పాపులర్ బ్లాగరి కావడం ఎలా???
2/11/2009 - రాసింది karthik at Wednesday, February 11, 2009
నాకు తెలుసు మీరందరు పాపులర్ కావడానికి తెగ తొందర పడుతున్నారని. అందుకనే నేను బాగా ఆలోచించి, చించి, చించి పూర్తిగా చినిగాక ఈ టపా రాస్తున్నా. ఈ అవిడియాలు నావే ఐనా మీరందరి కోసం చెప్పేస్తున్నాను. కాస్కోండి...
మొదటిది మరియు అతి కష్టమైనది: ముందు బుర్ర అనేది శరీరం లో ఎక్కడ ఉందో కనుక్కొని. దాన్ని వాడి రెగులర్ గా టపాలు రాయడం. మొగుడే ఉంటే తెల్ల చీర ఎందుకని, ఆ బుర్రే ఏడిస్తే నీ లాంటి తొక్కలో బ్లాగులు ఎందుకు చూస్తాం అని అనుకుంటున్నారా? అలా ఐతే మీరు కరెక్ట్ బ్లాగుకే వచ్చారు. మిగతావన్నీ మీ కోసమే!! త్వరపడండి మరి!
రెండవది: మొయిన్ ఖాన్ అనే అడ్రెస్స్ లేని పాకిస్తాన్ ప్లేయర్ సచిన్ ముఖం లో భయాన్ని చూసాను అని చెప్పాడు. వెంటనే అందరు ఎవడీ ఎదవ అని ఆరా తీశారు. దెబ్బకు మొయిన్ ఖాన్ పెద్ద పాపులార్ ఫిగర్ అయి కూర్చూన్నాడు. కనుక ఇందు మూలంగా తెలియ చెయుటమేమనగా, వెంటనే ఒక పేరున్న బ్లాగరిని పట్టుకుని మీ రచనలలో ఎదో తప్పుందని, మీ ఆలోచనా విధానం పాత చింతకాయ పచ్చడని అనాలి. ఇప్పుడు ఆ సదరు బ్లాగరి మనకు అర్థం కావడానికి కొంత వివరణ ఇస్తారు. ఇప్పుడు మనం ఇంకొక మెట్టు పైకెక్కి ఆ వివరణా లో లోపాలు చెప్పవచ్చు ఉదా: మీ 30+ ముసలివాళ్ళంతా ఇంతే అనొచ్చు, మా ఊరి టీ.వీ. లో అజిత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు మొదలగునవి... ఈ దెబ్బకు బ్లాగ్లోకం అంతా ఎవరా బ్లాగరి? ఎక్కడ ఆ బ్లాగరి?? అని పిచ్చెక్కి పోతారు..
మూడవది: కూడలి, జల్లెడ, తేనేగూడు లాంటి వాటి మీద యుద్ధం ప్రకటించడం. అన్నెం పున్నెం ఎరుగని కూడలి వాళ్ళు ఏం చేశారూ అని అనుకుంటున్నారా?? మరేం పర్లేదు. పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పాపులరికానికి. మన ఎనిమిదవ తరగతి హాఫ్ యియర్లీ మార్కులు మనసులో పెట్టుకొని ఈ కూడలి వాళ్ళు మన మీద వివక్ష చూపిస్తున్నారని అందుకే మన బ్లాగ్ కూడలి లొ కనిపించదు అని గొడవ చెయ్యొచ్చు. నా సామి రంగా ఇప్పుడు మనకు వచ్చే పాపులారిటి చూసి కూడలి వాళ్ళూ, జల్లెడ వాళ్ళూ కలిసి చందా వేసుకుని మనకు అఖిల బ్లాగ్లోక అపర పాపులరి అనే బిరుదు ఇస్తారు!! నిజమండీ బాబూ!!
ఇక నాలుగొది: మన బ్లాగ్లోకం చాలా మంది కవితలు, గేయాలు రాస్తుంటారు. వీళ్ళూ మిగత వాళ్ళ వ్యాఖ్యల గురించి పెద్దఘా పట్టించుకోరూ. ఏదో వాళ్ళ తుత్తి కోసం రాసుకుంటారు. మనం వీళ్ళని కూడా వదలద్దు. వెంటా పడి మీ పద్యం ఏదో పాత మళయాళీ సినిమాలో ఉందే అనాలి. ఆ టపా రాసిన వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు మనం వాళ్ళ బ్లాగ్లో 10-15 వ్యాఖ్యలు రాయాలి. వాళ్ళు పట్టించుకోకున్నా మిగత బ్లాగ్లోకం మాత్రం ఇంత సన్నాసి వెధవ ఎవడా అని వెతుకుతారు, గూగులమ్మని కూడా సంప్రదిస్తారు. ఏంటీ!! నమ్మ బుద్ది కావడం లేదా? మీరు చెయ్యండి మీ వెనకాల నేనున్నాను. పదండి చెప్తాను.
ఐదవది: ప్రస్తుతానికి పై నాలగు ఆచరించండి. అప్పటికీ కాకపోతే నా పేరు చెప్పి బ్లాగులు రాయడం మానుకోండి.
ఇన్ని అవిడియాలు ఇచ్చిన నన్ను మీరు పొగడాలని అనుకుంటున్నారు కదా? నాకు తెలుసు, అందుకే వర్డ్ వెరిఫికేషన్ తీసేశా!!! ఎన్ని వ్యాఖ్యలు రాస్తారో రాసుకోండి. కుమ్ముకోండి చెప్తాను.
గమనిక: ఎవ్వరినీ బాధ పెట్టాలని రాయలేదు. ఎవరికైనా కష్టం అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించగలరు.
మీ
-కార్తీక్