కొత్త రాజధాని.. నా ఆలోచనలు!!

8/17/2014 - రాసింది karthik at Sunday, August 17, 2014
1. హైదరాబాద్ సిండ్రోం
కొత్త రాజధాని అనే మాట వింటూనే వచ్చే మొట్టమొదటి ఆలోచన "హైదరబాద్ కంటే బాగుండాలి", "హైదరాబాదు ఉన్నట్టుండాలి", "హైదరాబాదు లాగా కంపెనీలు ఉండాలి".. ఈ ఆలోచనలన్నీ అర్థం చేసుకోదగ్గవే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి హైదరాబాదుతో ఏదో రకమైన అనుబంధం ఉంది. ఈ రోజు అక్కడి ముక్కుదొర ప్రభుత్వం ఆంధ్రా విద్యార్థులని, ఉద్యోగులని తరిమేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకో తరం మారే దాకా ఇలానే ఉంటుంది. టాంక్ బండ్ పై విగ్రహాలు చూస్తూ గర్వించని ఆంధ్రుడెవడు?
కానీ ప్రస్తుతం ఈ హైదరాబాద్ సెంట్రిక్ ఆలోచనలు మనకు ఏ మాత్రం పనికి రావు.. మన రాజధాని మన బలాబలాలకు, మన అవసరాలకు తగినట్టుగా ఉండాలి తప్ప హైదరాబాదునే వేరు పేరుతో నిర్మించాలనుకోవడం మంచిది కాదు. కానీ హైదరాబాదు విషయంలో జరిగిన తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి.. మంచి నీటి కొరత, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు హైదరాబాదును ఇంకా కొన్నేళ్ళ దాకా వదిలే సూచనలు లేవు.. కొత్త రాజధాని విషయంలో ఇలాంటి వాటిపై శ్రధ్ధ పెట్టాలి.

2. సాఫ్ట్వేరు - బోడి గుండు
తొంభైవ దశకం లో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడం వల్ల హైదరాబాదులో జరిగిన అభివృధ్ధి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్ఠితి లేదు.. అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడానికి చాలా అవకాశాలు ఉండేవి... ఇప్పుడు ఇండస్ట్రీ బాగా మెచ్యూర్ అయ్యింది. 2008 రిసెషన్ తర్వాత కంపెనీలు చాలా కన్సెర్వేటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫర్ లెట్టర్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేని ఇబ్బందికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాయి.. కాబట్టి అప్పటిలాగా వేలకు వేలు ఉద్యోగాలు పుట్టడం కుదరని పని. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాదు నుంచీ రావాలనుకోవడం మూర్ఖత్వం.. ముక్కుదొర ప్రభుత్వం మరీ తాలిబన్ల తమ్ముడిలా వేధిస్తే చెప్పలేం కానీ మామూలు పరిస్థితుల్లో అయితే అది జరగని పని.

3. కోస్తా వర్సెస్ సీమ
అన్నిటికంటే ఇది ప్రధాన సమస్య.. రాజధాని కోస్తాలో ఉంటే సీమకు అన్యాయం జరుగుతుందని, సీమలో ఉంటే కోస్తాకు అన్యాయం జరుగుతుందని రెండు వైపులా అభ్యంతరాలున్నాయి.. ఈ భయాలకు కూడా హైదరాబాద్ సిండ్రోమే ప్రధాన కారణం. రాజధాని అంటే హైదరాబాదులా అన్నీ ఒకే చోట ఉంటే మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని భయం. కాబట్టి ఇరుప్రాంతాలను సంతృప్తి పరిచే విధంగా సాధ్యమైనంత వికేంద్రీకరణ జరగాలి.. ప్రతీ జిల్లా ఏదో ఒక రంగానికి కేంద్రీకృతం కావాలి. ప్రతీ జిల్లాపై మిగిలిన పన్నెండు జిల్లాలు ఆధారపడేలా ఉండాలి. సెక్రెటేరియట్, హై కోర్ట్ ఒకేచోట ఉండకూడదు. అసంబ్లీ సమావేశాలు ఇరు ప్రాంతాలలో జరిగేలా చూడాలి.

4. మన సముద్రం మన బలం:

శాతవాహనుల కాలంలోనే సముద్ర వ్యాపారం చేసిన జాతి మనది. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నాణేలపై నౌక ముద్ర ఉండటం మన పూర్వీకులకు నౌకాయానం పై గల పట్టుని చూపుతోంది. మన మోటుపల్లి కాలగర్భంలో కలిసిపొయి ఉండచ్చు కానీ ప్రకృతి ప్రసాదించిన సముద్రం మాత్రం ఇంకా మనకు అపారమైన అవకాశలను కల్పిస్తోంది. దాన్ని వాడుకుని అంతర్జాతీయ నౌకాశ్రయాలు నిర్మించుకోవాలి.. రాజధాని కంటే అధిక ప్రాధాన్యత దీనికే ఇవ్వాలి. బకింగ్ హాం కాలువ మొదలుకొని అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రోడ్లపైన సరకు రవాణా భారం తగ్గించాలి.