యుహ్హ్హ్హా హహ్హ్హా! "టమేటా పులుసు"

11/21/2010 - రాసింది karthik at Sunday, November 21, 2010
హహ్హ్హాహ్హా.. అవును నేనే! 
వికట్టాట్టహాసం చేస్తున్నాను.. ప్రస్తుతం బ్లాగర్లకందరికీ పట్టిన ఈ వంట ఫీవర్ నన్ను కూడా తాకింది.. మధ్యాహ్నం పల్లకిగారి టపా చూసినప్పటి నుంచీ గుండె రగిలిపోతోంది.. ఏ బ్లాగు చూసినా కుటుంబరావులు, సక్కూబాయిలు వంటల మీద వంటలతో బుర్ర తోడేస్తున్నారు.. పైగా కుక్కర్లతో చపాతీలు, పెనం లో పూరీలు అంటూ బ్రహ్మచారుల మీద జోకులు.. ఇవన్నీ చూస్తూ సైలెంటుగా ఉంటే అఖిలభారత బ్రహ్మచారుల సంఘం నన్ను క్షమించదు.. కనుక వీళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి నేనే స్వయంగా పూనుకున్నాను.. పూర్వాశ్రమంలో నా వంట టాలెంటు తెలియని వారు ఇక్కడ లేదా ఇక్కడ నొక్కండి..
వంట చేద్దాం అని అనుకోవడం మొదలు నా వంటరాత్మ ఆవులిస్తూ నిద్రలేచి "ఆ..క..లి" అని అరిచింది..టపాలు రాయలేక నేనేడుస్తుంటే ఎవరో వచ్చి కొత్త అగ్రిగేటర్ మొదలుపెడదాం అన్నాడట.. ఒళ్ళుమండి  విజయేంద్ర వర్మ లో బాలయ్య బాబును గుర్తును తెచ్చుకుని ఒక చిన్న సైజు క్లాస్ పీకాను..   అప్పటికి వంటరాత్మకు కర్తవ్యం గుర్తుకు వచ్చి వెంటనే ఏ వంట చేయాలి అని బాల్కనీ కూర్చొని రోడ్డు మీదపొయ్యే అమ్మాయిలను చూస్తూ ఆలోచించసాగాను.. అలా కొంతమందిని చూశాక సారీ కొంతసేపయ్యాక, ఏ వంట చేయాలి అనేది డిసైడ్ చెయ్యాల్సింది బాల్కనీలో కాదు వంట రూంలో అని గుర్తుకువచ్చి వంట రూంలోకి వెళ్ళి అసలు సామాగ్రి ఏమున్నాయొ చూశాను.. ఒక నాలగు టమేటాలు, ఆరు పచ్చిమిరపకాయలు, రెండు ఉల్లగడ్డలు ఉన్నాయి..  సారీ ఉల్లగడ్డలంటే మీకు అర్థం కాదు కదూ.. వాటినే కోస్తా తెలుగులో బంగాళ దుంపలని హైదరాబాదు తెలుగులో ఆలుగడ్డలని అంటారు.. నా ఆర్సెనల్ అంతా కింద ఫోటోలో చూడండి..

ఉల్లగడ్డలతో మనం పెద్దగా పీకేదేం లేదు.. ఇక టమేటాతోనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను..ఇంతలో నా వంటరాత్మన్ పొయినవారం బుక్ ఎగ్జిబిషన్ లో  కొన్న రెండు వంటల పుస్తకాలను గుర్తు చేసింది.. వెంటనే ఆ పుస్తకాలు తీశా, వాటిలో చాలానే వంటలు గట్రా ఇచ్చారు.. కానీ టమేటాతో పెద్దగా ఏమీ ఇవ్వలేదు..  అసలే సింపుల్ వంటలు చేసి ఫోటోలు గట్రా బ్లాగుకు ఎక్కించడం నాకసలు ఇష్టం లేదు... శోధించగా శోధించగా "టమేటా పులుసు" కనిపించింది.. ఈ రోజుల్లో సినిమాకు కథకంటే కథనం ముఖ్యం.. ఏ రోజైనా వంటకు టేస్టే ముఖ్యం ..  సరే ఇక మొదలు పెడదాం అనుకొంటుండగా నాలోని పరోపకారి పాపన్న నిద్ర లేచాడు.. ఇలా చేసిన వంటకం ఒక్కడినే తినడం చాలా తప్పు ఇంకొక బక్రా సారీ మనిషి కావాలి అనుకున్నాను.. వెంటనే మారథహళ్ళి లో రకరకాల పనులు చేస్తున్న మన రాజ్‌కుమార్ కు ఫోన్ చేశాను.. ఆ సంభాషణ ఇలా జరిగింది..
నేను: హల్లో రాజ్‌కుమార్, ఎక్కడున్నావ్? బిజీగా ఉన్నావా?
రా: లేదు ఫ్రీగానే  ఇంట్లో ఉన్నాను కార్తీక్ గారూ (ఆ ప్రాంతం వాడు కదా అందుకని "గారు" "గారు" అని సోప్ వేస్తాడు, కానీ నేను పడనుగా)
నే: సరే ఐతే, బ్లాగుల్లో అందరూ వంటలు చేస్తున్నారు కదా నువ్వు కూడా మా ఇంటికి వచ్చేయ్, ఇక్కడే ఇద్దరం కలిసి రచ్చ రచ్చ చేసేద్దాం..
రా: సారీ కార్తీక్ గారూ, మేము ఆల్రెడీ ఇక్కడ మొదలు పెట్టేశాం, మీరు కనీసం ఇంకొక గంట ముందు ఫోన్ చెయ్యాల్సింది..
(స్వగతం: బ్రతికుంటే ఏ బెంగాలీ వంటలైనా తింటా కానీ నేను మాత్రం రాను)
నే: అవునా సరే అలాగే మాంచి చాన్స్ మిస్ అయిపోతున్నావ్ ఆలోచించుకో..
రా: మరోసారి కలుద్దాం..
(స్వగతం: దమ్మ పెబువులు, అంత వీజీగా ఒగ్గేశారు)..

సరే ఇంక రాజ్ కూడా రాలేదని నేనే బుక్ చదవడం మొదలు పెట్టాను.. మొదటి వాక్యమే చాలా కఠినంగా "టమేటాలు ఒకమాదిరి తరిగిపెట్టుకోవాలి" అని ఉంది.. "ఒక మాదిరి" అంటే ఏ మాదిరి కామ్రెడ్ అని గట్టిగా అరిచాను, కానీ మా ఇంటి పక్కనున్న లేడీస్ హాస్టెల్ లో కమ్యూనిష్టులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరూ పలక్లేదు..  సరే బుర్రకు పదును పెట్టి ఏ మాదిరో తెలియనప్పుడు ఒకమాదిరే తరిగి అది తప్పు కావడం కంటే రెండు మాదిరిలుగా తరుగుదాం అని ఒకటి నిలువుగా ఇంకొకటి అడ్డంగా తరిగాను.. ఫోటో చూపించాను కదా..

తర్వాత లైన్ లో చింతపండు పులుసు ఉడికించాలి అని ఉంది..  ఈ చింతపండు పులుసు అంటే, అదింకొక సబ్ వంటకమా అని డౌట్ వచ్చింది.. మరే, డెడ్‌లైన్ , ఇంటర్నల్ డెడ్‌లైన్ ఉంటాయి కదా అలాంటిదేమో అని అనుమానం.. గూగుల్ లో వెతికితే అదేం కాదని, సింపుల్ గా చింతపండులో నీళ్ళు పోసి కడిగి పిచ్చలు తీసేసి దాన్నే పులుసు అంటారు అని తెలిసింది.. ( అబ్బ! ఈ రోజు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో).. అలా ఒకవైపు చింతపండు ఉడికించి మరో వైపు తమేటా వేయించి సవ్యసాచిలా వంట చేసి బాల్కనీ లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నాను..  ఇంతలో మా నార్త్ ఇండియన్ మితౄడొకడు వంట రూములోకి పొయ్యి, "అబే, టమేటా ఫ్రై సహి బనాయ తూనే, పర్ బహుత్ దైల్యూట్ హోగయా" అన్నాడు..  నాకు చిన్నప్పటి నుంచీ విన్న బూతులన్నీ ఒకేసారి వచ్చాయి.. కానీ వాడికి తెలుగు అర్థం కాదని క్షమించేశా..  ఇదుగోండి ఫైనల్ వంటకం కొత్తిమీర తో డెకరేషన్ చేశాక ఇలా తయారయ్యింది..


మాదగ్గరే మైసూర్ కెమెరాలు లేవు కదా అందుకని ఏదో ఫోన్ కెమెరాతో పని జరిపించేశాను..   మరొక మాట వచ్చేవారం మా ఇంటికి వస్తానని మాటిచ్చిన సోదర బ్రహ్మి రాజ్‌కుమార్ కు ఈ టపా అంకితం.. ఈ రోజు చేసిన పులుసు వచ్చేవారం వరకూ ఉంచి మరీ తినిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను..

-కార్తీక్