నా మొదటి ట్రెక్కింగ్ అనుభవం

4/11/2009 - రాసింది karthik at Saturday, April 11, 2009
నిన్న రాత్రి నేను, బెంగళూరు మౌంటెనీరింగ్ క్లబ్ వారి అంతర్ గంగె నైట్ ట్రెక్ కి వెళ్ళాను. ఈ ట్రెక్ ప్రత్యేకత ఏమిటంటే అందులో నడవడం తక్కువ పాకడం, దూకడం వగైరా ఎక్కువ. నాలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తారని తెలిసే వాళ్ళు డబ్బులు కట్టే దానికంటే ముందే చేప్పారు, ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు మానుకొండి అని. నా గురించి కాదులే అనుకొని వెళ్ళాను. అక్కడ చూస్తే దాదాపుగా 60 మంది ఉన్నారు. అబ్బో ఇది చాలా పాపులర్ లాగా ఉందే అనుకున్నాను. దాదాపుగా రాత్రి 1 గం. లకు ఆ కొండ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పరుపులు గట్ర తీసుకుని కొండ ఎక్కడం మొదలు పెట్టాము. చాలా దూరం పొయ్యాము అని నేను అనుకున్నా ( ఎందుకంటే నా కాళ్ళు నొప్పి పుట్టటం మొదలైంది కాబట్టి ) ఒక గుడి ఎదురైంది. ఇంక ఇక్కడె పరుపులేసుకుని తెల్లారే వరకు పడుకోవచ్చు అనుకున్నా. కాని మా గైడ్ ఇది ఒక వార్మప్ ట్రెక్ అని అసలు సినిమా ఇంక మొదలు కాలేదని చెప్పాడు. నాకు మొదటి సారిగా దీనికి డబ్బులు కట్టి ప్రమదాన్ని 450/- కి కొనుకున్నానా అని అనిపించింది. కానీలే అన్నిటికి ఎడ్మండ్ హిల్లారీ ఉన్నాడు అనుకున్నా. ఇంకొక గంట సేపు నడిచిన తరువాత ఒక చోట పెద్ద పెద్ద బండలు కనపడ్డాయి. ఇంక ఈ బండలు ఎక్కడం ఇంపాజిబుల్ అని నా పరుపు పరుచుకున్నా, ఇంతలో మా గైడ్ కి హెల్ప్ గా వచ్చిన అబ్బాయి రెండు బండల మధ్య పిల్లి పట్టేంత దూరం చూపించి "ఆక్రమణ్" అని అరిచాడు. వెంటనే అందరూ గబ గబా అందులోకి దూరాము. (అందరూ ఒకే సారి కాదు, ఒకరి తరువాత ఒకరు). ఎడ్మండ్ హిల్లరీ నన్నింత మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కానీ మంచికి రోజులు కావు కదా అని నొరు మూసుకుని కూర్చున్నాను సారి నోరు మూసుకుని ఆ బండల మధ్య దారిలో నేను కూడ దూరాను. కొంత దూరం అలా ఒక బండకు అతుక్కుని జరిగాక ఇప్పుడు ఇంకొక గుంత చూపించి "జంప్" అని అరిచాడు ఆ హెల్ప్ అబ్బాయి. ఒకరి తరువాత ఒకరు ముందూ వెనకా ఆలోచించకుండా ఆర్. నారాయణ మూర్తి సినిమాలో సైడ్ డాన్సర్ల లాగా ముందుకు దూకారు. నేను మాత్రం నాకు డాన్సులు గట్రా రావు నేను దూకను అన్నాను. అదంతా నాకు తెలీదు దూకాల్సిందే అన్నాడు. ఎలాగో కష్టపడి దూకాను. ఇంతలో నా వెనక ఉన్న ఒక 7-8 ఏళ్ళ అబ్బాయి అంకుల్ నన్ను కొంచెం అందుకోరు అన్నాడు. నిన్ను ఈ పాతళ చెరసాలకు పంపుతున్న ఆ రాతీ హృదయం ఎవరికి ఉందీ అనుకున్నాను. నేను ఏమి చెబుతున్నానో వినకుండా వాడు నా మీదికి దూకాడు. కానీ నేను డేరింగ్ అండ్ డైనమిక్ కాబట్టి వాడిని అందుకొని కిందికి దించాను. అలా కొంత దూరం వెళ్ళాక ఇంక నడవడం కుదరదు అందరూ పాకండి అన్నాడు మా గైడ్. ఒకరొకరుగా పాకడం మొదలు పెట్టాం. నేను నా పాకుడు కార్యక్రమం ముగించి ఆ పక్కకు తొంగి చూస్తే ఒక ఫారినర్ అమ్మాయి మమ్మల్ని వీడియొలో షూట్ చేస్తొందీ. నేను అందరికంటే విసుగ్గా కనిపించానో ఏమో నన్నే అడిగింది "హౌ ఇస్ ఇట్?" అని. నేను వెంటనే పళ్ళన్నీ కనపడేటట్టూ నవ్వుతూ నా చేతులు ముందుకు వెనక్కూ ఊపుతూ "ఇట్స్ వెరీ గుడ్, ఐ లైక్ దీస్ థింగ్స్ ఎ లాట్" అన్నాను. ఇంకొంచెం ముందుకు పోయాక మా గైడ్ ఇదే ఆఖరి గుహ ఇంక మనం పైకి ఎక్కాలి అన్నాడు. హారి పాపాత్ముడ, ఈ ముక్క చెప్పుంటే నేను పైనే పడుకుని ఉండే వాడిని కదా అనుకున్నాను. అప్పటికి రాత్రి 3గం. అయ్యింది. సరే 4:30గం. లకు పైకి ఎక్కితే నేను ఒక రెండు గంటలు నిద్ర పోవచ్చు అనుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి అన్ని గోడలే ఒక్కక్కొటీ జాగ్రత్తగా దూకూతూ ముందుకు వెళ్ళాను. గట్టిగా తిట్టడానికి కూడా లేకుండా ఆ ఫారినర్ నా కంటే ముందుగా వేళ్ళి "హౌ ఇస్ ఇట్?" అని అడగడము నేను "వావ్!!" అనడము జరిగింది. దాదాపు 4గం. ప్రాంతంలో మా హెల్ప్ తను దారి మర్చిపొయినట్టు ప్రకటించాడు. నేను ఫారినర్ ముందు పరువు పోతే పొయింది, నా బూటు తీద్దామని అనుకున్నా, కానీ అది తీస్తే కిందకు జారి నా ప్రాణాలు అనంత విశ్వం లో కలిసి పోతాయని భయపడి తీయలేదు. ప్రజలను మోటివేట్ చేద్దామని నా మొబైల్ లో "లక్ష్య" సినిమా లో హృతిక్ రోషన్ పాడే "ఏ జొ లక్ష్య హైన్ తెరా" అనే పాటను పెట్టాను. ఇంతలో వెనక నుంచి ఎవడో "ఇమ్రాన్ హష్మి సినిమా లో హిమేష్ సంగీతం లాగా ఆపు నీ ఎదవ గోల" అని అరిచాడు. నా హృదయం బరువెక్కుతూ ఉండగా ఆపేశాను. ఇంతలో వెనక నుంచీ వచ్చిన మా గైడ్ దారి చూపించగా ఇంకొంత దూరం పాకి ఆఖరికి ఆకాశాన్ని చూశాను. అప్పటికి దాదాపుగా 5:30గం కావస్తొంది. ఒక పది నిమిషాల తరువాత సూర్యొదయం అయ్యింది. కొండ మీది నుంచీ అది చూస్తూనే నాకు పాత చింతకాయ పచ్చడి లోకి మీగడ పెరుగు వేసుకుని తిన్నంత హాయిగా అనిపించింది. ఆ ఫీలింగ్ బ్లాగ్ లోకం మిస్ కకూడదని ఆ ఫోటోలు కింద లింకులో పెట్టాను.
చింతకాయ పచ్చడి+మీగడ పెరుగు