగా చెడామడా తరిగేశాను..  ముందు ఆ ఫోటోలు పెడదామనుకున్నాను మళ్ళీ ఈ టపా లేడీస్ స్పెషల్ కదా, అంత వయొలెంట్ ఫోటోలు వద్దని పెట్టలేదు.  అలా తరిగాక కుక్కర్లో కొంచెం కందిపప్పు, ఈ వంకాయ ముక్కలు మరియూ నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టాను.. మా కుక్కర్ గ్యాస్ కట్ లేచిపొయినట్టుగా ఉంది కనుక అసలు విజిల్స్ రాలేదు..  మా కుక్కర్ కూడా మా మేనేజర్ లాగే అవసరానికి ఎప్పుడూ ఉపయోగపడదు.. కొంచెం సేపటి తర్వాత నేనే ఆఫ్ చేసి కుక్కర్ మూత తీయడానికి ట్రై చేశాను అది నా మీద చాలా కోపంగా ఉంది కాబోలు కస్సు బుస్సు అని సెగలు కక్కింది.. శాంత్ గదా ధారీ భీం శాంత్ అని కొన్ని నీళ్ళు చల్లి కొంచెం సేపు వెయిట్ చేసి కుక్కర్ మూత తెరిచాను.. స్పూన్ తో పప్పుని, కూరగాయలను టచ్ చేసి చూశాను అవి ఉడికిపోయి ఉన్నాయి.. వావ్! సగం వంట అయిపోయింది.. ఇంక మిగిలింది తిరగవాత వెయ్యడం మాత్రమే.. జజ్జినక జజ్జినక!!    
తిరగవాత అనేది ఒక సెపరేట్ అసైన్మెంట్.  వంట అనేది థియరీ పరీక్షల్లాంటిదైతే తిరగవాత ల్యాబ్ exam లాంటిది.. కనుక ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వైవా చెప్పినంత బాగా నటించాలి..   ముందుగా  కొంచెం నెయ్యి వేడి చేసిన బాణలి లో వెయ్యాలి.. అది కాగిందా లేదా తెలుసుకోను కొన్ని ఆవగింజలు వెయ్యాలి.. అవి బుస్ బుస్ అని సౌండ్ చేశాక అందులో కరివేపాకు, సన్నగా తరిగిన మిరపకాయలు, తిరగవాతలో వేసే బేడలు(పేరు మర్చిపోయాను ఏమనుకోకండి) , ఇంగువ వేయాలి.. ఆ తర్వాత తిరగవాత లో నుంచీ కొంచెం పొగ రావడాం మొదలయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి.. అంతే! తిరగవాత రేఢీ.. ఇప్పుడు ఈ తిరగవాతను ఆ పప్పులో వేసి దానికి తగినంత ఉప్పూ, కారం, పసుపు వేసి బాగా కలపాలి..  (ఇంట్లో ఉంటే కొంచెం చింతపండు కూడా వెయ్యచ్చు కానీ నా దగ్గర లేదు కనుక వెయ్యలేదు)
  ఇంకా చెప్పేదేముందీ?? మీ అభిమాన వంటకం బెంగళూరు వంకాయ పప్పు రెఢీ..

మహిళా బ్లాగర్లందరూ ఈ వంటకం యొక్క రెసిపీని విచ్చలవిడిగా వాడుకోవచ్చు.. నేనెలాంటి పేటెంట్ గొడవలు చెయ్యనని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను..   ఇలా మహిళా ప్రత్యేకమైన టపాలు రాసి స్త్రీజాతిని ఉద్దరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. నాకు ఈ అవకాశం కల్పించిన బ్లాగర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 


-కార్తీక్

అక్కినేని టాప్-10

9/15/2011 - రాసింది karthik at Thursday, September 15, 2011
తెలుగు సినీచరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారి శకం ఒక సువర్ణాధ్యాయం. ఆయన నటించిన సినిమాలలో టాప్-10 ఏవి అని చర్చకు చిత్రమాలిక శ్రీకారం చుట్టింది. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రేక్షకులు మెచ్చిన ఆ సినిమాల గురించిన ఒక repository తయారు చెయ్యడమే తప్ప మరొకటి కాదు. ఈ పని అనుకున్నంత సులువు కాదని తెలుసు కానీ సినిమాల మీద అభిమానం ఈ కార్యానికి పురికొల్పింది. అందరూ ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని చిత్రమాలిక టీం మనవి చేస్తోంది.

అవినీతి; అన్నా హజారే; నా అభిప్రాయాలు

8/23/2011 - రాసింది karthik at Tuesday, August 23, 2011
ప్రస్తుతం దేశం లో అవినీతి పై ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ చర్చలో ఏదో నాకు తోచిన నా రెండు పైసలు ఇలా రాస్తున్నాను..
స్థూలంగా ఈ అవినీతి పై చర్చకు రెండు పార్శాలు..
1. ఒకటి అసలు ఇండియాలో అవినీతిని ఎలా అంతమొందించాలి??
2. రెండవది అన్నా హజారే చేస్తున్నది సబబేనా??
మొదటి విషయానికి వస్తే, మన ప్రియతమ ప్రధానమంత్రి గారూ తన దగ్గర మంత్రదండేమేదీ లేదని, పరిష్కారం కుదరదనీ, తానూ నిమిత్త మాత్రుణ్ణనీ, సెలవిచ్చారు.. ఒక పాత కథలో ఎవరో ఒక పండితుడు కాశీకి పొయ్యి పెద్ద చదువులు చదివి తన సొంత బాష మరిచిపోయాడట, (ఆయనకు తిరిగి తన బాషా జ్ఞానం కలిగించడానికి గాడిదతో తన్నించాల్సి వచ్చిందట.. ఆ కథ మనకెందుకులేండి వదిలేయండి.. మళ్ళీ పెటా సభ్యులు గానీ చూస్తే ఇబ్బంది)  అలా ఉంది మన సింగు గారు చెప్పిన విషయం.. ఇక నా విషయానికి వస్తే, నేను ప్రధానమంత్రినీ కానూ , ఆర్థిక శాస్త్రం అసలు చదువుకోలేదు, హార్వార్డ్ డిగ్రీలు అంతకుముందే లేవు.. కనుక ఎంచక్కా నా ఆలోచనలు రాసేస్తున్నాను.. (మరే నా బ్లాగుకు నేనే సుమన్ :)) .. అవినీతి అనే కాక ఏ విషయం అయినా వ్యక్తి స్థాయిలో మార్పు రాకుండా సమాజం మారాలని ఆశించడం అర్థ రహితం.. ఈ వాదన నేను 100% ఒప్పుకుంటా, కానీ వ్యక్తి స్థాయిలో మార్పు రాలేదు కాబట్టి వ్యవస్థ అలానే ఉండాలని అనుకోవడం ఇంకా ఘోరం.. ఇక వ్యక్తి స్థాయిలో మార్పు అంటామా, అది రావడానికి మన సమాజం పరిస్థితులు ఎలా ఉన్నాయి??  మన విద్యా వ్యవస్థ పతనావస్థ లో ఉంది.. మన విద్యా సంస్థల నుంచీ సాఫ్ట్ వేర్ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్స్ వస్తున్నారేమో కానీ సమాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు??  సామాజిక బాధ్యత వరకూ ఎందుకు మన సొంత మనుషుల పట్ల ఎంతమాత్రం బాధ్యతతో ఉన్నాం?? ప్రతీ వందమందిలో నలభై మంది మహిళలు గృహ హింస బారీన పడుతున్నారు (This number might be over rated but 20-25% looks reasonable to me).. ఆడపిల్ల గడపదాటితే ఎవడు ఆసిడ్ పోస్తాడో అని జనాలు భయపడుతున్నారు.. ఇక తల్లి దండ్రులు గురువుల కు మనం చూపిస్తున్న గౌరవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఒక తండ్రీ/గురువు కామెడీ క్యారెక్టర్ కానీ సినిమా వచ్చి ఎన్ని రోజులయింది??  ఇన్ని రుగ్మతలతో ఉన్న ఈ తరాన్నుంచీ అవినీతిని కాక ఇంక ఏమాశించగలం??జవాబు కష్టంగా ఉంది కదూ.. శ్రమ ఎందుకు లేండీ, వదిలేయండి!!
ఒక 3-4 సంవత్సరాల క్రింద మాట, ఒక ప్రఖ్యాత సంస్థ నుంచీ విఖ్యాత కోర్స్ చదివి ఫైనల్ సెమిస్టర్ లో ప్లేస్మెంట్ జరగలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. మూడు రోజుల పాటూ శవం సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ ఉంది.. అంటే మూడు రోజులుగా తమ తోటి విద్యార్థిని మెస్ కు రాలేదు, క్లాసులకు రాలేదు అన్న సృహ కూడా ఎవరికీ కలగలేదు.. ఇంతకంటే ఏం చెప్పాలండీ మన సామాజిక బాధ్యత గురించి??  బాధగా ఉంది కదూ, సరే అయితే వదిలేయండి.    
ఒక రెండు నెలల క్రితం మా నాన్న గారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచీ పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన రోజు జరిగిన కార్యక్రమం లో దాదాపు 200 మంది పాల్గొన్నారు.. 1987 లో మా నాన్న తో కలిసి పని చేసిన వాళ్ళు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు.. సో కాల్డ్ MNC ఉద్యోగులూ, ఒక్కసారి ఆలోచించండి మనం పదవీ విరమణ అంటూ చేస్తే (మనకు అంత అదృష్టం కూడానా, పింక్ స్లిప్పులు రాకుంటే అదే చాలు!!) .. ఆ రోజు మనకు Best Wishes అని చెప్పడానికి ఎంతమందికి తీరిక ఉంటుందంటారు?? పోనీ మన పాత టీముల్లో కలిసి పని చేసిన వాళ్ళలో ఎంత మందితో మనం ఫేస్ బుక్ హలో లు కాక మనస్పూర్తిగా బాగున్నావా అని అడిగాము??  మరీ పర్సనల్ గా ఉంది కదూ సరే అయితే ఇది కూడా వదిలేయండి.
ఒక జాతిగా మనం ఎంతగా దిగజారామో మన రాజకీయ నాయకులు కూడా అలానే ఒక్కో మెట్టూ పైకెక్కుతూ మనకు అందని స్టేజికి చేరుకున్నారు. యథప్రజా తథా రాజా.. ప్రజస్వామ్యం కదా అందుకని సామెత కూడా మారింది.  

ఇక ఈ చర్చ లో రెండవ విషయానికి వద్దాం " అన్నా హజారే చేస్తున్నది సబబేనా?? " లోక్ పాల్ తో అద్భుతాలు జరిగిపోవు, ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది లంచాలివ్వకుండా పనులు చేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న.  నిజమే వాళ్ళల్లో చాలామంది లంచాలిచ్చి అవసరానికి తమ పనులు జరిపించుకుంటూ ఉండవచ్చు కానీ అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేక వాళ్ళ నిస్సహయత అలా చేయిస్తోందా అనేది చూడాలి..  ప్రతీ ఒక్కరికీ లంచాలివ్వకుండా తట్టుకుని నిలబడే స్థోమత/పరపతి/ధైర్యం ఉండాలి కదా.. లంచం ఇవ్వకపోతే అంతులేని జాప్యాలు అర్థం లేని తిరస్కరణలు.. బ్రతుకు భారం తో కృశించిపోతున్న సగటు మనిషి మరింత భారం మోసే పరిస్థితుల్లో లేడు కదా.. దాని ఫలితమే ఈ అవినీతి!! ఈ అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదంటారా?? ఏమో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, నీతి నిజాయితీలు కలిగిన వాళ్ళు మన సమాజం లో ఇంకా ఉన్నారు. వాళ్ళను సమర్థించే వాళ్ళూ ఇంకా ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్లు కాదు, క్రికెటర్లు అసలు కాదు.. మేతావులు అసలే కాదు(అథోగతి రాయ్ గురించి అనుకుంటున్నారా?అయితే మీకు 120 మార్కులు).. వాళ్ళంతా ఊరూ పేరూ లేని Stupid Common Indians.. బాబా రాందేవ్ వెంట అంతమంది నడిచినా, అన్నా హజారే యూత్ ఐకాన్ గా మారినా ఇదంతా వాళ్ళ పుణ్యమే!!


నావరకూ ఫ్రీడం పార్క్ కు వెళ్ళిన రెండు సార్లు చాలా ఆత్మ సంతృప్తి తో ఇంటికి వచ్చాను. ఈ దేశానికి ఇంకా భవిష్యత్తు ఉంది అని నాకు నమ్మకం కలిగించిన ఉద్యమం ఇది.
జై హింద్!!! 


ఈ టపా రాయడానికి ప్రేరణనిచ్చిన టపాలలో కొన్ని:



మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు!!!

8/22/2011 - రాసింది karthik at Monday, August 22, 2011
మెగాస్టార్ చిరంజీవికి చిత్రమాలిక టీం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. పూర్తి వ్యాసం ఇక్కడ చదవగలరు..

ముందడుగు(1983) గురించి చిత్రమాలికలో..

8/18/2011 - రాసింది karthik at Thursday, August 18, 2011
కృష్ణ శోభన్ బాబు ల కామెబినేషన్ లో వచ్చిన ముందడుగు చిత్రం గురించి చిత్రమాలికలో చదవండి... పూర్తి పాఠం ఇక్కడ చూడండి

మరణ మృదంగం(1988) గురించి చిత్రమాలిక లో

8/17/2011 - రాసింది karthik at Wednesday, August 17, 2011
కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తే సినిమా ఎలా ఉంటుందో అని ఒక ఉత్కంఠ ఇంకొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే అది సూపర్ హిట్ అని ముందుగానే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు..
అలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమానే మరణ మృదంగం. చిరంజీవి-యండమూరి-కోదండరామిరెడ్డి ల కాంబినేషన్ లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా “మరణ మృదంగం”

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

చిత్రమాలికలో పెళ్ళిపుస్తకం

7/27/2011 - రాసింది karthik at Wednesday, July 27, 2011
మనదేశం లో ఎన్ని కొండలు ఉన్నా హిమాలయాలకు సాటి రావు.. మన దర్శకులలో బాపూగారి స్థానం అలాంటిదే.. బాపు గారి దర్శకత్వం లో వచ్చిన పెళ్ళి పుస్తకం గురించి చిత్రమాలికలో (ఇక్కడ) చూడండి..

జీవని యాత్ర

6/23/2011 - రాసింది karthik at Thursday, June 23, 2011
మొన్న ఆదివారం జీవనికి వెళ్ళాం కదా.. ఆ రోజు మొత్తం సూపరో సూపరు :)
కడప  నుంచీ అనంతపురం ఫస్ట్ బస్ పొద్దున 5:30 కు అందుకని మా నాన్న 4:30 కు నిద్ర లేపారు.. కానీ ఈ మధ్య బద్దకం బాగా ఎక్కువైంది కదా, ఒక 20నిముషాలు అటు ఇటు చాపమీదనే పొల్లి తర్వాత నిద్రలేచాను.. పరుగెత్తుకుంటూ స్నానం చేసి బస్ స్టండ్ కు వెళ్ళాను అప్పటికి టైం 5:20.. బస్ దొరుకుతుంది లే అనుకున్నాను.. కానీ ఆ బస్ వెళ్ళిపొయి అప్పటికే 5నిమిషాలు దాటిపోయింది.. తర్వాతి బస్ తాడిపత్రి దాకా ఉంది అంటే అదెక్కాను.. ఆ బస్ 8:45 కు తాడిపత్రి దించేశాడు.. చాలాసేపు నిద్రపోవడం వల్ల ప్రయాణం చేసినట్టు అనిపించలేదు.. అక్కడి నుంచీ అనంతపురం వెళ్ళే బస్ లో జరిగింది అసలు కామెడీ.. మన రాజ్ కుమార్ కు ఫోన్ చేస్తే ఇంజినీరింగ్ కాలెజీ దగ్గర దిగేయమని చెప్పాడు.. అక్కడికి తనే వచ్చి పికప్ చేసుకుంటా అని కూడా చెప్పాడు.. నేను కండక్టర్ కు ఆ విషయమే చెప్పి పాటలు వింటూ పడుకున్నాను.. తిఫిన్ తిన్నాక నిద్రపోయాను.. కళ్ళు తెరిచి చూసే సరికి మన బస్ వాడు ఆ కాలేజీ దాటి 10నిమిషాలయ్యింది అని పక్కవాళ్ళు చెప్పారు.. కండక్టర్ దగ్గరకి పొయ్యి అడిగితే, ఆ కాలేజి దగ్గర ఎవరో దిగారు సార్ అది మీరే అనుకున్నా అన్నాడు.. మహానుభావుడిది సొంత ఊరు శ్రీకాకుళమేమో.. ఏం చేద్దాం, వెంటనే బస్ దిగేసి ఆటో కోసం చూశా.. ఒక్క ఆటో కూడా ఖాళీగా రావడం లేదు.. అన్ని ఫుల్లే, బహుశా కాలేజీ వల్ల బిజీ అనుకుంటా.. ఒక 5నిమిషాల తర్వాత ఎవరో బైక్ మీద వస్తుంటే అతన్ని లిఫ్ట్ అడిగి కాలేజీ దగ్గరికి చేరాను. ఇంకొక 5నిమిషాల తర్వాత రాజ్ వచ్చి పికప్ చేసుకున్నాడు..  ఆ శంకుస్థాపన జరిగే చోటికి వెళితే అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు చాలా జరిగాయి..ఒంగోల్ శ్రీను అనే వ్యక్తి కనిపించాడు, పక్కన రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా కనిపించాడు. ఒక వ్యక్తి ఒరిజినల్, ఫేక్ ఇద్దరూ ఒకే ఫ్రేం లో ఇద్దరు మనుషులుగా కనిపించడం బహుశా ప్రపంచ ఫేకుల చరిత్ర లో ఇదే ప్రధమం కాబోలు.. ఈ ఒక్క కారణం చాలు ఆ రోజుని ఫాదర్స్ డే కు బదులుగా ఫేకర్స్ డే గా గుర్తించడానికి.. తల తిప్పి చూస్తే బంతి అనే వ్యక్తి కూడా కనిపించాడు.. ఆశ్చర్యం!! నా ఫేక్ ఐడీ నాకు తెలీకుండా ఎలా వచ్చాడా అని కాసేపు విస్తుపోయాను.. ఆ తర్వాత జీవితం అంటే ఇంతే అని లైట్ తీసుకున్నాను.. మాతో పాటూ అక్కడ లీలామోహనం బ్లాగర్ విజయమోహన్ గారూ కూడా వచ్చారు..  రైతునని గర్వంగా చెప్పుకునే వ్యక్తిని కలవడం చాలా సంతోషం కలిగించింది.. We are proud to have met someone like you..

ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవకముందు శివకుమార్ మైక్ అందుకొని తన ప్రతిభా ప్రదర్శన మొదలు పెట్టాడు. శివకుమార్ తెలుగు, కన్నడ భాషలలో పాటలు, డయలాగులు,మిమిక్రీ చెయ్యగలడు.. కానీ ఆ రోజు మాత్రం మిమిక్రీ చేశాడు.. మైక్ దొరికింది కదా అని వై.యస్. ను చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుకున్నాడు. గెస్ట్లు వచ్చేముందు ఎవరో వెళ్ళి ఇంక చాలు రా బాబు అని మైక్ లాక్కున్నారు.. అప్పటికి గానీ మనవాడు శాంతించలేదు.. :D
ఇక ప్రోగ్రాం మొదలయ్యాక ఎవరూ ఊకదంపుడు లెక్చర్లు ఇచ్చి బుర్ర తినలేదు.. అందరూ క్లుప్తంగా తాము చెప్పాలనుకున్నది చెప్పారు.. ఇందులో నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన స్టేజ్ మీద ఉండి ప్రతీ వక్తా మాట్లాడిన దానిలో తనకేం గుర్తొచ్చాయి, ఆ విషయాలు ఇక్కడ ఎలా రిలవెంట్ అని వివరిస్తూ చాలా మంచి విషయాలు చెప్పారు.. ప్రసాద్ గారు కేవలం రెండు నిమిషాలలో తను చెప్పాలనుకున్నది చెప్పి ప్రతీ ఒక్కరిని తమ టైం లో డబ్బులో 1% సమాజానికి ఇవ్వమని చెప్పారు.. ఇది నాకు చాలా బాగా నచ్చింది.. తర్వాత ఆలూరు సాంబశివా రెడ్డి గారు మాట్లాడారు. ఈయన యస్.ఆర్.ఐ.టి. కాలేజి కరస్పాండెంట్. నేను మొదట్లో కరస్పాండెంట్ అంటే కనీసం 45 ఏళ్ళు ఉంటాయని అనుకున్నాను.. కానీ చూస్తే నాకంటే చిన్న వ్యక్తి లా కనిపించారు..   ఆయన మాట్లాడుతూ ఇంకొక 2-3 ఏళ్ళల్లో దాతలు ఎవరూ లేకపోయినా కేవలం ఇంజినీరింగ్ కాలేజీ ఫండ్స్ తో జీవనిని నడిపేందుకు తను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.. అంత అవసరం ఎప్పటికీ రాదు.. కానీ నాకు జీవని కి ఆయన కమిట్మెంట్ శ్లాఘనీయం.. ఈయన తమ ఇంజినీరింగ్ కాలేజిలో పదివేల లోపు ఎంసెట్ ర్యాంక్ ఉన్న పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఫీజ్ తీసుకోమని పొయిన ఏడాది ప్రకటించారు.. ఈ ప్రకటన చూసి నేను ఆ సంస్థకు అభిమానిగా మారాను.. నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజులలో ఫీజు కట్టలేక చదువు మానేసిన వాళ్ళను చూశా కదా, బహుశా అందువల్ల కాబోలు!

ఆ తర్వాత ఫెర్రర్ గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.. ఆ ప్రసంగం గురించి ఇప్పటికే వీజయమోహన్ గారు, రాజ్ చెప్పారు కద..తర్వాత బ్లాగర్ల ప్రతినిధిగా వికటకవి మైక్ అందుకొని తనదైన శైలిలో జీవని ముందున్న సవాళ్ళ గురించి చెప్పారు.. అంతే కాక పారదర్శకతకు పెద్ద పీట వేయడం వల్ల జీవని మీద బ్లాగర్లకున్న నమ్మకం గురించి చెప్పారు.. ఇదే స్పూర్తితో మనమందరం జీవని టీం కు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రసంగాలు అవి అయ్యాక మా ముందు వరుసలో కూర్చున్న ఒక ముసలాయన నిదానంగా లేచి నడవడం మొదలు పెట్టాడు.. ఆయనకు 70+ వయసు ఉంటుంది.. కర్ర సాయంతో నడుస్తున్నాడు..  నేను సభ నుంచి వెళ్ళిపోవడానికి లేచాడనుకున్నా.. నిదానంగా వెళ్ళి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు.. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే ఆయన జేబు క్రింద ఉన్న చొక్కా అంతా చిరిగిపోయి ఉంది.. నాకు ఎందుకో ఒక్క నిముషం కళ్ళు చెమర్చాయి.. చాలెంజ్ సినిమాలో చూపించిన ఆ ముసలమ్మ గుర్తుకు వచ్చింది.. వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలో!
ఇవన్నీ సరే కానీ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేశాం.. కొందరు బ్లాగర్లు ఇప్పుడు అంటున్నారు మాకు తెలిసుంటే వచ్చేవాళ్ళం అని.. నిజమే! అందరం కలిస్తేనే సందడిగా బాగుంటుంది.. కుదిరితే ఆగస్ట్ నెలలో ఒక రెండు రోజుల జీవని యాత్ర వెయ్యడం బాగుంటుంది అని నాకనిపిస్తోంది.. అంటే శనివారం పొద్దున అనంతపురం వెళ్ళి ఆ రోజంతా ఉండి ఆదివారం పూర్తిగా పిల్లలతో గడపేటట్టుగా వెళ్ళాలి.. చూద్దాం, ఎంతమందికి ఈ ప్లాన్ నచ్చుతుందో, ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి..   

జంధ్యాల గారి గురించి ఆదివిష్ణు గారు రాసిన వ్యాసం..

6/20/2011 - రాసింది karthik at Monday, June 20, 2011
జంధ్యాల గారు-ఆది విష్ణు గారు ఎంత మంచి మిత్రులో మనకు తెలిసిందే.. 2002లో జంధ్యాల గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆది విష్ణు గారు వ్రాసిన వ్యాసం  లోని కొంత భాగం చిత్రమాలికలో ఇక్కడ చూడవచ్చు.. ఈ వ్యాసం 16జూన్-30జూన్,2002 హాసం పత్రికలో ప్రచురితం అయ్యింది..ఈ వ్యాసం  ఒక ప్రముఖుడు మరో ప్రముఖుడి గురించి రాసినట్టుగా కాక కేవలం ఒక మిత్రుడి లేని వెలితి గురించి ఆదివిష్ణు గారు ఎలా రాశారో మనం చూడవచ్చు .. ఈ వ్యాసాన్ని ద్తొమ్మిదేళ్ళపాటూ భద్రపరిచినందుకు నాగురించి నాకే చాలా ఆనందంగా ఉంది..ఈ రోజు చిత్రమాలిక ద్వారా ఆ వ్యాసాన్ని ఆన్లైన్లో పెట్టే అవకాశం కలిగింది..   చిత్రమాలికలో వ్యాసం ఇక్కడ చూడగలరు..

చిత్రమాలికలో బద్రీనాథ్ రివ్యూ..

6/13/2011 - రాసింది karthik at Monday, June 13, 2011
మగధీర లాంటి మెగా హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచీ అలాంటి పెద్ద ఖర్చుతో, వినాయక్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ నుంచీ వస్తున్న సినిమా అంటే అంచనాలు చాలా ఎక్కువగా ఉండటం సహజం. అలాంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “బద్రీనాథ్”..

పూర్తి  రివ్యూ కోసం ఇక్కడ నొక్కండి..

బులుసేరియా మరియూ దాని పర్యవసానాలు..

6/10/2011 - రాసింది karthik at Friday, June 10, 2011
గత ఏడాది కాలంగా బ్లాగుల్లో బులుసేరియా అనే వ్యాధి బహు వేగంగా వ్యాపిస్తోందని ఇంటెలిజెన్స్ సమాచారం.. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి??వాటిని మొదట్లోనే తుంచేయడం ఎలా?? అసలు ఈ వ్యాధి కి గల కారణాలు ఏమిటి?? అనే విషయాల పై కొంత తిరిగిశోధన(re-search) చేసి ఈ క్రింది లక్షణాలు కలవారు బులుసేరియా వ్యాధిగ్రస్తులని నిర్ణయించడం జరిగింది..

1. ఏ వాస్తు జ్యోతిష్యాల గురించిన ప్రకటన చూసినా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి నవ్వడం.. 
>>ఆతర్వాత ఎ.సి తీసికెళ్ళి బాత్ రూములో పెట్ట౦డి. బెడ్ రూము ఒక అడుగు లోతు తవ్వి౦చ౦డి. బెడ్ రూములో మీమ౦చ౦ నాలుగు కోళ్ళలో రె౦డు సగానికి విరగ కొట్టి౦చ౦డి.

2. స్కూలుకుపొయ్యే ఏ చంటి పిల్లోడిని చూసినా ఈ క్రింది విషయం గుర్తొచ్చి ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోకుండా పగలబడి నవ్వడం.
>>తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా అని ఏడ్చేవాడు మాబండోడు.

3. కాంఫరెన్స్ రూం లో మీటింగ్ ఉన్నప్పుడు బాసు పక్కనే ఉన్నా కూడా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి పళ్ళికిలించడం..
>>బాసింపట్టు వేసుకొని రెండు చేతులు వళ్ళో పెట్టుకొని కళ్ళుమూసుకొని ఘృతాచి మీద మనసు లగ్నం చేసి కూర్చుంటాను.

4.ఏ భార్యా భర్తాలు మాట్లాడుకుంటున్నా ఈ క్రింది విషయాలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వడం.. వాళ్ళు సీరియస్ గా చూస్తే ఏం చెప్పాలో అర్థం కాక తింగరి ఫేస్ పెట్టడం :(
>>ఉద్యమిస్తే పొయేది ఏమీలేదు భార్య తప్ప పద౦డి ము౦దుకు పద౦డి పద౦డి.

5.పార్కుల్లో, మాల్స్ లో ఒక అమ్మాయి &అబ్బాయి కనిపిస్తే ఈ క్రింది వాక్యాలు గుర్తు రావడం.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది..
>>“ఐ యామ్ తెగ లవింగ్ యు డార్జిలింగ్,  సిమ్లా, కులుమనాలి”

6. Appraisal Discussionలో క్రింది పద్యం చెప్పుకోవాలనిపించడం.. అంత సీరియస్ టైం లో నవ్వాపుకోలేకపోవడం
>>లావొక్కింతయు  లేదు, ఎవనిచే  జనించు, కానరార  కైలాస  నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను  లోలోపల.

7. అమ్మా నాన్నలతో ఎప్పుడు మాట్లాడినా ఈ క్రింది వాక్యం గుర్తుకు వచ్చి "హహహ" అని వికట్టాట్టహాసం చెయ్యడం..
>>అయినా ఈ తల్లిదండ్రులకు,  ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక  హే కృష్ణా, ముకుందా, మురారీ   అని పాడుతుంటే విని ఆనందించాలనే  బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు

8. పెళ్ళిల్లలో నగలు దిగేసుకున్న జనాలను చూసి ఈ క్రింది వాక్యం గుర్తుకురావడం.. నవ్వితే ఏదో ఘోరాం చేసినట్టు వాళ్ళు చూడటం
>>కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళా మణుల మధ్య నించి, నన్ను లాక్కేళ్ళి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు.

వీటన్నిటినీ మించి నా ఫేవరేట్ టపా మాత్రం ఇదే  "
మీ ఆయన మిమ్మలని ఎంతగా ప్రేమిస్తున్నాడు?" ఇప్పటికి కనీసం 30 సార్లు చదివుంటాను.. :D అసలు మనల్ని ఇంతగా వెంటాడిన బులుసుగారిని కిడ్నాప్ చేస్తే ఎలాఉంటుంది అని ఆలోచించా.. ఏలూరులో ఉన్నానని మాష్టారు చెప్పేశారు కనుక ఇక మిగిలింది సూమోలను దించడమే అనుకున్నా.. కానీ ఆ తర్వాత మోకాల్లో బల్బు వెలిగింది.. తీరా అక్కడికెళ్ళాక ఈయన ఇంకెన్ని విషయాలు చెప్పేస్తారో అసలు కిడ్నాప్ చేసేలోపు మనం నవ్వి నవ్వి సృహ తప్పచ్చేమో అని డౌట్ వచ్చింది.. అందుకని భయపడి ఆ ప్రాజెక్ట్ వదిలేశా.. సీమ లో పుట్టినందుకు ఒక్కటైనా ఫ్యాక్షన్ పని చేద్దామనుకున్నా.. 
చీ! నాకోరిక ఇలా మట్టికొట్టుక్పోయింది :(

కాబట్టి కామ్రెడ్స్ నేను చెప్పేదేమిటంటే బ్లాగుల్లో ప్రస్తుతం ఉన్నవి రెండు వర్గాలు:
1. బులుసేరియా బాధితులు
2. కాదని అబద్దం చెప్పేవాళ్ళు
మీరే వర్గం వారో మీరే తేల్చుకోండి.. నేను మాత్రం మొదటి వర్గం ఒప్పేసుకుంటున్నా!

గమనిక: సెలయేరులా మొదలైన బులుసుగారి నవ్వులప్రవాహం జీవనదిలా మారి మనందరినీ తడిపిముంచెత్తింది.. ఆ హాస్యపు జల్లు మొదలై వచ్చే వారానికి(14 జూన్) ఒక ఏడాది..   ఆ రోజు నాకు పోస్ట్ వెయ్యడం కుదరకపోవచ్చు అందుకని  కూసింత ముందుగానే రాస్తున్నా.. హిహిహి!!




ఆ ముసలోడు చచ్చాడు..

6/09/2011 - రాసింది karthik at Thursday, June 09, 2011
హైందవ ద్వేషమే ఆలంబనగా జీవించిన  ఆ ముసలోడు చచ్చాడు..
సనాతన విశ్వాసాలు ఈ దేశం లో ఎంత హీన స్థితిలో ఉన్నాయో చెప్పిన ఆ ముసలోడు చచ్చడు.. 
దేవతామూర్తుల వలువలూడదీసి నగ్నత్వమే పవిత్రత అని బొంకిన ఆ ముసలోడు చచ్చాడు.. 
మరి అంత పవిత్రమైన నగ్నత్వాన్ని తన మతం వారికి ఆపాదించలేని ఆ ముసలోడు చచ్చాడు..
హిందువుల చేతకానితనానినికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
ఈ కర్మభూమిన హిందువుల ప్రారబ్దం ఏమిటో చాటిచెప్పిన ఆ ముసలోడు చచ్చాడు..
లౌకికత్వం పేరుతో హైందవ ధర్మం పైన జరుగుతున్న దాడికి సాక్షిగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
హైందవ జాతిలోని అనైఖ్యతను సొమ్ము చేసుకున్న ఆ ముసలోడు చచ్చడు..

ఇప్పుడే చూస్తున్నా.. ఆ బూతుబొమ్మల ముసలోడు చచ్చాడంట..  జనాలు తెగ సానుభూతి చూపిస్తుంటే ఊరుకోలేక ఇది రాశా.. 

కమ్యూనిస్టు రక్త చరిత్ర- ఇండియన్ వర్షన్

6/06/2011 - రాసింది karthik at Monday, June 06, 2011
(ఆంధ్రజ్యోతి ఆదివారం పేపర్లో వచ్చిన ఈ కథనం చూడగలరు.. 5వ పేజి క్లిక్ చేసి పీడి ఎఫ్ గా డౌన్లోడ్ చేసుకోగలరు..  )

కమ్యూనిష్టులు చెప్పే సమసమాజ స్థాపన లోని డొల్ల తనాన్ని బయటపెట్టే నిజాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి.. బెంగాల్ లో 34 ఏళ్ళ పాటూ పాలించాం అని జబ్బలు చరుచుకునే ఈ గోముఖ వ్యాఘ్రాలు అసలు అన్నాళ్ళు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి ఏం చేశారో సాక్ష్యాలతో సహా బయటకు వస్తుంటే ఇలాంటి రాక్షస మూక కు ఆధునిక సమాజం లో చోటు ఎలా దక్కింది అని సగటు పౌరుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.. మిడ్నాపూర్ లో మమతా బెనర్జీకి వోటు వేస్తామన్న పాపానికి కాళ్ళూ చేతులు పోగొట్టుకున్న వారి గురించి జాతీయ మీడియా లో చూశాం.. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఈ కంకాళాలు హిట్లర్ కాలం నాటి హోలోకాస్ట్ ను గుర్తుతెస్తున్నాయి.. బహుశా స్వత్రంత భారత చరిత్రలో ఇలా హిట్లర్ వారసులను చూడటం ఇదే ప్రధమం కాబోలు.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకునే కమ్యూనిష్టులు తమ అధికారం కోసం అదే పంథాను అనుసరించి తామూ ఆ తాను లో ముక్కలమే అని తెలుపుకోవడం కొసమెరుపు.. 

ఇంకా కామెడీ విషయం ఏమిటంటే, ఈ రాక్షస మూకలు బాబా రాం దేవ్ దీక్ష గురించి చులకనగా మాట్లాడటం.. ఈ దివాళాకోరు మేధావులు చేసిన ఏ ఉద్యమానికైనా ఇంత ప్రజామద్దతు లభించిందా?? నా ఇంజినీరింగ్ రోజులలో మా సీనియర్ ఒకతను ఒక మాట చెప్పేవాడు.. ప్రస్తుతం ప్రపంచాన్ని మానవసమాజం మనుగడకు పెను సవాళ్ళుగా ఉన్నవి రెండు:1. ఎయిడ్స్ 2. కమ్యూనిజం
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎందుకో అతని మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి.. ఎన్ని దేశాలను నాశనం చేశారో, ఎన్ని లక్షలమందిని చంపరో.. బహుశా లెక్క కట్టడం సాధ్యం కాకపోవచ్చు..   మనదేశం లాంటి బలమైన ప్రజాస్వామ్య దేశం లోనే వీళ్ళ ఆగడాలు ఇలా ఉంటే ఇక మిగతా దేశాల గురించి ఆలోచించడం అనవ సరం..
-
ఇంద్రకంటి కార్తికేయ

విజయ సౌరభాలలో గుండమ్మ కథ

5/23/2011 - రాసింది karthik at Monday, May 23, 2011
చిత్రమాలిక విజయసౌరభాలు  కేటగిరీ లో ఈ నెల  గుండమ్మ కథ సినిమా గురించిన వ్యాసం ప్రచురింపబడింది.. ప్రముఖ బ్లాగర్ మాలాకుమార్ గారు ఈ వ్యాసం రాశారు..


చిత్రమాలిక లో బద్రినాథ్ ఆడియో రివ్యూ..

5/10/2011 - రాసింది karthik at Tuesday, May 10, 2011
భారి సినిమాలు తీసే వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం "బద్రినాథ్",  ఇప్పటికే సినిమా ట్రైలర్స్ చాలా హైప్ సృష్టిస్తున్నాయి.. ఈ సినిమా రివ్యూ చిత్రమాలిక లో ఇక్కడ చూడండి

మిష్టర్ పర్‌ఫెక్ట్ ఎందుకు బాగుంది?? చిత్రమాలిక లో

4/25/2011 - రాసింది karthik at Monday, April 25, 2011
మిష్టర్ పర్‌ఫెక్ట్ సినిమా ఎందుకు హిట్ అయ్యింది??
ప్రభాస్ వల్లా?? కాజల్ వల్లా?? లేక దర్శకుడి వల్లా??

ఇక్కడ చదవండి !!!

చిత్రమాలిక లో విజయ సౌరభాలు

4/17/2011 - రాసింది karthik at Sunday, April 17, 2011
తెలుగు చిత్ర చరిత్రలో విజయ బ్యానర్ కు ఉండే ప్రత్యేకత తెలిసిందే.. చిత్రమాలికలో విజయా వారి సినిమాల గురించి వ్యాస పరంపర కోసం కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం.. అవి కొంత వరకూ ఫలించి ఈ రోజు ప్రముఖ బ్లాగర్ తృష్ణ గారు పాతాళ భైరవి సినిమా గురించి రాశారు.. ఇవే కాక విజయా వారి సినిమా గురించి మరికొన్ని వ్యాసాలు విషయాలు సేకరించి చిత్రమాలిక పాఠకులకు అందించాలని మా ప్రాయత్నం..  ఎవరికైనా విజయా వారి సినిమాల గురించిన విషయాలు పాఠకులతో పంచుకోవాలంటే దయచేసి నన్ను సంప్రదించండి(karthikeya.iitk@జీమెయిల్)

-కార్తీక్



ఎంతమందికి ఈ పాట తెలుసు???

3/28/2011 - రాసింది karthik at Monday, March 28, 2011
గుప్పెడు మనసు సినిమాలో ఉన్న "నేనా పాడనా" అనే ఈ పాట గురించి మీకు తెలుసా??? చిత్రమాలికలో ఈ పాట పై వచ్చిన వ్యాసాన్ని ఒకసారి చదవండి.. ఇక్కడ నొక్కండి

సోదరులారా!! ఒక విన్నపం

3/11/2011 - రాసింది karthik at Friday, March 11, 2011
ముందుగా, మీ సమయం వెచ్చించి నా బ్లాగుకు వచ్చినందుకు శిరస్సు  వంచి నమస్కరిస్తున్నాను..

ముందుగా ఒక చిన్న చందమామ కథ చెబుతాను శ్రమ అనుకోకుండా చదవండి..

ఒకానొక కాలం లో బోధిసత్వుడు కాశీ రాజుగా జన్మించాడు.. ఆయన ఒకరొజు తన రథం లో విహరిస్తుండగా ఒకానొక ఇరుకైన మార్గం లో రథం పోవలసి వచ్చింది.. ఆ మార్గం లో సగం దూరం వెళ్ళాక మరొక వైపు నుంచీ  మరొక రథం వచ్చి ఎదురుగా నిల్చింది.. ఇరుకైన ఆ మార్గం లో ఎవరో ఒక రథం వారు వెనక్కు మళ్ళితే తప్ప మరొకరు ముందుకు పోవడం కుదరదు.. ఇంతలో అటు వైపు రథ సారథి ఆ రథం లో ఉండేది మరొక దేశం యొక్క రాజని అందువల్ల బోధిసత్వుని రథం వెనక్కు మళ్ళించమని చెప్పాడు.. బోధిసత్వుని రథసారథి కూడా ఈ రథం లో ఉండేది కాశీరాజని కనుక ఆ రథాన్ని వెనక్కు మళ్ళించడం కుదరదని జవాబిచ్చాడు.. ఇలా మొదలైన సంవాదం వివాదం లా మారి మా రాజ్యం గొప్ప అంటే మా రాజ్యం గొప్ప అనే స్థాయికి చేరింది.. అందులోను ఎవరి వాదన పైచేయి  కాలేదు కనుక మా రాజు గొప్ప అంటే మా రాజు గొప్ప అనే వాదన మొదలింది.. ఆ సందర్భం లో ఆ రథసారథి తమ రాజు భృత్యులను రక్షిస్తాడని ప్రేమించేవారిని అభిమానిస్తాడని ద్వెషించేవారిని శిక్షిస్తాడని చెబుతాడు.. అది విన్న కాశీ రథ సారథి తమ రాజు భృత్యులను ఆదరిస్తాడని ద్వేషించిన వారిని ప్రేమతో జయిస్తాడని చెబుతాడు.. ఈమాట విన్న వెంటనే మరొక రథం లో ఉండే రాజు బోధిసత్వుని దగ్గరకు వచ్చి ఆయన గొప్పతనానికి శిరస్సు వంచి తన గురువుగా ఉండమని వేడుకుంటాడు..(ఆఖరి సంభాషణ పద్యాలలో జరుగుతుంది.. ఆ పద్యాలు చాలా బాగుంటాయి.. కానీ నేను మరిచిపోయాను)

ఈ కథ చెప్పడానికి కారణం ఈరోజు జరిగిన దుస్సంఘటన అని వేరే చెప్పక్కర్లేదు కదా!! ప్రస్తుతం మన రాష్ట్రం లో కూడా సీమాంధ్ర-తెలంగాణ అనే రెండు రథాలు  ఒకే మార్గం దగ్గర నిలిచిపోయాయి.. ఈ రోజు జరిగిన దాన్ని గుణపాఠం గా తీసుకుని ఇకనైనా ఈ ద్వేష ప్రచారాన్ని ఆపుదాం.. ఈ విషయం నేను తెలంగాణా మితృలకు చెబితే వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు.. కనీసం సీమాంధ్ర సోదర/సోదరీమణులన్నా జరిగినది ఒక పీడకలగా భావించి ఎటునుంచి ఏం జరిగినా మన మనస్సులో ద్వేషమనే భావనకు ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సోదరులను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. మితృలారా! ద్వేషాన్ని జయించగల ఏకైక ఆయుధం ప్రేమ/అభిమానం మాత్రమే.. తెలంగాణ ప్రజలు మనల్ని ఈరోజు ద్వేషించచ్చు మనకు గురుతుల్యులైన వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసి ఉండచ్చు కానీ మనం మాత్రం వారిని మునుపుకంటే ఎక్కువ ఆదరం తో చూద్దాం.. ఎందుకంటే, the need of the hour is not winning enemies but enemity..

జరిగినదానికి మొత్తం బాధ్యత తెలంగాణ వాళ్ళదే అని, మాకు ఏం సంభందం లేదని అనుకోవడం ప్రస్తుత పరిస్థితులలో కుదరదు.. ఇది మన కోసం మన భవిష్యత్ తరాల కోసం చేయాల్సిన గురుతర బాధ్యత.. మండుతున్న తెలంగాణ ను క్రోధం తో కప్పెట్టేదానికంటే అభిమానం తో చల్లార్చాలి.. వాళ్ళు తాలిబన్ పనులు చేశారని మనం అమెరికా లా దమనకాండకు దిగడం ఎంతవరకూ సబబు??   కనుక జరిగిన దానికి తెలంగాణ వారి పై కోపాన్ని ప్రదర్శించక ప్రేమ/అభిమానం తో వాళ్ళను  అర్థం చేసుకోండి.. ఈరోజు కాకపోయినా రేపైనా మన జాతి ఉమ్మడిగా నిలబడాలంటే ఇది మన తక్షణ కర్తవ్యం.. శాంతం  సముద్రం కంటే గొప్పది సోదరా!
ఇది చాలా కష్టమైన పని అని తీసిపారేయకండి, ఈ దేశం లో హిందువులు ముస్లింలు కలిసి బ్రతుకుతున్నప్పుడు తెలంగాణ-సీమాంధ్ర ప్రజలు ఎందుకు బ్రతకలేరు?? ఔరంజేబు కాలం లో బ్రాహ్మణులను చంపి వారి జంధ్యాలతో నీళ్ళు కాచుకుని ఔరంగజేబ్ స్నానం చేసేవాడట.. అలాంటిది ఈ రోజు మనం ఒక ముస్లిం ను భారత రాష్ట్ర పతిగా చేశాం.. అలాంటప్పుడు తెలుగు వారందరూ పరస్పర ద్వేషాన్ని ఎందుకు జయించలేరు?? కానీ ఎవరు మొదటి అడుగు వేస్తారనేదే అసలు ప్రశ్న?? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సీమాంధ్ర ప్రజలే ఈ శాంతిస్థాపనకు పూనుకోవాలి.. కనుక నా వంతుగా "తెలబాన్లు" అనే పదాన్ని బ్లాగుల్లో మనం త్యజించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..
 నేను ఈ క్రింద ఇచ్చిన సందేశాన్ని నా తెలంగాణ సోదరులందరికీ పంపుతున్నాను.. మీ అందరినీ కూడా మీకు తెలిసిన అందరు తెలంగాణ వాస్తవ్యులకు, విదేశాలలో ఉండే తెలంగాణ సోదరులకు పంపమని మనవి చేస్తున్నాను.. 

Dear Telangana friend,

Today's incident at Tankbund have immensely hurt my sentiments as I have an emotional attachment with those statues..this is completely unexpected and uncalled for.. Words like horriible, miserable will not suffice to explain the agony I'm going through.. Having said that, I still respect brotherhood that we share and promise you all my support in the hour of any need.. All I want to convey is few sweet  words, which goes like "I BELONG TO YOU"

Hugs and wishes,

urs ever,
-Karthik

నేను చెబుతున్న ఈ విషయం చాలామందికి ఒక అర్థం లేని పనిగా అనిపించవచ్చు.. కానీ మిత్రమా, మానవ మనుగడకు పరస్పర అనుభందం కంటే పెద్ద కారణం లేదని విజ్ఞులైన పాఠకులకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.. ఒక్కసారి మన పొరుగుదేశం లో ఏం జరుగుతుందో చూడండి, ప్రతీ రోజు ఒక బాంబు దాడి, పదులలో ప్రజలు దుర్మరణం..  అర్థం లేని ద్వేషం తో ఒక సమాజం ఎలా కుదేలైపోతుంది అనేదానికి అంత కంటే పెద్ద ఉదాహరణ అవసరమా??? గత దశాబ్దంగా జరుగుతున్న ఈ విషపర్వానికి స్వస్తి వాచకం పలుకుదాం.. లేకుంటే మరొక 20ఏళ్ళ తర్వాత మనం కూడా మరో పాకిస్తాన్ లా మారుతాం అనే దాన్లో నాకు ఎటువంటి సందేహం లేదు.. బయటకు వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి తిరిగివస్తారనే నమ్మకం లేని రోజులను మీరు చూడాలనుకుంటున్నారా?? ఎన్నాళ్ళీ ద్వేషపాశం?? ఎంత కాలం ఈ వీధిపోరాటాలు???

పరమేశ్వర కృపా కటాక్ష సిద్దిరస్తు,
సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్

చీకటి రహస్యాలు - 2

3/08/2011 - రాసింది karthik at Tuesday, March 08, 2011

నా చీకటి రహస్యాలు-1 చదవని వారు ఇక్కడ నొక్కి చదవండి.. (ఈ మధ్య నా బ్లాగుకు హిట్లు లేవు బాబూ అందుకే ఇలాంటి ప్రమోషన్ ట్రిక్స్)

ఇహ పోతే ఈసారి విషయాలు:

నేను చదివింది ఇంగ్లీష్ మీడియం.. చిన్నప్పటి నుంచీ టీచర్లు రెక్కలు ముక్కలు చేసుకుని చదువు చెప్పారు.. నేను మాత్రం పుస్తకాలను ముక్కలు ముక్కలు చేసి చదివాను.. కాబట్టి ముక్కలు ముక్కలుగా వచ్చింది తప్ప శుద్దంగా రాలేదు.. అసలు నన్ను స్కూల్ లో చేర్పించక ముందే మా అత్త(నా మొదటి టీచర్) నాకు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పిందట.. కానీ నేను మాత్రం అలాంటి చేదుగుళికలను ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును తాజాగా ఉంచుకునేవాడిని.. ఒకటో రకం అక్షరాలు ఎలాగో గుర్తుండిపోయాయి కానీ రెండో రకం మాత్రం మా చెడ్డ కష్టం అయిపోయాయి..అందువల్ల నాకు చానాళ్ళపాటూ అంటే ఆరు-ఏడు తరగతుల వరకూ "b" కి "d" తేడా తెలియదు.. ఒకసారి మా మేడం ఒకామె  బోర్డ్ మీద "బి","డి" రాయమని చెప్పింది నేను ఏ మాత్రం భయపడకుండా "B " "D " రాసి వచ్చా.. దురదృష్ట వశాత్తు ఆమె చేతిలో ఆ రోజు ఒక కర్ర ఉండటం సంభవించింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ సెపరేటుగా చెప్పాలా??

ఇక చిన్నప్పటి నుండీ నాకు పరీక్షలంటే విపరీతమైన విరక్తి.. ఎందుకో నాకిప్పటి వరకూ తెలియదు.. అందువల్ల ఎప్పుడు పరీక్ష ఉన్నా విరక్తి వల్ల కలిగిన బాధతో సగం పేపర్ ప్రశ్నలు మాత్రమే రాయగలిగేవాడిని సారీ రాసేవాడిని.. కానీ మా టీచర్లు కొంచెమన్నా జాలీ దయ అనేది లేకుండా నేను రాసిన సగం లో సగం మార్కులు కోసేవాళ్ళు.. అందువల్ల నాకు పెద్ద పెద్ద మార్కులు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ.. లెక్కలు, తెలుగు తప్పిస్తే ఇంక దేంట్లో మనకు మార్కులు వచ్చేవి కాదు.. అందరూ potential energy/kinetic energy అని స్కూల్ లో చదువుతారు నేను మాత్రం అవి ఇంటర్ కొచ్చాక నేర్చుకున్నా.. దేని కైనా టైం రావాలి అనే ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అప్పుడే అర్థం చేసుకున్నా!! (తర్వాత తర్వాత గొప్ప గొప్ప టీచర్ల పుణ్యమా అని కొంత చదువు అబ్బింది లేండి, అది వేరే విషయం)

మరొక రహస్యం ఏమిటంటే, కాన్పూర్ కి వెళ్ళే ముందు వరకూ నేనెప్పుడూ నార్త్ ఇండియన్ భోజనం తినలేదు.. ఈ నాన్, రోటీ లాంటివి దూరదర్శన్ వారి కార్యక్రమాలలో చూడటం తప్ప నిజంగా ఎప్పుడూ చూడలేదు.. ఇలాంటి నేను హాస్టల్ లో చేరిన కొత్తలోఎవడో పార్టీ ఇస్తుంటే ఫ్రీగా మెక్కడానికి (మరే! మన ఖాతా అప్పటి నుండే రన్ అవుతోంది) మా కాంపస్ కు దగ్గరగా ఉన్న లక్కీ  రెస్టారెంట్ అనే చోటికి వెళ్ళాను.. మనకు ఆ పదార్థాల పేర్లు కూడా మార్తాండ కథలోని పాత్రల్లా అనిపిస్తున్నాయి..అందుకని ఏం పలక్కుండా ఏం ఆర్డర్ ఇస్తే అది వెజిటేరియన్నా కాదా అని ఆ బుక్కులో చూస్తున్నా.. కాసేపటికి మనకు క్లారిటీ వచ్చింది..అక్కడ ఎవడో ఏదో ఒక తింగరి సూప్ ఆర్డర్ ఇచ్చాడు.. దానిలోకి టొమాటో సాస్ ఏసుకుని తాగాలి/తినాలి.. .. హమ్మయ్య అనుకున్నాను.. వెంటనే ధారాళంగా " రేయ్ ఆ  సాస్  ఇలా ఇవ్వు ఈ సూప్ వేసుకుని తాగాలి నేను" అని అరిచాను.. ఒక్క నిమిషం పొరపాటున అన్నాను అనుకున్నారు.. కానీ వాడు పలకలేదని నేను మళ్ళీ అరిచాను..ఒక రెండు నిమిషాల పాటూ నా చుట్టూ కూర్చున్న 7-8మంది మౌనం పాటించారు.. ఆ తర్వాత ఒకడు మెల్లగా వచ్చి అడిగాడు ఏ ఊరు మనది అని, నేను మీసం మెలి తిప్పి చెప్పా కడప అని (బ్యాక్ గ్రౌండ్లో  "ఇంద్ర" మ్యూజిక్ వచ్చింది)..
వాడన్నాడు  "ఒరే బాబూ ఇంకెప్పుడూ నువ్వు నీ విజ్ఞాన ప్రదర్శన చెయ్యనని ఈటీవి సుమన్ మీద ఒట్టేయమని" బ్రతిమాలాడు.. పెద్ద ముండావాడు బ్రతిమాలాడు కదా అని ఓకే అనేశా.. అందుకే ఇప్పటికీ బయట తినాలంటే ఫుల్ మీల్స్ ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే వెళతాను.. వాటినే ఇక్కడ ఆంధ్రా హోటల్స్ అని అందరూ అంటుంటారు :)

కార్తీక్