నేను--మా బల్లి--కోకకోలా--నా నిద్ర :(

3/19/2009 - రాసింది karthik at Thursday, March 19, 2009
తారాగణం: నేను, మా బల్లి అండ్ నా బ్లాగులో కామెంటని ప్రజలు. గెస్ట్ రోల్ బై యెన్.టి.ఆర్.

అది మొన్న ఆది వారం, నేను ముందు రోజే నా బ్లాగులో మా 43 సార్ ని మనసారా పొగిడి (నిజమండీ కావాలంటే ఇంతకు ముందు టప చూడండి) ఎవరు కామెంటుతారా అని ఎదురుచూస్తున్నాను. కాని మంచికి రోజులు కావు కదా, అందుకని ఎవరూ కామెంట లేదు. అప్పుడు నేను మా వంట రూమూ గోడ వైపు తిరిగి ఆ పైన వుండే బల్లిని చూస్తూ దీర్ఘంగా ఆలోచించిస్తూ మయసభలో భంగపడిన యన్.టీ. ఆర్. లెవెల్లో,
ఏమే! ఏమేమే నీ ఉన్మత్త వికట్టాట్టహాసము అని మిగత డయలాగ్ గుర్తుతెచ్చుకుంటుంటే ఆ బల్లి కాస్తా వచ్చి దాదాపుగా నా మీద పడింది. నేను డేరింగ్ అండ్ డైనమిక్ పర్సన్ కాబట్టి పక్కకు గెంతి ఒక అరుపు అరిచి తప్పించుకున్నా. ఇంకొకరైతే ఈపాటికి ఆ బల్లి దెబ్బకు సౄహ కోల్పొయే వారు.
అప్పుడు మరోసారి యన్.టీ. ఆర్. ...
అహో!! కడపలో జన్మించితినిపో?? నేనెందుకు ఇంజినీరింగ్ చదువ వలే??
చదివితినిపో, నేనెందుకు బెంగళూరుకు రావలె?? వచ్చితినిపో నేనెందుకు బ్లాగు రాయవలె, రాసితినిపో, ప్రజలెందుకు కామెంటకుండవలే?? కామెంటకుండెను పో, నేనెందుకు గోడ వైపు మరల వలె??
అహా!! హతవిధీ!! కడపలో జన్మించి బెంగళూరుకు ఏతెంచిన నాకు ఈ బల్లి చే పరాభవమా??
ఇదంతా విని మా రూమ్మేటు నేను ఎర్రగడ్డ నుంచి వచ్చిన బాపతు అనుకుని మెంటల్ హాస్పిటల్ కు ఫోన్ చేస్తానన్నాడు. ఇంకా అక్కడె ఉంటే ఏమేమి దారుణాలు చేస్తానో అని భయపడి మా వీధి చివర ఉండే టోటాల్ మాల్ లోకి పారిపోయా. అక్కడ కూరగాయలు కొనబోతుంటే ప్రజల తాకిడికి నాకు కొన్ని గాయాలయ్యాయి. ఇలా నేను చెమటలు కక్కుతూ ఉంటే పక్కన కోకకోలా బాటిల్ కనపడింది. అమీర్ ఖాన్, టండ మత్లబ్ కోకకోలా అన్నాడు కదా అని అది కొనుక్కుని ఇంటికి వచ్చా. ఇప్పుడు ఆ బల్లి ఉన్న రూములో కాకుండా వేరే రూములో కుర్చొని "ఖతర్నాక్" అనే సినిమా చూస్తూ భయమేసినప్పుడల్లా కొంచం కొంచం కోకకోలా తాగేశా.
ఇంక ఆ రోజు రాత్రి నుంచి మొదలైయింది అసలు కథ. రెండు ముక్కులు పూర్తిగా మూసుకుపోయాయి, మాట్లాడాలంటే కూడా కష్టం ఐపోతుంది. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని. ఎండలు ఎక్కువ ఉన్నాయని కూల్ ద్రింక్ తెచ్చుకంటే , ఆ రోజే వర్షం రావాలా?? ఈ జలుబు దెబ్బకు నేను సరిగ్గా నిద్రపోయి 5 రోజులు అయ్యింది. ప్రతీ రోజు రాత్రి 3, 4 అవుతోంది. మామూలుగానే నేను ఏ మాత్రం నిద్ర పోతానో ఇక్కడ చూడండి. కరువుకు తోడు అధిక మాసం అంటారే అలాగ తయారయ్యింది పరిస్తిథి :(
ఇప్పుడు రాత్రి 12 అయ్యింది, ఇంకెప్పుడు నిద్రపోవాలో ఏమొ??

నా నిద్ర కోసం ప్రార్థించాలని ప్రజలకు మనవి ఎందుకంటే అప్పుడు నేను తక్కువ బ్లాగులు రాస్తా, మీకు కొంచం తల నొప్పి తగ్గుతుంది.

మీ
-కార్తీక్