నా పేరు- నా కష్టాలు

4/11/2010 - రాసింది karthik at Sunday, April 11, 2010
నా పూర్తి పేరు ఇంద్రకంటి వీరభద్ర కార్తికేయ శర్మ.   వినటానికే తిక్క తిక్కగా ఉందికదా.. అసలు ఇంత పేరు అప్లికేషన్లలో నింపాలంటే మెయిన్ షీటుతోపాటూ రెండు మూడు అడిషనల్ షీట్స్ కావాలి. అందుకనే నేను కూడా చిన్నప్పటి నుంచీ అందరికీ "కార్తికేయ" అని మాత్రమే చెప్పేవాడిని.   మా అక్కలు ఇద్దరి తర్వాత నేను పుట్టాను అంతే కాక మా వంశం లో ఈ తరానికి నేనొక్కడినే అబ్బాయిని.. అందుకని దేవుడి పేరు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు.. దానితో నా పేరు స్కిప్పింగ్ రోప్ అంత పొడుగైంది.   స్కూల్ రోజులలో అందరూ "కార్తికేయ" అని పిలిచేవారు.. నాక్కూడా ప్రాణానికి సుఖంగా ఉండేది.. ఇలా రోజులు గడుస్తుండగా  నేను పదవ తరగతిలో చేరాను.  పదవ తరగతి సర్టిఫికేటులో  పేరు రాయించాలి.. నాలోని అభ్యుదయ భావాలు బీ.పీ. పెరిగినట్టు పెరగడం వల్ల ముందు "శర్మ" అనేది పీకేశాను(బీపీలా ఎందుకు పెరిగాయి అనేది మీరు అడగకూడదు.. నేను చెప్పకూడదు). ఆ తర్వాత ఇంకో రకమైన పైత్యం  వల్ల ఇంటిపేరూ వగైరా పీకేసి కేవలం  "కార్తికేయ" అనేది మాత్రమే ఉంచమని చెప్పాను.. కానీ మా సారు మా అమ్మావాళ్ళతో కుమ్మక్కై అవంతా అలానే ఉంచి "ఐ.వి.బి.కార్తికేయ" గా చేశాడు.  ఈ ఘోర నిజం నాకు తెలిసే సరికే పుణ్యకాలం కాస్తా తీరిపొయింది.. ప్రతీకారం తీర్చుకునే లోపల పదవ తరగతి కూడా అయిపోయింది :( అందువల్ల నా అఫిషియల్ పేరు అలా "ఐ.వి.బి. కార్తికేయ" గా మిగిలిపోయింది. 

కథ ఇక్కడితో ఆగిపోతే నేను కార్తీకునూ కాదు ఇది నా బ్లాగూ కాదు..  ఇంటర్మేడియేట్ ఎలాగో బండి లాగించేశాక ఇంజినీరింగులో అసలు కష్టాలు మొదలయ్యాయి..  విషయం ఏమిటంటే తమిళ దేశాం లో ప్రతీ  ఇంట్లో ఇద్దరు "కార్తికేయన్" లు ఉంటారట కంఫ్యూస్ కాకూడదని ఒకరి పేరు "కార్తికేయన్" ఇంకొకరి పేరు "కార్తిగేయన్" అని పెడతారట (బూతులు వెతక్కండి బాబూ.. వాళ్ళు కొన్ని సార్లు క బదులు గ  రాస్తారు.. ఉదా:-కర్పగవల్లి )  . సో మాలెక్చరర్లు అందరూ మొహమాటం లేకుండా "కార్తికేయన్" "కార్తికేయన్" అని పిలిచేవాళ్ళు.. నాకు ఈ అరవ పేరు అస్సలు ఇష్టం ఉండదు.. అసలే నేను పదహారణాల తెలుగు బిడ్డను..  పైగా అభాతెమాసం సభ్యుడిని కూడా... బుర్ర గోక్కోకండి.. అభాతెమాసం అంటే ప్రపీసస సిస్టర్ కమ్యూనిటీ కాదు.. అభాతెమాసం అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం.      ఈ బెంగ తో సగం మార్కులు గట్రా తక్కువ వచ్చేవి.. కొన్ని రోజులు ఇలా సాగాక ఇక తప్పదని మా లెక్చరర్లకు  చెప్పాను సార్ నా పేరు "కార్తికేయ" మీరు వేరే ఏదో అంటున్నారు అని.   అయినా  కూడా ఏమి ఉపయోగం లేదు ఎంతైనా ఇంజినీరింగు కాలేజీ లెక్చరర్లు కదా..  ఫైనల్ ఇయర్ కు వచ్చాక ఇంకో రూట్లో పని కానిచ్చాలని నా పేరును కాస్తా "కార్తీక్" గా కుదించాను.. స్కిప్పింగ్ రోప్ అంత పెద్ద పేరు హెయిర్ బ్యాండ్ అంత చిన్నగా అయిపొయింది :(.. అందుకే నా ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ "కార్తీక్" అనే పిలుస్తారు.. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా నా పేరు "కార్తీక్" అని మాత్రమే చెప్పాను..
కొసమెరుపు: పాత కంపెనీలో అందరూ కార్తిక్ అనే పిలుస్తారు.. కానీ నిన్న హ్యులెట్ పాకార్డ్ ఇండక్షం ప్రోగ్రాం లో ఆ మానవ వనరుల మేనేజర్(మేనేజర్ తెలుగు పదం??)  నా పేరు చెప్పాల్సిన చోటల్లా నా పేరు "కార్తికేయన్" "కార్తికేయన్" అని పిలిచింది.. రేపటినుంచీ నా కొత్త బాసుతో కలిసి పని చెయ్యాలి అతను ఎలా పిలుస్తాడో చూడాలి.. ఆ అరవ పేరు పిలిస్తే మాత్రం మొదటి రోజే చెప్పేస్తాను.. అలా చెప్పకపోతే శిక్షగా మార్తాండ కథ సంపుటికి ముందుమాట రాస్తాను..

-కార్తీక్