3 ఇడియట్స్!!!

12/26/2009 - రాసింది karthik at Saturday, December 26, 2009
ఈ రోజు మధ్యాహ్నం షోకి ఇనొవేటివ్ మల్టీప్లెక్స్ అనే ఒకానొక చెత్త థియేటర్ లో ఈ సినిమాకు వెళ్ళాను.. ఈ సినిమా చేతన్ భగత్ నవల మీద తీశారు అంటే చూడకూడదనుకున్నాను, ఎందుకంటే అతి చెత్త రచయితలు అనే పోటీ జరిగితే నేను దానికి చేతన్ భగత్ పేరుని నామినేట్ చేస్తా!! ఆ జీవి రాసిన 5 పాయింట్ సంవన్,3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చదివాను.. ఆ తరువాత ఇంకెప్పుడు అతని రచనలు చదవకూడదని ఫిక్స్ అయిపోయాను..

రచయిత చెత్త అయినా ఆమిర్ ఖాన్ సినిమా, అందులో మున్నాభాయ్ తీసిన డైరెక్టర్, కాబట్టి పర్లేదులే అని వెళ్ళాను...90% సినిమా మాధవన్ నెరేట్ చేస్తాడు.. మాధవన్, ఆమిర్ ఖాన్ తో పాటు శర్మాన్ జోషి కూడా ఉన్నాడు.. నాకు రంగ్ దే బసంతి తరువాత శర్మాన్ జోషీ బాగా నచ్చాడు.. హీరోయిన్ గా కరీనా కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో బొమన్ ఇరానీ ఉన్నారు.. చేతన్ భగత్ నవల నుంచీ పక్కా దింపుడు కాదు కనుక నవల చదివినా కూడా కొత్తగానే అనిపించింది.. 90% సినిమా ఒక ముగ్గురు స్టూడెంట్ల నాలుగేళ్ళ కాలేజీ జీవితమే.. ఇంకా చెప్పాలంటే హాస్టల్ జీవితం.. నవల లో చేతన్ భగత్ IITల మీద ప్రజలకున్న క్రేజును విమర్శించాడు.. సినిమాలో ఆమిర్ ఖాన్ మన మార్కుల వ్యవస్థను విమర్శించాడు.. దర్షిల్ సఫారీ ఆత్మ హత్య చేసుకున్నప్పుడు జరిగే సంభాషణ నాకు బాగా నచ్చింది. "డాక్టర్లు గొంతు మీద ఒత్తిడి వల్ల చనిపోయాడు అన్నారు, కానీ మెదడు మీద పడ్డ ఒత్తిడి గురించి ఏమీ చెప్పలేదు" అంటాడు...how true!! నా రెండేళ్ళ హాస్టల్ జీవితం లో ప్రతీ 2-3 నెలలకు ఒక ఆత్మహత్య చూశాను..(at one point of time i attended a workshop on "how to prevent suicides and find signs of depression in people around us") కనుక ఆ వాక్యం నా మనసుకు బాగా హత్తుకుంది.. మున్నాభాయ్ తరహాలోనే దీనిలో కూడా కామెడికి సెపరేట్ ట్రాక్ అంటూ ఏమీ లేదు కానీ మంచి పంచ్ డయలాగులు ఇంకొంత సిచ్యుయేషనల్ కామెడీ బాగుంది.. ఇంటర్వెల్ బ్రేక్లో వచ్చే ట్విస్ట్ నవల నుంచీ సినిమాను దూరంగా నిలబెడుతుంది.. ఇక సెకండ్ హాఫ్ లో నవల నుంచీ తీసుకున్న కొన్ని సీన్లు ఉన్నాయి కానీ నవలలో లాగా చెత్త రొమాంటిక్ సన్నివేశాలు లేవు.. ఎవరైనా కరీనా కపూర్ హాట్ హాట్ సీన్ల కోసం సీనిమా చూడలనుకుంటే వారికి తీవ్ర నిరాశ తప్పదు.. క్లైమాక్స్ లో ఒక 15-20 నిమిషాలు నాకు సుత్తి కొట్టింది. క్లైమాక్స్ టెన్షన్ క్రియేట్ చేసేదానికి కథాపరంగా వేరే సన్నివేశం చేసుంటే బాగుండేదేమో!! బిల్డింగ్ నుంచీ దూకడం, కొశన్ పేపర్లు కొట్టేయడం నవల నుంచీ తీసుకున్నారు..

ఇక పాత్రల చిత్రీకరణల విషయానికి వస్తే హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా ఒవర్ చేస్తున్నారు అని అనిపించలేదు.. నవల లో ఉన్న తమిళియన్ పాత్రను చతుర్ రామలింగం గా బాగా అడ్జస్ట్ చేశారు.. అది కూడా కథలో ఇమిడిపోయింది.. చాంధసవాద ప్రిన్సిపల్ గా బొమన్ ఇరానీ పాత్ర సినిమాకే హైలైట్!! అలాంటి వాళ్ళను నా జీవితం లో కూడా చాలామందినే చూశాను.. (అవన్నీ "నా ఇంజినీరింగ్ రోజులు" సీరీస్ లో త్వరలో రాద్దామనుకుంటున్నాను). ఇక కరీన హీరోయిన్ గా కంటే ఒక సపోర్టింగ్ పాత్ర అంటే బాగుంటుందేమో, కానీ హీరో హీరోయిన్ రిలేషన్ బాగా చూపించాడు.. ముగ్గురు ఇడియట్స్ మధ్య జరిగే కొన్ని సంభాషణలు చాలా నచ్చాయి.. All is well ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది(ఎందుకంటే అది నా ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉంటుంది కనుక :)) All is well అంటే కష్టాలు మాత్రం తీరవు కానీ వాటి వల్ల వచ్చే ఒత్తిడి మాత్రం రాదు.. ఆడియో కూడా బానే ఉంది.. 2-3 పాటలు నాకు బాగా నచ్చాయి..

ఇక నటీనటుల నటన పరంగా చూస్తే అందరూ బాగా చేశారు.. నాకు బాగా నచ్చిన నాటుడు మాత్రం బొమన్ ఇరానీయే.. పాత్రలో చక్కగా ఇండిపోయాడు.. ఆదివారం మధ్యాహ్నం నా కొడుకు చనిపోతే సోమవారం పొద్దున నేను కాలేజీకి వచ్చాను అని చెప్పే సీన్లో మాంఛి గర్వం చూపాడు.. సెంటిమెంటల్ సీన్లలో ఇడియట్స్ ముగ్గురు బాగాచేశారు. ఇక్కడ ఆ ముగ్గురి ప్రతిభ గురించీ ఎవరికీ అనుమానాలు లేవు, వాళ్ళు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా చేశారు..

అన్నీ బాగా కుదిరినా సినిమా హిట్ అయ్యేది మాత్రం డయలాగుల వల్లే, అందులో నాకెటువంటి డౌటు లేదు.. కొన్ని అంతర్జాలం లో మెయిళ్ళ నుంచీ తీసుకున్నా చాలా మటుకు కొత్త జోక్సే ఉన్నాయి.. మొత్తానికి ఆమిర్ ఖాతాలో మరో హీట్ అనుకోవచ్చు..

-కార్తీక్