మరు జన్మలో నేను ......

3/29/2010 - రాసింది karthik at Monday, March 29, 2010
కరవు సీమలో తొలకరి అల్లరికి కలిగిన మట్టి వాసననౌతాను! 
అరుణోదయాన జగతిని నిద్రలేపే పక్షుల కిలకిలరావాలలో ఇమిడిపోతాను!
ముగ్గువేస్తున్న పల్లేపడుచు ముంగురులపై స్వేదబిందువునౌతాను!
బిడ్డకోసం తన సుఖం మరిచే అమ్మ హృదయపు ఆర్ర్ధతనౌతాను!
చెలి ఎడబాటు వల్ల కలిగిన విరహంలోని వేడి నిట్టూర్పునౌతాను! 
కల్లోల కాశ్మీరానా కదం తొక్కే వీరసైనికుడి పాదధూళిగా పుడతాను!
కరవుకరాళ నృత్యానికి సాక్షిగా నిలిచిన బక్కరైతు ఆక్రందననౌతాను! 
నిర్లక్ష్య నిదర్శనంగా బోరుబావిలో పడ్డ పాపడి ఏడుపులో ప్రతిధ్వనినౌతాను!
బుడిబుడి నడకల వయసులో బ్యాగు బరువులకు కుదేలౌతున్న బాల్యపు చిహ్నంగా మిగిలిపోతాను!

-కార్తీక్

కొన్ని రోజుల క్రితం నేను రాసుకున్న కవిత ఇది. ఇవాళ పుస్తకాలు సర్దుతుంటే దొరికింది. మరోసారి మిస్ అయ్యేలోపు బ్లాగులో పెట్టడం మేలనిపించి ఇలా పెట్టాను.