పసందైన రాజకీయం..

12/18/2009 - రాసింది karthik at Friday, December 18, 2009
ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మంచి రసకందాయం లో పడింది.. ఒక పక్క కే.సీ.ఆర్. లాంటి జిన్నాలు రాష్ట్రాన్ని విడదీయటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు మరో పక్క తాంబూలాలిచ్చిన కేంద్రం మీరు తన్నుకు చావండి అంటూ చోద్యం చూస్తోంది. కానీ ఓలుమొత్తంగా చూస్తే ఎక్కువ నష్టం కలిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకే.. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే(అశుభం ప్రతిహతమౌగాక) ఆ క్రెడిట్ తె.రా.స. కొట్టేస్తుంది. మరో పక్క మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్రాన్ని విడదీశారనే అపప్రధను మూట కట్టుకుని దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు రోశయ్య ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళబుచ్చినా ఉపయోగం లేదు... ప్రజల మధ్య ఏర్పడ్డ మానసిక దూరం తగ్గే సూచనలు ఇప్పుడిప్పుడే కనపడటం లేదు.. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమీ చెయ్యకుండా తాత్సారం చూపిస్తోంది అందుకే!! ఎటువంటి పరిస్థితిలో అయినా తన 'వర్గ బలంతో' చక్రం అడ్డువేయగల వై.యస్. ఇప్పుడు లేడు.. జగన్ వర్గాన్ని వరండా బ్యాచిగా తయారుచేసి ఒక బలమైన వర్గాన్ని అధిష్ఠానం దూరం చేసుకుంది..
మరో పక్క తెలుగుదేశం పరిస్థితి ఇంకా కామెడీగా ఉంది!! ప్రజల ఆగ్రహాలతో మైండ్ బ్లాక్ అయ్యిన బాబు నేడో రేపో "నా అంబారీ ఏనుగుని రిక్షాలో తీసుకురండి నేను డాల్ఫిన్ హోటల్లో కాఫీ తాగి కురుక్షేత్ర యుద్దానికి పోవాలి" అనే స్టేజిలో ఉన్నాడు.. తెలంగాణ మీద ఒక కమిటీని వేసి దానిలో అభిప్రాయ భేదాలు వచ్చి దేవెందర్ గౌడ్ లాంటి నేత పార్టీని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ అంశం లోని సంక్లిష్టతను అర్థం చేసుకోకుండా తన "ఏ ఎండకా గొడుగు" పాలసీ ఫాలో అయ్యి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.. బాబు విస్వనీయత అసలే అంతంతమాత్రం..ఈ దెబ్బతో బాబుకు శంకర గిరి మాన్యాలు తప్పదనిపిస్తోంది..
ఇక మిగిలింది చిరంజీవి, తన మెగస్టార్ స్టేటస్ ను పణంగా పెట్టి మరీ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి.. ఎలాగోల అధికార పీఠానికి కూతవేటు దూరం లో అయినా ఉండాలని చాలా తాపత్రయం... ఈ కక్కూర్తితోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించాడు. అదికాస్తా మీడియాలో "జెండా పీకేద్దాం" అని వచ్చేసరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడటంతో ఏడుస్తూ అదే పత్రికలకు ఎక్కాడు.. సామాజిక తెలంగాణ అని కబుర్లు చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నాడు.. ఇది ఆలోచించాల్సిన విషయం!! నేను దీని గురించి ఆలోచించగా చించగా కొంత చినిగాక బల్బు వెలిగింది. రాష్ట్రం ఈ రోజు కాకపొయినా ఒక 4-5 ఏళ్ళల్లో అయినా విడిపోక తప్పదు.. అప్పుడు కోస్తాలో కాంగ్రెస్ దూకాణం మూసేసే పరిస్థితిలో ఉంటుంది.. పైగా అది తనకు కొద్దో గొప్పో పట్టున్న ప్రాంతం కనుక అందరికంటే ముందుగా సమైఖ్యాంధ్రకు జై అంటే తెలుగుదేశం కు చెక్ పెట్టచ్చు అనేది ఒక లెక్క!!
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే జగన్ అకస్మాత్తుగా జై సమైఖ్యాంధ్ర అని ఎందుకన్నాడు?? దీన్ని అడ్డం పెట్టుకుని మేడం కు కడప స్టైల్లో రిప్లై ఇస్తున్నాడా?? (మాదీ కడపే, మేము కొట్టడం అంటు జరిగితే ఇక దెబ్బ తిన్న వాడు మళ్ళీ లేయడు.ఎంతైనా ఉడుకు రక్తం కదా :) :) ) ఇప్పుడు కాంగ్రెస్ నుంచీ జగన్,లగడపాటి అధికార కేంద్రాలుగా తాయారౌతే రాజకీయం బాగుంటుంది.. ఎందుకంటే ఇప్పటిదాకా లగడపాటి వై.యస్. వర్గానికి చెందిన వాడు. ఇక నుంచీ కూడా అలానే ఉంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం..ఎందుకంటే ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు..
ఈ మొత్తం గొడవల్ల ఒక విషయం మాత్రం విస్పష్టంగా తెలిసొచ్చింది.. అదే మన దేశం లో ప్రజలకు, రాజకీయ పార్టిలకు ఉన్న దూరం.. ఒక కమిటీ వేసి కూడా బాబు సమైఖ్యాంధ్ర గురించి తెలుసుకోలేక పోయాడంటే అంతకంటే కామెడీ లేనే లేదు.. ప్రస్తుత పరిస్థితిలో చూశ్తే చిరంజీవికి అందరికంటే ఎక్కువ లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి..