ఎలక్షన్ విందు!!

4/25/2009 - రాసింది karthik at Saturday, April 25, 2009
అయ్యలారా, అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అమ్మాయిలారా, త్వర పడండి. మీ కోసమే వేడి వేడి ఎలక్షన్ విందు తయారుగా ఉంది. మంచి తరుణం మించి పోతుంది. ఆలసించిన ఆశా భంగం!!!

స్థలం: రాష్ట్రం లో ఎక్కడైనా కావచ్చు.
పాత్రధారులు: తినబోతూ రుచులెందుకు? చదివితే తెలుస్తుంది.

అదొక డైనింగ్ టేబుల్, అక్కడ కూర్చున్న వాళ్ళల్లో మొదటి వ్యక్తి దేవుడు మార్కు అభ్యర్థి వై.యస్.ఆర్. భొజనం మొదలుపెడుతూ ఇలా అన్నాడు.
ఓ ఓటరూ, మంచి ఓటరు..
నువ్వు మాకు తినడానికి పవర్ ప్లాంట్లిచ్చావ్, రింగ్ రోడ్ షేప్ ఇచ్చావ్, ఇడుపులపాయ కూడా ఇచ్చావ్, ఇలాగే మన రాష్ట్రం లో ఉన్న 294 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, అలాగే 42 మంది ఎంపీ లకి అదే చేత్తో దేశం లో ఉన్న.. నంబర్ ఎంతో కరెక్ట్ గా తెలీదు ఎంతమంది ఉంటే అంతమంది కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇవే ఇస్తావని..ఇవే అంటే ఇవేకాదు.. వాళ్ళకు ఏమి కావాలంటే అవి. థర్మల్ పవర్ ప్లాంట్లు, బొగ్గు గనులు, సెజ్ లు అలాగ. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు ఇస్తావని ఎందుకంటే బేసికల్లి యు ఆర్ ఎ ఓటర్, యు ఆర్ ఎ గుడ్ ఓటర్!! అంతే, దట్సాల్!

క్షమించాలి, నా ప్రార్థన్ మీకందరికీ కొత్తగా అనిపించచ్చు. అప్పుడు పక్కనున్న బి.వి.రాఘవులు " కొత్తగా కాదు పరమచెత్తగా అనిపించింది" అన్నాడు. ఇంతలో పక్కనున్న నారాయణ ఇది మాకేమి కొత్త కాదు సార్, ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తుంటారు. కాకపోతె నువ్వు ఓటరు మీద రాశావ్ ఆయన వాళ్ళ మామ మీద రాస్తారు అన్నాడు. ఈ మధ్యే ఒక కొత్త కవిత కూడా రాశారు అన్నాడు. అప్పుడు వై.యస్ ఆర్. " నాకు కవితలన్నా, డబ్బులున్న మామలన్నా చాలా ఇష్టం" అన్నాడు. అప్పుడు "ఆయన" అనబడే సదరు చంద్ర బాబు తన ల్యాప్టాప్ ఒపన్ చేసి " మామా.. అడక్కుండానే పార్టీ ఇచ్చావ్, అడిగితే కూతుర్నిచ్చావ్, ఎలక్షన్లు వస్తే సీట్ ఇచ్చావ్, గెలిస్తే మినిస్టర్ గిరి ఇచ్చావ్. ఆడుకోవడానికి కుప్పం నిచ్చావ్, వాడుకోవడానికి బాలయ్యనిచ్చావ్, అందుకే నువ్వు నాకు నచ్చావ్!! కానీ ఎందుకు నన్ను తిట్టావ్?? ఐనా నువ్వు నాకు నచ్చావ్" అన్నాడు.
ఇదంతా విన్న వెంటనే అప్పటి వరకూ డైనింగ్ టేబుల్ కింద ఉన్న చిరంజీవి టేబుల్ ఎక్కి "అరవింద్ బావా, అరవింద్ బావా సి.యం నైపోతా, ఈ స్టేట్ నే, అరవింద్ బావా, అరవింద్ బావా రఫాడించేస్తా " అంటూ వీణ డాన్స్ మొదలు పెట్టాడు. చిరంజీవి టెబుల్ ఎక్కడం చూసి పక్క రూములో ప్లేట్లు కడుగుతున్న మోహన్ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి " అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నా ఇద్దరు కొడుకులను కలిపి సినిమా తీస్తా " అని వార్నింగ్ ఇచ్చాడు.

ఇదంతా చూసి అప్పటి వరకూ మౌనంగా ఉన్న ఒకే ఒక సెన్సిబుల్ శాల్తీ బయటకు నడిచాడు. ఆ శాల్తీ పేరు "జయ ప్రకాష్ నారాయణ్"


ఈసారి మన రాష్ట్రం లో జరిగిన ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో అందరికీ తెలుసు. ప్రతిష్టాత్మకం అని ఎందుకు అన్నానంటే ఒక వైపు ఐ.పి.యల్. జరుగుతున్నా నా మిత్రులు చాలా మంది మా ఊర్లో ఈ పార్టీ గెలవచ్చు, మా ఎం.పి సీటూ వీడికి ఇవ్వకూడదు అని నా బుర్ర తిన్నారు. మన తెలుగు బ్లాగులలో కూడా సదరు పార్టీల మద్దతు దారులు శక్తి వంచన లేకుండా ఆయా పార్టీలను సమర్ధించారు. ఆ ఎలక్షను వేడి నన్ను కూడా సోకి ఇది రాశాను.

-కార్తీక్