గుర్తుకొస్తున్నాయి : రాజంపేట

5/07/2013 - రాసింది karthik at Tuesday, May 07, 2013

పొయిన నెలలో మా పెదనాన్న గారి సంవత్సరీకం జరిగితే రాజంపేటకు వెళ్ళాను.. మా పెదనాన్న గారి పార్థివ శరీరం చూసే అవకాశం నాకు రాసిపెట్టలేదు అందువల్ల ఇప్పుడు మిస్ అవకుండా అటెండ్ అయ్యాను.. రాజంపేట అంటే అన్నమయ్య జన్మించిన తాళ్ళపాకకు దగ్గర్లో ఉన్న చిన్న టౌను. అది మా అమ్మమ్మ గారి ఊరు కావడం వల్ల చిన్నప్పటి నుండీ సెలవలకు అక్కడికి వెళ్ళేవాడిని.. మా చుట్టాలు అక్కడ చాలామందే ఉన్నారు కానీ చిన్నతనంలో నా సమయమంతా మా అమ్మమ్మా వాళ్ళ గడ్డివామిలో ఆడుకునేందుకే సరిపోయేది.. ఆ గడ్డివామి దగ్గర నిలబడితే రాజంపేట రైల్వే స్టేషన్ కనిపించేది.. ఇప్పుడు ఆ గడ్డివామి లేదు, ఇళ్ళు కట్టడం వల్ల రైల్వే స్టేషన్ కూడా కనిపించదు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వెళ్ళాను, ఊరు చాలా మారిపోయింది.. పాత బస్ స్టాండ్ నుంచీ స్టేషన్ దగ్గర మా అమ్మమ్మా వాళ్ళ ఇంటి వరకూ బైక్ లో వెళుతూ ఉంటే ప్రతీ వీధి, ప్రతీ షాపూ నా జ్ఞాపకాల నుంచీ బయటకు వచ్చాయి.. అలా ఆలోచిస్తూ ఉండగానే బి.యస్. థియేటర్ ఉన్న సందు కనిపించింది.. ఇప్పుడు ఆ థియేటర్ ఉందో లేదో తెలీదు.. కానీ నేను ఆ థియేటర్లో ఎన్ని సినిమాలు చూశానో లెక్కేలేదు. ఆ థియేటర్ స్పేషాలిటీ ఏమంటే అక్కడ కేవలం పాత సినిమాలు మాత్రమే వచ్చేవి.. మా మామ వాళ్ళతో ఆ సినిమాలకు మ్యాట్నీకి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు నాకు ఎప్పుడూ లేదు మరి.. అలనాటి ఆణిముత్యాలు బాలనాగమ్మ, బందిపోటు, ఇల్లరికం, ఇంకా విజయా వాళ్ళ సినిమాలు ఆ హాల్లోనే చూశాను. ఆ సినిమాలకు వెళ్ళాలంటే కూడా చాలా షరతులు పెట్టేవాడిని, "రేలంగి ఉన్నాడా?", "రమణా రెడ్డి  ఉన్నాడా?", "రాజబాబు ఉన్నాడా?" లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితేనే వేళ్ళేవాడిని.. వాళ్ళు ముగ్గురూ లేని పాత సినిమాలు చూడటం దండగ అని నా నమ్మకం; అప్పుడే కాదు ఇప్పుడు కూడా!

ఇంకాస్త దూరం వెళితే సంగీత బుక్ లింక్స్ షాప్ ఉన్న స్థలం కనిపించింది. సంగీతా బుక్ లింక్స్ లో నేను షాడో, బుల్లెట్ నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. పుస్తకం మరుసటి రోజుకు ఇచ్చేయాలి కాబట్టి గబ గబా చదివేవాడిని.. కొన్ని సార్లు డబ్బులు తక్కువ పడేవి అప్పుడు మా మామ దగ్గరో, మా ప్రసన్నక్క దగ్గరో గాంధీ ఖాతా మీద డబ్బు తీసుకునేవాడిని.. :)   సంగీతా బుక్ లింక్స్ గురించి మా తమ్ముడిని అడిగితే ఆ షాప్ ఇప్పుడు మరో చోటకు మార్చారని, ఇప్పుడు ఎక్కువ కంపిటీటివ్ పరీక్షల పుస్తకాలు మాత్రమే అమ్ముతున్నారని చెప్పాడు.. ఇప్పుడు డిమాండ్ ఉన్నది వాటికేగా మరి.. ఇప్పుడు పుస్తకాలు అద్దెకు ఇచ్చే షాపులూ లేవు, తీసుకుని చదివే ప్రజలూ పెద్దగా కనిపించరు.. బహుశా పుస్తకాలు అద్దెకు తెచ్చుకున్న వారిలో నా తరం ఆఖరు అనుకుంటా..   పుస్తకాలు పక్కన పెడితే ఆ షాపు దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు నిలబడి దేశ కాల వైపరిత్యాల గురించి చర్చిస్తుండేవారు.. అలాంటి వాళ్ళతో చర్చించేంత వయసు, సబ్జెక్ట్ నాకు లేకపోవడం వల్ల కేవలం వాళ్ళ చర్చ విని ఇంటికి వచ్చేవాడిని.. అదొక శునకానందం! 

ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ సమద్ థియేటర్ కనిపించింది. ఈ థియేటర్లో సహజంగా కొత్త సినిమాలు వచ్చేవి.. అవి కూడా డైరెక్ట్ రిలీజ్ కాదు కడపలో రిలీజైన వారం పది రోజులకు వచ్చేవి.. కానీ నా జీవితంలో మరచిపోలేని థియేటర్లలో అదీ ఒకటి. సినిమా ఏదో గుర్తులేదు కానీ ఒకసారి ఫస్ట్ షో  మధ్యలో కరెంట్ పోతే కరెంట్ వచ్చాక మళ్ళీ రమ్మని జనాలను ఇంటికి పంపించారు.. మేము ఇంటికి వచ్చి అన్నం తిని కరెంట్ వచ్చాక మళ్ళీ సినిమాకు వెళ్ళాం.. ఇలాంటి అనుభవాలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి??  ఇప్పుడు ఈ సమద్ థియేటర్ దగ్గర నుండీ మొదలయ్యే ఒక పెద్ద ఫ్లై ఓవర్ కట్టారు, దాని వల్ల రైల్వే ట్రాక్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోయే సమస్య తప్పింది.. ఈ ఫ్లై ఓవర్ కట్టాలని బ్రిటీష్ కాలం నుంచీ ప్రతిపాదన ఉంటే రెండు మూడేళ్ళ క్రితం కట్టించారు.. స్వతంత్ర భారత దేశమా జోహార్!

ఇవన్నీ కాక రాజంపేటకు వెళితే తప్పకుండా చేసేపని బోనగిరి గుట్టకు వెళ్ళడం. ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది.. అప్పట్లో ఆ గుడి శనివారాలు మరియూ ఇతర పర్వదినాలలో మాత్రమే తెరిచేవారు.. మేము అక్కడికి నడిచివెళ్ళేవాళ్ళం. దూరమెంతో గుర్తులేదు కానీ మాకు ఎప్పుడూ బడలిక అనిపించేది కాదు.. ఎందుకంటే మధ్య దారిలో పూర్తిగా మామిడి తోటలు. అక్కడక్కడా ఆగుతూ కాసేపు పెరిగెత్తుకుంటూ కొంచెం సేపు ఒకరితో ఒకరు పందేలు కాస్కుంటూ వెళ్ళేవాళ్ళం.. దారి మధ్యలో తినడానికి మిక్చర్ కలిపిన బొరుగులు..అదొక తీపి జ్ఞాపకం! ఇప్పుడు ఆ గుడిని మాజీ ఎం.ఎల్.ఏ. పసుపులేటి బ్రహ్మయ్య గారు బాగా అభివృధ్ధి చేయించారని తెలిసింది. ఇప్పుడు ప్రతీ రోజు ఆ గుడిని తెరుస్తారట పైగా కొండమీద మోటర్ వాహనాలు వెళ్ళే వెసులుబాటు కూడా ఉందట.. మేము వెళ్ళే కాలంలో ఇలాంటి సదుపాయం లేదు.. బహుశా అందువల్లే మేము ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగామేమో!

భారత క్రికెట్ టీముకు సర్ రవీంద్ర జడేజా ఎలానో రాజంపేట ఊరికి పనీర్ సోడా అలాంటిది.. :)) ఈ కూల్ డ్రింక్ మరెక్కడా తయారు చేసినట్టు నేను చూడలేదు; వినను కూడా వినలేదు .. ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ తింగర తింగరగా భలే ఉండేది. నా పదవ తరగతి సెలవల్లో ప్రతీ రోజూ రైల్వే స్టేషన్ నుండీ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న లైబ్రరీకి నడుచుకుంటూ వెళ్ళి ఈనాడు పేపర్ చదివేవాడిని. అలాంటి రోజులలో కొన్ని సార్లు పనీర్ సోడా తాగేవాడిని.. ఇప్పుడు అది ఎవరూ తయారు చేయడం లేదట.. ఎంత ఘోరం?? అలాంటిదే పెద్ద గ్రౌండులో జరిగే క్రికెట్ పోటీలు.. ప్రతీ వేసవిలో తప్పకుండా జరిగేవి.. ఒకటి రెండు సార్లు మా అన్న కూడా ఈ పోటీల్లో పాల్గొన్న టీములో ఉన్నాడు.. కానీ వాళ్ళ టీము ఆడిన మొదటి మ్యాచులోనే ఇంటికి వచ్చేసి ఆటగాడిగా మా అన్నకు, ప్రేక్షకుడిగా నాకూ శ్రమ తప్పించింది.. ఇప్పుడు కూడా ఇలాంటి పోటీలైతే జరుగుతున్నాయంట కానీ ముందంత జోరు లేదని టాక్.

అలానే రాజంపేటలో నాకు బాగా నచ్చే మరొక స్థలం అక్కడి స్కూలు, కాలేజి దాని పక్కనుండే పేఏఏద్ద గ్రౌండు..ఆ గ్రౌండులో ఉన్న పెద్ద పెద్ద చెట్లు.. రావి, మఱ్ఱి, జివ్వి లాంటి చెట్లు అక్కడ చాలా ఉండేవి. వాటి క్రింద ఆడుకునేందుకు మాకు కావాల్సినంత నీడ ఉండేది.  ఈ కాలంలో అంత గ్రౌండున్న స్కూల్ దొరకాలంటే చాలా కష్టం.. మా అమ్మా వాళ్ళ కుటుంబంలో అందరూ అక్కడ చదివిన వాళ్ళే; మా తాతగారు అక్కడ లెక్చరర్ గా పని చేశారు. నాకిప్పటికీ బాగా గుర్తు, మా అమ్మ ఒకసారి తను పరీక్షలు రాసిన క్లాస్ మాకు చూపించింది..  ఇలాంటి జ్ఞాపకాలు ఆ ఊరితో మరెన్నో ఉన్నాయి, దాదాపు పదేళ్ళ తర్వాత వెళ్ళాను కనుక ఇప్పుడు ఎక్కువగా టచ్ చేస్తున్నాయి..

-కార్తీక్