నా ఇంజినీరింగ్ రోజులు -2: ప్రోగ్రామింగ్ ల్యాబ్, మా "43"

3/14/2009 - రాసింది karthik at Saturday, March 14, 2009
ఇక అసలు కథ కు వస్తే మాకు వర్క్ షాపే కాక ఇంకొక ల్యాబ్ కూడా ఉండేది అదే "సి" ప్రోగ్రామింగ్. ఆ ల్యాబ్ లో కూడా నా పక్కన పంకజాక్షి కూర్చుని చాలా సీరియస్ గా ఏదేదో రాసేది. నాకు మాత్రం దూరదర్శన్లో "ప్రగతిపథం" చూస్తున్న ఫీలింగ్ కలిగేది. నా స్థాయికి తగ్గట్టుగా నా అబ్సర్వషన్ నోట్స్ లో కూడా ఒక నాలగు పెట్టెలు ఉండేవి, వాటికి సి.పి.యు. అని, మానిటర్ అని, రకరకాల పేర్లు పెట్టి ఉండేవి. ఆ పిల్ల బుక్కు లో మాత్రం ఒక నంబర్ కు ఫాక్టోరియల్ ఎలా కట్టాలి, సెంటిగ్రేడ్ ను ఫారిన్ హీట్ లోకి ఎలా మార్చాలి వగైరా ఉన్నాయి. కంప్యుటర్ పేరు చెప్పి ఎన్ని అఘాయిత్యాలు చెయ్యొచ్చో ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఎవరూ చెప్పకుండానే ఇన్ని ఎలా రాయగలిగిందా అని ఆశ్చర్య పోయాను. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే ఎంసెట్ అయ్యాక ఆ పిల్ల ఏదో కోర్స్ జాయిన్ అయ్యింది. నేను మాత్రం మా బాలూ గాడితో కలిసి ఏ ర్యాంక్ కి ఏ కాలేజీలో చేరాలి అని ప్రజలను అడుగుతూ సమయం వెల్ల బుచ్చాను. ఆఖరికి ప్రజలు మా సైకిళ్ళ శబ్దం విని పారిపోయే స్టేజికి వచ్చారు. అప్పుడు నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే " హత్య అయినా, ఆత్మహత్య అయినా మరణం తప్పదు: ఏ కాలేజీలో చేరినా మనం పెద్ద పొడిచేది అంటూ ఏమీ లేదు " అని.
ఇంతకూ నేను చెప్పొచేది ఏమిటంటే, ఆ పిల్ల నాకన్నా చాలా తోపు అని. అందు వల్ల ప్రతి ల్యాబ్ లో నా కన్న చాలా త్వరగా బయటకు వెళ్ళిపొయేది. నేను మాత్రం, అందరికంటే ఆఖరున ల్యాబ్ ఇంచార్జ్ చేత కొన్ని అక్షింతలు తిని పొయ్యెవాడిని. అలా నా ప్రోగ్రామింగ్ మూడు తిట్లు ఆరు ఎర్రర్లతో విరబూస్తూండగా మా ప్రోగ్రామింగ్ సార్ మారిపోయాడు. ఈ కొత్త సార్ చూడ్డానికి తార్జాన్ లాగా ఉంటాడు. యన్.టీ.ఆర్. లెవెల్లో ఒక కనుబొమ్మ ఎత్తి మాట్లాడే వాడు. ఇవ్వన్నీ కాకా, ఆ జీవి ఇంగ్లీష్ అతని జీవితానికి హైలైట్, సైడ్ లైట్, అండ్ బ్యాక్ లైట్. అతని ఇంగ్లీష్ ప్రతిభ గురించీ రెండు మచ్చు తునకలు ప్రజల కోసం ఇక్కడ:
1. సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ని " అప్సైడ్ హియర్ ఒన్ కామా దేర్ ఒన్ కామా " అన్నాడు.
2. గొంతు బాగాలేదు, మాట్లాడటం కష్టంగా ఉంది అనేదానికి " వర్డ్స్ నాట్ కమింగ్ " అన్నాడు.
( ఇలాంటి వాడు లెక్చరర్ ఎలా అయ్యాడు? అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ లో, అని మీకు అనుమానాలు రావచ్చు. కాని నేను అవి తీర్చేందుకు అశక్తుడను. ఎందుకంటే అవి చాలా పెద్ద రాజకీయాలు. )
ఈ జీవి వచ్చాకా నా పని పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. తిట్లు, ఎర్రర్ల నుంచి ల్యాబ్ నుంచి బయటకు పంపించే స్టేజికి చేరుకున్నాను. నా పక్కనున్న పిల్ల మాత్రం ఓ తెగ రాసేది. ఇలా లాభం లేదని మా సార్ దగ్గర పర్సనల్ గా డౌట్స్ అడుగుదాం అని అతని రూం కి పోయాను. అప్పుడు ఆ జీవి నిమిషానికి మూడు సార్లు నన్ను, నా ఎంసెట్ ర్యాంకును, నా ఇంటర్ సార్లను తిట్టాడు. నేను మాత్రం మనసులో అన్ పార్లమెంటరీ ల్యాంగ్వేజ్ లో అతన్ని పొగిడాను. ( అఖరి వాఖ్యం నమ్మిన వారికి పాజిటివ్ థింకింగ్ ఎక్కువని తెలుసుకోండి )
ఎమన్నా అంటే నాది ఓర్చలేని తనం అంటారు కాని, ఆ పాపాత్ముడు ఆకాశవాణి " డాక్టర్ గారి సలహాలు " కు ఫోన్ చేసి కొత్త పాటలు అడిగే రకం.
ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్న నాకు ఒక విషయం చెప్పాడు అదేంటంటే మా సారు అతను ఇంజినీరింగ్ క్లాస్మేట్స్ అట మరియు మా సార్ కు ఇంజినీరింగ్ పర్సెంటేజ్ "43" అని. ఆ మాటలు నా జీవితం లోకి కొత్త వెలుగును తీసుకు వచ్చాయి. ఎందుకంటే, మా దరిద్రుడికే 43% వచ్చిందంటే నాకు 70 కి తక్కువ కాకుండా వస్తుంది అని డిసైడ్ అయ్యాను. ఈ విషయాన్ని నేను కాలేజ్ అంతా వ్యాపింప చేయడం అతని పేరు "43 సార్" గా మారిపోవడం నిమిషాలలో జరిగింది. అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు అతను పోతూ ఉంటే చుట్టు పక్కల ప్రజలంతా "43" "43" అని అరిచేవారు. కానీ ఆ జీవికి దాని మీనింగ్ అర్థం చేసుకునే సీన్ లేక పోవడం వల్ల అదేమీ ప్రాబ్లం కాలేదు.

ఇలా కథ మంచి రసకందంలో ఉండగా, ల్యాబ్ ఇంటర్నల్స్ వచ్చాయి. నాకు మాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చింది. నాకు అది మామూలుగా చెయ్యటమే సరిగ్గా రాదు, ఇంక కంప్యుటర్లో అంటే??? సానియా మీర్జాకు సెరెనా విలియంస్ కు మధ్య మ్యాచ్ లా తయారయింది అక్కడి పరిస్థితి. నేను దేవుణ్ణి ప్రార్థించి కోడ్ రాయటం మొదలు పెట్టేసరికి నా పక్కనున్న పిల్ల కోడ్ రాసి, టైప్ చేసి, అది కరెక్ట్ అని అనిపించుకుంది. వైవా అడగను మా జీవి ఆ పిల్ల సిస్టం దగ్గరికి వచ్చాడు. ఒక్క కొశన్ తెలిసినా మంచిదే కదా అని నేను ఒక చెవి అటు వేసి వుంచాను. మా వాడు అడిగింది ఏమిటంటే " ఏమండీ మీరు అబ్బాయిలకు, లెక్చరర్లకు అడ్డ పేర్లు పెడతారంట? ఈ మార్కులు పూర్తిగా నా చేతిలో ఉంటయి అని మర్చి పొయారా? " అని అడిగాడు. నేను ఈ రోజు నా పని గోవిందా అని ఫిక్స్ అయ్యాను. "43" గురించి తెలిస్తే ఎప్పటికీ పాస్ కాలెను. కానీ దేవుడు నా ప్రార్థనలు విని నా వైవా ఇంకొక సార్ దగ్గర వేశాడు. కాబట్టి ఎలాగో బయట పడ్డాను. తుపాకి చేతిలో పెట్టుకుని కూడా హీరో చేతిలో చచ్చిపొయ్యే విలన్ లా ఆ పిల్ల కు నా కంటే తక్కువ మర్కులు వచ్చాయి.

( ఇది నిజంగా జరిగిందా అంటే, అవును జరిగింది. నేను ఆ డేట్స్ కూడా చెప్పగలను )

మీ
-కార్తీక్