బాపూ గారి గురించి వేణువు బ్లాగులో టపాకు నా సమాధానం

9/09/2014 - రాసింది karthik at Tuesday, September 09, 2014
ఈ టపా రంగనాయకమ్మ భజన బృందాలకు నచ్చే అవకాశం లేదు. కావున మీరు ఆ జాబితాలో ప్రజలైతే ఈ టపా చదవకపోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల మీ సమయాన్ని ఆదా చేసుకున్నవాళ్ళౌతారు. 

ఈ టపాకు మూలమైన వేణువు బ్లాగులోని టపా ఇక్కడ చదవగలరు.

అందులో ప్రధాన ఆంశం ఏమంటే బాపూ గారు విషవృక్షం పుస్తకానికి ముఖచిత్రం వేయడానికి నిరాకరించడం తప్పు. అంతే కాక ఆ ముఖ చిత్రం కోసం పంపిన డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని వ్యంగ్యంగా రాయడం ఇంకా తప్పు.. 

అసలు దీనికంటే ముందు విషవృషం పుస్తకం గురించి కొన్ని విషయాలు:

ఆకలి అనేది నాలగు రకాలు అని రమణ ఉవాచ; బ్లాగర్ రమణ కాదు ముళ్ళపూడి వెంకటరమణ.. అవి కడుపాకలి, డబ్బాకలి, కామాకలి, పేరాకలి.. ఇందులో మొదటిది కాసింత తిండి పడేస్తే సర్దుకుంటుంది కానీ మిగిలినవి తీర్చేకొద్దీ పెరిగేవే తప్ప తగ్గేవి కాదు.. (ఇది కూడా ఆయన చెప్పిందే) అలా పేరాకలి ఎక్కువైన ఒకానొక మహిళా రచయిత్రి ఒకానొక విదేశీ భావాజాలానికి గులాం గిరి చేస్తూ రచనలు చేశారు.. వాటిలో చాలామటుకు ఆడవాళ్ళను విక్టిమైజ్ చేస్తూ కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే మూసలో రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసి దానిలో రామాయణంలోని అన్ని పాత్రలనూ చెడామడా తిట్టేశారు.. పనిలోపనిగా వాల్మికి గారిని కూడా వదలకుండా ఆయన కోటా ఆయనకిచ్చారు. అసలు ఆ పుస్తకం మొదలవడమే, "నీగురించి తెలుసుకో, నీ వర్గమేదో తెలుసుకో" లాంటి విదేశీభావజాల దాస్యంతో మొదలౌతుంది. ఆ తర్వాత ముసలి వాళ్ళను ముగ్గుబుట్ట తల అనటము, వంశ పారంపర్య రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని వాపోవడం లాంటి తింగరి లాజిక్కులతో మొత్తం పుస్తకాన్నీ రక్తి కట్టించారు.. ఇందులో ఫలాన విషయం రామాయణంలోని ఫలానా పద్యం నుంచీ తీసుకున్నానని ఎక్కడ కూడా లేదు. కనీసం నేను చదివిన పుస్తకంలో అయితే నాకు కనిపించడం లేదు.. కానీ వేణువు బ్లాగర్ వేణు గారు ఆ పుస్తకంలో ఫుట్ నోట్స్ ఉన్నాయి అని చెబుతున్నారు.. నాకైతే కనిపించలేదు.

ఇంతా చేస్తే "ఎందుకు తల్లీ రాముడంటే అంత ద్వేషం. అంతగా అయితే రామయణాన్ని మించిన పుస్తకం నువ్వే ఒకటి రాయి" అని కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఒక చిన్న ప్రశ్నవేశారు. నాలగు దశాబ్దాలు దాటిన సదరు రచయిత్రి గారు వాళ్ళనూ వీళ్ళనూ తిట్టిన రచనలే తప్ప ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు.. ఈ విషయం చదివాక మీకు "మై స్ప్రైట్ పీతా హూన్ ఔర్ జ్ఞాన్ దేతా హూన్" అన్న పాత స్ప్రైట్ ప్రకటన గుర్తొస్తే నా బాధ్యత కాదు.  

ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాపూ గారు చేసింది ఎందుకు తప్పు?? ఆయనకు నచ్చిన పని చేసే హక్కు ఆయనకు లేదా?? కళాకారుడైనంత మాత్రన ఎవరొచ్చి ఏం చెప్పినా చెయ్యాలని రూలేమన్నా ఉందా? వీళ్ళ లాజిక్ ప్రకారం ఒక తాళాలు తయారు చేసేవాడికి ఎవరైనా ఒక డ్రాఫ్ట్ ఇచ్చి ఫలానా ఇంటి తాళం ఈ సమయంలో తియ్యాలి అని చెబితే ఆ పని అతను ఒప్పుకోవాల్సిందే అంటారేమో..  

ఇక దీని కంటే అద్భుతం, ఆ డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని రాశాడని జనాలు ఆక్షేపించడం.. 
 ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’ 

విషవృక్షం అనే పేరు పెట్టి కొన్ని కోట్లమందికి ఆదరణీయమైన పుస్తకాన్ని నానా టిట్లు తిట్టారు, ఇప్పుడు కేవలం "రామ" అని ఒకేఒక పదం రాస్తే భరించలేకున్నారు.. మీ ఆదర్శాలకు, సహనశీలతకు ఒక పెద్ద పంగనామం. ఇదేమాట ఆ రచయిత్రి విషయంలో ఎందుకు వర్తించదు.. ఇష్టముంటే రామాయణం చదవాలి లేదా మానుకోవాలి అంతే కానీ ఇలా చవకబారు విమర్శలు చేసే అధికారం ఆమెకెవరిచ్చారు?

మితృడు రాజ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఇదేలా ఉందంటే "కొరివి దయ్యం వర్షంలో వేదాలు చదువుతూ యాగం చేసినట్లుంది".  

సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్