చీకటి రహస్యాలు - 2

3/08/2011 - రాసింది karthik at Tuesday, March 08, 2011

నా చీకటి రహస్యాలు-1 చదవని వారు ఇక్కడ నొక్కి చదవండి.. (ఈ మధ్య నా బ్లాగుకు హిట్లు లేవు బాబూ అందుకే ఇలాంటి ప్రమోషన్ ట్రిక్స్)

ఇహ పోతే ఈసారి విషయాలు:

నేను చదివింది ఇంగ్లీష్ మీడియం.. చిన్నప్పటి నుంచీ టీచర్లు రెక్కలు ముక్కలు చేసుకుని చదువు చెప్పారు.. నేను మాత్రం పుస్తకాలను ముక్కలు ముక్కలు చేసి చదివాను.. కాబట్టి ముక్కలు ముక్కలుగా వచ్చింది తప్ప శుద్దంగా రాలేదు.. అసలు నన్ను స్కూల్ లో చేర్పించక ముందే మా అత్త(నా మొదటి టీచర్) నాకు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పిందట.. కానీ నేను మాత్రం అలాంటి చేదుగుళికలను ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును తాజాగా ఉంచుకునేవాడిని.. ఒకటో రకం అక్షరాలు ఎలాగో గుర్తుండిపోయాయి కానీ రెండో రకం మాత్రం మా చెడ్డ కష్టం అయిపోయాయి..అందువల్ల నాకు చానాళ్ళపాటూ అంటే ఆరు-ఏడు తరగతుల వరకూ "b" కి "d" తేడా తెలియదు.. ఒకసారి మా మేడం ఒకామె  బోర్డ్ మీద "బి","డి" రాయమని చెప్పింది నేను ఏ మాత్రం భయపడకుండా "B " "D " రాసి వచ్చా.. దురదృష్ట వశాత్తు ఆమె చేతిలో ఆ రోజు ఒక కర్ర ఉండటం సంభవించింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ సెపరేటుగా చెప్పాలా??

ఇక చిన్నప్పటి నుండీ నాకు పరీక్షలంటే విపరీతమైన విరక్తి.. ఎందుకో నాకిప్పటి వరకూ తెలియదు.. అందువల్ల ఎప్పుడు పరీక్ష ఉన్నా విరక్తి వల్ల కలిగిన బాధతో సగం పేపర్ ప్రశ్నలు మాత్రమే రాయగలిగేవాడిని సారీ రాసేవాడిని.. కానీ మా టీచర్లు కొంచెమన్నా జాలీ దయ అనేది లేకుండా నేను రాసిన సగం లో సగం మార్కులు కోసేవాళ్ళు.. అందువల్ల నాకు పెద్ద పెద్ద మార్కులు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ.. లెక్కలు, తెలుగు తప్పిస్తే ఇంక దేంట్లో మనకు మార్కులు వచ్చేవి కాదు.. అందరూ potential energy/kinetic energy అని స్కూల్ లో చదువుతారు నేను మాత్రం అవి ఇంటర్ కొచ్చాక నేర్చుకున్నా.. దేని కైనా టైం రావాలి అనే ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అప్పుడే అర్థం చేసుకున్నా!! (తర్వాత తర్వాత గొప్ప గొప్ప టీచర్ల పుణ్యమా అని కొంత చదువు అబ్బింది లేండి, అది వేరే విషయం)

మరొక రహస్యం ఏమిటంటే, కాన్పూర్ కి వెళ్ళే ముందు వరకూ నేనెప్పుడూ నార్త్ ఇండియన్ భోజనం తినలేదు.. ఈ నాన్, రోటీ లాంటివి దూరదర్శన్ వారి కార్యక్రమాలలో చూడటం తప్ప నిజంగా ఎప్పుడూ చూడలేదు.. ఇలాంటి నేను హాస్టల్ లో చేరిన కొత్తలోఎవడో పార్టీ ఇస్తుంటే ఫ్రీగా మెక్కడానికి (మరే! మన ఖాతా అప్పటి నుండే రన్ అవుతోంది) మా కాంపస్ కు దగ్గరగా ఉన్న లక్కీ  రెస్టారెంట్ అనే చోటికి వెళ్ళాను.. మనకు ఆ పదార్థాల పేర్లు కూడా మార్తాండ కథలోని పాత్రల్లా అనిపిస్తున్నాయి..అందుకని ఏం పలక్కుండా ఏం ఆర్డర్ ఇస్తే అది వెజిటేరియన్నా కాదా అని ఆ బుక్కులో చూస్తున్నా.. కాసేపటికి మనకు క్లారిటీ వచ్చింది..అక్కడ ఎవడో ఏదో ఒక తింగరి సూప్ ఆర్డర్ ఇచ్చాడు.. దానిలోకి టొమాటో సాస్ ఏసుకుని తాగాలి/తినాలి.. .. హమ్మయ్య అనుకున్నాను.. వెంటనే ధారాళంగా " రేయ్ ఆ  సాస్  ఇలా ఇవ్వు ఈ సూప్ వేసుకుని తాగాలి నేను" అని అరిచాను.. ఒక్క నిమిషం పొరపాటున అన్నాను అనుకున్నారు.. కానీ వాడు పలకలేదని నేను మళ్ళీ అరిచాను..ఒక రెండు నిమిషాల పాటూ నా చుట్టూ కూర్చున్న 7-8మంది మౌనం పాటించారు.. ఆ తర్వాత ఒకడు మెల్లగా వచ్చి అడిగాడు ఏ ఊరు మనది అని, నేను మీసం మెలి తిప్పి చెప్పా కడప అని (బ్యాక్ గ్రౌండ్లో  "ఇంద్ర" మ్యూజిక్ వచ్చింది)..
వాడన్నాడు  "ఒరే బాబూ ఇంకెప్పుడూ నువ్వు నీ విజ్ఞాన ప్రదర్శన చెయ్యనని ఈటీవి సుమన్ మీద ఒట్టేయమని" బ్రతిమాలాడు.. పెద్ద ముండావాడు బ్రతిమాలాడు కదా అని ఓకే అనేశా.. అందుకే ఇప్పటికీ బయట తినాలంటే ఫుల్ మీల్స్ ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే వెళతాను.. వాటినే ఇక్కడ ఆంధ్రా హోటల్స్ అని అందరూ అంటుంటారు :)

కార్తీక్