మహిళా బ్లాగర్లకు బొనాంజా ;)

10/12/2011 - రాసింది karthik at Wednesday, October 12, 2011
ఈ మధ్య నాకు లేటుగా తెలిసినా లేటేస్టు గా తెలిసిన విషయం ఏమిటంటే బ్లాగర్లు నన్ను నా వంటల వల్ల గుర్తుపెట్టుకుంటున్నారట. అందుకని వారి అభిమానాన్ని గుర్తిస్తూ వాళ్ళ కోసం మరో వంటకం అందిస్తున్నాను.
ఈరోజు వంటకం పేరు బెంగళూరు వంకాయ పప్పు.. అసలు బెంగళూరు వంకాయ అంటే చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళ సౌకర్యం కోసం కింద క్లోజప్ ఫోటో పెట్టాను అది చూసి మీ జ్ఞాన చక్షువులను తెరిచి ఆ జ్ఞానాన్ని పొందండి.   ఇక అసలు ఈ కూరగాయనే ఎందుకు తీసుకున్నానంటే మా ఇంటి పక్కనున్న షాప్ లో వేరేవి లేవు అందువల్ల..
బెంగళూరు వంకాయ

 పోతే ఈ వంటకానికి కావాల్సిన వస్తువులు: ఒక బెంగళూరు వంకాయ, ఒక కట్ట కరివేపాకు, కొంచెం కొత్తి మీర, 3 చెంచాల నెయ్యి (ఒక చెంచా తిరగవాతలోకి, రెండు చెంచాలు ఆ తర్వాత కలుపుకునేటప్పుడు వేసుకోవడానికి)  మరియూ తిరగవాత సామాన్లు .. వీటన్నిటితో పాటూ కావాల్సింది కొండంత మోటివేషన్..  నా అంత మోటివేషన్ మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ; కాబోయే కుటుంబరావుకు కొవ్వెక్కువ సారీ కసి ఎక్కువ. కనుక "డాక్టర్ సినీ యాక్టర్" సినిమాలో కృష్ణ లా మోటివేట్ అయ్యి కసితో వంట మొదలు పెట్టాను.

ఇకపోతే సామాన్ల తో పాటు పెరుగు ప్యాకెట్ కూడా ఉంది.. అది ఎందుకంటే ఒక వేళ ఈ తిండి అటో ఇటో ఐతే అప్పుడు ఎంచక్కా పెరుగన్నం లాగించెయ్యచ్చు.. మరే!  పడవతో పాటూ లైఫ్ బోట్ కంపల్సరీ కదా..  ఇలా అనుకుని ముందు కూరగాయలు తరిగాను.. ఈసారి పుస్తకాలు చదవలేదు కాబట్టి ఎలా తరగాలి అన్న కంఫ్యూజన్ అస్సలు లేదు..  నాకు ఇష్టం వచ్చినట్టుగా నిలువుగా అడ్డంగా, నా సామి రంగా చెడామడా తరిగేశాను..  ముందు ఆ ఫోటోలు పెడదామనుకున్నాను మళ్ళీ ఈ టపా లేడీస్ స్పెషల్ కదా, అంత వయొలెంట్ ఫోటోలు వద్దని పెట్టలేదు.  అలా తరిగాక కుక్కర్లో కొంచెం కందిపప్పు, ఈ వంకాయ ముక్కలు మరియూ నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టాను.. మా కుక్కర్ గ్యాస్ కట్ లేచిపొయినట్టుగా ఉంది కనుక అసలు విజిల్స్ రాలేదు..  మా కుక్కర్ కూడా మా మేనేజర్ లాగే అవసరానికి ఎప్పుడూ ఉపయోగపడదు.. కొంచెం సేపటి తర్వాత నేనే ఆఫ్ చేసి కుక్కర్ మూత తీయడానికి ట్రై చేశాను అది నా మీద చాలా కోపంగా ఉంది కాబోలు కస్సు బుస్సు అని సెగలు కక్కింది.. శాంత్ గదా ధారీ భీం శాంత్ అని కొన్ని నీళ్ళు చల్లి కొంచెం సేపు వెయిట్ చేసి కుక్కర్ మూత తెరిచాను.. స్పూన్ తో పప్పుని, కూరగాయలను టచ్ చేసి చూశాను అవి ఉడికిపోయి ఉన్నాయి.. వావ్! సగం వంట అయిపోయింది.. ఇంక మిగిలింది తిరగవాత వెయ్యడం మాత్రమే.. జజ్జినక జజ్జినక!!    
తిరగవాత అనేది ఒక సెపరేట్ అసైన్మెంట్.  వంట అనేది థియరీ పరీక్షల్లాంటిదైతే తిరగవాత ల్యాబ్ exam లాంటిది.. కనుక ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వైవా చెప్పినంత బాగా నటించాలి..   ముందుగా  కొంచెం నెయ్యి వేడి చేసిన బాణలి లో వెయ్యాలి.. అది కాగిందా లేదా తెలుసుకోను కొన్ని ఆవగింజలు వెయ్యాలి.. అవి బుస్ బుస్ అని సౌండ్ చేశాక అందులో కరివేపాకు, సన్నగా తరిగిన మిరపకాయలు, తిరగవాతలో వేసే బేడలు(పేరు మర్చిపోయాను ఏమనుకోకండి) , ఇంగువ వేయాలి.. ఆ తర్వాత తిరగవాత లో నుంచీ కొంచెం పొగ రావడాం మొదలయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి.. అంతే! తిరగవాత రేఢీ.. ఇప్పుడు ఈ తిరగవాతను ఆ పప్పులో వేసి దానికి తగినంత ఉప్పూ, కారం, పసుపు వేసి బాగా కలపాలి..  (ఇంట్లో ఉంటే కొంచెం చింతపండు కూడా వెయ్యచ్చు కానీ నా దగ్గర లేదు కనుక వెయ్యలేదు)
  ఇంకా చెప్పేదేముందీ?? మీ అభిమాన వంటకం బెంగళూరు వంకాయ పప్పు రెఢీ..

మహిళా బ్లాగర్లందరూ ఈ వంటకం యొక్క రెసిపీని విచ్చలవిడిగా వాడుకోవచ్చు.. నేనెలాంటి పేటెంట్ గొడవలు చెయ్యనని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను..   ఇలా మహిళా ప్రత్యేకమైన టపాలు రాసి స్త్రీజాతిని ఉద్దరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. నాకు ఈ అవకాశం కల్పించిన బ్లాగర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 


-కార్తీక్