నాకు భయమేస్తోంది..

5/30/2010 - రాసింది karthik at Sunday, May 30, 2010
అవును నిజం నాకు భయమేస్తోంది.. కర్ణుడి చావుకి చాలా కారణాలు అలాగే నాకు భయమేయడానికి కూడా చాలానే కారణాలు.. వాటిల్లో కొన్ని ఇవి:

రాకెట్ ఎక్కాలంటే భయం.
ఇప్పుడు రాకెట్ ఎందుకు ఎక్కాలంటారా?? పచారి కొట్టులో ధరలను అందుకోవాలంటే రాకెట్లు, చంద్రయాన్ తప్పేలా లేవు..

రైలు ఎక్కాలంటే భయం.
ఏ అన్నకో కోపం వచ్చి కొన్ని పట్టాలను కోసుకొని పాత సామాన్లకు వేసుంటాడని భయం.

విమానం ఎక్కాలంటే భయం.
టెక్నాలజీ సౌజన్యంతో ఏ లోయలోకో తీసుకెళ్ళి బ్రతికుండగానే తగలబెడతారని భయం.

బస్సు ఎక్కాలన్నా భయం.
ఏ సందు మలుపులోనో పొంచి ఉన్న కరెంటు తీగ సున్నితంగా ముద్దాడి మక్కువ తీర్చుకుంటుందేమోనని భయం.

సాయంత్రం సరదాగా మాల్ కు పోవాలన్నా భయం.
ఏ జిహదీనో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆ మాల్ లో ఒక అరడజను బాంబులు పెట్టుంటాడని భయం.

భక్తి తో గుడికి వెళ్ళాలన్నా భయం.
ఏ గోపురాన్నో కూల్చి ఒకేసారి ముక్తిని ప్రసాదిస్తారని భయం.

ఇల్లు కొనాలంటే భయం.
రేప్పొదున ఏ రాజకీయ రావణుడొ వచ్చి కబ్జా చేస్తాడని భయం.

పత్రికలు చదవాలంటే భయం.
చావులు,రేపులు కాక ఇంకేమీ ఉండవని భయం.

 
ఇంట భయం బయట భయం
ముందు భయం వెనుక భయం
బ్రతుకంతా భయం భయం
ఇంత భయంగా మాట్లాడుతున్న నా పేరు చెప్పలేదు కదూ.. ఇదుగోండి:

మధ్య తరగతి మానవులం!
నిస్సహాయకులం నిష్ప్రయోజనులం!
దరిద్రులం దామోదరులం!
మా చిరునామా స్వార్థం, మా బ్రతుకు వ్యర్థం!
మా నేస్తం స్వప్రయోజనం, మా మరో పేరు మూర్ఖత్వం!
నిర్లక్ష్యం మా చుట్టం, నైరాశ్యం మా నైజం !
శనిదేవుడి సేవకులం, లక్ష్మీ ప్రసన్నత మాకు శూన్యం!
కర్మ భూమిన కుక్కలం, లేదు మాకు ఆత్మ బలం!

-కార్తీక్

ఈ రోజు..

5/24/2010 - రాసింది karthik at Monday, May 24, 2010
సరిగ్గా 26 ఏళ్ళ క్రితం నేను ఈ రోజునే పుట్టాను. అంటే మే 23,1984.

ఇక మే 23 2010 అనేది నాకొక అద్భుతం.. మాటల్లో చెప్పలేని ఆనందం.. పదాలాలో పట్టలేని సంతోషం.. దానికి చాలా కారణాలే ఉన్నాయి.. ఇవన్నీ బ్లాగులో ఎందుకు రాస్తున్నానంటే తర్వాత ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు చదువుకోవడానికి పనికివస్తుందని.
ఈ రోజు ఎందుకు ఒక అద్భుతం అనేది తెలియాలంటే కింద చదవండి మరి.

నిన్న రాత్రి 12గం: కేక్ కట్ చేశాను..అందులో వింతేముంది అనుకుంటున్నారా?? మరే మామూలు కేక్ ఐతే వింత లేదు.. కానీ ఆ కేక్ మా అమ్మ అదే పని గా బజార్ కు పొయి తెచ్చింది.. తనకు ఈ ఊర్లో మా ఇంటి పక్కన ఉండే కూరగాయల షాప్ తప్పించి ఇంకేమీ తెలీదు.. అలాంటిది బేకరీ ఎక్కడుందో కనుక్కొని మరీ తీసుకొచ్చింది.. తర్వాత అమెరికా నుంచీ రవి ఫోన్ చేశాడు..

ఇవాళ ఉదయం 8గం: మా అమ్మ కు,అమ్మమ్మకు, అక్కా బావలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. పుట్టిన రోజుకు మా అమ్మటో ఉండి అక్షరాలా ఆరు సంవత్సరాలు అయ్యింది..

ఉదయం పదిన్నర: నా మేనల్లుడి అన్నప్రాసన ఫంక్షన్ జరిగింది.. అక్కడ కూడా అన్ని నేనే చూసుకున్నాను.. నిజం మరి, చూస్తూనే ఉన్నాను చెయ్యలేదు :)

సాయంత్రం 5గం: ఆశ్రమం లో సత్సంగ్ కి వెళ్ళను.. చాలా బాగా జరిగింది.. మరియూ పన్నా అనే మామిడికాయ రసం తాగాను.. సూపర్ గా ఉంది.. తర్వాత 6:30 నుంచీ 7:30 వరకూ ఒక గొప్ప చర్చ లో పాల్గొన్నాను.. నా మిత్రులతో, మరియూ అనుభవజ్ఞులతో కలిసి నా పురోగతి అడ్డు పడుత్తున్న కొన్ని ప్రతిబంధకాలను ఎలా దాటలో తెలుసుకున్నాను.. దీని కంటే అద్భుతం ఏమిటంటే సత్సంగ్ తర్వాత గురూజి నుంచీ ఒక బహుమతి నాకొచ్చింది.. అసలు నమ్మలేని విధంగా జరిగింది ఇది.. మామూలుగా పుట్టినరోజు వాళ్ళకి, పెళ్ళిరోజు వాళ్ళకి సత్సంగ్ లో వాళ్ళ చుట్టూ ఉన్నవారు శుభాకాంక్షలు చెబుతారు.. కానీ ఈ రోజు గురూజీ తరఫున కొన్ని బహుమతులు పంచారు.. గత 10 నెలల కాలంలో అలా జరగడం ఇదే తొలిసారి..

సాయంత్రం 7:30గం: మా సుష్మక్కను కలిశాను.. తను ఈ రోజు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ టిచర్ ట్రైనింగ్ పూర్తిచేసింది.. మా సుష్మక్క గురించి చెప్పలేదు కదూ.. తను పూర్వజన్మలో నాకు అమ్మ.. దేవుడు మళ్ళీ ఈ జన్మలో కూడా కలిపాడు.. నాకొక రోజు కార్ లో లిఫ్ట్ ఇచ్చింది.. తర్వాత నేను వాళ్ళింట్లో ఫెవికాల్ వేసుకుని స్థిరపడి పోయాను..

వీటి తో పాటు ఇంకా సంతోషం ఏమిటంటే ఈ రోజు నా పాతమిత్రులు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు.. మా ప్రపీసస అధ్యక్షులు కూడా మా సంఘం తరఫున ఒక మంచి కార్డ్ పంపించారు.. ఇవాళ ఫోన్ కూడా చేశారు. ఇవేకాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇప్పుడు కడుపుతో ఉండి మాట్లాడను కూడా ఓపిక లేదు.. కాని నా పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని మెయిల్ చేసింది..
I repeatedly say that I'm blessed to lead the life I have.. well, can anyone challenge my claim???

-కార్తీక్

"ఘర్షణ" పరిష్కారమా???

5/12/2010 - రాసింది karthik at Wednesday, May 12, 2010
ఈ మధ్య బ్లాగుల్లో జరిగిన కొన్ని చర్చలలో అసమానతలను రూపుమాపడానికి ఘర్షణ తప్పదనే ఒక భావన వ్యక్తమైంది. ఇది నాకు కొంత ఆశ్చర్యం మరికొంత అసహనం కలిగించింది.  ఇది నేను స్త్రీవాదానికో లేక దళితవాదానికో మాత్రమే పరిమితం చేసి ఈ టపా రాయటం లేదు.. కేవలం రెండు  వర్గాల గురించి మాత్రమే చెప్పదల్చుకున్నాను..  ఆ వర్గాలు ఎవరైనా కావచ్చు.. స్వతహాగా నేను ఏ వాదినీ కాదు.. నాకు తెలిసి ఏ అమ్మా అబ్బకు కూడు పెట్టే వాదాలు నాకింతవరకూ కనిపించ లేదు. అది సామ్యవాదమైనా కావచ్చు లేదా స్త్రీవాదమైనా కావచ్చు.
ఇక విషయానికి వస్తే "ఘర్షణ" తో కలిగిన ఏ మార్పూ శాశ్వతంగా నిలబడుతుందని నాకనిపించటం లేదు. ఎందుకంటే ఈ ఘర్షణ వల్ల మరొక వర్గం లో "ఓటమి" అనే బాధ ప్రతీకారాన్ని నూరిపోస్తుంది తప్ప వాళ్ళకు సమానత్వం యొక్క అవసరాన్ని తెలియచెప్పదు. ప్రస్తుతం సమాజానికి కావాల్సింది సహజీవనానికి ఆయువు పట్టు లాంటి ఓర్పు, సహనం. "ఘర్షణ" అనేది ఒకసారి మొదలంటూ అయితే ఇక దానికి అంతం అంటూ ఉంటుందా అనేది నాకు అర్థం కాని విషయం.  ఎందుకంటే దాన్ని ప్రతీ వర్గం వారూ ఒక ఆధిపత్య పోరులా భావిస్తారే తప్ప  సమానత్వానికి దారిలా అంగీకరించరు. సమాజం లో ప్రతీ వ్యక్తీ/వర్గానికీ ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది.. ఈ "ఘర్షణ" అనే భావజాలం దాన్ని గుర్తించక సదరు వ్యతిరేక వర్గాన్ని కించపరుస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తాయి.. దీనికి ఏ వర్గమూ అతీతం కాదు.. ఇప్పుడు పీడిత వర్గం గా ఉన్నవారు భవిష్యత్తులో పీడించేవారిగా మారరు అని చెప్పలేము.. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం..రేపు ఈ పీడిత వర్గాలకు ఏ హిట్లరో దొరికాడంటే మిగతా వారి పని గోవిందే.. జర్మనీలో యూదుల ఆధిపత్యానికి గండి కొట్టాలనే హిట్లర్  తలంపు దేనికి దారితీసిందో మనకందరికీ తెలుసు. ఆ రోజులలో జర్మన్ సమాజం లోని ఉన్నతమైన పదవులను యూదులు ఆక్రమించారని వారికి వ్యతిరేకంగా హిట్లర్ చేసిన పనులు ఏ సమానత్వాన్ని సాధించాయో ప్రపంచం చూస్తూనే ఉంది..
ఇలాంటిదే మరొక సంఘటన నేను కళ్ళారా చూశాను.. నాకు తెలిసిన మిత్రుడొకరు విడాకులు తీసుకోవాలనుకుంటే అతని భార్య గృహ హింస కింద కేసు పెట్టింది. ఇక్కడ విషయమేమిటంటే ఆ జీవి అప్పుడు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు బ్రతికిలేరు.. కానీ ఇండియాకు వచ్చిన వెంటనే జెయిలుకైతే వెళ్ళల్సి వచ్చింది.. అంతే కాక అతని మీద ఏడు కేసులు పెట్టిందట కనీసం తన కొడుకును కూడా నాలుగేళ్ళపాటూ చూడనివ్వలేదు :( ఇలాంటిదే ఇంకొక సంఘటన కూడా చూశాను కానీ దాని గురించి బ్లాగులో రాయడం సభ్యత కాదు కాబట్టి రాయడం లేదు.. ఆర్కుట్లో ఉన్న 498ఏ సమూహం లో చూస్తే ఇలాంటివే మరిన్ని తగుల్తాయి..
మరో పక్క మా బంధువుల అమ్మాయిని అత్తగారి వాళ్ళు కిరోసిన్ పోసి చంపేశారు.. బాగా బలిసిన పార్టీ కనుక అది బయటికి రాకుండా మూసేశారు.. ఆ అమ్మాయి తండ్రి మొన్నటి వరకూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు..
ఆఖరుగా నేను చెప్పేదేమిటంటే ఇప్పుడు పీడితులుగా ఉన్నవారు అవకాశం అంటూ వస్తే ఇతరులను పీడిచే అవకాశం ఎంతైనా ఉంది..   కనుక ఈ ఘర్షణలు మరొక ఘర్షణకు మార్గం తప్ప మరేమీ కాదు.. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జరిగిన వర్సెయిల్స్ ఒప్పదమే రెండవ ప్రపంచ యుద్దానికి నాందిగా నిలిచింది.  
ఇక ఈ ఫలానావాదుల గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. ఉదా:స్త్రీవాదులు. నా జీవితం లో ఇప్పటి వరకూ ఒక్క నిజమైన స్త్రీవాదిని చూడలేదు. అందరూ స్త్రీవాదమనే ముసుగును అవసరానికి వాడుకునే వారే.. కాబట్టి ఎవరైనా స్త్రీవాదులం అని చెప్పుకుంటే నేను నమ్మడానికి కొంచెం సందేహిస్తాను.. 
The need of the hour is enrollment of people into our cause not enforcement.
నేను enrollment(తెలుగుపదం??) అని ఎందుకు చెబుతున్నానంటే అది పని చెయ్యడం ఒక కుటుంబ స్థాయిలో చూశాను కాబట్టి.. వ్యక్తి స్థాయిలో ఫలవంతమైనది సమూహం స్థాయిలో కూడా పనికిరావచ్చు అనేది నా భావన.. దీనికి నా దగ్గర ఆధారాలు, నిరూపిత సాక్ష్యాలు లేవు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఖైదీల కోసం ఒక  కార్యక్రమం నిర్వహిస్తారు. దానిలో వారిని హింసారహిత జీవితం లోకి enroll చేస్తారు తప్ప బలవంత పెట్టరు.. నేను చెప్పేది అలాంటి పరివర్తన. ఆ పరివర్తనకు మూలం enrollment మాత్రమే!!

-కార్తీక్
గమనిక: నేను రేపు పొద్దునే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాను. కనుక మీ వ్యాఖ్యలకు జవాబివ్వటం కొంత ఆలస్యం కావచ్చు. గమనించగలరు.