సోదరులారా!! ఒక విన్నపం

3/11/2011 - రాసింది karthik at Friday, March 11, 2011
ముందుగా, మీ సమయం వెచ్చించి నా బ్లాగుకు వచ్చినందుకు శిరస్సు  వంచి నమస్కరిస్తున్నాను..

ముందుగా ఒక చిన్న చందమామ కథ చెబుతాను శ్రమ అనుకోకుండా చదవండి..

ఒకానొక కాలం లో బోధిసత్వుడు కాశీ రాజుగా జన్మించాడు.. ఆయన ఒకరొజు తన రథం లో విహరిస్తుండగా ఒకానొక ఇరుకైన మార్గం లో రథం పోవలసి వచ్చింది.. ఆ మార్గం లో సగం దూరం వెళ్ళాక మరొక వైపు నుంచీ  మరొక రథం వచ్చి ఎదురుగా నిల్చింది.. ఇరుకైన ఆ మార్గం లో ఎవరో ఒక రథం వారు వెనక్కు మళ్ళితే తప్ప మరొకరు ముందుకు పోవడం కుదరదు.. ఇంతలో అటు వైపు రథ సారథి ఆ రథం లో ఉండేది మరొక దేశం యొక్క రాజని అందువల్ల బోధిసత్వుని రథం వెనక్కు మళ్ళించమని చెప్పాడు.. బోధిసత్వుని రథసారథి కూడా ఈ రథం లో ఉండేది కాశీరాజని కనుక ఆ రథాన్ని వెనక్కు మళ్ళించడం కుదరదని జవాబిచ్చాడు.. ఇలా మొదలైన సంవాదం వివాదం లా మారి మా రాజ్యం గొప్ప అంటే మా రాజ్యం గొప్ప అనే స్థాయికి చేరింది.. అందులోను ఎవరి వాదన పైచేయి  కాలేదు కనుక మా రాజు గొప్ప అంటే మా రాజు గొప్ప అనే వాదన మొదలింది.. ఆ సందర్భం లో ఆ రథసారథి తమ రాజు భృత్యులను రక్షిస్తాడని ప్రేమించేవారిని అభిమానిస్తాడని ద్వెషించేవారిని శిక్షిస్తాడని చెబుతాడు.. అది విన్న కాశీ రథ సారథి తమ రాజు భృత్యులను ఆదరిస్తాడని ద్వేషించిన వారిని ప్రేమతో జయిస్తాడని చెబుతాడు.. ఈమాట విన్న వెంటనే మరొక రథం లో ఉండే రాజు బోధిసత్వుని దగ్గరకు వచ్చి ఆయన గొప్పతనానికి శిరస్సు వంచి తన గురువుగా ఉండమని వేడుకుంటాడు..(ఆఖరి సంభాషణ పద్యాలలో జరుగుతుంది.. ఆ పద్యాలు చాలా బాగుంటాయి.. కానీ నేను మరిచిపోయాను)

ఈ కథ చెప్పడానికి కారణం ఈరోజు జరిగిన దుస్సంఘటన అని వేరే చెప్పక్కర్లేదు కదా!! ప్రస్తుతం మన రాష్ట్రం లో కూడా సీమాంధ్ర-తెలంగాణ అనే రెండు రథాలు  ఒకే మార్గం దగ్గర నిలిచిపోయాయి.. ఈ రోజు జరిగిన దాన్ని గుణపాఠం గా తీసుకుని ఇకనైనా ఈ ద్వేష ప్రచారాన్ని ఆపుదాం.. ఈ విషయం నేను తెలంగాణా మితృలకు చెబితే వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు.. కనీసం సీమాంధ్ర సోదర/సోదరీమణులన్నా జరిగినది ఒక పీడకలగా భావించి ఎటునుంచి ఏం జరిగినా మన మనస్సులో ద్వేషమనే భావనకు ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సోదరులను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. మితృలారా! ద్వేషాన్ని జయించగల ఏకైక ఆయుధం ప్రేమ/అభిమానం మాత్రమే.. తెలంగాణ ప్రజలు మనల్ని ఈరోజు ద్వేషించచ్చు మనకు గురుతుల్యులైన వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసి ఉండచ్చు కానీ మనం మాత్రం వారిని మునుపుకంటే ఎక్కువ ఆదరం తో చూద్దాం.. ఎందుకంటే, the need of the hour is not winning enemies but enemity..

జరిగినదానికి మొత్తం బాధ్యత తెలంగాణ వాళ్ళదే అని, మాకు ఏం సంభందం లేదని అనుకోవడం ప్రస్తుత పరిస్థితులలో కుదరదు.. ఇది మన కోసం మన భవిష్యత్ తరాల కోసం చేయాల్సిన గురుతర బాధ్యత.. మండుతున్న తెలంగాణ ను క్రోధం తో కప్పెట్టేదానికంటే అభిమానం తో చల్లార్చాలి.. వాళ్ళు తాలిబన్ పనులు చేశారని మనం అమెరికా లా దమనకాండకు దిగడం ఎంతవరకూ సబబు??   కనుక జరిగిన దానికి తెలంగాణ వారి పై కోపాన్ని ప్రదర్శించక ప్రేమ/అభిమానం తో వాళ్ళను  అర్థం చేసుకోండి.. ఈరోజు కాకపోయినా రేపైనా మన జాతి ఉమ్మడిగా నిలబడాలంటే ఇది మన తక్షణ కర్తవ్యం.. శాంతం  సముద్రం కంటే గొప్పది సోదరా!
ఇది చాలా కష్టమైన పని అని తీసిపారేయకండి, ఈ దేశం లో హిందువులు ముస్లింలు కలిసి బ్రతుకుతున్నప్పుడు తెలంగాణ-సీమాంధ్ర ప్రజలు ఎందుకు బ్రతకలేరు?? ఔరంజేబు కాలం లో బ్రాహ్మణులను చంపి వారి జంధ్యాలతో నీళ్ళు కాచుకుని ఔరంగజేబ్ స్నానం చేసేవాడట.. అలాంటిది ఈ రోజు మనం ఒక ముస్లిం ను భారత రాష్ట్ర పతిగా చేశాం.. అలాంటప్పుడు తెలుగు వారందరూ పరస్పర ద్వేషాన్ని ఎందుకు జయించలేరు?? కానీ ఎవరు మొదటి అడుగు వేస్తారనేదే అసలు ప్రశ్న?? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సీమాంధ్ర ప్రజలే ఈ శాంతిస్థాపనకు పూనుకోవాలి.. కనుక నా వంతుగా "తెలబాన్లు" అనే పదాన్ని బ్లాగుల్లో మనం త్యజించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..
 నేను ఈ క్రింద ఇచ్చిన సందేశాన్ని నా తెలంగాణ సోదరులందరికీ పంపుతున్నాను.. మీ అందరినీ కూడా మీకు తెలిసిన అందరు తెలంగాణ వాస్తవ్యులకు, విదేశాలలో ఉండే తెలంగాణ సోదరులకు పంపమని మనవి చేస్తున్నాను.. 

Dear Telangana friend,

Today's incident at Tankbund have immensely hurt my sentiments as I have an emotional attachment with those statues..this is completely unexpected and uncalled for.. Words like horriible, miserable will not suffice to explain the agony I'm going through.. Having said that, I still respect brotherhood that we share and promise you all my support in the hour of any need.. All I want to convey is few sweet  words, which goes like "I BELONG TO YOU"

Hugs and wishes,

urs ever,
-Karthik

నేను చెబుతున్న ఈ విషయం చాలామందికి ఒక అర్థం లేని పనిగా అనిపించవచ్చు.. కానీ మిత్రమా, మానవ మనుగడకు పరస్పర అనుభందం కంటే పెద్ద కారణం లేదని విజ్ఞులైన పాఠకులకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.. ఒక్కసారి మన పొరుగుదేశం లో ఏం జరుగుతుందో చూడండి, ప్రతీ రోజు ఒక బాంబు దాడి, పదులలో ప్రజలు దుర్మరణం..  అర్థం లేని ద్వేషం తో ఒక సమాజం ఎలా కుదేలైపోతుంది అనేదానికి అంత కంటే పెద్ద ఉదాహరణ అవసరమా??? గత దశాబ్దంగా జరుగుతున్న ఈ విషపర్వానికి స్వస్తి వాచకం పలుకుదాం.. లేకుంటే మరొక 20ఏళ్ళ తర్వాత మనం కూడా మరో పాకిస్తాన్ లా మారుతాం అనే దాన్లో నాకు ఎటువంటి సందేహం లేదు.. బయటకు వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి తిరిగివస్తారనే నమ్మకం లేని రోజులను మీరు చూడాలనుకుంటున్నారా?? ఎన్నాళ్ళీ ద్వేషపాశం?? ఎంత కాలం ఈ వీధిపోరాటాలు???

పరమేశ్వర కృపా కటాక్ష సిద్దిరస్తు,
సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్