దాదాపు
7-8 నెలల నుంచీ అనుకున్న జీవని యాత్ర చివరకు నిన్న శని-ఆదివారాలు
కుదిరింది. శనివారం పొద్దున మారథహళ్ళి నుంచీ నేనూ, రాజ్, భాస్కర్ అవినేని
గారూ బయలుదేరాం.. భాస్కర్ గారి కార్లో వెళదామనుకోవడం వల్ల బస్/రైల్
రిజర్వేషన్ల గొడవ లేకుండా బయలుదేరాం.. భాస్కర్ గారికి లాంగ్ డ్రైవ్స్
అలవాటు ఉండటం వల్ల, అనంతపురం రూట్ తెలిసుండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా
అనంతపురం దాకా వెళ్ళిపోయాం.. ముందు రోజు ఫోన్ చేసినప్పుడు ప్రసాద్ గారు
చిలక్కు చెప్పినట్టు చెప్పారు "రాప్తాడు దాటిన తర్వాత కుడివైపు టర్నింగ్
తీసుకుంటే టౌన్లోకి వెళ్ళకుండా రోటరీపురం వచ్చేయచ్చు" అని.. కానీ నేను
మరోసారి నా అలవాటును కొనసాగించి ఆ టర్నింగ్ గురించి భాస్కర్ గారికి
చెప్పలేదు.. ఇప్పటిదాకా జీవనికి వెళ్ళిన ఎప్పుడు కూడా నేను ఆ టర్నింగ్
తీసుకోలేదు.. ఒకసారి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చాం, నిన్న కూడా మిస్
అయ్యింది.. నేనే అనుకుంటే మన రాజ్ బాబు ఇంకా గొప్పోడు ఒకసారి రాప్తాడులో
దిగేశాడు, ఇంకోసారి దిగాల్సిన స్టాప్ దాటి రెండు స్టాపుల తర్వాత దిగాడు..
బ్లాగర్లా మజాకా!
అనంతపురం
ఊర్లోకి వెళ్ళాక ఒక రెండు డజన్లమందిని రూట్ అడిగి (జ్ఞానేశ్వర్ గారు రూట్
చెప్పిన తర్వాత కూడా) తిన్నగా కాకుండా వంకర టింకరగా వెళ్ళి జీవని
చేరుకున్నాం.. అక్కడికి హైదరాబాద్ నుంచీ రహ్మాన్, బెంగళూరు నుంచీ శారద
గారు, ఆనంద్ గారు మాకంటే ముందే వచ్చేశారు. మేము కారులో వచ్చిన దానికంటే
వాళ్ళు బస్సులో ముందు వచ్చారు.. మన బస్సులు ఎంత ఫాస్ట్ పోతాయో దీనిద్వారా
ప్రజలు తెలుసుకోవాలి.. శారద గారు రెగులర్గా బ్లాగులు చదువుతుండటం వల్ల మా
గురించి ప్రవర చెప్పకుండానే గుర్తు పట్టేశారు.. పిల్లలు ఇంకా స్కూల్ నుంచీ
రాలేదు కాబట్టి భోజనాలకు ఇంకా టైం ఉండటం వల్ల పిల్లల రూములు అవి చూశాం..
పిల్లలంతా బట్టల అల్మారాలు, పుస్తకాల అల్మారాలు చాలా నీటుగా
పెట్టుకున్నారు.. నేను ఆ వయసులో ఎప్పుడూ నా పుస్తకాలు అంత నీటుగా
పెట్టుకోలేదు.. నర్సరీలో ఉండే పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళతో పరమ పద సోపాన పటం, టిక్ ట్యాక్ టో లాంటి ఆటలు ఆడించాం.. మన రాజ్ బాబు స్మైలీ అనే
పాపతో ఆడాడు.. కనీసం మూడుసార్లు పెద్ద పాము నోట్లో పడి క్రిందకు వచ్చాడు..
ఇక స్మైలీకి ఇంకా నంబర్లు కరెక్ట్ గా తెలీదు.. ఎటు సైడు నిచ్చెన కనిపిస్తే ఆ
సైడు తన బొమ్మ జరిపేసుకుంది.. ఎలాగైతే ఏం చివరకు రాజ్ బాబే గెలిచాడు..
కాంగ్రాట్స్ రాజ్!
భోజనాలయ్యాక
పిల్లలందరితో కూర్చుని మాట్లాడుతూ వాళ్ళ చేత పాటలు పాడించాం.. దాదాపు
పిల్లలంత ఉత్సాహంగా పాటలు పాడారు ఒకరిద్దరు డాన్సులు కూడా చేశారు..జీవనిలో
డాన్సులు, పాటలు అంటే శివకుమార్ గురించి చెప్పాలి.. తను ఇప్పుడు 7వ తరగతి
చదువుతున్నాడు.. నాలైదు పాటలు కలిపి సొంతంగా తనే డాన్స్ కంపోజ్
చేసుకుంటాడట.. జీవని హాస్టల్ శంకుస్థాపన రోజు మైక్ తీసుకుని పాట, స్పీచ్,
మిమిక్రి అన్నీ కలిపి కొట్టాడు. మైక్ వెనక్కు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది
పడ్డాం.. శివనే కాక దాదాపు పిల్లలందరూ స్టేజ్ ఫియర్ లేకుండా ముందుకు వచ్చి
పాటలు పాడారు. సాయంత్రమయ్యాక పిల్లలందరూ స్నాక్స్ తిని వరుసగా కూర్చుని
హోంవర్క్ చేసుకున్నారు.. మేము కాసేపు దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చాం..
మాతోపాటూ రాజ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ప్రతీ నాలగు సెకన్లకు ఒక కుక్క మా
వెనుక పడేది. ఎలాగో తప్పించుకుని, కాట్లు లేకుండా మళ్ళీ వెనక్కు
వచ్చేశాం.. శునక చరిత్ర తెలుసుకోవాలనుకున్నవాళ్ళు ఈ లంకెను నొక్కండి..
సాయంత్రానికి
హైదరాబాదు నుంచీ సురేష్ పెద్దరాజు గారూ, లక్ష్మి నరేష్, చిత్తూరు నుంచీ
బంతి వచ్చేశారు.. రాత్రి భోజనాలయ్యాక కొంతసేపు సాహిత్య చర్చ జరిపి కొన్ని
ఆడియోలు విని వీడియోలు చూసాం.. పడుకోవాలని డాబా మీదికెళ్ళి అక్కడ కూర్చుని
బాలయ్య విగ్ కలెక్షన్ దగ్గర నుంచీ 2014 ఎన్నికల దాకా చాలా విషయాలు
మాట్లాడుకున్నాం.. Everything and anything under the sun is discussed. భాస్కర్ గారు తప్ప మిగిలిన వాళ్ళమంతా ఈ సుదీర్ఘ చర్చల్లో
పాల్గొని తమ తమ విజ్ఞానానికి పదును పెట్టుకున్నారు.. భాస్కర్ గారు త్వరగా
నిద్రపోయారు కాబట్టి (అ)జ్ఞాన యజ్ఞంలో పాల్గొనలేకపోయారు..
ఆదివారం
పొద్దున నిద్ర లేచి డాబా పై నుంచీ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాం..
అప్పటికే పిల్లలందరూ లేచి పుస్తకాలు తెరిచి హోం వర్క్ అవి
చేసుకుంటున్నారు.. కొంత సేపయ్యాక పిల్లలకు శారద/ఆనంద్ గార్లు తెచ్చిన
రంగులు ఇచ్చి హోలీ ఆడించాం.. పిల్లలు ముందు కొంచెం భయపడ్డారు కానీ తర్వాత
రంగుల అయిపోయాక కూడా మామూలు నీళ్ళు కూడా ఒకరిపై ఒకరు చల్లుకుంటూ
ఆడుకున్నారు. అప్పటిదాకా బుద్దిగా హోం వర్క్ చేసుకున్న పిల్లలు ఒక్కసారిగా
తమ అసలైన బాల్యాన్ని ఆవిష్కరించారు.. మాటలతో చెప్పడం కాదు కానీ వాళ్ళ
కేరింతలు నిజంగా చూడాల్సిందే..కలర్స్ తేవాలనే చక్కని ఐడియాతో వచ్చిన
ఆనంద్/శారద గార్లకు అభినందనలు..
హోలీ
అయ్యాక పిల్లలందరితో క్రికెట్ ఆడాం.. మన లక్ష్మి నరేష్ తన సీనియారిటీ అంతా
ప్రదర్శించి పిల్లలందరికి సూచనలిస్తూ దుమ్ము లేపాడు.. సురేష్ గారు ధోనీ
అసూయ పడేలా రెండు సిక్సర్లు పీకి తన బ్యాటింగ్ ప్రావిణ్యాన్ని
ప్రదర్శించారు.. భాస్కర్ గారు అంపైరింగ్ చేసారు.. కానీ మ్యాచులో హైలెట్
మాత్రం రాజ్ కుమారే.. బ్యాటింగులో ముందుకు జరిగి, వికెట్ల వెనక్కు జరిగి,
భరత నాట్యం, కథకళి ఫ్యూజన్ చేసి క్రీజ్ మీద అరాచకం చేశాడు.. పైగా
హ్యాట్రిక్ ఫోర్లు కూడా కొట్టాడు.. ఆ జుగల్ బందీ కార్యక్రమం వాళ్ళ ఒంకార్
అన్నయ్య చూసుంటే ఆట-36 కి రాజ్ కుమార్నే జడ్జ్ గా పెట్టుకునేవాడు.
క్రికెట్
తర్వాత టిఫిన్లు చేసి చలో తాడిపత్రి అన్నాం.. పిల్లలకు మెడికల్ చెకప్
ఉండటం వల్ల దొరికిన తీరికను ఇలా వాడుకున్నాం.. ముందుగా చెప్పుంటే విజయమోహన్
గారే అనంతపురం వచ్చేవారు కానీ నేను ఆయనకు ఫోన్ చెయ్యడం మర్చిపోయాను..
అనంతపురం నుంచీ ఫోన్ చేస్తే విజయమోహన్ గారు ఇంటికి రమ్మని పిలిచారు..
నాకేమో కుదరదనిపించింది కానీ సురేష్ గారూ, లక్ష్మి నరేష్ తాడిపత్రి గుడి
చూద్దాం అని సజెస్ట్ చెయ్యడంతో విజయమోహన్ గారికి ఫోన్ చేసి వస్తున్నామని
చెప్పాను.. ఆయన దగ్గరుండి రెండు గుళ్ళు చూపించారు.. ఆ గుళ్ళ గురించి
రాయాలంటే ఈ టప సరిపోదు కాబట్టి రాయడం లేదు. తర్వాత వాళ్ళింటికి వెళ్ళాం,
వాళ్ళింట్లో ప్రతీ ఒక్క వస్తువూ ఒక మాస్టర్ పీసే.. మేము విజయమోహన్ గారితో
మాట్లాడటం కంటే వాళ్ళింట్లో ఆర్ట్ వర్క్స్ ఫోటోలు తీసుకోవడానికే ఎక్కువ
సమయం కేటాయించాం.. టౌన్లో పుట్టి సిటీలో బ్రతుకుతున్న నాలాంటి వారికి విరగకాసిన మామిడి
చెట్టును చూసి చేతులు ముడుచుకుని కూర్చోవడం చాలా కష్టమైంది. వాళ్ళింట్లో
మొత్తం మూడు మామిడి చెట్లు, రెండు శ్రీగంథం చేట్లు (తిరుమల నుంచీ తెచ్చి
వేశారట), ఒక జామ చెట్టు, ఒక దేవ గన్నేరు, ఇంకా ఒక వెరైటీ క్రోటన్ మొక్క
ఉన్నాయి.. నేను ముందు అనుకున్నట్లు తాడిపత్రి వెళ్ళకుండా ఉంటే చాలా మిస్
అయ్యేవాడిని.. విజయమోహన్ గారిలా కళాహృదయం, ప్రకృతిని ప్రేమించే గుణం ఈ
కాలంలో బహు అరుదు.. వారికి అన్నివిధాలా తోడ్పాటును అందించిన వారి కుటుంబ
సభ్యులు ఇంకా అరుదు.
తాడిపత్రి
నుంచీ వచ్చాక భోజనాలు చేసి మేము అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరాం..
రెండు రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పటిదాకా అర్థం కావడం లేదు.. కానీ ఒక్కటి
మాత్రం నిజం ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రిప్ నేను అసలు వెయ్యలేదు.. నేను
వెళడం అనగానే ముందుకువచ్చిన రాజ్, శ్రమ అనుకోకుండా కార్ డ్రైవ్ చేసిన
భాస్కర్ గారికి ధన్యవాదాలు.. అలాగే హైదరాబాద్ నుంచీ వచ్చిన బంతి,
నాగార్జున, రహ్మాన్, సురేష్ పెద్దరాజు, లక్ష్మి నరేష్ గార్లకు కూడా
నెనర్లు..
మేము
వెళ్ళడం అనేది పక్కన పెడితే, రోటరీపురంలో కాపురం ఉంటున్న ప్రసాద్ గారి
కుటుంబం సదా అభినందనీయులు.. ఏ చిన్న అవసరం వచ్చిన ఆఖరకు ఉప్పూ, చింతపండూ
కావలసి వచ్చినా అనంతపురం (12కి.మి) వెళ్ళాలి.. మరి ప్రసాద్ గారి కుటుంబం
ఎలా మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. జీవని హోం శంకుస్థాపన అప్పుడు
శీనన్న ఒక మాట అన్నాడు "జీవనిలో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కానీ ఇక పైన
జరిగే ప్రయాణం నూనే పూసిన స్థంభాన్ని ఎక్కడం లాంటిది" అని. రోటరీపురంలో
ప్రసాద్ గారి కూటుంబం ఉండటం ఖచ్చితంగా అలాంటిదే..
పప్పుసార్,
ఈ
టూర్ విషయంలో మిమ్మల్ని ఎలా మిస్ అయ్యానో ఇప్పటిదాకా అర్థం కావడాం లేదు..
ఇందుకుగానూ మీకు బ్లాగు ముఖంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను.. మరోసారి
ఇలాంటి ట్రిప్(అన్నీ కుదిరితే డిశంబర్లో) వేస్తే మీరు మిస్ అవ్వకుండా
చూసుకుంటాను.. ఈసారికి మమ్మల్ని క్షమించేసేయండి.. ;-)
సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్