చీకటి రహస్యం 1

3/11/2009 - రాసింది karthik at Wednesday, March 11, 2009
నా ప్రోగ్రామింగ్ ప్రతిభ గురించి చెప్పేముందు, నాకు కంప్యుటర్ కు మధ్య వున్న సంబంధాన్ని గురించి చెప్పాలి. అందుకోసం నా చీకటి రహస్యాన్ని ప్రజలకు చెప్పక తప్పదు.
చీకటి రహస్యం 1: అవి నేను ఇంటర్ పూర్తి చేసి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్న రొజులు, ఒక రోజు మా ఫ్రెండ్ బాలూతో కలిసి ఇంటర్నెట్ కి వెళ్ళాను. అప్పటికి మా ఇద్దరికీ కలిపి ఒకే యాహూ అకౌంట్ ఉండేది. ( అందరూ అకౌంట్ అకౌంట్ అంటే అదేదో బ్యాంక్ అకౌంట్ లాంటిది అనుకుని జాయింట్ గా వాడేవాళ్ళం ). మాకు తెలిసిన ఒక జీవీ మాకు అతని మెయిల్ ఐడి ఇచ్చాడు. సో ఆ రోజు అతనికి మెయిల్ చెయ్యాలని పట్టుదలగా వెళ్ళాం. డేట్, ఊరి పేరు కుడి వైపు రాసి ఆ తర్వాత ఒక నాలుగైదు లైన్లు రాశాం. ఇంతలో ఆ షాప్ వాడు మీ గంట సేపు టైం అయిపొయింది అని చెప్పాడు. కంప్యుటర్ గడియారానికి స్పీడ్ ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు ఆ మెయిల్ పంపించాలంటె అతని ఐడి టైప్ చెయ్యాలి. అందులో ఒక "@" కూడా ఉంది. అది ఏ భాషలోదో మాకు తెలియదు. "2" ని టైప్ చేస్తే అదే వస్తాంది తప్ప "@" రాలేదు. ఐదు నిముషాల పాటూ స్విచ్ బోర్డ్ లో ఉన్న అన్ని స్విచ్లు వత్తాం. (ఆ స్విచ్ బోర్డ్ నే కీ బోర్డ్ అంటారని తర్వాత తెలిసింది ). అప్పటికే షాప్ వాడిని పాస్వర్డ్ ఎక్కడ రాయాలి, అందులో చుక్కలు కాక అక్షరాలు కనపడవా వగైరా, వగైరా ప్రశ్నలతో వాడి మెదడుకు మేత పేట్టాం. మళ్ళీ అడిగితే సీ.పీ.యు. మా నెత్తినేసి చొక్కా చించుకుంటాడనిపించింది. అందుకని అడగ లేదు. అలానే ఇంకొక ఐదు నిముషాలు ప్రయత్నించి మా వల్ల కాక ఏడుపు మొహాలు పెట్టుకుని బయటకు వచ్చాం.

కానీ ఇందులో నా తప్పేం లేదని ప్రజలు గుర్తించాలి. ప్రతీ అక్షారానికి ఒక స్విచ్ ఇవ్వకుండా కక్కుర్తి చూపించుకున్న బిల్ గేట్స్ ది. కాబట్టి అప్పటి నా మానసిక క్షోభకు పరిహారంగా మైక్రోసాఫ్ట్ లో సగ భాగం నాకు ఇవ్వాలని బ్లాగు ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అందువల్ల ఈ టపా చదువుతున్న ప్రజలంతా ఈ ఉద్యమం లో నాకు బాసటగా నిలిచి తమ తమ మొబైల్స్ నుంచీ "కార్తీక్" అని 420 కు మెసేజ్ ఇవ్వగలరు. (మీరు ఇవ్వండి చెప్తాను, కానీయ్యండి)

-కార్తీక్