సమస్యలు: అటూ, ఇటూ ..

7/31/2013 - రాసింది karthik at Wednesday, July 31, 2013
చివరకు కేంద్రం తెలంగాణ ప్రకటించింది. ఇప్పటిదాకా తిట్టుకున్న తిట్లన్నీ మర్చిపొయి ఇప్పుడు అందరం సోదరభావంతో ఉందామని ప్రముఖులంతా ప్రకటనిస్తున్నారు.. సరే, సంతోషం!  నేను ఆ విషయం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. విభజన కరెక్టా, కాదా అనే చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ప్రజలలో మానసికంగా విభజన జరిగి ఒక ఐదారేళ్ళకు పైగానే అయింది. ఒకరు విగ్రహాలు పగులగొట్టినప్పుడు, కవిత్వం పేరుతో బూతు పురాణాలు ప్రచురించినప్పుడు, మరొకరు ఆత్మాహుతి దళం గా మారుతాం అన్నప్పుడే మానసిక విభజన్ ఏ స్థాయిలోఓ ఉందో చూశాం.. 

ఒక సమైక్యవాదిగా సారీ ఇప్పుడు ఈమాటకు విలువ లేదు కదా, సరే ఒక సీమబిడ్డగా ఈ నిర్ణయం వల్ల మా నాకు కనిపిస్తున్న నష్టాలు:

1. హైదరాబాదు నుంచీ సీమాంధ్ర ప్రాంతాలకు బస్సు చార్జీలు పెరగడం. ఎందుకంటే అంతరాష్ట్రాల మధ్య ఉండే టాక్స్ అదనంగా కట్టాలి. ఇది సీమాంధ్రులకు మాత్రమే నష్టం కాదు. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇరు ప్రాంతాల వారూ మొహమాటం లేకుండా ఈ టాక్స్ వేసుకుంటారు.

2. కరెంట్ కష్టాలు అధికమవడం. సీమాంధ్రులకు సింగరేణి బొగ్గు, సాగర్ నుంచీ కరెంట్ రెండు కష్టమే.. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే ఇవి సరిపోవడం కష్టం. కాబట్టి ఇక సీమాంధ్రులు ఎంచక్కా కరెంట్ తీగలపై బట్టలారేసుకోవచ్చు.

3. రాయలసీమలో, యస్ నా సీమలో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కరువుసీమలో పుట్టిన పాపానికి సాగు నీళ్ళ గురించి ఆలోచించడం అత్యాసే కానీ ఇప్పుడు తాగు నీరు కూడా కష్టమే. కడప, అనంతపురం జిల్లాలో అతి త్వరలో ఎడారులుగా మారే అవకాశాలు పుష్కలం.

4. ఉద్యోగాలలో ఇబ్బందులు వస్తాయి అని ఒక వాదన. కానీ ఈరోజులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే చాలా తక్కువ పోను పోను ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోలేము.

ఈ సమస్యలు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పాటు వల్ల కనీసం ఈ క్రింద చెప్పిన సమస్యలు తీరినా నేను సంతోషిస్తాను:

1. ఫ్లోరైడ్ సమస్య: మన ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ సమస్య తీరితే అంతే చాలు.
2. ఐ.ఐ.టి. హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కళశాలగా రూపుదిద్దుకోవాలి.
3. హైదరాబాదులో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి అవి వేరే రాష్ట్రాలకు పోకుండా చూడాలి.
 
తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ మాత్రం మేలు జరిగినా ఉద్యమానికి సార్థకత చేకూరినట్లే..


సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్


దూసుకొచ్చిన కారు; తల్లీ పిల్లలు దుర్మరణం!

రాసింది karthik at Wednesday, July 31, 2013
న్యూఢిల్లీ, జూలై 30: ఈ రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతం లో రాజధాని ఢిల్లీ నగరంలో JANPATH10 నంబర్ కల గులాబీ రంగు కారు ఫుట్ పాత్ పైకి దూసుకోపోవడం తో తల్లి, ఆమె పిల్లలు అక్కడిక్కడే అకాల మరణం పొందారు. ఈ దుర్ఘటన పొరపాటున జరిగింది కాదని, యస్.గాంధీ అనే విదేశీ వనిత తన కుమారుడైన రాహువును అందలమెక్కించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఇంతకు మునుపు ఇదే రాహువు కోసం యస్.గాంధీ బీహారీ చాత్ పూజలు చెయ్యడం, లక్నో కబాబులు తినడం లాంటి ప్రయత్నాలు కూడా చేసింది. అవి రెండూ బెడిసికొట్టడం తో నిస్సహాయురాలైన ఈ మృతురాలిని లక్ష్యం గా చేసుకుని ఈ ఘోరకలికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి పొరపాట్లు కాకుండా పిగ్విజయ్ సింగ్, గులాం ఆజాద్నహీ అనే డ్రైవర్ల దగ్గర నుంచీ సలహాలు తీస్కున్నట్టు తెలిసింది. 
మృతురాలి స్వస్థలం గోదావరీ, కృష్ణ పరివాహక ప్రాంతమని తన వాళ్ళందరూ అనాథగా వదిలివేయడంతో ఢిల్లీ రోడ్ల మీద బ్రతుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరణించిన వారి వివరాలు:

పేరు: తెలుగు తల్లి
పిల్లలు: శాంతి, తేజ

మరణించిన వారి ఆత్మలకు పుణ్యలోకాలు కలగాలని కోరుకుందాం!

మరణించిన వారిపై రాసిన పాటను క్రింది వీడియో చూడగలరు:





ఈ విషయం ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఈ లేఖను ఒకసారి చూద్దాం. 


It looks like political expediency, not development, is behind the formation of a separate Telangana. The Congress is aware that Chief Minister Kiran Kumar Reddy is from Rayalaseema and has never openly backed the demand for Telangana. It is evident that his views were not taken seriously by the party high command which appears to have made up its mind after the BJP’s strident support for the cause.
The Congress will gain nothing from its latest move. It has lost its identity in all three regions of Andhra Pradesh. The party leaders from Telangana cannot hope to perform a magic in the region as the TRS, which has been pursuing the demand since 2001, will gain an upper hand. It may well turn out to be a straight contest between the TRS and the TDP. One thing is certain. Andhra Pradesh is heading for a long phase of uncertainty and violence.
V. Sriharsha,
New Delhi
నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు!  

ఆశ్రునయనాలతో
-కార్తీక్

బ్రహ్మశ్రీ చాగంటి వారి వివాదం: నా అనుకోలు

7/21/2013 - రాసింది karthik at Sunday, July 21, 2013

గుర్తుకొస్తున్నాయి : రాజంపేట

5/07/2013 - రాసింది karthik at Tuesday, May 07, 2013

పొయిన నెలలో మా పెదనాన్న గారి సంవత్సరీకం జరిగితే రాజంపేటకు వెళ్ళాను.. మా పెదనాన్న గారి పార్థివ శరీరం చూసే అవకాశం నాకు రాసిపెట్టలేదు అందువల్ల ఇప్పుడు మిస్ అవకుండా అటెండ్ అయ్యాను.. రాజంపేట అంటే అన్నమయ్య జన్మించిన తాళ్ళపాకకు దగ్గర్లో ఉన్న చిన్న టౌను. అది మా అమ్మమ్మ గారి ఊరు కావడం వల్ల చిన్నప్పటి నుండీ సెలవలకు అక్కడికి వెళ్ళేవాడిని.. మా చుట్టాలు అక్కడ చాలామందే ఉన్నారు కానీ చిన్నతనంలో నా సమయమంతా మా అమ్మమ్మా వాళ్ళ గడ్డివామిలో ఆడుకునేందుకే సరిపోయేది.. ఆ గడ్డివామి దగ్గర నిలబడితే రాజంపేట రైల్వే స్టేషన్ కనిపించేది.. ఇప్పుడు ఆ గడ్డివామి లేదు, ఇళ్ళు కట్టడం వల్ల రైల్వే స్టేషన్ కూడా కనిపించదు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వెళ్ళాను, ఊరు చాలా మారిపోయింది.. పాత బస్ స్టాండ్ నుంచీ స్టేషన్ దగ్గర మా అమ్మమ్మా వాళ్ళ ఇంటి వరకూ బైక్ లో వెళుతూ ఉంటే ప్రతీ వీధి, ప్రతీ షాపూ నా జ్ఞాపకాల నుంచీ బయటకు వచ్చాయి.. అలా ఆలోచిస్తూ ఉండగానే బి.యస్. థియేటర్ ఉన్న సందు కనిపించింది.. ఇప్పుడు ఆ థియేటర్ ఉందో లేదో తెలీదు.. కానీ నేను ఆ థియేటర్లో ఎన్ని సినిమాలు చూశానో లెక్కేలేదు. ఆ థియేటర్ స్పేషాలిటీ ఏమంటే అక్కడ కేవలం పాత సినిమాలు మాత్రమే వచ్చేవి.. మా మామ వాళ్ళతో ఆ సినిమాలకు మ్యాట్నీకి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు నాకు ఎప్పుడూ లేదు మరి.. అలనాటి ఆణిముత్యాలు బాలనాగమ్మ, బందిపోటు, ఇల్లరికం, ఇంకా విజయా వాళ్ళ సినిమాలు ఆ హాల్లోనే చూశాను. ఆ సినిమాలకు వెళ్ళాలంటే కూడా చాలా షరతులు పెట్టేవాడిని, "రేలంగి ఉన్నాడా?", "రమణా రెడ్డి  ఉన్నాడా?", "రాజబాబు ఉన్నాడా?" లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితేనే వేళ్ళేవాడిని.. వాళ్ళు ముగ్గురూ లేని పాత సినిమాలు చూడటం దండగ అని నా నమ్మకం; అప్పుడే కాదు ఇప్పుడు కూడా!

ఇంకాస్త దూరం వెళితే సంగీత బుక్ లింక్స్ షాప్ ఉన్న స్థలం కనిపించింది. సంగీతా బుక్ లింక్స్ లో నేను షాడో, బుల్లెట్ నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. పుస్తకం మరుసటి రోజుకు ఇచ్చేయాలి కాబట్టి గబ గబా చదివేవాడిని.. కొన్ని సార్లు డబ్బులు తక్కువ పడేవి అప్పుడు మా మామ దగ్గరో, మా ప్రసన్నక్క దగ్గరో గాంధీ ఖాతా మీద డబ్బు తీసుకునేవాడిని.. :)   సంగీతా బుక్ లింక్స్ గురించి మా తమ్ముడిని అడిగితే ఆ షాప్ ఇప్పుడు మరో చోటకు మార్చారని, ఇప్పుడు ఎక్కువ కంపిటీటివ్ పరీక్షల పుస్తకాలు మాత్రమే అమ్ముతున్నారని చెప్పాడు.. ఇప్పుడు డిమాండ్ ఉన్నది వాటికేగా మరి.. ఇప్పుడు పుస్తకాలు అద్దెకు ఇచ్చే షాపులూ లేవు, తీసుకుని చదివే ప్రజలూ పెద్దగా కనిపించరు.. బహుశా పుస్తకాలు అద్దెకు తెచ్చుకున్న వారిలో నా తరం ఆఖరు అనుకుంటా..   పుస్తకాలు పక్కన పెడితే ఆ షాపు దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు నిలబడి దేశ కాల వైపరిత్యాల గురించి చర్చిస్తుండేవారు.. అలాంటి వాళ్ళతో చర్చించేంత వయసు, సబ్జెక్ట్ నాకు లేకపోవడం వల్ల కేవలం వాళ్ళ చర్చ విని ఇంటికి వచ్చేవాడిని.. అదొక శునకానందం! 

ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ సమద్ థియేటర్ కనిపించింది. ఈ థియేటర్లో సహజంగా కొత్త సినిమాలు వచ్చేవి.. అవి కూడా డైరెక్ట్ రిలీజ్ కాదు కడపలో రిలీజైన వారం పది రోజులకు వచ్చేవి.. కానీ నా జీవితంలో మరచిపోలేని థియేటర్లలో అదీ ఒకటి. సినిమా ఏదో గుర్తులేదు కానీ ఒకసారి ఫస్ట్ షో  మధ్యలో కరెంట్ పోతే కరెంట్ వచ్చాక మళ్ళీ రమ్మని జనాలను ఇంటికి పంపించారు.. మేము ఇంటికి వచ్చి అన్నం తిని కరెంట్ వచ్చాక మళ్ళీ సినిమాకు వెళ్ళాం.. ఇలాంటి అనుభవాలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి??  ఇప్పుడు ఈ సమద్ థియేటర్ దగ్గర నుండీ మొదలయ్యే ఒక పెద్ద ఫ్లై ఓవర్ కట్టారు, దాని వల్ల రైల్వే ట్రాక్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోయే సమస్య తప్పింది.. ఈ ఫ్లై ఓవర్ కట్టాలని బ్రిటీష్ కాలం నుంచీ ప్రతిపాదన ఉంటే రెండు మూడేళ్ళ క్రితం కట్టించారు.. స్వతంత్ర భారత దేశమా జోహార్!

ఇవన్నీ కాక రాజంపేటకు వెళితే తప్పకుండా చేసేపని బోనగిరి గుట్టకు వెళ్ళడం. ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది.. అప్పట్లో ఆ గుడి శనివారాలు మరియూ ఇతర పర్వదినాలలో మాత్రమే తెరిచేవారు.. మేము అక్కడికి నడిచివెళ్ళేవాళ్ళం. దూరమెంతో గుర్తులేదు కానీ మాకు ఎప్పుడూ బడలిక అనిపించేది కాదు.. ఎందుకంటే మధ్య దారిలో పూర్తిగా మామిడి తోటలు. అక్కడక్కడా ఆగుతూ కాసేపు పెరిగెత్తుకుంటూ కొంచెం సేపు ఒకరితో ఒకరు పందేలు కాస్కుంటూ వెళ్ళేవాళ్ళం.. దారి మధ్యలో తినడానికి మిక్చర్ కలిపిన బొరుగులు..అదొక తీపి జ్ఞాపకం! ఇప్పుడు ఆ గుడిని మాజీ ఎం.ఎల్.ఏ. పసుపులేటి బ్రహ్మయ్య గారు బాగా అభివృధ్ధి చేయించారని తెలిసింది. ఇప్పుడు ప్రతీ రోజు ఆ గుడిని తెరుస్తారట పైగా కొండమీద మోటర్ వాహనాలు వెళ్ళే వెసులుబాటు కూడా ఉందట.. మేము వెళ్ళే కాలంలో ఇలాంటి సదుపాయం లేదు.. బహుశా అందువల్లే మేము ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగామేమో!

భారత క్రికెట్ టీముకు సర్ రవీంద్ర జడేజా ఎలానో రాజంపేట ఊరికి పనీర్ సోడా అలాంటిది.. :)) ఈ కూల్ డ్రింక్ మరెక్కడా తయారు చేసినట్టు నేను చూడలేదు; వినను కూడా వినలేదు .. ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ తింగర తింగరగా భలే ఉండేది. నా పదవ తరగతి సెలవల్లో ప్రతీ రోజూ రైల్వే స్టేషన్ నుండీ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న లైబ్రరీకి నడుచుకుంటూ వెళ్ళి ఈనాడు పేపర్ చదివేవాడిని. అలాంటి రోజులలో కొన్ని సార్లు పనీర్ సోడా తాగేవాడిని.. ఇప్పుడు అది ఎవరూ తయారు చేయడం లేదట.. ఎంత ఘోరం?? అలాంటిదే పెద్ద గ్రౌండులో జరిగే క్రికెట్ పోటీలు.. ప్రతీ వేసవిలో తప్పకుండా జరిగేవి.. ఒకటి రెండు సార్లు మా అన్న కూడా ఈ పోటీల్లో పాల్గొన్న టీములో ఉన్నాడు.. కానీ వాళ్ళ టీము ఆడిన మొదటి మ్యాచులోనే ఇంటికి వచ్చేసి ఆటగాడిగా మా అన్నకు, ప్రేక్షకుడిగా నాకూ శ్రమ తప్పించింది.. ఇప్పుడు కూడా ఇలాంటి పోటీలైతే జరుగుతున్నాయంట కానీ ముందంత జోరు లేదని టాక్.

అలానే రాజంపేటలో నాకు బాగా నచ్చే మరొక స్థలం అక్కడి స్కూలు, కాలేజి దాని పక్కనుండే పేఏఏద్ద గ్రౌండు..ఆ గ్రౌండులో ఉన్న పెద్ద పెద్ద చెట్లు.. రావి, మఱ్ఱి, జివ్వి లాంటి చెట్లు అక్కడ చాలా ఉండేవి. వాటి క్రింద ఆడుకునేందుకు మాకు కావాల్సినంత నీడ ఉండేది.  ఈ కాలంలో అంత గ్రౌండున్న స్కూల్ దొరకాలంటే చాలా కష్టం.. మా అమ్మా వాళ్ళ కుటుంబంలో అందరూ అక్కడ చదివిన వాళ్ళే; మా తాతగారు అక్కడ లెక్చరర్ గా పని చేశారు. నాకిప్పటికీ బాగా గుర్తు, మా అమ్మ ఒకసారి తను పరీక్షలు రాసిన క్లాస్ మాకు చూపించింది..  ఇలాంటి జ్ఞాపకాలు ఆ ఊరితో మరెన్నో ఉన్నాయి, దాదాపు పదేళ్ళ తర్వాత వెళ్ళాను కనుక ఇప్పుడు ఎక్కువగా టచ్ చేస్తున్నాయి..

-కార్తీక్ 

జీవనికి వెళ్ళామోచ్!!

4/02/2013 - రాసింది karthik at Tuesday, April 02, 2013

దాదాపు 7-8 నెలల నుంచీ అనుకున్న జీవని యాత్ర చివరకు నిన్న శని-ఆదివారాలు కుదిరింది. శనివారం పొద్దున మారథహళ్ళి నుంచీ నేనూ, రాజ్, భాస్కర్ అవినేని గారూ బయలుదేరాం.. భాస్కర్ గారి కార్లో వెళదామనుకోవడం వల్ల బస్/రైల్ రిజర్వేషన్ల గొడవ లేకుండా బయలుదేరాం..  భాస్కర్ గారికి లాంగ్ డ్రైవ్స్ అలవాటు ఉండటం వల్ల, అనంతపురం రూట్ తెలిసుండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా అనంతపురం దాకా వెళ్ళిపోయాం.. ముందు రోజు ఫోన్ చేసినప్పుడు ప్రసాద్ గారు చిలక్కు చెప్పినట్టు చెప్పారు "రాప్తాడు దాటిన తర్వాత కుడివైపు టర్నింగ్ తీసుకుంటే టౌన్లోకి వెళ్ళకుండా రోటరీపురం వచ్చేయచ్చు" అని.. కానీ నేను మరోసారి నా అలవాటును కొనసాగించి ఆ టర్నింగ్ గురించి భాస్కర్ గారికి చెప్పలేదు.. ఇప్పటిదాకా జీవనికి వెళ్ళిన ఎప్పుడు కూడా నేను ఆ టర్నింగ్ తీసుకోలేదు.. ఒకసారి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చాం, నిన్న కూడా మిస్ అయ్యింది.. నేనే అనుకుంటే మన రాజ్ బాబు ఇంకా గొప్పోడు ఒకసారి రాప్తాడులో దిగేశాడు, ఇంకోసారి దిగాల్సిన స్టాప్ దాటి రెండు స్టాపుల తర్వాత దిగాడు.. బ్లాగర్లా మజాకా! 

అనంతపురం ఊర్లోకి వెళ్ళాక ఒక రెండు డజన్లమందిని రూట్ అడిగి (జ్ఞానేశ్వర్ గారు రూట్ చెప్పిన తర్వాత కూడా) తిన్నగా కాకుండా వంకర టింకరగా వెళ్ళి జీవని చేరుకున్నాం.. అక్కడికి హైదరాబాద్ నుంచీ రహ్మాన్, బెంగళూరు నుంచీ శారద గారు, ఆనంద్ గారు మాకంటే ముందే వచ్చేశారు. మేము కారులో వచ్చిన దానికంటే వాళ్ళు బస్సులో ముందు వచ్చారు.. మన బస్సులు ఎంత ఫాస్ట్ పోతాయో దీనిద్వారా ప్రజలు తెలుసుకోవాలి..  శారద గారు రెగులర్గా బ్లాగులు చదువుతుండటం వల్ల మా గురించి ప్రవర చెప్పకుండానే గుర్తు పట్టేశారు.. పిల్లలు ఇంకా స్కూల్ నుంచీ రాలేదు కాబట్టి భోజనాలకు ఇంకా టైం ఉండటం వల్ల  పిల్లల రూములు అవి చూశాం.. పిల్లలంతా బట్టల అల్మారాలు, పుస్తకాల అల్మారాలు చాలా నీటుగా పెట్టుకున్నారు.. నేను ఆ వయసులో ఎప్పుడూ నా పుస్తకాలు అంత నీటుగా పెట్టుకోలేదు.. నర్సరీలో ఉండే పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళతో పరమ పద సోపాన పటం, టిక్ ట్యాక్ టో లాంటి ఆటలు ఆడించాం.. మన రాజ్ బాబు స్మైలీ అనే పాపతో ఆడాడు.. కనీసం మూడుసార్లు పెద్ద పాము నోట్లో పడి క్రిందకు వచ్చాడు.. ఇక స్మైలీకి ఇంకా నంబర్లు కరెక్ట్ గా తెలీదు.. ఎటు సైడు నిచ్చెన కనిపిస్తే ఆ సైడు తన బొమ్మ జరిపేసుకుంది.. ఎలాగైతే ఏం చివరకు రాజ్ బాబే గెలిచాడు.. కాంగ్రాట్స్ రాజ్! 

భోజనాలయ్యాక పిల్లలందరితో కూర్చుని మాట్లాడుతూ వాళ్ళ చేత పాటలు పాడించాం.. దాదాపు పిల్లలంత ఉత్సాహంగా పాటలు పాడారు ఒకరిద్దరు డాన్సులు కూడా చేశారు..జీవనిలో డాన్సులు, పాటలు అంటే శివకుమార్ గురించి చెప్పాలి.. తను ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు.. నాలైదు పాటలు కలిపి సొంతంగా తనే డాన్స్ కంపోజ్ చేసుకుంటాడట.. జీవని హాస్టల్ శంకుస్థాపన రోజు మైక్ తీసుకుని పాట, స్పీచ్, మిమిక్రి అన్నీ కలిపి కొట్టాడు. మైక్ వెనక్కు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం.. శివనే కాక దాదాపు పిల్లలందరూ స్టేజ్ ఫియర్  లేకుండా ముందుకు వచ్చి పాటలు పాడారు.   సాయంత్రమయ్యాక పిల్లలందరూ స్నాక్స్ తిని వరుసగా కూర్చుని హోంవర్క్ చేసుకున్నారు.. మేము కాసేపు దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చాం.. మాతోపాటూ రాజ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ప్రతీ నాలగు సెకన్లకు ఒక కుక్క మా వెనుక పడేది. ఎలాగో తప్పించుకుని, కాట్లు లేకుండా మళ్ళీ వెనక్కు వచ్చేశాం.. శునక చరిత్ర తెలుసుకోవాలనుకున్నవాళ్ళు ఈ లంకెను నొక్కండి..

సాయంత్రానికి హైదరాబాదు నుంచీ సురేష్ పెద్దరాజు గారూ, లక్ష్మి నరేష్, చిత్తూరు నుంచీ బంతి వచ్చేశారు..  రాత్రి భోజనాలయ్యాక కొంతసేపు సాహిత్య చర్చ జరిపి కొన్ని ఆడియోలు విని వీడియోలు చూసాం..  పడుకోవాలని డాబా మీదికెళ్ళి అక్కడ కూర్చుని బాలయ్య విగ్ కలెక్షన్ దగ్గర నుంచీ 2014 ఎన్నికల దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.. Everything and anything under the sun is discussed. భాస్కర్ గారు తప్ప మిగిలిన వాళ్ళమంతా ఈ సుదీర్ఘ చర్చల్లో పాల్గొని తమ తమ విజ్ఞానానికి పదును పెట్టుకున్నారు..  భాస్కర్ గారు త్వరగా నిద్రపోయారు కాబట్టి (అ)జ్ఞాన యజ్ఞంలో పాల్గొనలేకపోయారు.. 

ఆదివారం పొద్దున నిద్ర లేచి డాబా పై నుంచీ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాం.. అప్పటికే పిల్లలందరూ లేచి పుస్తకాలు తెరిచి హోం వర్క్ అవి చేసుకుంటున్నారు.. కొంత సేపయ్యాక పిల్లలకు శారద/ఆనంద్ గార్లు  తెచ్చిన  రంగులు ఇచ్చి హోలీ ఆడించాం.. పిల్లలు ముందు కొంచెం భయపడ్డారు కానీ తర్వాత రంగుల అయిపోయాక కూడా మామూలు నీళ్ళు కూడా ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆడుకున్నారు. అప్పటిదాకా బుద్దిగా హోం వర్క్ చేసుకున్న పిల్లలు ఒక్కసారిగా తమ అసలైన బాల్యాన్ని ఆవిష్కరించారు..  మాటలతో చెప్పడం కాదు కానీ వాళ్ళ కేరింతలు నిజంగా చూడాల్సిందే..కలర్స్ తేవాలనే చక్కని ఐడియాతో వచ్చిన ఆనంద్/శారద గార్లకు అభినందనలు.. 

హోలీ అయ్యాక పిల్లలందరితో క్రికెట్ ఆడాం.. మన లక్ష్మి నరేష్ తన సీనియారిటీ అంతా ప్రదర్శించి పిల్లలందరికి సూచనలిస్తూ దుమ్ము లేపాడు.. సురేష్ గారు ధోనీ అసూయ పడేలా రెండు సిక్సర్లు పీకి తన బ్యాటింగ్ ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు.. భాస్కర్ గారు అంపైరింగ్ చేసారు.. కానీ మ్యాచులో హైలెట్ మాత్రం రాజ్ కుమారే.. బ్యాటింగులో ముందుకు జరిగి, వికెట్ల వెనక్కు జరిగి, భరత నాట్యం, కథకళి ఫ్యూజన్ చేసి క్రీజ్ మీద అరాచకం చేశాడు.. పైగా హ్యాట్రిక్ ఫోర్లు కూడా కొట్టాడు.. ఆ జుగల్ బందీ కార్యక్రమం వాళ్ళ ఒంకార్ అన్నయ్య చూసుంటే ఆట-36 కి రాజ్ కుమార్నే జడ్జ్ గా పెట్టుకునేవాడు.  

క్రికెట్ తర్వాత టిఫిన్లు చేసి చలో తాడిపత్రి అన్నాం.. పిల్లలకు మెడికల్ చెకప్ ఉండటం వల్ల దొరికిన తీరికను ఇలా వాడుకున్నాం.. ముందుగా చెప్పుంటే విజయమోహన్ గారే అనంతపురం వచ్చేవారు కానీ నేను ఆయనకు ఫోన్ చెయ్యడం మర్చిపోయాను.. అనంతపురం నుంచీ ఫోన్ చేస్తే విజయమోహన్ గారు ఇంటికి రమ్మని పిలిచారు.. నాకేమో కుదరదనిపించింది కానీ సురేష్ గారూ, లక్ష్మి నరేష్ తాడిపత్రి గుడి చూద్దాం అని సజెస్ట్ చెయ్యడంతో విజయమోహన్ గారికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాను.. ఆయన దగ్గరుండి రెండు గుళ్ళు చూపించారు.. ఆ గుళ్ళ గురించి రాయాలంటే ఈ టప సరిపోదు కాబట్టి రాయడం లేదు. తర్వాత వాళ్ళింటికి వెళ్ళాం, వాళ్ళింట్లో ప్రతీ ఒక్క వస్తువూ ఒక మాస్టర్ పీసే.. మేము విజయమోహన్ గారితో మాట్లాడటం కంటే వాళ్ళింట్లో ఆర్ట్ వర్క్స్ ఫోటోలు తీసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాం.. టౌన్లో పుట్టి సిటీలో బ్రతుకుతున్న నాలాంటి వారికి విరగకాసిన మామిడి చెట్టును చూసి చేతులు ముడుచుకుని కూర్చోవడం చాలా కష్టమైంది. వాళ్ళింట్లో మొత్తం మూడు మామిడి చెట్లు, రెండు శ్రీగంథం చేట్లు (తిరుమల నుంచీ తెచ్చి వేశారట), ఒక జామ చెట్టు, ఒక దేవ గన్నేరు, ఇంకా ఒక వెరైటీ క్రోటన్ మొక్క ఉన్నాయి.. నేను ముందు అనుకున్నట్లు తాడిపత్రి వెళ్ళకుండా ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని.. విజయమోహన్ గారిలా కళాహృదయం, ప్రకృతిని ప్రేమించే గుణం ఈ కాలంలో బహు అరుదు.. వారికి అన్నివిధాలా తోడ్పాటును అందించిన వారి కుటుంబ సభ్యులు ఇంకా అరుదు.

తాడిపత్రి నుంచీ వచ్చాక భోజనాలు చేసి మేము అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరాం.. రెండు రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పటిదాకా అర్థం కావడం లేదు.. కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రిప్ నేను అసలు వెయ్యలేదు.. నేను వెళడం అనగానే ముందుకువచ్చిన రాజ్, శ్రమ అనుకోకుండా కార్ డ్రైవ్ చేసిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.. అలాగే హైదరాబాద్ నుంచీ వచ్చిన బంతి, నాగార్జున, రహ్మాన్, సురేష్ పెద్దరాజు, లక్ష్మి నరేష్ గార్లకు కూడా నెనర్లు..

మేము వెళ్ళడం అనేది పక్కన పెడితే, రోటరీపురంలో కాపురం ఉంటున్న ప్రసాద్ గారి కుటుంబం సదా అభినందనీయులు.. ఏ చిన్న అవసరం వచ్చిన ఆఖరకు ఉప్పూ, చింతపండూ కావలసి వచ్చినా అనంతపురం (12కి.మి) వెళ్ళాలి.. మరి ప్రసాద్ గారి కుటుంబం ఎలా మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. జీవని హోం శంకుస్థాపన అప్పుడు శీనన్న ఒక మాట అన్నాడు "జీవనిలో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కానీ ఇక పైన జరిగే ప్రయాణం నూనే పూసిన స్థంభాన్ని ఎక్కడం లాంటిది" అని. రోటరీపురంలో ప్రసాద్ గారి కూటుంబం ఉండటం ఖచ్చితంగా అలాంటిదే..

పప్పుసార్,
ఈ టూర్ విషయంలో మిమ్మల్ని ఎలా మిస్ అయ్యానో ఇప్పటిదాకా అర్థం కావడాం లేదు.. ఇందుకుగానూ మీకు బ్లాగు ముఖంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను.. మరోసారి ఇలాంటి ట్రిప్(అన్నీ కుదిరితే డిశంబర్లో) వేస్తే మీరు మిస్ అవ్వకుండా చూసుకుంటాను.. ఈసారికి మమ్మల్ని క్షమించేసేయండి.. ;-)

సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్

సినిమా ఆట!!

2/18/2013 - రాసింది karthik at Monday, February 18, 2013

చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకుంటాం కానీ కొన్ని ఆటలు మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతాయి. 
ఏంటి, బొంగులో బ్లాగుకు ఇంత బిల్డప్ అవసరమా అనుకుంటున్నారా?? కికికి.. ఈరోజు భావావేశం పడిశం పట్టినట్టు పట్టింది.. అందులో నుంచీ వచ్చిందే ఇది.. 

సరే విషయానికి వస్తే చిన్నప్పుడు మేము సినిమా ఆట అనే ఒక చిత్రాతి చిత్రమైన ఆట ఒకటి ఆడుకునేవాళ్ళం.. ఇందులో రూల్ ఏమంటే కొత్తగా వచ్చిన ఏదైనా సినిమాని రీమేక్ చెయ్యాలి. అంటే కాపీ రైట్లు, మ్యూజిక్ రైట్లు కొనడం కాదు ఆ సినిమాలో జరిగినట్లు డైలాగులు, పాటలు, ఫైట్లు చెయ్యాలి.. మా కాంపౌండులో జనాలు చాలామందే ఉండేవారు..  కానీ మా కాంపౌండులో సినిమా ఆట అంటే జనాలు పక్క కాంపౌండ్ నుంచీ కూడా వచ్చేవాళ్ళు.. మా గ్యాంగులో  మా అక్కలు ఇద్దరు, మా పక్కింట్లో ఉండే ఒక అక్క ఒక బాబు, మా ముందింట్లో ఉండే ఒక అక్క.. పక్క కాంపౌండునుంచీ సరోజ అనే ఒక పాప. ఈ సినిమా ఆటగా ఆడటానికి నాకు ఎక్కువగా నచ్చే సినిమా మరణ మృదంగం.. ఎందుకంటే ఆ సినిమాలో డైలాగులు పాటలు ఏమీ ఉండేవి కాదు.. జట్టుకు ఇద్దరు చొప్పున జట్లుగా విడిపోయి, మెట్ల కిందా, బావి పక్కన దాక్కుని "ఢన్ ఢన్ ఢన్ ఢన్" అని అరుస్తూ ఉంటే కాసేపటికి బోరుకొట్టిన జట్టు చెప్పా పెట్టాకుండా ఇంటికి వెళ్ళిపోతుంది సినిమా ఆటోమేటిగ్గా అయిపోతుంది..  

మన సమాజంలో ఉన్న వివక్ష గురించి నాకు తెలిసింది ఈ సినిమా ఆటలోనే, ఎందుకంటే సినిమా ఏదైనా సరే విలన్ మాత్రం నేనే, ఎందుకంటే నేను వయసు ఆధారిత మైనార్టీని కాబట్టి.. అప్పటికి మా కాంపౌండ్లో ఐదుకంటే తక్కువ వయసున్న వాడిని నేను మాత్రమే.. అందుకని మరో ఆలోచన లేకుండా నన్నే విలన్ పాత్రకు ఫిక్స్ అయ్యేవాళ్ళు.. 
ఆటలో నాకు మాబాగా గుర్తున్న సినిమా "శివ".. నాగార్జున అనే హీరో ఒకడున్నాడని మా పక్కింటి సరోజ లాంటి చిన్నపిల్లలకు చాటిచెప్పిన సినిమా "శివ".. నాకు నాగార్జున ముందే తెలుసు, మా అమ్మ నన్ను విక్కిదాదా సినిమాకు రాయల్ హాల్ లో మాట్నీకి తీసుకెళ్ళింది.. ఐ యాం ఇంటెలిజెంట్ యు నో!! 

ఆ "శివ" ప్రభంజంలో అలవాటుగా మా కాంపౌండ్లో సినిమా ఆట మొదలుపెట్టారు, నన్ను మామూలుగానే విలన్ చేశారు అంటే "భవానీ" అన్న మాట..   ఆ భవాని మాటిమాటికీ ఒక చిన్న సీసా తీసి ఏదో తాగుతాడు.. నాకు ఏం తాగాడో తెలీదు కానీ నేను కూడా ఏదో ఒకటి తాగాలి అందులో బాటిల్ లాంటి దానిలో తాగాలి, అలాంటి సమయంలో నాకు రస్నా ఆడ్ గుర్తుకు వచ్చింది.. వెంటనే నా తెలివిని పూర్తిగా ఉపయోగించా! మా వంటింట్లో ఉండే మరచెంబు నిండా రస్నా పోసి తెచ్చుకున్నా..  ఇంక చూసుకో నా సామీ రంగా నా డైలాగ్ వచ్చినప్పుడల్లా గటగటా తాగి డైలాగులు చెప్పేవాడిని.. అప్పట్లో రియాల్టీ షోలూ టాలెంట్ షోలు లేవు కానీ లేకపోతే నాది కమలహాసన్ లెవెల్ యాక్టింగ్..  
అలానే మరొక సినిమా ఆఖరిపోరాటం.. అందులో నేను ఎక్కువగా బూటులో కత్తి పెట్టుకునే రౌడీ పాత్ర వేసేవాడిని.. మా అక్కలిద్దరిలో ఎవరికి నన్ను కొట్టాలనిపిస్తే వాళ్ళు హీరో పాత్ర వేసేవాళ్ళు.. నాగార్జున పేరు చెప్పుకుని నన్ను ఫుట్ బాల్ ఆడేసుకునేవాళ్ళు.. 

ఇవన్నీ కాదు గానీ సినిమా ఆటలో నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం నేను మెట్ల మీద నుంచీ దొర్లుకుంటూ కింద పడ్డం.. ఎవరో కొట్టారో తెలీదు కానీ విలన్ పాత్రను తన్నాలన్న ఉత్సాహం ఎక్కువై కొట్టారు.. నేను మిద్దె మీద నుంచీ దొర్లుకుంటూ కిందికి వచ్చి పడ్డాను.. ఏంతైనా మైనార్టీనీ కదా ఏమైనా చెప్పుకోలేను..

అన్నట్టు చెప్పడం మరిచిపోయా, మా పక్క కాంపౌండ్ జనాలు కూడా మా కాంపౌండ్ కి రావడానికి కారణం మా ఆర్కెస్ట్రా.. మా పెద్దక్క, మా పక్కింటి అక్కా మంచి సింగర్స్.. మా ముందింట్లో ఉండే అక్క పెద్ద సింగర్ అవ్వాలని వాళ్ళింట్లో వాళ్ళు హార్మోనియం కొనిచ్చారు.. ఇంక చెప్పేదేముంది?? అందరు కలిసి ఇరగదీసేవాళ్ళు.. 


-కార్తీక్