వైద్యో నారయణో హరి...

3/29/2015 - రాసింది karthik at Sunday, March 29, 2015
వైద్యో నారయణో హరి- అంటే వైద్యుని దగ్గరకు వెళితే నారాయణా కోచింగ్ సెంటర్ లాగా శాంతం నాకేసి ఫైనల్ గా హరి పాదాలకు చేర్చుతారని ఒక పెద్దమనిషి ఉవాచ. ఆ పెద్దమనిషి ఎవరా అని పెద్దగా ఆలోచించకండి.. అది నేనే! :)

ఈరోజు ఏదో వీడియోలు చూస్తుంటే ఈ మహత్తరమైన వీడియో దొరికింది. ఆంధ్రుల (దుర)అభిమాన చానల్ టీవీ9లో మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి వైద్యం మీద చర్చా కార్యక్రమం మహా పసందుగా జరిగింది. ప్యానల్ లో ఉన్న ముగ్గురు డాక్టర్లూ మంతెన గారిని నానా రకాలుగా విమర్శిస్తూ రక్తి కట్టించారు. ఏ విషయానికైనా రెండో వర్షన్ ఉంటుందని టీవీ9 వాళ్ళకు తెలియదు కాబోలు మంతెన గారి వర్షన్ చెప్పడానికి ఎవరినీ పిలవలేదు. ఈ టపా ఉద్దేశ్యం మంతెన గారిని సమర్థించడమో లేక టివీ9 వాళ్ళను విమర్శించడమో కాదు. ఆ రెండు పనులు చెయ్యడానికి అటు హేటువాదులు ఇటు టీ.ఆర్.యస్ పార్టీ వాళ్ళూ ఎలాగూ ఉన్నారు. అసలు మౌలికంగా ఈ Alternative Medicine ఇంత పాపులర్ ఎలా అయ్యింది అనే కోణంలో ఆలోచించి ఈ టపా రాస్తున్నాను.

ముందుగా కొంత చరిత్ర:
ఏల్చురి గారి ఆయుర్వేదం, మంతెన గారి ప్రకృతి వైద్యం లాంటివి ప్రస్తుతం చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కానీ మునుపు ఇవి మనవాళ్ళకు సుపరిచితమైనవే. 1950ల దాకా బెజవాడ గుంటూర్ ప్రాంతాలలో 30కి పైగా ఆయుర్వేద వైద్యశాలలు ఉండేవి.  ఆ తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల అవి మూతపడ్డాయి. అలాగే వేరే రంగాల్లో రాణించిన వారికి కూడా ఆయుర్వేదంలో ప్రవేశం ఉండటం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది. కానీ ఇది చాలావరకూ అనువంశీకమే తప్ప ఒక సబ్జెక్ట్ లాగా కాలేజీలలో నేర్పించింది లేదు. బ్రిటీష్ వాళ్ళకు ఇవన్నీ ఎందుకు పడతాయి? (On another note, Ayurvedic medicine is still prohibited in UK & Europe. What a loss to their societies!!)

ఒక 4-5 దశాబ్దాలపాటూ మరుగున పడ్డ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం లాంటివి ఏ ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం 15-20ఏళ్ళల్లో ఎందుకింత పాపులర్ అయ్యాయి??

1. ఫ్యామిలీ డాక్టర్ పద్దతి ఉన్నన్ని రోజులు పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక పర్సనల్ రిలేషన్ ఉండేది, డాక్టర్లు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పద్దతి కనుమరుగు అయ్యిందో అప్పటి నుంచీ డాక్టర్-పేషెంట్ రిలేషన్ కాస్తా వెండార్-కస్టమర్ రిలేషన్ అయ్యింది. అలోపతి అయినా ఆయుర్వేదమైనా డాక్తర్ మీద పేషెంటుకు నమ్మకం ముఖ్యం. ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ పద్దతి పోయిందో డాక్టర్లను నమ్మడం కష్టమైపోతోంది. 

2. డాక్టర్లు పేషెంట్లను cash cow గా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేదు అనే ఒక వాదన ప్రజలలోకి బలంగా వెళ్ళడం. ఇందులో మీడియా పాత్ర చాలా ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ డాక్టర్లూ ప్రైవేట్ డాక్టర్లూ అన్న తేడాలు లేవు. ఠాగూర్ సినిమాలో చూపించిన డాక్టర్ ఎపిసోడ్ నిజంగా జరగడం మన దౌర్భాగ్యం. గ్రామాలలోకి వెళ్ళి పని చెయ్యడానికి అటు సీనియర్ వైద్యులు ఇటు జుడాలు ఇద్దరూ మొండికేయడం నడుస్తున్న చరిత్ర.

3. Alternative Medicine ఫాలో అయ్యే వాళ్ళలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళూ ఎక్కువ. దీనికి కారణం మన డాక్టర్ల యాటిట్యుడ్. డాక్టర్ కన్సల్టేషన్ టైం 10నిమిషాలైతే హాస్పిటల్లో వెయిటింగ్ టైం కనీసం ఒకగంట సేపు ఉంటుంది. ఇది కూడా ముందు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత. ఇక సర్కారీ దవాఖానాల సంగతి సరేసరి!

4. అలోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం. 

5. మంతెన, ఏల్చూరి, బాబా రాందేవ్.. ఇలా పాపులర్ అయిన వాళ్ళంతా టీవీలలో డైరెక్ట్ గా రాలేదు. ముందు word of mouth ద్వారా పాపులర్ అయ్యి తర్వాత టీవీలో రావడం మొదలు పెట్టారు. కాలేజీలలో చేరడం దగ్గరనుంచీ పెళ్ళి సంబంధాల వరకూ మన సమాజంలో word of mouth చాలా పవర్ఫుల్ అడ్వర్టైజింగ్ టెక్నిక్.కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళల్లో  తమకు నయం అవుతుంది అన్న నమ్మకం మీద వెళ్ళేవాళ్ళే ఎక్కువ. సైకలాజికల్ గా ఇది చాలా పెద్ద బోనస్. బాబా రాందేవ్ ఏకంగా ఐ.యం.ఏ. ని చాలెంజ్ చేశాడంటే ఆలోచించండి. 

పైన చెప్పినవన్నీ వ్యవస్థాగత సమస్యలైతే దీనికంటే దారుణం ఏమంటే మన డాక్టర్లు తాము పట్టిన కుందేలుకు రెండున్నర కాళ్ళేనని వాదించడం. ఇప్పటికి కూడా Alternative Medicine ని గుడ్డిగా విమర్శించడం సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అని అరిగిపొయిన రికార్డ్ వెయ్యడం తప్ప ఈ ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. ఎంతసేపూ బాబా రాందేవ్ కు ఎవరో ఒక ద్వీపం మొత్తం ఇచ్చారు అని, మంతెన గారు కోటీశ్వరుడు అవుతున్నారని అదే పనిగా మాట్లాడటం వల్ల ప్రజల దృష్టిలో కుళ్ళుబోతులుగా మిగిలిపోతున్నారు. మనిషి ఆరోగ్యం అనేది అలోపతి-ఆయుర్వేదం-హోమియోపతి-వగైర మధ్య టగ్ ఆఫ్ వార్ లో చిక్కుకోకూడదు.


సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్

దొంగ రచయితలున్నారు జాగ్రత్త!!

2/09/2015 - రాసింది karthik at Monday, February 09, 2015
ప్రతీ మనిషికి కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయి.. వాటికి కారణాలు ఉండాలని రూల్ లేదు, కొన్ని సార్లు కారణాలు ఉంటాయి కొన్ని సార్లు ఉండవు. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు పైత్యపుగాళ్ళు తమను తాము రచయితలని చెప్పుకుంటూ తాము రాసిందే సాహిత్యమని తమ ఆలోచన ధోరణీతో విబేధించేవాళ్ళను నానా తిట్లు తిట్టి తమను తాము మేధావులమని చెప్పుకుని కుతి తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళను ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగత దాడి, సంస్కారహీనమైన పనులు అంటూ మాటలు చెబుతారు, వీళ్ళు మాత్రం ఎవరి గురించైనా ఎంత నీచంగా మాట్లాడినా అదంతా ఫ్రీడం ఆఫ్ స్పీచ్, స్వేచ్చ ప్రపంచంలో మనిషికి ఉండే హక్కు. అన్నట్టు మనుషులంటే ఒకానొక విదేశీ భావజాలన్ని నమ్మేవాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా రాతియుగం నాటి జంతువులు.

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సదరు పైత్యపుగాళ్ళకు పబ్లిషర్లు దొరికారు, అంతే! ఇంక చెప్పేదేముంది?? ఇషాంత్ శర్మను చూసిన ఆస్ట్రేలియా బాట్స్ మెన్ లాగా రెచ్చిపోతుంటారు.. పైత్యం ఒకపాలు, ఉన్మాదం మూడు పాళ్ళు ఉన్న వీళ్ళ రచనల దెబ్బకు తెలుగు దేశంలో పుస్తకాలు చదివే వాళ్ళే కరువయ్యారు. ఎవరైనా కొంచెం వెరైటీగా రాస్తే వాళ్ళకు క్షుద్ర రచయితలని బిరుదులు ప్రదానం చేస్తుంటారు. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి "తెలుగు సాహిత్య పతనం యండమూరితో మొదలైంది" అని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.  ఈ చినవాల్తేరు శాల్తీలందరికి నవల/కథ అంటే ఈ క్రింది లక్షణాలు ఉండాలి:

1. హీరో పేదవాడు అయ్యుండాలి.. అంతే కాక ఆడవాళ్ళ సమస్యల గురించి ప్రతీ అరడజను పేజీలకు ఒక పేజీ స్పీచ్ ఇస్తుండాలి..
2. విలన్ ఖచ్చితంగా బాగా డబ్బున్న వాడు అయ్యుండాలి. నిజజీవితంలో ఎవరూ పెట్టుకోని సర్పభూషణ రావు  లాంటి తింగరి పేర్లు ఉండాలి. అతగాడు హీరోయిన్ తండ్రి అయ్యి హీరో కుటుంబానికి ఏదో తీరని అన్యాయం చేసుండాలి.. ఆ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసేదానికి హీరోయిన్ హీరోని ప్రేమించి తన సమసమాజపు భావజాలాన్ని చాటి చెబుతుంది.
3. డబ్బున్న వాళ్ళందరూ నీతి నిజాయితీ లేకుండా ఉండాలి. వాళ్ళంతా రోజూ బ్రాందీలు విస్కీలు తాగుతూ ఉండాలి. కాగడా వేసి వెతికినా వాళ్ళల్లో ఏ మంచి లక్షణాలు ఉండకూడదు.

ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే అది చెత్త సాహిత్యం, మనిషికి సహజంగా ఉండే బలహీనతలతో ఆడుకోవడం. వీళ్ళు మాత్రం పేర్లు మార్చి, ఊర్లు మార్చి రాసిందే రాస్తూ ప్రజల మీద ఘోరమైన మానసిక దాడులు చేస్తుంటారు. పెషావర్లో తాలిబలు పిల్లల మీద ఒకసారే దాడి చేశారు, ఈ దొంగ రచయితలు మాత్రం ప్రజల మీద కొన్ని దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. వీటికి తోడు ఎవరైనా వీళ్ళతో కలిసి పని చేయకూడదని అనుకుంటే వాళ్ళ మీద సెటైర్లు అదనం.

ఇప్పటిదాక వీళ్ళు రాసిన చెత్తను ఒకసారి చూసి వీళ్ళు భవిష్యత్తులో ఏం రాస్తారో అని ఒక ఊహించి ఒక లిస్ట్ రాశా, దాన్ని క్రింద చూడండి:

1. తెందుల్కర విషబ్యాటు:
సచిన్ తెందుల్కర్ మహిళా క్రికెట్లో ఆడకుండా పురుషుల క్రికెట్లో మాత్రమే ఆడి స్త్రీ జాతిని ఎలా అవమానించాడు అనేది ఈ నవల కాన్సెప్ట్.

2. ఆగడు సినిమాపై మార్కిస్టు విశ్లేషణ: ఒక పరిశోధనాత్మక వ్యాసం
దీని గురించి వేరే ఏం చెప్పాలి.. పేరు చూస్తేనే భయం వెయ్యడం లేదు.. అనుభవించండి.

3. ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్:
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలో హాబిట్ గా మగవాడిని పెట్టడం ఎంత ఘోరం ఎంత నేరం. స్త్రీజాతికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి లేదు. ఈ విషయంలో టొల్కిన్ ఎంత నీచంగా ఆలోచించాడు అనే విషయం మీద ఈ నవల.




బాపూ గారి గురించి వేణువు బ్లాగులో టపాకు నా సమాధానం

9/09/2014 - రాసింది karthik at Tuesday, September 09, 2014
ఈ టపా రంగనాయకమ్మ భజన బృందాలకు నచ్చే అవకాశం లేదు. కావున మీరు ఆ జాబితాలో ప్రజలైతే ఈ టపా చదవకపోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల మీ సమయాన్ని ఆదా చేసుకున్నవాళ్ళౌతారు. 

ఈ టపాకు మూలమైన వేణువు బ్లాగులోని టపా ఇక్కడ చదవగలరు.

అందులో ప్రధాన ఆంశం ఏమంటే బాపూ గారు విషవృక్షం పుస్తకానికి ముఖచిత్రం వేయడానికి నిరాకరించడం తప్పు. అంతే కాక ఆ ముఖ చిత్రం కోసం పంపిన డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని వ్యంగ్యంగా రాయడం ఇంకా తప్పు.. 

అసలు దీనికంటే ముందు విషవృషం పుస్తకం గురించి కొన్ని విషయాలు:

ఆకలి అనేది నాలగు రకాలు అని రమణ ఉవాచ; బ్లాగర్ రమణ కాదు ముళ్ళపూడి వెంకటరమణ.. అవి కడుపాకలి, డబ్బాకలి, కామాకలి, పేరాకలి.. ఇందులో మొదటిది కాసింత తిండి పడేస్తే సర్దుకుంటుంది కానీ మిగిలినవి తీర్చేకొద్దీ పెరిగేవే తప్ప తగ్గేవి కాదు.. (ఇది కూడా ఆయన చెప్పిందే) అలా పేరాకలి ఎక్కువైన ఒకానొక మహిళా రచయిత్రి ఒకానొక విదేశీ భావాజాలానికి గులాం గిరి చేస్తూ రచనలు చేశారు.. వాటిలో చాలామటుకు ఆడవాళ్ళను విక్టిమైజ్ చేస్తూ కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే మూసలో రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసి దానిలో రామాయణంలోని అన్ని పాత్రలనూ చెడామడా తిట్టేశారు.. పనిలోపనిగా వాల్మికి గారిని కూడా వదలకుండా ఆయన కోటా ఆయనకిచ్చారు. అసలు ఆ పుస్తకం మొదలవడమే, "నీగురించి తెలుసుకో, నీ వర్గమేదో తెలుసుకో" లాంటి విదేశీభావజాల దాస్యంతో మొదలౌతుంది. ఆ తర్వాత ముసలి వాళ్ళను ముగ్గుబుట్ట తల అనటము, వంశ పారంపర్య రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని వాపోవడం లాంటి తింగరి లాజిక్కులతో మొత్తం పుస్తకాన్నీ రక్తి కట్టించారు.. ఇందులో ఫలాన విషయం రామాయణంలోని ఫలానా పద్యం నుంచీ తీసుకున్నానని ఎక్కడ కూడా లేదు. కనీసం నేను చదివిన పుస్తకంలో అయితే నాకు కనిపించడం లేదు.. కానీ వేణువు బ్లాగర్ వేణు గారు ఆ పుస్తకంలో ఫుట్ నోట్స్ ఉన్నాయి అని చెబుతున్నారు.. నాకైతే కనిపించలేదు.

ఇంతా చేస్తే "ఎందుకు తల్లీ రాముడంటే అంత ద్వేషం. అంతగా అయితే రామయణాన్ని మించిన పుస్తకం నువ్వే ఒకటి రాయి" అని కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఒక చిన్న ప్రశ్నవేశారు. నాలగు దశాబ్దాలు దాటిన సదరు రచయిత్రి గారు వాళ్ళనూ వీళ్ళనూ తిట్టిన రచనలే తప్ప ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు.. ఈ విషయం చదివాక మీకు "మై స్ప్రైట్ పీతా హూన్ ఔర్ జ్ఞాన్ దేతా హూన్" అన్న పాత స్ప్రైట్ ప్రకటన గుర్తొస్తే నా బాధ్యత కాదు.  

ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాపూ గారు చేసింది ఎందుకు తప్పు?? ఆయనకు నచ్చిన పని చేసే హక్కు ఆయనకు లేదా?? కళాకారుడైనంత మాత్రన ఎవరొచ్చి ఏం చెప్పినా చెయ్యాలని రూలేమన్నా ఉందా? వీళ్ళ లాజిక్ ప్రకారం ఒక తాళాలు తయారు చేసేవాడికి ఎవరైనా ఒక డ్రాఫ్ట్ ఇచ్చి ఫలానా ఇంటి తాళం ఈ సమయంలో తియ్యాలి అని చెబితే ఆ పని అతను ఒప్పుకోవాల్సిందే అంటారేమో..  

ఇక దీని కంటే అద్భుతం, ఆ డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని రాశాడని జనాలు ఆక్షేపించడం.. 
 ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’ 

విషవృక్షం అనే పేరు పెట్టి కొన్ని కోట్లమందికి ఆదరణీయమైన పుస్తకాన్ని నానా టిట్లు తిట్టారు, ఇప్పుడు కేవలం "రామ" అని ఒకేఒక పదం రాస్తే భరించలేకున్నారు.. మీ ఆదర్శాలకు, సహనశీలతకు ఒక పెద్ద పంగనామం. ఇదేమాట ఆ రచయిత్రి విషయంలో ఎందుకు వర్తించదు.. ఇష్టముంటే రామాయణం చదవాలి లేదా మానుకోవాలి అంతే కానీ ఇలా చవకబారు విమర్శలు చేసే అధికారం ఆమెకెవరిచ్చారు?

మితృడు రాజ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఇదేలా ఉందంటే "కొరివి దయ్యం వర్షంలో వేదాలు చదువుతూ యాగం చేసినట్లుంది".  

సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్



కొత్త రాజధాని.. నా ఆలోచనలు!!

8/17/2014 - రాసింది karthik at Sunday, August 17, 2014
1. హైదరాబాద్ సిండ్రోం
కొత్త రాజధాని అనే మాట వింటూనే వచ్చే మొట్టమొదటి ఆలోచన "హైదరబాద్ కంటే బాగుండాలి", "హైదరాబాదు ఉన్నట్టుండాలి", "హైదరాబాదు లాగా కంపెనీలు ఉండాలి".. ఈ ఆలోచనలన్నీ అర్థం చేసుకోదగ్గవే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి హైదరాబాదుతో ఏదో రకమైన అనుబంధం ఉంది. ఈ రోజు అక్కడి ముక్కుదొర ప్రభుత్వం ఆంధ్రా విద్యార్థులని, ఉద్యోగులని తరిమేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకో తరం మారే దాకా ఇలానే ఉంటుంది. టాంక్ బండ్ పై విగ్రహాలు చూస్తూ గర్వించని ఆంధ్రుడెవడు?
కానీ ప్రస్తుతం ఈ హైదరాబాద్ సెంట్రిక్ ఆలోచనలు మనకు ఏ మాత్రం పనికి రావు.. మన రాజధాని మన బలాబలాలకు, మన అవసరాలకు తగినట్టుగా ఉండాలి తప్ప హైదరాబాదునే వేరు పేరుతో నిర్మించాలనుకోవడం మంచిది కాదు. కానీ హైదరాబాదు విషయంలో జరిగిన తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి.. మంచి నీటి కొరత, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు హైదరాబాదును ఇంకా కొన్నేళ్ళ దాకా వదిలే సూచనలు లేవు.. కొత్త రాజధాని విషయంలో ఇలాంటి వాటిపై శ్రధ్ధ పెట్టాలి.

2. సాఫ్ట్వేరు - బోడి గుండు
తొంభైవ దశకం లో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడం వల్ల హైదరాబాదులో జరిగిన అభివృధ్ధి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్ఠితి లేదు.. అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడానికి చాలా అవకాశాలు ఉండేవి... ఇప్పుడు ఇండస్ట్రీ బాగా మెచ్యూర్ అయ్యింది. 2008 రిసెషన్ తర్వాత కంపెనీలు చాలా కన్సెర్వేటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫర్ లెట్టర్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేని ఇబ్బందికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాయి.. కాబట్టి అప్పటిలాగా వేలకు వేలు ఉద్యోగాలు పుట్టడం కుదరని పని. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాదు నుంచీ రావాలనుకోవడం మూర్ఖత్వం.. ముక్కుదొర ప్రభుత్వం మరీ తాలిబన్ల తమ్ముడిలా వేధిస్తే చెప్పలేం కానీ మామూలు పరిస్థితుల్లో అయితే అది జరగని పని.

3. కోస్తా వర్సెస్ సీమ
అన్నిటికంటే ఇది ప్రధాన సమస్య.. రాజధాని కోస్తాలో ఉంటే సీమకు అన్యాయం జరుగుతుందని, సీమలో ఉంటే కోస్తాకు అన్యాయం జరుగుతుందని రెండు వైపులా అభ్యంతరాలున్నాయి.. ఈ భయాలకు కూడా హైదరాబాద్ సిండ్రోమే ప్రధాన కారణం. రాజధాని అంటే హైదరాబాదులా అన్నీ ఒకే చోట ఉంటే మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని భయం. కాబట్టి ఇరుప్రాంతాలను సంతృప్తి పరిచే విధంగా సాధ్యమైనంత వికేంద్రీకరణ జరగాలి.. ప్రతీ జిల్లా ఏదో ఒక రంగానికి కేంద్రీకృతం కావాలి. ప్రతీ జిల్లాపై మిగిలిన పన్నెండు జిల్లాలు ఆధారపడేలా ఉండాలి. సెక్రెటేరియట్, హై కోర్ట్ ఒకేచోట ఉండకూడదు. అసంబ్లీ సమావేశాలు ఇరు ప్రాంతాలలో జరిగేలా చూడాలి.

4. మన సముద్రం మన బలం:

శాతవాహనుల కాలంలోనే సముద్ర వ్యాపారం చేసిన జాతి మనది. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నాణేలపై నౌక ముద్ర ఉండటం మన పూర్వీకులకు నౌకాయానం పై గల పట్టుని చూపుతోంది. మన మోటుపల్లి కాలగర్భంలో కలిసిపొయి ఉండచ్చు కానీ ప్రకృతి ప్రసాదించిన సముద్రం మాత్రం ఇంకా మనకు అపారమైన అవకాశలను కల్పిస్తోంది. దాన్ని వాడుకుని అంతర్జాతీయ నౌకాశ్రయాలు నిర్మించుకోవాలి.. రాజధాని కంటే అధిక ప్రాధాన్యత దీనికే ఇవ్వాలి. బకింగ్ హాం కాలువ మొదలుకొని అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రోడ్లపైన సరకు రవాణా భారం తగ్గించాలి.

Facebook నుంచీ కాపీ చేసిన టపా!!!

8/06/2014 - రాసింది karthik at Wednesday, August 06, 2014
Copied from FB



నోరు విప్పితే ఆంధ్రా వాళ్లపై దాడి. దగా- మోసం- కుట్ర…. ఈ మూడు పదాలు నిత్యం రామ నామ జపంలా జపించి తెలంగాణ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచాడు కేసీఆర్. విభజనకు ముందు నిపుణులు, ఏపీ ముఖ్యమంత్రి గొంతి చించుకుని చెప్పారు తెలంగాణ ఆంధ్రమీద, ఆంధ్ర తెలంగాణ మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్ర విభజన ఇరు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అని నెత్తీనోరు మొత్తుకున్నారు. అయినా వినలేదు. మభ్యపెట్టి… ఏదో ఒకలా ఇచ్చేయండని అన్నారు. ఈరోజు తెలంగాణ పొలాలు ఎండిపోయాయి. ఉత్తర తెలంగాణకు రైస్ బౌల్ అని పేరున్న మెదక్ జిల్లా పొలాలు గొంతెండి చూస్తున్నాయి. అవన్నీ బోరు బావుల పంటలు. కరెంటు ఉంటేనే పంటకు నీరు. దీనికి తోడు వర్షాభావం. దీంతో మెట్టరైతులు పంట వేయలేక అన్యాయం అయిపోతే బోరు బావుల కింద రైతులు పంటలు వేసి కరెంటు కోసం చూసి చూసి అది రాక అన్యాయం అయిపోయారు. హైదరాబాదు నగరానికి రోజుకు ఐదు గంటలు కోతలు పెట్టినా, అన్ని జలాశయాలు నిండుకుండలా మారినా తెలంగాణకు అవసరమైన విద్యుత్తు అందడం లేదు. ఎందుకంటే… ఈ పొలాలన్నీ ఇంతకాలం ఆంధ్రా నుంచి వచ్చే విద్యుత్తుతో పండేవి. ఇపుడు అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. ఆ రాష్ట్రం తన అవసరాలు చూసుకోవడంతో తెలంగాణ రైతులు అన్యాయం అయిపోయారు.
దీనికి ఎవరు కారణం?

కచ్చితంగా తొలి దోషి టీఆర్ఎస్. ఎన్నికల ముందు అంత ఆఘమేఘాల మీద విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డున నిలబెట్టాల్సిన పరిస్థితి. తెలంగాణకు కరెంటు ప్రాణం, ఆంధ్రకు రాజధాని ప్రాణం. ఆంధ్రకు రాజధాని పోయి వారు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోయి నష్టపోతే… తెలంగాణలో ఉన్న వ్యవసాయం, పరిశ్రమలు నడపటానికి కీలకమైన కరెంటును నష్టపోయి ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇంత ఘోరమైన విభజన చేయకపోతే విభజన కు పార్లమెంటు సాక్షిగా డెడ్ లైన్ పెట్టి మూడేళ్లలో ఇటు కరెంటు ఉత్పత్తిని పెంచి, అటు రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని విడదీసి ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలు భరోసాతో జీవించేవారు. రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండేవి. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికార దాహం ఇరు ప్రాంతాల ప్రజల పాలిట శాపమైంది. హైదరాబాదులో వేలసంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచిఉంది. అక్టోబరు నుంచి నిరంతర కరెంటు సరఫరా ఉండే ఆంధ్రకు ఈ చిన్న పరిశ్రమలు తరలిపోయినా పెద్ద ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే వాటిని తరలించడం చాలా సులభం. పైగా వాటికి విద్యుత్తు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్ర మెరుగైన ఆప్షన్ అవుతుంది.

ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాను అడుగుతారు ?

నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా తన తప్పులను పక్కన పెట్టి ఎదుటి వారిని వేలెత్తిచూపడంలో నోబెల్ అవార్డు అంటూ ఉంటే అది కేసీఆర్ నే వరిస్తుంది. అధికారం కోసం అత్యాస పడిన కేసీఆర్ ఇపుడు కరెంటు ఇవ్వడం చేతకాక చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
వీటీపీఎస్ నుంచి 500 ముద్దనూరు నుంచి 210 మెగావాట్లు విద్యుత్తు రావాల్సి ఉన్నా ఆంధ్రా సీఎం అడ్డుకుంటున్నారని రైతులకు ఆయన చంద్రబాబును చూపిస్తున్నారు. మరి ఇదే బుద్ధి ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో ఏమైంది. మా పిల్లలకే ఫీజులు ఇస్తాం, మీకేం నొప్పి అని బడాయి చెప్పిన ఆయన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ ప్రజలకు తన సొంత విద్యుత్తు ఇవ్వడంలో తప్పేముంది. తెలంగాణలో దశాబ్దాలుగా స్థిరపడి ఇక్కడే పుట్టి పెరిగిన వారినే పట్టించుకోనపుడు ఆ రాష్ట్రం తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకుంటుంది? ఎందుకు పట్టించుకోవాలి.
విభజన చట్టం ఉల్లంఘించి ఉన్నత విద్యా మండలి పెట్టినపుడు గుర్తురాలేదా అదే చట్టం ఉల్లంఘించి వారు విద్యుత్తు ఆపేయవచ్చని?. ఉమ్మడి రాష్ట్ర జీవోను ఉల్లంఘించి ఆంధ్ర వాహనాలపై పన్ను వేసినపుడు గుర్తురాలేదా… అదే ఉల్లంఘన వారు కూడా చేయగలరని? మా రాష్ట్రం, మా విద్యావిధానం మా ఇష్టం అన్నపుడు గుర్తురాలేదా … వారు కూడా మా రాష్ట్రం మా విద్యుత్తు మా ఇష్టం అంటారని? మాకు కర్ణాటక ఎంతో ఆంధ్రా అంతే అన్నపుడు గుర్తురాలేదా… ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కర్ణాటక ఎంతో, తెలంగాణ అంతే అని అనగలదని.
ఇతర రాష్ట్రాల సీఎంలు మాత్రం తమ ప్రజల ప్రయోజనాలు త్యాగం చేసి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలా? ఎవడు నేర్పిన న్యాయం ఇది! నీ ప్రయోజనాలకు సంబంధించి చట్టం ప్రకారం జరగాలి. ఇతరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు అయితే కేసీఆర్ ఇష్టం ప్రకారం జరగాలా? విభజనకు ముందు ఆంధ్రోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అన్న మాటలు మరిచిపోయి ఆంధ్రోడు అన్న మూలం ఎక్కడున్నా వేటాడుతున్న కేసీఆర్ కు ఆ ఆంధ్రోడు ఎందుకు విద్యుత్తు ఇవ్వాలి?

(నోట్ : లాఠీ ఛార్జి జరిగితే తెలంగాణ బిడ్డలను రాక్షసంగా అణచివేస్తారా అన్న కేసీఆర్ ఈరోజు కరెంటు అడిగిన పాపానికి మెదక్ జిల్లాలో రైతులపై లాఠీ ఛార్జి చేయించాడు. పదిమంది రైతులకు ఈ సందర్భంగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తిరగబడటంతో రాత్రి పొద్దుపోయాక కేసీఆర్ … దీనికంతటికీ బాబే కారణం అంటూ ఆంధ్ర వైపు వేలెత్తి చూపాడు. ఈ కథనం నేపథ్యం ఇది.)