జీవని యాత్ర

6/23/2011 - రాసింది karthik at Thursday, June 23, 2011
మొన్న ఆదివారం జీవనికి వెళ్ళాం కదా.. ఆ రోజు మొత్తం సూపరో సూపరు :)
కడప  నుంచీ అనంతపురం ఫస్ట్ బస్ పొద్దున 5:30 కు అందుకని మా నాన్న 4:30 కు నిద్ర లేపారు.. కానీ ఈ మధ్య బద్దకం బాగా ఎక్కువైంది కదా, ఒక 20నిముషాలు అటు ఇటు చాపమీదనే పొల్లి తర్వాత నిద్రలేచాను.. పరుగెత్తుకుంటూ స్నానం చేసి బస్ స్టండ్ కు వెళ్ళాను అప్పటికి టైం 5:20.. బస్ దొరుకుతుంది లే అనుకున్నాను.. కానీ ఆ బస్ వెళ్ళిపొయి అప్పటికే 5నిమిషాలు దాటిపోయింది.. తర్వాతి బస్ తాడిపత్రి దాకా ఉంది అంటే అదెక్కాను.. ఆ బస్ 8:45 కు తాడిపత్రి దించేశాడు.. చాలాసేపు నిద్రపోవడం వల్ల ప్రయాణం చేసినట్టు అనిపించలేదు.. అక్కడి నుంచీ అనంతపురం వెళ్ళే బస్ లో జరిగింది అసలు కామెడీ.. మన రాజ్ కుమార్ కు ఫోన్ చేస్తే ఇంజినీరింగ్ కాలెజీ దగ్గర దిగేయమని చెప్పాడు.. అక్కడికి తనే వచ్చి పికప్ చేసుకుంటా అని కూడా చెప్పాడు.. నేను కండక్టర్ కు ఆ విషయమే చెప్పి పాటలు వింటూ పడుకున్నాను.. తిఫిన్ తిన్నాక నిద్రపోయాను.. కళ్ళు తెరిచి చూసే సరికి మన బస్ వాడు ఆ కాలేజీ దాటి 10నిమిషాలయ్యింది అని పక్కవాళ్ళు చెప్పారు.. కండక్టర్ దగ్గరకి పొయ్యి అడిగితే, ఆ కాలేజి దగ్గర ఎవరో దిగారు సార్ అది మీరే అనుకున్నా అన్నాడు.. మహానుభావుడిది సొంత ఊరు శ్రీకాకుళమేమో.. ఏం చేద్దాం, వెంటనే బస్ దిగేసి ఆటో కోసం చూశా.. ఒక్క ఆటో కూడా ఖాళీగా రావడం లేదు.. అన్ని ఫుల్లే, బహుశా కాలేజీ వల్ల బిజీ అనుకుంటా.. ఒక 5నిమిషాల తర్వాత ఎవరో బైక్ మీద వస్తుంటే అతన్ని లిఫ్ట్ అడిగి కాలేజీ దగ్గరికి చేరాను. ఇంకొక 5నిమిషాల తర్వాత రాజ్ వచ్చి పికప్ చేసుకున్నాడు..  ఆ శంకుస్థాపన జరిగే చోటికి వెళితే అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు చాలా జరిగాయి..ఒంగోల్ శ్రీను అనే వ్యక్తి కనిపించాడు, పక్కన రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా కనిపించాడు. ఒక వ్యక్తి ఒరిజినల్, ఫేక్ ఇద్దరూ ఒకే ఫ్రేం లో ఇద్దరు మనుషులుగా కనిపించడం బహుశా ప్రపంచ ఫేకుల చరిత్ర లో ఇదే ప్రధమం కాబోలు.. ఈ ఒక్క కారణం చాలు ఆ రోజుని ఫాదర్స్ డే కు బదులుగా ఫేకర్స్ డే గా గుర్తించడానికి.. తల తిప్పి చూస్తే బంతి అనే వ్యక్తి కూడా కనిపించాడు.. ఆశ్చర్యం!! నా ఫేక్ ఐడీ నాకు తెలీకుండా ఎలా వచ్చాడా అని కాసేపు విస్తుపోయాను.. ఆ తర్వాత జీవితం అంటే ఇంతే అని లైట్ తీసుకున్నాను.. మాతో పాటూ అక్కడ లీలామోహనం బ్లాగర్ విజయమోహన్ గారూ కూడా వచ్చారు..  రైతునని గర్వంగా చెప్పుకునే వ్యక్తిని కలవడం చాలా సంతోషం కలిగించింది.. We are proud to have met someone like you..

ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవకముందు శివకుమార్ మైక్ అందుకొని తన ప్రతిభా ప్రదర్శన మొదలు పెట్టాడు. శివకుమార్ తెలుగు, కన్నడ భాషలలో పాటలు, డయలాగులు,మిమిక్రీ చెయ్యగలడు.. కానీ ఆ రోజు మాత్రం మిమిక్రీ చేశాడు.. మైక్ దొరికింది కదా అని వై.యస్. ను చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుకున్నాడు. గెస్ట్లు వచ్చేముందు ఎవరో వెళ్ళి ఇంక చాలు రా బాబు అని మైక్ లాక్కున్నారు.. అప్పటికి గానీ మనవాడు శాంతించలేదు.. :D
ఇక ప్రోగ్రాం మొదలయ్యాక ఎవరూ ఊకదంపుడు లెక్చర్లు ఇచ్చి బుర్ర తినలేదు.. అందరూ క్లుప్తంగా తాము చెప్పాలనుకున్నది చెప్పారు.. ఇందులో నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన స్టేజ్ మీద ఉండి ప్రతీ వక్తా మాట్లాడిన దానిలో తనకేం గుర్తొచ్చాయి, ఆ విషయాలు ఇక్కడ ఎలా రిలవెంట్ అని వివరిస్తూ చాలా మంచి విషయాలు చెప్పారు.. ప్రసాద్ గారు కేవలం రెండు నిమిషాలలో తను చెప్పాలనుకున్నది చెప్పి ప్రతీ ఒక్కరిని తమ టైం లో డబ్బులో 1% సమాజానికి ఇవ్వమని చెప్పారు.. ఇది నాకు చాలా బాగా నచ్చింది.. తర్వాత ఆలూరు సాంబశివా రెడ్డి గారు మాట్లాడారు. ఈయన యస్.ఆర్.ఐ.టి. కాలేజి కరస్పాండెంట్. నేను మొదట్లో కరస్పాండెంట్ అంటే కనీసం 45 ఏళ్ళు ఉంటాయని అనుకున్నాను.. కానీ చూస్తే నాకంటే చిన్న వ్యక్తి లా కనిపించారు..   ఆయన మాట్లాడుతూ ఇంకొక 2-3 ఏళ్ళల్లో దాతలు ఎవరూ లేకపోయినా కేవలం ఇంజినీరింగ్ కాలేజీ ఫండ్స్ తో జీవనిని నడిపేందుకు తను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.. అంత అవసరం ఎప్పటికీ రాదు.. కానీ నాకు జీవని కి ఆయన కమిట్మెంట్ శ్లాఘనీయం.. ఈయన తమ ఇంజినీరింగ్ కాలేజిలో పదివేల లోపు ఎంసెట్ ర్యాంక్ ఉన్న పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఫీజ్ తీసుకోమని పొయిన ఏడాది ప్రకటించారు.. ఈ ప్రకటన చూసి నేను ఆ సంస్థకు అభిమానిగా మారాను.. నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజులలో ఫీజు కట్టలేక చదువు మానేసిన వాళ్ళను చూశా కదా, బహుశా అందువల్ల కాబోలు!

ఆ తర్వాత ఫెర్రర్ గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.. ఆ ప్రసంగం గురించి ఇప్పటికే వీజయమోహన్ గారు, రాజ్ చెప్పారు కద..తర్వాత బ్లాగర్ల ప్రతినిధిగా వికటకవి మైక్ అందుకొని తనదైన శైలిలో జీవని ముందున్న సవాళ్ళ గురించి చెప్పారు.. అంతే కాక పారదర్శకతకు పెద్ద పీట వేయడం వల్ల జీవని మీద బ్లాగర్లకున్న నమ్మకం గురించి చెప్పారు.. ఇదే స్పూర్తితో మనమందరం జీవని టీం కు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రసంగాలు అవి అయ్యాక మా ముందు వరుసలో కూర్చున్న ఒక ముసలాయన నిదానంగా లేచి నడవడం మొదలు పెట్టాడు.. ఆయనకు 70+ వయసు ఉంటుంది.. కర్ర సాయంతో నడుస్తున్నాడు..  నేను సభ నుంచి వెళ్ళిపోవడానికి లేచాడనుకున్నా.. నిదానంగా వెళ్ళి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు.. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే ఆయన జేబు క్రింద ఉన్న చొక్కా అంతా చిరిగిపోయి ఉంది.. నాకు ఎందుకో ఒక్క నిముషం కళ్ళు చెమర్చాయి.. చాలెంజ్ సినిమాలో చూపించిన ఆ ముసలమ్మ గుర్తుకు వచ్చింది.. వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలో!
ఇవన్నీ సరే కానీ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేశాం.. కొందరు బ్లాగర్లు ఇప్పుడు అంటున్నారు మాకు తెలిసుంటే వచ్చేవాళ్ళం అని.. నిజమే! అందరం కలిస్తేనే సందడిగా బాగుంటుంది.. కుదిరితే ఆగస్ట్ నెలలో ఒక రెండు రోజుల జీవని యాత్ర వెయ్యడం బాగుంటుంది అని నాకనిపిస్తోంది.. అంటే శనివారం పొద్దున అనంతపురం వెళ్ళి ఆ రోజంతా ఉండి ఆదివారం పూర్తిగా పిల్లలతో గడపేటట్టుగా వెళ్ళాలి.. చూద్దాం, ఎంతమందికి ఈ ప్లాన్ నచ్చుతుందో, ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి..