జడివాన

5/01/2008 - రాసింది karthik at Thursday, May 01, 2008
స్కూల్లో చదివే రొజుల్లో ఒక తెలుగు పాఠం 'జడివాన '. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తే ముందు కురిసిన వాన గురించి అందులో చదివాను. మొన్న మంగళవారం రాత్రి వాన సృష్టించిన భీభత్సం నాకు ద్వాపరయుగాన్ని గుర్తు చేసింది.

అలవాటుగా నేను రాత్రి 11గం.ల కు ఇంటికి చేరాను. ఆఫీస్ దగ్గర వర్షం పెద్దగా లేదు అందువల్ల తిన్నగ ఇంటికి వెళ్ళి పోయాను. మేము వుండేది కోరమంగల లో. అది చాలా హై క్లాస్ ఏరియా అని నా లాంటి వాళ్ళము కహానీలు చెబుతుంటాం.(ఒక గదికి వేలకు వేలు అద్దె కడతాం కదా, ఆ బాధ ఇలా వెళ్ళగక్కుతాం) .

కానీ ఇంటికి చేరేసరికి మా వీధి ఒక డంపింగ్ గ్రౌండ్ ల వుంది :( 3 కరెంట్ స్తంభాలు, 6 చెట్లు పడిపోయాయి. జాక్ పాట్ కొట్టినట్లు మా ఇంటి ముందు ఉన్న చెట్టు కూలిపొయి మా వాకిలి మీద పడింది. (దేవుడి దయ వల్ల ఇంటికి లేటుగా వెళ్ళాను, లేకపోతే ఈ పాటికి అమరుడిని అయ్యేవాడిని :) ) ఎలాగో ఆ చెట్టును సరి చేసి ఇంట్లొ వెళ్ళాను. మామూలుగానే కరెంట్ లేదు. ఆకలితో కడుపు మండిపోతొంది. కొవ్వొత్తి వెలిగించి వంటింట్లోకి వెళ్ళాను. అప్పుడు తెలిసింది నాది జాక్ పాట్ కాదు డబుల్ బంపర్ లక్కీ డ్రా అని, ఎందుకంటె మా వంటవాడు, పనిమనిషి ఇద్దరు రాలేదు. సింక్ నిండా వున్న గిన్నెలు స్వాగతం పలికాయి. చేసేది ఏమీ లేదు కనుక మొదట గిన్నెలు కడిగాను, తర్వాత వంట పని మొదలు పెట్టాను. ఎర్రగడ్డలు, టొమాటోలు తరిగే సమయానికి కొవ్వొత్తి ఐపోయింది. అల్మారా లో వెతకగా ఇంకొక విషయం బోధ పడింది: వున్నది ఒకేఒక కొవ్వొత్తి,దాన్ని ఇందాకే ముగించాను. కంపరం అంటారు కద, దాన్ని 100తో గుణిస్తే ఏమంటారో అది పుట్టింది.

ఎవరికైనా ఫోన్ చెయ్యాలనిపించింది కానీ ప్రజలు '12గం. తర్వాత ఫోన్ ఎత్తం' , 'నీ గొంతు వింటే ఫోన్ కట్ చేస్తాం' లాంటి రూల్ బేస్ లో ఉన్నారు కనుక ఫోన్ తియ్యలేదు. ఐనా చేసేది ఏమి లేదు కనుక మొబైల్ లైట్ తో పప్పు అన్నం చేసుకుని తిన్నాను. నా పరిస్థితి ఇలా వుంటే మా తాగుబోతు ఓనర్ నీళ్ళు దుబారా చేయ్యొద్దు అని ఒక 5పైసల సలహ ఇచ్చాడు. నీళ్ళు వుంటే కదరా దుబారా చెయ్యటానికి, నీ పిండాకూటికి కూడా లేవురా అంట్ల వెధవా అని చెప్పి నిద్ర పొయే సరికి 2:30 దాటిపోయింది.