నా ఇంజినీరింగ్ రోజులు -1: వర్క్ షాప్

3/01/2009 - రాసింది karthik at Sunday, March 01, 2009
అది క్రీ. శం. 2001.

ఎంసెట్ లో తల బొప్పి కట్టిన తరువాత, మా ఊరిలో ఉన్న అతి చెత్త కాలేజీ లో ఎప్పుడూ పేరు కూడా వినని బ్రాంచిలో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. అందరు ర్యాగింగ్, తొక్క, తోలూ అని చెప్పి బుర్ర వాయగొట్టారు. కాని తీరా చేరిన తరువాత అందరు స్కూల్లో లేదా ఇంటార్ లో నా సీనియర్స్. కనపడుతూనే నేను "మీది ఆ స్కూలే, మాది ఆ స్కూలే, మన కరస్పొండెంట్దీ ఆ స్కూలే " అని గట్టిగా పాడేవాడిని. వెంటనే వాళ్ళు "ఏం కార్తీక్, కాలేజీ లో చేరుతున్నావని నాకు చెప్పలేదేం? " అని అడిగేవాళ్ళు. ఈ కాలేజీలో చేరానూ అని అందరికి చెప్పుకుంటే, అది విన్న వాళ్ళకి పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అని చెప్తే బాగుండదని ఏదో ఒక ఐదు పైసల అబద్దం చెప్పేవాడిని. కొందరు నమ్మే వాళ్ళు కొందరు నమ్మి నట్లు నటించేవాళ్ళూ. ఇలా ఒక వారం పది రోజులు కుశల ప్రశ్నలు, స్టీలు డబ్బాలు , సె ల్ఫ్ డబ్బా లతో గడిచిన తరువాత, ఒకానొక దుర్దినాన, వర్క్ షాప్ అనే చోటికి మమ్మల్ని పిల్చుకుపోయారు. దాని మొహం చూస్తే ఏ రెడ్డి రాజుల కాలం నాటి కొలిమికి పేరు మార్చి వర్క్ షాప్ అంటున్నారు అని డౌట్ వచ్చింది. అందులో నా రోల్ నెం. 1 కాబట్టి నేను అందరికంటే ముందుగా లోపలికి పోయాను. అక్కడ ఉన్న సార్ "ఈ రోజు నీ జాబ్ ఫైలింగ్ అన్నాడు" ఫైలింగ్??? అంటే ??? *(#@&...

అంతలో ఒక అటెండర్ వచ్చి నన్ను ఒక కసురు కసిరి ఇంకా అక్కడే ఉన్నావే అని రెండు ఇనుప బిళ్ళలు చేతిలో పెట్టి వీటిని "V" షేప్ లో అతికించు అని చెప్పాడు. నేను చిన్నప్పుడు ఇంజినీరింగ్ అంటే ఇంజిన్లకు నీళ్ళు పొయ్యటం అని అనుకునేవాడిని, అది నిజమేనేమో అని ఒక అనుమానం నా మనసులో అడుగు పెట్టింది. కానీ గుండెను రాయి చేసుకుని ఆ ఇనుప ముక్కలని అతికించను ప్రయత్నించా. నా రక్తాన్ని చెమటగా మార్చి దాని మీద పని చేశా, కానీ అది కాస్తా "వి" షేప్ లో కాకుండా, అదేదో చైనీస్ అక్షరం టైపులో వచ్చింది.(నిజమండి మీరు నమ్మాలి అదేదో అక్షరమే!! ) దాని వాలకాన్ని చూసిన ఆ అటెండార్ కు మతి పొయ్యింది (వాడికి అసలు మతి ఉందా అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ) వాడు దాన్ని మా సార్కు చూపించాడు. ఆయన అది చూసి, "యౌ!! ఆడపిల్లలు సరిగ్గా చేశ్తానారు కదుయ్యా! " అని నా పక్కనున్న పంకజాక్షిని చూపించాడు. ఆ పిల్ల వెంటనే గర్వంగా ఒక చిరునవ్వు నవ్వింది. నేను ఆ పరిసరాల్లొ ఉన్న ప్రజలందరిని అన్-పార్లమెంటరి ల్యాంగ్వేజ్ పొగిడాను. (ఒట్టు!! నిజంగా పొగిడాను కొన్ని పొగడ్తలను సభ్య సమాజం హర్షించదు అందుకని ఇక్కడ రాయడం లేదు.) నా క్రియెటివిటీ ఎంసెట్ బోర్డే అర్థం చేసుకోలేదు ఇంక వీళ్ళెంత అనుకున్నా.

ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మా బ్యాచ్ని కొలిమి నుంచి వడ్రంగి పనికి మార్చారు. అక్కడ వీడీ కంటే పెద్ద ముదురు ఒకడు తగిలాడు. వాడు ఎం చెప్తాడో నర మనవుడికి అర్థం కాదు. వాడిది పులివెందుల అని తెలిసి మా బ్యాచ్లో ఉన్న ప్రదీప్ కూడా వాళ్ళ ఊరి పేరును పులివెందులగా మార్చాడు. నేను మాత్రం అక్కడ కూడా నా క్రియేటివిటికి పదును పెట్టి లోక కల్యాణం కోసం కొత్త కొత్త అక్షరాలు కనుక్కున్నాను. మా సార్ మాత్రం అవి ఏ అక్షరాలో కనుక్కోలేక తికమక పడిపోయేవాడు. చూస్తూండగానే ఇంటర్నల్స్ వచ్చాయి. ఏలేశ్వరం పొయినా శనేశ్వరం తప్పదని అక్కడ కూడా వడ్రంగి పని దొరికింది. ఆ రోజు క్రియేటివిటి ఎక్కువయి ఇచ్చిన చెక్క మధ్యలోకి విరిగిపోయింది. పది మార్కులు ఫట్ అనే ఒప్పందం మీద కొత్త చెక్క ఇస్తాను అన్నాడు. నేను అల్ట్రా-క్రియేటివ్గా ఆలోచించి పక్కనున్న చెట్టు కొమ్మలో వాడికి కావలసిన అక్షరాలు చెక్కుతాను అన్నాను. ఐనా నన్ను అర్థం చేసుకోకుండా మార్కులు కట్ చేశాడు. మంచికి రోజులు కావు.

అలా పడ్తూ లేస్తూ 38/50 మార్కులతో గట్టెక్కాను.


(వచ్చే టపాలో నా ప్రోగ్రామింగ్ ప్రతిభను, మా 43సార్ గురించి రాస్తాను. అంత వరకు సెలవు.)

మీ
-కార్తీక్