వైద్యో నారయణో హరి...

3/29/2015 - రాసింది karthik at Sunday, March 29, 2015
వైద్యో నారయణో హరి- అంటే వైద్యుని దగ్గరకు వెళితే నారాయణా కోచింగ్ సెంటర్ లాగా శాంతం నాకేసి ఫైనల్ గా హరి పాదాలకు చేర్చుతారని ఒక పెద్దమనిషి ఉవాచ. ఆ పెద్దమనిషి ఎవరా అని పెద్దగా ఆలోచించకండి.. అది నేనే! :)

ఈరోజు ఏదో వీడియోలు చూస్తుంటే ఈ మహత్తరమైన వీడియో దొరికింది. ఆంధ్రుల (దుర)అభిమాన చానల్ టీవీ9లో మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి వైద్యం మీద చర్చా కార్యక్రమం మహా పసందుగా జరిగింది. ప్యానల్ లో ఉన్న ముగ్గురు డాక్టర్లూ మంతెన గారిని నానా రకాలుగా విమర్శిస్తూ రక్తి కట్టించారు. ఏ విషయానికైనా రెండో వర్షన్ ఉంటుందని టీవీ9 వాళ్ళకు తెలియదు కాబోలు మంతెన గారి వర్షన్ చెప్పడానికి ఎవరినీ పిలవలేదు. ఈ టపా ఉద్దేశ్యం మంతెన గారిని సమర్థించడమో లేక టివీ9 వాళ్ళను విమర్శించడమో కాదు. ఆ రెండు పనులు చెయ్యడానికి అటు హేటువాదులు ఇటు టీ.ఆర్.యస్ పార్టీ వాళ్ళూ ఎలాగూ ఉన్నారు. అసలు మౌలికంగా ఈ Alternative Medicine ఇంత పాపులర్ ఎలా అయ్యింది అనే కోణంలో ఆలోచించి ఈ టపా రాస్తున్నాను.

ముందుగా కొంత చరిత్ర:
ఏల్చురి గారి ఆయుర్వేదం, మంతెన గారి ప్రకృతి వైద్యం లాంటివి ప్రస్తుతం చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కానీ మునుపు ఇవి మనవాళ్ళకు సుపరిచితమైనవే. 1950ల దాకా బెజవాడ గుంటూర్ ప్రాంతాలలో 30కి పైగా ఆయుర్వేద వైద్యశాలలు ఉండేవి.  ఆ తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల అవి మూతపడ్డాయి. అలాగే వేరే రంగాల్లో రాణించిన వారికి కూడా ఆయుర్వేదంలో ప్రవేశం ఉండటం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది. కానీ ఇది చాలావరకూ అనువంశీకమే తప్ప ఒక సబ్జెక్ట్ లాగా కాలేజీలలో నేర్పించింది లేదు. బ్రిటీష్ వాళ్ళకు ఇవన్నీ ఎందుకు పడతాయి? (On another note, Ayurvedic medicine is still prohibited in UK & Europe. What a loss to their societies!!)

ఒక 4-5 దశాబ్దాలపాటూ మరుగున పడ్డ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం లాంటివి ఏ ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం 15-20ఏళ్ళల్లో ఎందుకింత పాపులర్ అయ్యాయి??

1. ఫ్యామిలీ డాక్టర్ పద్దతి ఉన్నన్ని రోజులు పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక పర్సనల్ రిలేషన్ ఉండేది, డాక్టర్లు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పద్దతి కనుమరుగు అయ్యిందో అప్పటి నుంచీ డాక్టర్-పేషెంట్ రిలేషన్ కాస్తా వెండార్-కస్టమర్ రిలేషన్ అయ్యింది. అలోపతి అయినా ఆయుర్వేదమైనా డాక్తర్ మీద పేషెంటుకు నమ్మకం ముఖ్యం. ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ పద్దతి పోయిందో డాక్టర్లను నమ్మడం కష్టమైపోతోంది. 

2. డాక్టర్లు పేషెంట్లను cash cow గా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేదు అనే ఒక వాదన ప్రజలలోకి బలంగా వెళ్ళడం. ఇందులో మీడియా పాత్ర చాలా ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ డాక్టర్లూ ప్రైవేట్ డాక్టర్లూ అన్న తేడాలు లేవు. ఠాగూర్ సినిమాలో చూపించిన డాక్టర్ ఎపిసోడ్ నిజంగా జరగడం మన దౌర్భాగ్యం. గ్రామాలలోకి వెళ్ళి పని చెయ్యడానికి అటు సీనియర్ వైద్యులు ఇటు జుడాలు ఇద్దరూ మొండికేయడం నడుస్తున్న చరిత్ర.

3. Alternative Medicine ఫాలో అయ్యే వాళ్ళలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళూ ఎక్కువ. దీనికి కారణం మన డాక్టర్ల యాటిట్యుడ్. డాక్టర్ కన్సల్టేషన్ టైం 10నిమిషాలైతే హాస్పిటల్లో వెయిటింగ్ టైం కనీసం ఒకగంట సేపు ఉంటుంది. ఇది కూడా ముందు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత. ఇక సర్కారీ దవాఖానాల సంగతి సరేసరి!

4. అలోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం. 

5. మంతెన, ఏల్చూరి, బాబా రాందేవ్.. ఇలా పాపులర్ అయిన వాళ్ళంతా టీవీలలో డైరెక్ట్ గా రాలేదు. ముందు word of mouth ద్వారా పాపులర్ అయ్యి తర్వాత టీవీలో రావడం మొదలు పెట్టారు. కాలేజీలలో చేరడం దగ్గరనుంచీ పెళ్ళి సంబంధాల వరకూ మన సమాజంలో word of mouth చాలా పవర్ఫుల్ అడ్వర్టైజింగ్ టెక్నిక్.కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళల్లో  తమకు నయం అవుతుంది అన్న నమ్మకం మీద వెళ్ళేవాళ్ళే ఎక్కువ. సైకలాజికల్ గా ఇది చాలా పెద్ద బోనస్. బాబా రాందేవ్ ఏకంగా ఐ.యం.ఏ. ని చాలెంజ్ చేశాడంటే ఆలోచించండి. 

పైన చెప్పినవన్నీ వ్యవస్థాగత సమస్యలైతే దీనికంటే దారుణం ఏమంటే మన డాక్టర్లు తాము పట్టిన కుందేలుకు రెండున్నర కాళ్ళేనని వాదించడం. ఇప్పటికి కూడా Alternative Medicine ని గుడ్డిగా విమర్శించడం సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అని అరిగిపొయిన రికార్డ్ వెయ్యడం తప్ప ఈ ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. ఎంతసేపూ బాబా రాందేవ్ కు ఎవరో ఒక ద్వీపం మొత్తం ఇచ్చారు అని, మంతెన గారు కోటీశ్వరుడు అవుతున్నారని అదే పనిగా మాట్లాడటం వల్ల ప్రజల దృష్టిలో కుళ్ళుబోతులుగా మిగిలిపోతున్నారు. మనిషి ఆరోగ్యం అనేది అలోపతి-ఆయుర్వేదం-హోమియోపతి-వగైర మధ్య టగ్ ఆఫ్ వార్ లో చిక్కుకోకూడదు.


సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్

దొంగ రచయితలున్నారు జాగ్రత్త!!

2/09/2015 - రాసింది karthik at Monday, February 09, 2015
ప్రతీ మనిషికి కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయి.. వాటికి కారణాలు ఉండాలని రూల్ లేదు, కొన్ని సార్లు కారణాలు ఉంటాయి కొన్ని సార్లు ఉండవు. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు పైత్యపుగాళ్ళు తమను తాము రచయితలని చెప్పుకుంటూ తాము రాసిందే సాహిత్యమని తమ ఆలోచన ధోరణీతో విబేధించేవాళ్ళను నానా తిట్లు తిట్టి తమను తాము మేధావులమని చెప్పుకుని కుతి తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళను ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగత దాడి, సంస్కారహీనమైన పనులు అంటూ మాటలు చెబుతారు, వీళ్ళు మాత్రం ఎవరి గురించైనా ఎంత నీచంగా మాట్లాడినా అదంతా ఫ్రీడం ఆఫ్ స్పీచ్, స్వేచ్చ ప్రపంచంలో మనిషికి ఉండే హక్కు. అన్నట్టు మనుషులంటే ఒకానొక విదేశీ భావజాలన్ని నమ్మేవాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా రాతియుగం నాటి జంతువులు.

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సదరు పైత్యపుగాళ్ళకు పబ్లిషర్లు దొరికారు, అంతే! ఇంక చెప్పేదేముంది?? ఇషాంత్ శర్మను చూసిన ఆస్ట్రేలియా బాట్స్ మెన్ లాగా రెచ్చిపోతుంటారు.. పైత్యం ఒకపాలు, ఉన్మాదం మూడు పాళ్ళు ఉన్న వీళ్ళ రచనల దెబ్బకు తెలుగు దేశంలో పుస్తకాలు చదివే వాళ్ళే కరువయ్యారు. ఎవరైనా కొంచెం వెరైటీగా రాస్తే వాళ్ళకు క్షుద్ర రచయితలని బిరుదులు ప్రదానం చేస్తుంటారు. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి "తెలుగు సాహిత్య పతనం యండమూరితో మొదలైంది" అని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.  ఈ చినవాల్తేరు శాల్తీలందరికి నవల/కథ అంటే ఈ క్రింది లక్షణాలు ఉండాలి:

1. హీరో పేదవాడు అయ్యుండాలి.. అంతే కాక ఆడవాళ్ళ సమస్యల గురించి ప్రతీ అరడజను పేజీలకు ఒక పేజీ స్పీచ్ ఇస్తుండాలి..
2. విలన్ ఖచ్చితంగా బాగా డబ్బున్న వాడు అయ్యుండాలి. నిజజీవితంలో ఎవరూ పెట్టుకోని సర్పభూషణ రావు  లాంటి తింగరి పేర్లు ఉండాలి. అతగాడు హీరోయిన్ తండ్రి అయ్యి హీరో కుటుంబానికి ఏదో తీరని అన్యాయం చేసుండాలి.. ఆ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసేదానికి హీరోయిన్ హీరోని ప్రేమించి తన సమసమాజపు భావజాలాన్ని చాటి చెబుతుంది.
3. డబ్బున్న వాళ్ళందరూ నీతి నిజాయితీ లేకుండా ఉండాలి. వాళ్ళంతా రోజూ బ్రాందీలు విస్కీలు తాగుతూ ఉండాలి. కాగడా వేసి వెతికినా వాళ్ళల్లో ఏ మంచి లక్షణాలు ఉండకూడదు.

ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే అది చెత్త సాహిత్యం, మనిషికి సహజంగా ఉండే బలహీనతలతో ఆడుకోవడం. వీళ్ళు మాత్రం పేర్లు మార్చి, ఊర్లు మార్చి రాసిందే రాస్తూ ప్రజల మీద ఘోరమైన మానసిక దాడులు చేస్తుంటారు. పెషావర్లో తాలిబలు పిల్లల మీద ఒకసారే దాడి చేశారు, ఈ దొంగ రచయితలు మాత్రం ప్రజల మీద కొన్ని దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. వీటికి తోడు ఎవరైనా వీళ్ళతో కలిసి పని చేయకూడదని అనుకుంటే వాళ్ళ మీద సెటైర్లు అదనం.

ఇప్పటిదాక వీళ్ళు రాసిన చెత్తను ఒకసారి చూసి వీళ్ళు భవిష్యత్తులో ఏం రాస్తారో అని ఒక ఊహించి ఒక లిస్ట్ రాశా, దాన్ని క్రింద చూడండి:

1. తెందుల్కర విషబ్యాటు:
సచిన్ తెందుల్కర్ మహిళా క్రికెట్లో ఆడకుండా పురుషుల క్రికెట్లో మాత్రమే ఆడి స్త్రీ జాతిని ఎలా అవమానించాడు అనేది ఈ నవల కాన్సెప్ట్.

2. ఆగడు సినిమాపై మార్కిస్టు విశ్లేషణ: ఒక పరిశోధనాత్మక వ్యాసం
దీని గురించి వేరే ఏం చెప్పాలి.. పేరు చూస్తేనే భయం వెయ్యడం లేదు.. అనుభవించండి.

3. ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్:
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలో హాబిట్ గా మగవాడిని పెట్టడం ఎంత ఘోరం ఎంత నేరం. స్త్రీజాతికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి లేదు. ఈ విషయంలో టొల్కిన్ ఎంత నీచంగా ఆలోచించాడు అనే విషయం మీద ఈ నవల.