ఈ టపా ప్రధాన విషయంలోకి వెళ్ళే ముందు ఒక విషయం గమనించాలి. టీవీ9 చానల్ ఇప్పటికి చాలామంది బాబాలపైనా స్వామీజీలపైనా అనేక ఆరోపణలు చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేసింది. అదేంటో నాకు తెలియదు కానీ, ఏ స్వామీజీని విమర్శిస్తూ టీవీ9 కార్యక్రమం ప్రసారం చేస్తుందో అదే స్వామీజి యొక్క ఆడ్వర్టైజ్మెంట్లు కొన్ని రోజుల వ్యవధి తర్వాత టీవీ9లో వస్తాయి. ఈ ట్రెండ్ కాళేశ్వర్ బాబా విషయంలోనూ, హైదరాబాదులో ఉండే ఒక మాతాజీ విషయంలోనూ నేను గమనించాను. ఈ కారణం రిత్యా నాకు టీవీ9 విశ్వసనీయత పైన అనుమానాలు ఉన్నాయి. నా అనుమానాలకు సాక్ష్యాలు ఆధారాలు నా దగ్గర లేవు కానీ టీవీ9( ఆ మాటకొస్తే మన మీడియాలో ఉన్న ఏ చానల్ అయినా) ప్రసారం చేసే కార్యక్రమాలు ఫేస్ వాల్యూ పై నేను నమ్మలేను. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీవీ9 యాంకర్ "చాగంటి చెప్పారు", "చాగంటి అన్నారు" అన్నదే కానీ ఎక్కడ కూడా "చాగంటి గారు" అని సంబొధించిన పాపాన పోలేదు. ఇది నాకు చాలా చికాకు కలిగించింది. Decency is a very basic expectation particularly when you are on air. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే, బ్రహ్మశ్రీ చాగంటి వారు ఏ సందర్భంలో సాయి సచ్చరిత పైన ఈ వ్యాఖ్యలు చేశారు అనేది నాకు తెలియదు.టీవీ9 యూట్యూబ్ చానల్లో వీడియో చూశాను కానీ ఎక్కడ కూడా ఫలానా సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అని ప్రస్తావించినట్టు లేరు. సందర్భానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన చేసిన కొన్ని పంక్తులను వినిపిస్తూ దానిపై చర్చ చేస్తున్నారు. ఈ పద్దతి నాకు సబబుగా అనిపించలేదు. అసలు సాయి సచ్చరిత ప్రస్తావన ఎందుకు వచ్చింది?? అది చెప్పకుండా టీవీ9 వాళ్ళు మళ్ళీ సాయి చైతన్య సంఘం వాళ్ళూ చర్చించారు. సందర్భం కూడా పక్కన పెడదాం. టీవీ9 వాళ్ళు చెప్పినట్టే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే అనుకుందాం. వాటి గురించి నాకు తోచింది క్రింద రాస్తున్నాను. ఈ పంక్తులన్నీ కల్లూరి భాస్కరం గారి బ్లాగులో నుండీ తీసుకున్నాను. (అసలు వ్యాసం ఇక్కడ చూడగలరు)
1. నూటికి 99 మంది కోరికలతోనే గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు. కోరికలతో గురువు వద్దకు వెళ్లకూడదు. గురువుకు అసహ్యం పుడుతుంది.
2. సచ్చరిత్ర పారాయణ చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చేస్తున్నారు? 3. వ్యాసుడు చెప్పిందే ప్రమాణం. వారి కన్నా ఎక్కువ ఎవరూ చెప్పలేరు. సాయిబాబా గారైనా వ్యాసుడు చెప్పిందే చెప్పాలి. 4. సాయిబాబా జీవితచరిత్ర పారాయణ చేయచ్చు. అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. తత్వం ఆవిష్కరణ కానిదే పారాయణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సాయిబాబా గారికి ఇష్టమైనది తత్వ బోధే. గురుచరిత్ర పారాయణం తప్పని నేను అనను. అయితే ప్రయోజనం లభిస్తుందని చెప్పడం కష్టం. 5. (సాయి సచ్చరిత్ర లోని) సుదాముని కథ తప్పు. అది తాడూబొంగరం లేని కథ. అంత అర్థరహితమైన కథ ప్రపంచంలో లేదు. కుచేలుని గురించి ఇష్టమొచ్చినట్లు రాయడం తప్పు. అది చదవడం వల్ల పాపం వస్తుంది. కుచేలుని గురించి చులకనగా రాయడం, చదవడం దారుణం. ఆ రచయిత కనిపిస్తే దీనికి ప్రమాణం ఏమిటని అడగండి. 6. అర్థం తెలిసినా తెలియకపోయినా బీజాక్షరాలు ఉన్న గ్రంథాలను పారాయణ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. సుందరకాండను, సౌందర్యలహరిని పారాయణ చేస్తారు. వాటిలో బీజాక్షరాలు ఉన్నాయి. అవి బుద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. వాటివల్ల సరస్వతీ కటాక్షం ఉంటుంది. అర్థం తెలియనక్కరలేదు. 1,2: ప్రస్తుత కాలంలో దైవాన్నీ/గురువుని తమ కోర్కెలు తీర్చే పనిముట్లుగా చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దాని గురించి యధాలాపంగా 99శాతం అన్నారేమో కానీ అందులో సాయిబాబా పైన కానీ భక్తులపై కానీ ఎటువంటి విమర్శ చేసినట్టు నాకు అనిపించడం లేదు. మళ్ళీ చెబుతున్నా, సందర్భం తెలియకుండా కేవలం ఒక రెండు పంక్తులను బట్టి ఏదైనా కంక్లూజన్ కు రావడం సబబు కాదు. 3. ఈ వ్యాఖ్య గురించి రాసేముందు గురుపరంపర గురించి కొంచెం చెప్పుకోవాలి. నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం గురు పరంపరలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఎవరూ లేరు. It is not a hierarchy of masters but a series of masters. ఏ గురువైనా వేదసారాన్ని శిష్యకోటికి అందించడానికి మానవ జన్మ ఎత్తారే తప్ప మరొకటి కాదు. దీన్నేదో సాయిబాబాను వ్యాసమహర్షితో పోల్చి చిన్నబుచ్చారనుకోవడం అర్థ రహితం. 4. ప్రయోజనం లభిస్తుందని చెప్పలేను అని బ్రహ్మశ్రీ చాగంటి వారు అన్నారు. ఈసందర్భంలో ఆయన ఏ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారో నాకైతే తెలియలేదు. ఏదైనా ప్రశ్నకు సమాధానం లాగా ఈ వ్యాఖ్య చేశారా అనేది కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఫలాన ప్రయోజనం కలుగుతుందా అనే ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్య చేసుంటే ఇక అందులో వివాదమే లేదు. 5. సచ్చరిత్రలో సుధాముడి గురించి వ్యాస మహర్షి లేదా పోతన లాంటి వారు రాసిన కథ ఉన్నట్లు లేదు అని చెప్పారు. ప్రాంతీయ భేదాల వల్ల ఇది జరిగి ఉండచ్చు. కానీ బ్రహ్నశ్రీ చాగంటి వారు కూడా ఇంత కఠినమైన పదజాలాన్ని వాడకుంటే బాగుండేది. 6. ఇందులో వివాదాస్పదం ఏముందో నాకు అర్థం కాలేదు. "ఏ గ్రంథాలు పారాయణం చేయాలి?" అని ఎవరైనా అడిగారనుకోండి. దానికి సమాధానంగా ఈ వ్యాఖ్యను చదివి చూడండి. మొత్తంగా చూస్తే నా దృష్టిలో ఇందులో మీడియా చేసిన అతి ఎక్కువగానూ బ్రహ్మశ్రీ చాగంటి వారు యధాలాపంగా అన్నవి తక్కువగానూ కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి టీటీడీ మాజీ ఈ.ఓ. పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ గారు చెప్పినట్టు "మనం కాంట్రవర్సీ చెయ్యక్కరలేదు. టీవీ9 వాళ్ళే చేస్తారు". ఇది నాకు 100% కరెక్ట్ అనిపించింది. ఈ టపా ముగించేముందు, బ్లాగర్ తాడిగడప శ్యామలరావు గారు రాసిన ఈ పేరా మనమందరం ఒకసారి చదవడం అవసరం:
ఏది
ఏమైన ఒక విషయం స్పష్టం. పెద్దలు మనకు నచ్చినట్లే మాట్లాడాలీ లేకపోతే వారు
తప్పుచేసినవారూ అనటం హర్షణీయం కాదు. వారు ఏమి చెప్పినా మన అభ్యున్నతి కోరి
చెబుతున్నారు. ఇష్టమైన పక్షంలో, చేతనైనంతవరకూ ఆ మంచి మాటలను ఆదరించి
ఆచరించండి. లేదా ఊరుకోండి. పెద్దల జ్ఞానంలో లక్షోవంతుకూడా లేని మనం
వారిని ఆక్షేపించి నోరుమూయించాలను కుంటే, అది జాతికి మంచి చేయదు.
సర్వేజనా సుఖినోభవంతు!
-కార్తీక్
|
బ్రహ్మశ్రీ చాగంటి వారి వివాదం: నా అనుకోలు
7/21/2013 - రాసింది karthik at Sunday, July 21, 2013