నా ఇంజినీరింగ్ రోజులు -3 : మరొక ల్యాబు..

3/25/2009 - రాసింది karthik at Wednesday, March 25, 2009
ఎలాగో అష్ట కష్టాలు పడి మొదటి సంవత్సరం అయ్యిందనిపించాను. జాలి, దయ అనేవి ఏమాత్రం లేకుండా పరీక్షలు అయిన రెండు రొజులకే మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ల్యాబుల్లో ఒక దాని పేరు ఎలక్ట్రికల్ ల్యాబ్. దాని గురించి కాలేజీలో అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. నాలుగేళ్ళలో అది పాస్ అవ్వటం అన్నిటి కన్నా కష్టం అని. అక్కడ ప్రజలు మాహా శాడిస్టులని వగైరా,వగైరా. మా 43 సార్ నే భరించాను ఇంక వీళ్ళెంత అనుకున్నాను. కాని రెండు సార్లు ల్యాబ్ అట్టెండ్ అయ్యాక తెలిసింది నేనెంత పొర బడ్డానో తెలిసింది. అప్పుడు నేను ఆకాశం లోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచించి ఒక నిజం తెలుసుకున్నాను:

తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది
ౠతురాగాలు ముదిరి అంతరంగాలు అయ్యింది
మా 43 సార్ ముదిరి ఈ ఎలక్ట్రికల్ ఇంచార్జ్ అయ్యాడు.

ఇంక చూస్కో నా సామిరంగా ప్రతి వారం నాకు పండగే పండగ. వైవా పేరు చెప్పి ఆ దరిద్రుడు చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ట్రాన్స్ఫార్మర్ లలో రెండు రకాల లాసెస్ జరుగుతాయి. ఆ పాపాత్ముడికి అవి కూడా తెలీదు. మళ్ళి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాడు. ( నిజమండీ నాకు ఖడ్గం సినిమా చూసినప్పుడు అతనే గుర్తొచ్చాడు) పైగా ప్రతీ వారం మీ క్లాసులో ఇంత మందిని ఫెయిల్ చేస్తా, అంత మందిని మాత్రమే పాస్ చేస్తా అని చాలా బిల్డప్ ఇచ్చేవాడు. ఇలా వారం వారం గండం, సెమిస్టర్ ఆయుషు లాగా జీవితం గడిచిపోతొంది. ఇక్కడ ఒకే ఒక మంచి విషయం ఏమిటంటె ఆ పంకజాక్షి నా బ్యాచు కాకపోవటం. లేక పోతే ఆడ పిల్లలు ముందు అసలే అంతంత మాత్రంగా ఉన్న పరువు తెలుగంగలో కలిసి పోయేది.

ఇలా మూడు రికార్డ్ కొట్టివేతలు, ఆరు వైవాలతో జీవితం గడుస్తుండగా ల్యాబ్ ఇంటర్నల్స్ వచ్చాయి. నారు పోసిన వాడు నీరు పొయ్యక పోతాడా, పొయిన సారి హెల్ప్ చేసిన దేవుడే ఈ సారీ చెయ్యకపోతాడా అని ధైర్యంగా ఉన్నాను. ఆ రొజు ఎక్స్ పరిమెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఇంక ఈ ల్యాబు సూపర్ హిట్టే అనుకున్నాను. కాని నోటీస్బోర్డ్ లో మార్కులు చూస్తే 34/50 అని ఉన్నాయి. "నహీ" అని ఒకసారి గట్టిగా అరిచి అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుందామని ఆ ఇంచార్జ్ ని కలిశాను. అప్పుడు ఆ పాపాత్ముడు చెప్పిన కారణాలు ఇప్పటికీ నా చెవులలో మ్రోగుతున్నాయి. అందులో ముఖ్య మైనది ఏమిటంటే నేను రాసిన రెసల్ట్స్ లో సీరియల్ నంబర్ వేయలేదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ వాడింటికి నేనెప్పుడూ వెళ్ళ లేదు, ఇంకొక ముఖ్యమైన పాయింట్ మా బంధువులెవరు ఆ డిపార్ట్ మెంట్ లో పని చెయ్యటంలేదు వగైరా వగైరా.

అప్పుడు నా కోపం అంతా ఆ ఎక్స్ టర్నల్ ఎగ్జాం మీద చూపించి 44/50 తెచ్చుకున్నాను. కానీ, ఆ ఇంటర్నల్ మార్కులు మాత్రం నన్ను చాలా దెబ్బ తీశాయి. ఇప్పుడు నా ఇంజినీరింగ్ పర్సెంటేజ్ 79.. లలో ఆగిపొయింది. వాడు మార్కులు వేసుంటే 80+ అయ్యేది :(

thats life. that 1%, 1mark, 1sec is the damning difference b/n success and failure.

-కార్తీక్
(తదుపరి టపాలో మా రెడ్డి గారి జైత్రయాత్రల గురించి రాస్తాను)

నేను--మా బల్లి--కోకకోలా--నా నిద్ర :(

3/19/2009 - రాసింది karthik at Thursday, March 19, 2009
తారాగణం: నేను, మా బల్లి అండ్ నా బ్లాగులో కామెంటని ప్రజలు. గెస్ట్ రోల్ బై యెన్.టి.ఆర్.

అది మొన్న ఆది వారం, నేను ముందు రోజే నా బ్లాగులో మా 43 సార్ ని మనసారా పొగిడి (నిజమండీ కావాలంటే ఇంతకు ముందు టప చూడండి) ఎవరు కామెంటుతారా అని ఎదురుచూస్తున్నాను. కాని మంచికి రోజులు కావు కదా, అందుకని ఎవరూ కామెంట లేదు. అప్పుడు నేను మా వంట రూమూ గోడ వైపు తిరిగి ఆ పైన వుండే బల్లిని చూస్తూ దీర్ఘంగా ఆలోచించిస్తూ మయసభలో భంగపడిన యన్.టీ. ఆర్. లెవెల్లో,
ఏమే! ఏమేమే నీ ఉన్మత్త వికట్టాట్టహాసము అని మిగత డయలాగ్ గుర్తుతెచ్చుకుంటుంటే ఆ బల్లి కాస్తా వచ్చి దాదాపుగా నా మీద పడింది. నేను డేరింగ్ అండ్ డైనమిక్ పర్సన్ కాబట్టి పక్కకు గెంతి ఒక అరుపు అరిచి తప్పించుకున్నా. ఇంకొకరైతే ఈపాటికి ఆ బల్లి దెబ్బకు సౄహ కోల్పొయే వారు.
అప్పుడు మరోసారి యన్.టీ. ఆర్. ...
అహో!! కడపలో జన్మించితినిపో?? నేనెందుకు ఇంజినీరింగ్ చదువ వలే??
చదివితినిపో, నేనెందుకు బెంగళూరుకు రావలె?? వచ్చితినిపో నేనెందుకు బ్లాగు రాయవలె, రాసితినిపో, ప్రజలెందుకు కామెంటకుండవలే?? కామెంటకుండెను పో, నేనెందుకు గోడ వైపు మరల వలె??
అహా!! హతవిధీ!! కడపలో జన్మించి బెంగళూరుకు ఏతెంచిన నాకు ఈ బల్లి చే పరాభవమా??
ఇదంతా విని మా రూమ్మేటు నేను ఎర్రగడ్డ నుంచి వచ్చిన బాపతు అనుకుని మెంటల్ హాస్పిటల్ కు ఫోన్ చేస్తానన్నాడు. ఇంకా అక్కడె ఉంటే ఏమేమి దారుణాలు చేస్తానో అని భయపడి మా వీధి చివర ఉండే టోటాల్ మాల్ లోకి పారిపోయా. అక్కడ కూరగాయలు కొనబోతుంటే ప్రజల తాకిడికి నాకు కొన్ని గాయాలయ్యాయి. ఇలా నేను చెమటలు కక్కుతూ ఉంటే పక్కన కోకకోలా బాటిల్ కనపడింది. అమీర్ ఖాన్, టండ మత్లబ్ కోకకోలా అన్నాడు కదా అని అది కొనుక్కుని ఇంటికి వచ్చా. ఇప్పుడు ఆ బల్లి ఉన్న రూములో కాకుండా వేరే రూములో కుర్చొని "ఖతర్నాక్" అనే సినిమా చూస్తూ భయమేసినప్పుడల్లా కొంచం కొంచం కోకకోలా తాగేశా.
ఇంక ఆ రోజు రాత్రి నుంచి మొదలైయింది అసలు కథ. రెండు ముక్కులు పూర్తిగా మూసుకుపోయాయి, మాట్లాడాలంటే కూడా కష్టం ఐపోతుంది. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని. ఎండలు ఎక్కువ ఉన్నాయని కూల్ ద్రింక్ తెచ్చుకంటే , ఆ రోజే వర్షం రావాలా?? ఈ జలుబు దెబ్బకు నేను సరిగ్గా నిద్రపోయి 5 రోజులు అయ్యింది. ప్రతీ రోజు రాత్రి 3, 4 అవుతోంది. మామూలుగానే నేను ఏ మాత్రం నిద్ర పోతానో ఇక్కడ చూడండి. కరువుకు తోడు అధిక మాసం అంటారే అలాగ తయారయ్యింది పరిస్తిథి :(
ఇప్పుడు రాత్రి 12 అయ్యింది, ఇంకెప్పుడు నిద్రపోవాలో ఏమొ??

నా నిద్ర కోసం ప్రార్థించాలని ప్రజలకు మనవి ఎందుకంటే అప్పుడు నేను తక్కువ బ్లాగులు రాస్తా, మీకు కొంచం తల నొప్పి తగ్గుతుంది.

మీ
-కార్తీక్

నా ఇంజినీరింగ్ రోజులు -2: ప్రోగ్రామింగ్ ల్యాబ్, మా "43"

3/14/2009 - రాసింది karthik at Saturday, March 14, 2009
ఇక అసలు కథ కు వస్తే మాకు వర్క్ షాపే కాక ఇంకొక ల్యాబ్ కూడా ఉండేది అదే "సి" ప్రోగ్రామింగ్. ఆ ల్యాబ్ లో కూడా నా పక్కన పంకజాక్షి కూర్చుని చాలా సీరియస్ గా ఏదేదో రాసేది. నాకు మాత్రం దూరదర్శన్లో "ప్రగతిపథం" చూస్తున్న ఫీలింగ్ కలిగేది. నా స్థాయికి తగ్గట్టుగా నా అబ్సర్వషన్ నోట్స్ లో కూడా ఒక నాలగు పెట్టెలు ఉండేవి, వాటికి సి.పి.యు. అని, మానిటర్ అని, రకరకాల పేర్లు పెట్టి ఉండేవి. ఆ పిల్ల బుక్కు లో మాత్రం ఒక నంబర్ కు ఫాక్టోరియల్ ఎలా కట్టాలి, సెంటిగ్రేడ్ ను ఫారిన్ హీట్ లోకి ఎలా మార్చాలి వగైరా ఉన్నాయి. కంప్యుటర్ పేరు చెప్పి ఎన్ని అఘాయిత్యాలు చెయ్యొచ్చో ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఎవరూ చెప్పకుండానే ఇన్ని ఎలా రాయగలిగిందా అని ఆశ్చర్య పోయాను. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే ఎంసెట్ అయ్యాక ఆ పిల్ల ఏదో కోర్స్ జాయిన్ అయ్యింది. నేను మాత్రం మా బాలూ గాడితో కలిసి ఏ ర్యాంక్ కి ఏ కాలేజీలో చేరాలి అని ప్రజలను అడుగుతూ సమయం వెల్ల బుచ్చాను. ఆఖరికి ప్రజలు మా సైకిళ్ళ శబ్దం విని పారిపోయే స్టేజికి వచ్చారు. అప్పుడు నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే " హత్య అయినా, ఆత్మహత్య అయినా మరణం తప్పదు: ఏ కాలేజీలో చేరినా మనం పెద్ద పొడిచేది అంటూ ఏమీ లేదు " అని.
ఇంతకూ నేను చెప్పొచేది ఏమిటంటే, ఆ పిల్ల నాకన్నా చాలా తోపు అని. అందు వల్ల ప్రతి ల్యాబ్ లో నా కన్న చాలా త్వరగా బయటకు వెళ్ళిపొయేది. నేను మాత్రం, అందరికంటే ఆఖరున ల్యాబ్ ఇంచార్జ్ చేత కొన్ని అక్షింతలు తిని పొయ్యెవాడిని. అలా నా ప్రోగ్రామింగ్ మూడు తిట్లు ఆరు ఎర్రర్లతో విరబూస్తూండగా మా ప్రోగ్రామింగ్ సార్ మారిపోయాడు. ఈ కొత్త సార్ చూడ్డానికి తార్జాన్ లాగా ఉంటాడు. యన్.టీ.ఆర్. లెవెల్లో ఒక కనుబొమ్మ ఎత్తి మాట్లాడే వాడు. ఇవ్వన్నీ కాకా, ఆ జీవి ఇంగ్లీష్ అతని జీవితానికి హైలైట్, సైడ్ లైట్, అండ్ బ్యాక్ లైట్. అతని ఇంగ్లీష్ ప్రతిభ గురించీ రెండు మచ్చు తునకలు ప్రజల కోసం ఇక్కడ:
1. సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ని " అప్సైడ్ హియర్ ఒన్ కామా దేర్ ఒన్ కామా " అన్నాడు.
2. గొంతు బాగాలేదు, మాట్లాడటం కష్టంగా ఉంది అనేదానికి " వర్డ్స్ నాట్ కమింగ్ " అన్నాడు.
( ఇలాంటి వాడు లెక్చరర్ ఎలా అయ్యాడు? అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ లో, అని మీకు అనుమానాలు రావచ్చు. కాని నేను అవి తీర్చేందుకు అశక్తుడను. ఎందుకంటే అవి చాలా పెద్ద రాజకీయాలు. )
ఈ జీవి వచ్చాకా నా పని పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. తిట్లు, ఎర్రర్ల నుంచి ల్యాబ్ నుంచి బయటకు పంపించే స్టేజికి చేరుకున్నాను. నా పక్కనున్న పిల్ల మాత్రం ఓ తెగ రాసేది. ఇలా లాభం లేదని మా సార్ దగ్గర పర్సనల్ గా డౌట్స్ అడుగుదాం అని అతని రూం కి పోయాను. అప్పుడు ఆ జీవి నిమిషానికి మూడు సార్లు నన్ను, నా ఎంసెట్ ర్యాంకును, నా ఇంటర్ సార్లను తిట్టాడు. నేను మాత్రం మనసులో అన్ పార్లమెంటరీ ల్యాంగ్వేజ్ లో అతన్ని పొగిడాను. ( అఖరి వాఖ్యం నమ్మిన వారికి పాజిటివ్ థింకింగ్ ఎక్కువని తెలుసుకోండి )
ఎమన్నా అంటే నాది ఓర్చలేని తనం అంటారు కాని, ఆ పాపాత్ముడు ఆకాశవాణి " డాక్టర్ గారి సలహాలు " కు ఫోన్ చేసి కొత్త పాటలు అడిగే రకం.
ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్న నాకు ఒక విషయం చెప్పాడు అదేంటంటే మా సారు అతను ఇంజినీరింగ్ క్లాస్మేట్స్ అట మరియు మా సార్ కు ఇంజినీరింగ్ పర్సెంటేజ్ "43" అని. ఆ మాటలు నా జీవితం లోకి కొత్త వెలుగును తీసుకు వచ్చాయి. ఎందుకంటే, మా దరిద్రుడికే 43% వచ్చిందంటే నాకు 70 కి తక్కువ కాకుండా వస్తుంది అని డిసైడ్ అయ్యాను. ఈ విషయాన్ని నేను కాలేజ్ అంతా వ్యాపింప చేయడం అతని పేరు "43 సార్" గా మారిపోవడం నిమిషాలలో జరిగింది. అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు అతను పోతూ ఉంటే చుట్టు పక్కల ప్రజలంతా "43" "43" అని అరిచేవారు. కానీ ఆ జీవికి దాని మీనింగ్ అర్థం చేసుకునే సీన్ లేక పోవడం వల్ల అదేమీ ప్రాబ్లం కాలేదు.

ఇలా కథ మంచి రసకందంలో ఉండగా, ల్యాబ్ ఇంటర్నల్స్ వచ్చాయి. నాకు మాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చింది. నాకు అది మామూలుగా చెయ్యటమే సరిగ్గా రాదు, ఇంక కంప్యుటర్లో అంటే??? సానియా మీర్జాకు సెరెనా విలియంస్ కు మధ్య మ్యాచ్ లా తయారయింది అక్కడి పరిస్థితి. నేను దేవుణ్ణి ప్రార్థించి కోడ్ రాయటం మొదలు పెట్టేసరికి నా పక్కనున్న పిల్ల కోడ్ రాసి, టైప్ చేసి, అది కరెక్ట్ అని అనిపించుకుంది. వైవా అడగను మా జీవి ఆ పిల్ల సిస్టం దగ్గరికి వచ్చాడు. ఒక్క కొశన్ తెలిసినా మంచిదే కదా అని నేను ఒక చెవి అటు వేసి వుంచాను. మా వాడు అడిగింది ఏమిటంటే " ఏమండీ మీరు అబ్బాయిలకు, లెక్చరర్లకు అడ్డ పేర్లు పెడతారంట? ఈ మార్కులు పూర్తిగా నా చేతిలో ఉంటయి అని మర్చి పొయారా? " అని అడిగాడు. నేను ఈ రోజు నా పని గోవిందా అని ఫిక్స్ అయ్యాను. "43" గురించి తెలిస్తే ఎప్పటికీ పాస్ కాలెను. కానీ దేవుడు నా ప్రార్థనలు విని నా వైవా ఇంకొక సార్ దగ్గర వేశాడు. కాబట్టి ఎలాగో బయట పడ్డాను. తుపాకి చేతిలో పెట్టుకుని కూడా హీరో చేతిలో చచ్చిపొయ్యే విలన్ లా ఆ పిల్ల కు నా కంటే తక్కువ మర్కులు వచ్చాయి.

( ఇది నిజంగా జరిగిందా అంటే, అవును జరిగింది. నేను ఆ డేట్స్ కూడా చెప్పగలను )

మీ
-కార్తీక్

చీకటి రహస్యం 1

3/11/2009 - రాసింది karthik at Wednesday, March 11, 2009
నా ప్రోగ్రామింగ్ ప్రతిభ గురించి చెప్పేముందు, నాకు కంప్యుటర్ కు మధ్య వున్న సంబంధాన్ని గురించి చెప్పాలి. అందుకోసం నా చీకటి రహస్యాన్ని ప్రజలకు చెప్పక తప్పదు.
చీకటి రహస్యం 1: అవి నేను ఇంటర్ పూర్తి చేసి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్న రొజులు, ఒక రోజు మా ఫ్రెండ్ బాలూతో కలిసి ఇంటర్నెట్ కి వెళ్ళాను. అప్పటికి మా ఇద్దరికీ కలిపి ఒకే యాహూ అకౌంట్ ఉండేది. ( అందరూ అకౌంట్ అకౌంట్ అంటే అదేదో బ్యాంక్ అకౌంట్ లాంటిది అనుకుని జాయింట్ గా వాడేవాళ్ళం ). మాకు తెలిసిన ఒక జీవీ మాకు అతని మెయిల్ ఐడి ఇచ్చాడు. సో ఆ రోజు అతనికి మెయిల్ చెయ్యాలని పట్టుదలగా వెళ్ళాం. డేట్, ఊరి పేరు కుడి వైపు రాసి ఆ తర్వాత ఒక నాలుగైదు లైన్లు రాశాం. ఇంతలో ఆ షాప్ వాడు మీ గంట సేపు టైం అయిపొయింది అని చెప్పాడు. కంప్యుటర్ గడియారానికి స్పీడ్ ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు ఆ మెయిల్ పంపించాలంటె అతని ఐడి టైప్ చెయ్యాలి. అందులో ఒక "@" కూడా ఉంది. అది ఏ భాషలోదో మాకు తెలియదు. "2" ని టైప్ చేస్తే అదే వస్తాంది తప్ప "@" రాలేదు. ఐదు నిముషాల పాటూ స్విచ్ బోర్డ్ లో ఉన్న అన్ని స్విచ్లు వత్తాం. (ఆ స్విచ్ బోర్డ్ నే కీ బోర్డ్ అంటారని తర్వాత తెలిసింది ). అప్పటికే షాప్ వాడిని పాస్వర్డ్ ఎక్కడ రాయాలి, అందులో చుక్కలు కాక అక్షరాలు కనపడవా వగైరా, వగైరా ప్రశ్నలతో వాడి మెదడుకు మేత పేట్టాం. మళ్ళీ అడిగితే సీ.పీ.యు. మా నెత్తినేసి చొక్కా చించుకుంటాడనిపించింది. అందుకని అడగ లేదు. అలానే ఇంకొక ఐదు నిముషాలు ప్రయత్నించి మా వల్ల కాక ఏడుపు మొహాలు పెట్టుకుని బయటకు వచ్చాం.

కానీ ఇందులో నా తప్పేం లేదని ప్రజలు గుర్తించాలి. ప్రతీ అక్షారానికి ఒక స్విచ్ ఇవ్వకుండా కక్కుర్తి చూపించుకున్న బిల్ గేట్స్ ది. కాబట్టి అప్పటి నా మానసిక క్షోభకు పరిహారంగా మైక్రోసాఫ్ట్ లో సగ భాగం నాకు ఇవ్వాలని బ్లాగు ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అందువల్ల ఈ టపా చదువుతున్న ప్రజలంతా ఈ ఉద్యమం లో నాకు బాసటగా నిలిచి తమ తమ మొబైల్స్ నుంచీ "కార్తీక్" అని 420 కు మెసేజ్ ఇవ్వగలరు. (మీరు ఇవ్వండి చెప్తాను, కానీయ్యండి)

-కార్తీక్

నా ఇంజినీరింగ్ రోజులు -1: వర్క్ షాప్

3/01/2009 - రాసింది karthik at Sunday, March 01, 2009
అది క్రీ. శం. 2001.

ఎంసెట్ లో తల బొప్పి కట్టిన తరువాత, మా ఊరిలో ఉన్న అతి చెత్త కాలేజీ లో ఎప్పుడూ పేరు కూడా వినని బ్రాంచిలో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. అందరు ర్యాగింగ్, తొక్క, తోలూ అని చెప్పి బుర్ర వాయగొట్టారు. కాని తీరా చేరిన తరువాత అందరు స్కూల్లో లేదా ఇంటార్ లో నా సీనియర్స్. కనపడుతూనే నేను "మీది ఆ స్కూలే, మాది ఆ స్కూలే, మన కరస్పొండెంట్దీ ఆ స్కూలే " అని గట్టిగా పాడేవాడిని. వెంటనే వాళ్ళు "ఏం కార్తీక్, కాలేజీ లో చేరుతున్నావని నాకు చెప్పలేదేం? " అని అడిగేవాళ్ళు. ఈ కాలేజీలో చేరానూ అని అందరికి చెప్పుకుంటే, అది విన్న వాళ్ళకి పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అని చెప్తే బాగుండదని ఏదో ఒక ఐదు పైసల అబద్దం చెప్పేవాడిని. కొందరు నమ్మే వాళ్ళు కొందరు నమ్మి నట్లు నటించేవాళ్ళూ. ఇలా ఒక వారం పది రోజులు కుశల ప్రశ్నలు, స్టీలు డబ్బాలు , సె ల్ఫ్ డబ్బా లతో గడిచిన తరువాత, ఒకానొక దుర్దినాన, వర్క్ షాప్ అనే చోటికి మమ్మల్ని పిల్చుకుపోయారు. దాని మొహం చూస్తే ఏ రెడ్డి రాజుల కాలం నాటి కొలిమికి పేరు మార్చి వర్క్ షాప్ అంటున్నారు అని డౌట్ వచ్చింది. అందులో నా రోల్ నెం. 1 కాబట్టి నేను అందరికంటే ముందుగా లోపలికి పోయాను. అక్కడ ఉన్న సార్ "ఈ రోజు నీ జాబ్ ఫైలింగ్ అన్నాడు" ఫైలింగ్??? అంటే ??? *(#@&...

అంతలో ఒక అటెండర్ వచ్చి నన్ను ఒక కసురు కసిరి ఇంకా అక్కడే ఉన్నావే అని రెండు ఇనుప బిళ్ళలు చేతిలో పెట్టి వీటిని "V" షేప్ లో అతికించు అని చెప్పాడు. నేను చిన్నప్పుడు ఇంజినీరింగ్ అంటే ఇంజిన్లకు నీళ్ళు పొయ్యటం అని అనుకునేవాడిని, అది నిజమేనేమో అని ఒక అనుమానం నా మనసులో అడుగు పెట్టింది. కానీ గుండెను రాయి చేసుకుని ఆ ఇనుప ముక్కలని అతికించను ప్రయత్నించా. నా రక్తాన్ని చెమటగా మార్చి దాని మీద పని చేశా, కానీ అది కాస్తా "వి" షేప్ లో కాకుండా, అదేదో చైనీస్ అక్షరం టైపులో వచ్చింది.(నిజమండి మీరు నమ్మాలి అదేదో అక్షరమే!! ) దాని వాలకాన్ని చూసిన ఆ అటెండార్ కు మతి పొయ్యింది (వాడికి అసలు మతి ఉందా అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ) వాడు దాన్ని మా సార్కు చూపించాడు. ఆయన అది చూసి, "యౌ!! ఆడపిల్లలు సరిగ్గా చేశ్తానారు కదుయ్యా! " అని నా పక్కనున్న పంకజాక్షిని చూపించాడు. ఆ పిల్ల వెంటనే గర్వంగా ఒక చిరునవ్వు నవ్వింది. నేను ఆ పరిసరాల్లొ ఉన్న ప్రజలందరిని అన్-పార్లమెంటరి ల్యాంగ్వేజ్ పొగిడాను. (ఒట్టు!! నిజంగా పొగిడాను కొన్ని పొగడ్తలను సభ్య సమాజం హర్షించదు అందుకని ఇక్కడ రాయడం లేదు.) నా క్రియెటివిటీ ఎంసెట్ బోర్డే అర్థం చేసుకోలేదు ఇంక వీళ్ళెంత అనుకున్నా.

ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మా బ్యాచ్ని కొలిమి నుంచి వడ్రంగి పనికి మార్చారు. అక్కడ వీడీ కంటే పెద్ద ముదురు ఒకడు తగిలాడు. వాడు ఎం చెప్తాడో నర మనవుడికి అర్థం కాదు. వాడిది పులివెందుల అని తెలిసి మా బ్యాచ్లో ఉన్న ప్రదీప్ కూడా వాళ్ళ ఊరి పేరును పులివెందులగా మార్చాడు. నేను మాత్రం అక్కడ కూడా నా క్రియేటివిటికి పదును పెట్టి లోక కల్యాణం కోసం కొత్త కొత్త అక్షరాలు కనుక్కున్నాను. మా సార్ మాత్రం అవి ఏ అక్షరాలో కనుక్కోలేక తికమక పడిపోయేవాడు. చూస్తూండగానే ఇంటర్నల్స్ వచ్చాయి. ఏలేశ్వరం పొయినా శనేశ్వరం తప్పదని అక్కడ కూడా వడ్రంగి పని దొరికింది. ఆ రోజు క్రియేటివిటి ఎక్కువయి ఇచ్చిన చెక్క మధ్యలోకి విరిగిపోయింది. పది మార్కులు ఫట్ అనే ఒప్పందం మీద కొత్త చెక్క ఇస్తాను అన్నాడు. నేను అల్ట్రా-క్రియేటివ్గా ఆలోచించి పక్కనున్న చెట్టు కొమ్మలో వాడికి కావలసిన అక్షరాలు చెక్కుతాను అన్నాను. ఐనా నన్ను అర్థం చేసుకోకుండా మార్కులు కట్ చేశాడు. మంచికి రోజులు కావు.

అలా పడ్తూ లేస్తూ 38/50 మార్కులతో గట్టెక్కాను.


(వచ్చే టపాలో నా ప్రోగ్రామింగ్ ప్రతిభను, మా 43సార్ గురించి రాస్తాను. అంత వరకు సెలవు.)

మీ
-కార్తీక్