ఎర్ర బస్సు స్వగతం

12/13/2009 - రాసింది karthik at Sunday, December 13, 2009
నా అసలు పేరేమిటొ నేను మరిచిపోయి చాలా కాలమైంది. అందరూ నన్ను, నా జాతి వారినీ ఎర్రబస్సులనే పిలుస్తారు. మొదట మా జాతిలో 27 మంది మాత్రమే ఉండే వాళ్ళు తర్వాత భారత స్వాత్యంత్రం వచ్చాక మాజాతివారు దిన దిన ప్రవర్ధమానంగా పెరిగి ప్రస్తుతం 21 వేలమంది 7 రాష్ట్రాలలో తిరుగుతూ ఉన్నారు.. రోజు దాదాపుగా ఒకటిన్నరకోటిమంది మా జాతివారితో కలిసి తిరుగుతూ ఉంటారు. అందుకేనంట.. గిన్నేసో, గంగాళేసో రికార్డ్ మా పేరు మీదే రాశారంట.. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సు జాతులలో మేము తిప్పేంతమందిని ఎవరూ తిప్పరట.. 1990ల వరకూ ఒకవెలుగు వెలిగాము.. ఒకానొక కాలంలో మా సంరక్షకులుగా పని చెయ్యటం అనేది ఒక సామాజిక హోదాలా ఉండేది.. ఆంధ్ర జ్యోతి అనే పుస్తకంలో మా సంరక్షకుల మీద చాలానే చణుకులు పేలేవి.. కానీ అదంతా గతం...
ఆ తర్వాత కొంత మా సంరక్షకుల నిర్లక్ష్యం వల్ల, ఇంకొంత రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, మరికొంత సాంకేతిక విప్లవాల వల్లా ప్రస్తుతం మాజాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. గత దశాబ్దకాలంగా మా సంరక్షకులకు తెలివొచ్చి మమ్మల్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. కానీ కొందరు పాలకులు ప్రపంచ బ్యాంకో లేక విశ్వవ్యాప్త బ్యాంకో ఇచ్చే రుణాల మీద ఆశతో మమ్మల్ని అమ్మేస్తామని మాటిచ్చారాట.. ఇవన్నీ కాక పాలకుల చిన్న చూపు వల్ల సమాజంలో పంచింగ్ బ్యాగ్స్ లాగా తయారయ్యాము. ఎవరికి ఎవరిమీద కోపం వచ్చినా నష్టం మాత్రం మాజాతికే..

ఒక నాయకుడు మరణించినా.. అన్నలకు ఖాకీలమీద కోపం వచ్చినా..స్టుడెంట్లకు క్లాసులు ఎగరగొట్టాలనిపించినా.. ఇలా చెప్పుకుంటుపోతే రాష్ట్రంలో ఎక్కడ చిన్న అలజడి జరిగినా మరణించేది మాత్రం మేమే. పరిస్థితి ఇలానే సాగితే ఐక్య రాజ్య సమితి వాళ్ళు ప్రకటించే "అంతరించిపోయే జాతుల" అనే జాబితాలో మమ్మల్ని కూడా చేర్చాలేమో!! మా తాతలు తండ్రుల కాలంలో ఎంతో హుందాగా గర్వంగా బ్రతికిన మేము ఇప్పుడు రోడ్ల మీద దిక్కులేని చావు చావాల్సి వస్తోంది.. ఇంతా చేస్తే సగటు మనిషికి మా అవసరం చాలా ఎక్కువ. మాకు ప్రత్యామ్నాయం కానీ లేక మరొకటి కానీ కల్పించే పరిస్థితిలో ఇప్పటి ప్రభుత్వాలు లేవు..భారత రైల్వేతో సమానంగా భారం మోయగల సత్తా మాకుంది.. (ఆధారం: వీకీపీడియా) ఇక ఇప్పటికీ చాలా గ్రామాలకు మేము తప్పే వేరే రవాణా సాధనాం లేనే లేదు.. ఐనా ఈ పంచింగ్ బ్యాగ్ సంస్కృతి తెలుగు జాతి నరనరాల్లోకి ఎక్కింది. దానిని నిలువరించడానికి ప్రభుత్వ సాయం చాలా అవసరం కానీ ప్రభుత్వం ఎవరి మీద కేసుపెడితే ఎక్కడ ఓట్లు పోతాయో అని మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.. మా పరిస్థితిలాగే మా సంరక్షకుల వెతలు కూడా చాలానే పెరిగాయి.. బోనస్సులు తీసుకునే రోజుల నుంచీ ఓవర్ టైములు చేసుకునే స్థితికి వచ్చారు. పెన్షన్లు గట్ర ఎలాగూ ఉండవు కనుక పని చేసే రోజులలోనే నాలగు రాళ్ళు వెనక వేసుకోవాలి అని తాపత్రయపడుతూ రకరకాల స్కీములతో సంపాదన కోసం వెంపర్లాడుతూ ప్రజాసేవ అనేది క్రమంగా గాలికి వదిలేస్తున్నారు..మర్యాద వారోత్సవాలు, అమర్యాద సంవత్సరీకాలు చేసుకుంటున్నారు తప్పించి ప్రజలకు ఎలా దగ్గర కావాలి అనేదాని మీద శ్రద్ధ కనిపించదు. సమ్మెలు చేయటంలో ఉన్న నిజాయితీ ప్రజల మీద అభిమానంగా మార్చితే అదే చరిత్రలో అతి పెద్ద మార్కెటింగ్ స్కీము.. 2001 లో మా వాళ్ళు చేసిన సమ్మె గురించి తప్పకుండ చెప్పుకోవాల్సిందే.. ఎందుకంటే అది కార్మిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.. ఆ సమ్మె 24 రోజులు జరిగింది చాలా మంది కార్మికులకు 325 రూపాయలు నెల జీతంగా వచ్చింది. అయినా అన్నీ ఓర్చుకున్నారు... కడకు విజయం సాధించారు.. ప్రస్తుతం కూడా నష్టాలలో కార్మికులు పస్తులతో మేమూ బ్రతుకుతున్నాం..ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే మాకు ఈ ఆకలి చావులు తప్పవు కానీ ప్రభుత్వం ఇవ్వదు కదా!!
మరెన్ని రోజులు ఇలా అందరితో మాట్లాడుతూ చలాకీగా తిరుగుతుంటామో తెలీదు..ఒకవేళ మేము అంతరించిపోవటం అంటు జరిగితే మీ పిల్లలకు మా గురించీ కథలుగా చెబుతారు కదూ!!

రైట్ రైట్ !


-కార్తీక్

మా నాన్న గారు గత 35 సంవత్సరములుగా RTCలో పని చేస్తున్నారు..కాబట్టి నాకు సగటు RTC ఉద్యోగి జీవితం ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు..అందుకే నేను మాత్రం ఆంధ్రాలో ఎక్కడికిపోవాలన్నా RTC బస్సులోనే పోతాను..

"THE WHEEL STANDS FOR COMMON ZEAL"