ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

9/20/2010 - రాసింది karthik at Monday, September 20, 2010
నిన్న చెప్పుదెబ్బలు పూలదండలు బ్లాగులోని టపా చూశాక ఈ కవిత రాశాను..

విడగొడతా నేను
బొందలు పెడతా నేను
రక్తంపారిస్తా నేను
నెగడు ఎగదోస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

గనులను భోంచేస్తా నేను
పత్రికతో పాతరేస్తా నేను
ఆంధ్రా ఖోడా గా మారుతా నేను
ఏదీ కుదరకపోతే ఓదారుస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

సినిమాలను వొదిలేసా నేను
వీధి డ్రామాలు మొదలెట్టా నేను
ఝెండా పీకేస్తే ఊరుకోను నేను
జనాలను అంత సులభంగా వదలను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

సామంతుడిని నేను
కొరియర్ వాడిని నేను
అధిష్ఠానానికి మొక్కుతా నేను
ఫిర్యాదులు చేస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

ఏ ఎండకాగొడుగు పడతా నేను
మైండు బ్లాక్ అయ్యి వెర్రెత్తిపోతున్నా నేను
మహరాష్ట్రకుపోయాను నేను
మొహం పగలగొట్టించుకున్నాను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

మేడం కు కాల్మొకుతా నేను,
ఢిల్లీ గల్లీలో సిల్లీగా నేను,
ఎలక్షనుపొయినా ఆశ వదల్లేదు నేను,
ఏమైనా చేస్తాను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం..

-కార్తీక్

బ్రహ్మచారి బ్లాగర్ల దినం !!!

9/10/2010 - రాసింది karthik at Friday, September 10, 2010
టపా టైటిల్ మరోసారి చదవండి.. అది "బ్రహ్మచారి బ్లాగర్ల దినం" "బ్రహ్మచారి బ్లాగర్లకు దినం" కాదు..   ఇక విషయం ఏమిటంటే బ్లాగుల్లో బ్రహ్మచారుల మీద జరుగుతున్న దాష్టికాలకు వ్యతిరేకంగా "అఖిలభారత బ్రహ్మచారి బ్లాగర్ల సంఘం" ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడానికి నేను మిక్కిలి సంతోషిస్తున్నాను.. ఈ సంఘానికి అధ్యక్షులు సెగట్రీలు తొక్కా తోలు లేకుండా  ఒక బాధ్యతాయుతమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మచారులు తరతరాలుగా ఎదుర్కుంటున్న వివక్షను రూపుమాపటానికి కృషి చేస్తాం..  ఈ పరిణామం ప్రపంచ బ్లాగర్ల చరిత్రలో ఒక మేలి మలుపని పలువురు మేతావులు అభివర్ణిస్తున్నారు..   అసలు బ్రహ్మచారుల సంఘం ఎందుకు మొదలయ్యిందంటే:
1. ఇల్లు అద్దెకు అడిగితే ప్రతీ ఒక్క తాగుబోతు వెధవా "బ్యాచిలర్స్? నో హౌస్" అంటాడు.. అక్కడికి వాడేదో బ్రహ్మచారిగా బ్రతకనట్టు..
2. ఆఫీస్ నుంచీ లేటుగా ఇంటికి వస్తే, గేటు తాళం తీసే లోపు ఒక చిన్న సైజు భగవద్గీత వినాల్సి రావడం..
3. బ్రహ్మచారుల బ్లాగుల్లో కామెంట్లు బొత్తిగా లేకపోవడం..
4. బ్రహ్మచారులకు అగ్రిగేటర్లలో కోటా లేకపోవడం.. 

చెప్పుకుంటూపోతే ఒకటా రెండా, ఎన్నో వివక్షాపూరిత మాటలు, చేతలు  అభిజాత్యపు పొరల్లో నుంచీ వస్తున్నాయి..  వాటిని ఎదుర్కొనేందుకు పుట్టిందే ఈ సంఘం..  ఇక విధివిధానాల గురించి వస్తే, బ్రహ్మచారి సంఘం ఎవరికైనా అంశాల వారి మద్దతు మాత్రమే ఇస్తుంది..  అంటే ఇప్పుడెవరికైనా మాతో పని ఉంటే వాళ్ళు మాకు వేరొక రెండు అంశాలలో సహకరిస్తేనే మేము వాళ్ళకు సహకరించేది.. కుటుంబరావులైతే మాకు ధనవస్తువాహన సహాయం అందించాలి, ఇక సతీ సక్కూబాయిలైతే మాకు కనీసం రెండు రెసిపీలు చెప్పాలి..  ఇక అగ్రిగేటర్ల యజమానులు ఏదో ఒకటి చేసి మా బ్లాగుల్లో ఎక్కువ కామెంట్లు వచ్చేటట్లు చెయ్యాలి..  "పప్పన్నం ఎప్పుడు?", "ఫోటో జాతకం తయారు చేశావా ?"లాంటి  ప్రశ్నలడిగినవాళ్ళని తగు విధంగా శిక్షించాలి.. అప్పుడే మా సంఘాన్ని తమ సంఘానికి అనుభంధ సంఘంగా నడపమని కొందరు కుటుంబరావులు సలహాలిస్తున్నారు..  వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే తరతరాలుగా మీ వివక్షు గురై ఎంతో క్షోభ అనుభవించాం.. ఇప్పుడు మా ధిక్కారాన్ని చూసి మీరు శాంతిమంత్రం పఠిస్తున్నారని మాకు తెలుసు.. ధిక్కారం ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ధిక్కారం ఉంది..   మా న్యాయబద్దమైన డిమాండ్లకు మీరు తలొగ్గకపోతే మా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు..
 కావున బ్రహ్మచారులారా! ఇక నుంచీ మీరు నిర్భయంగా మీ బ్రహ్మ చర్యం గురించి ఎలుగెత్తి చాటండి.. మీకు తోడుగా, మీ వెన్నంటి నీడగా, మీ తల్లో పేనుగా మేముంటాం..  "బ్రహ్మచారి నైన నాజీవితం లో కూడా ఒక బ్రహ్మచారి కథ ఉంది" అందరూ చెప్పుకోవాలి..


మరొక మాట, ఈ రోజు అంటే సెప్టెంబర్ 10 బ్రహ్మచారుల దినం గా ప్రకటిస్తున్నాను.. ఎందుకంటే ఈ రోజు మన బ్రహ్మచారి మితృడైన రవిచంద్ర తన బ్రహ్మచర్యానికి "లాల్ సలాం " చేస్తున్నాడు కనుక ఈ చరితాత్మక రోజుని గుర్తుంచుకోవాలని ఇలా చేయడం జరిగింది..  కొద్ది సేపటి క్రితం ఫోన్ చేస్తే "మీరు ప్రయత్నిన్స్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు" అని రిప్లై వచ్చింది.. 

ఈ రోజు దాంపత్య జీవితం లోకి అడుగుపెడుతున్న రవిచంద్ర గారికి మా అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు..  

-కార్తీక్