రిసెషన్ ప్రేమలు!!

7/20/2009 - రాసింది karthik at Monday, July 20, 2009
రిసెషన్ లో ప్రేమ ఏమిటి అనుకుంటున్నారా?? ఈ ప్రపంచమంతా ప్రేమ మయం, ప్రేమ లేని జీవితం వ్యర్థం వగైరా వగైరా ఐదు పైసల సలహాలు నేను చెప్పను. ఎందుకంటే నేను డైరెక్టర్ తేజను కాదు కాబట్టి. "జై" అనే సినిమా తీయలేదు కాబట్టి. మరొక విషయం మీరు ఈ టపా రిసెషన్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఐపోతుంది? లాంటివి ఉంటాయనుకుంటే మీరు మా వంట వాడు చేసే దాల్ ఫ్రై లొ కాలేసినట్టే!!!

**************************************************************************************
ఎలాగూ మా వంట వాడి ప్రసక్తి వచ్చింది కాబట్టి వాడి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్.
దాల్ ఫ్రై ఎలా చెయ్యాలి?
చాలా సింపుల్. పెసర పప్పు నీళ్ళు లేకుండా ఫ్రై చేసి కుక్కర్లో వేసి ఉడికించడమే!!
ఈ క్రియేషన్ యొక్క అన్ని హక్కులు బికాష్ దాస్ అను మా ఒరిస్సా వంట వాడికే ఉన్నాయి.
**************************************************************************************
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, రిసెషన్ దెబ్బకు ప్రేమ పాటలు ఎలా మారిపోయాయి అనేది ఈ టపా యొక్క థీం!!
here we go:

ఏ కంపెనీ ఐనా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

అనుకున్నామని ఇవ్వరు హైకు, అనుకోలేదని ఆగదు ఫైరు!!
రాసేదంతా కోడు అని, వచ్చిందంతా మనది అని.
అనుకోవడమే సాఫ్ట్ పనీ..
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

బుల్లి మౌసు వలె వాడుకున్నాను, కీ బొర్డు వలే కాపాడినాను,
గుండెను సీడిగా చేసాను,
గుండెను సీడిగా చేసాను, నువ్వు బగ్గులున్నవని వెళ్ళావు..
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

కోడింగ్ తెలిసిన నా మనసునకు టెస్టింగ్ మాత్రం తెలియనిదా!!
కోడు రాసినదే నిజమైతే , బగ్గించుటయే రుజువు కదా!!
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా,
నీ కోడే కమ్మగ తిరగనీ.. నా మెయిలే నీలో ఆడనీ..
కలకాలం అప్రైసల్ రావాలని, మెయిలిస్తున్నా నా దేవికి.. మెయిలిస్తున్నా నా దేవికి..

ఏ కంపెనీ ఐనా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా, నీ జీతమే నే కోరుకున్నా,

అయ్య బాబోయ్!! ఈ పాట సీరియస్ గా వింటే మనసులో ఏదొ తెలియని బాధ. నాకు తెలికుండానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. ఆత్రేయ గారికి, అక్కినేని గారికి వందనం!! పాదాభి వందనం!! మీరు తెలుగు వాళ్ళవ్వడం తెలుగు జాతి చెసుకున్న పుణ్యం.
పాట వీడియో ఇక్కడ చూడగలరు.
గమనిక: నేను మొన్న రాసిన టపా లో ఆడ వాళ్ళ మీద జోకులేశానని చాలా మంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళకు సారీ చెప్పడం లేదు. ఎందుకంటే నా బ్లాగుకు నేనే "సుమన్" "ప్రభాకర్" "యస్.వీ.కృష్ణా రెడ్డి" వగైరా వగైరా. ఐనా భర్త భార్యను కొట్టాడు అంటే అది సెంటిమెంటు, ట్రాజేడి, అదే భార్య చీపురు తిరగేసి మొగుడికి నాలగు తగిలించింది అంటే అది కామెడి.


ఇంకొక గమనిక: మా రూమ్మేటు వాళ్ళ అన్నా వాళ్ళ తో కలిసి ఉండాలని వెళ్ళి పోతున్నాడు, కనుక నాకు కంప్యుటర్ దొరకదు. ఒక 2-3 నెలలు (నేను ఒక డబ్బా కొనే వరకు) ఈ బ్లాగులో కొత్త టపాలు ఉండక పోవచ్చు. ఇప్పటి దాకా నా పాటలూ, కోతలూ భరించిన అందరికి శతకోటి వందనాలు.

-కార్తీక్