చీకటి రహస్యాలు -3

3/20/2012 - రాసింది karthik at Tuesday, March 20, 2012
నా చీకటి రహస్యాలంటే అందరికీ తెలిసినవి కావు. కానీ నేనే అందరికీ చెప్పేస్తున్నా ఎందుకంటే రేపో మాపో ఏ బ్లాగీ లీక్స్ వాడో బయటపెడితే అవి కరెక్టా కాదా అందరూ నన్నడగడం, నేను మళ్ళీ వాటి గురించి ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యడం, ఎందుకీ గోలంతా?? అందుకే చెప్పేస్తున్నా.. నేను ఇంతకుముందు చెప్పిన రహస్యాలు ఇక్కడ లేక ఇక్కడ చదవండి.

నేను సినిమాలు చూడ్డం మొదలుపెట్టిన కొత్తల్లో చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది.. అప్పట్లో నేను చిరంజీవిని/బాలకృష్ణ కాకుండా ఇంకెవర్నీ హీరోలుగా ఒప్పూకునేవాడిని కాదు. సినిమా పేరు రుస్తుమో లేక రోషగాడో కరెక్ట్ గా గుర్తులేదు. ఆ సినిమాలో చిరంజీవి పేరు గండ్రగొడ్డలి.  ఒకానొక ఫైటింగ్ సీన్లో చిరంజీవి ఎద్దులబండిలో నుంచీ క్రిందకు దూకి రౌడీలతో ఫైటింగ్ మొదలు పెడతాడు. ఇంతమంచి సీన్ చూసి కూడా కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా ఉండటం చాలా కష్టమైన పని. అసలే చీమ దూరే ప్లేస్ లో డైనోసార్లను పంపించడం నా అలవాటు. మరుసటి రోజు మేము రాజం పేట నుంచీ కడపకు వచ్చాం, బస్టాండ్ నుంచీ రిక్షాలో ఇంటికి వస్తున్నాం..ఎర్రముక్కపల్లె సర్కిల్ లో మా రిక్షా చుట్టు రిక్షాలు వచ్చాయి.. ఇంత మంచి అవకాశం వస్తే వదులుతానా?? వెంటనే చిరంజీవిలాగా రిక్షా లో నుంచీ దూకి ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్ గా వెళుతున్న రిక్షా లో నుంచీ క్రిందకు దూకాను. అలా దూకిన తర్వాత నాకు రెండు విషయాలు అర్థం అయ్యాయి: 
1. నేను చిరంజీవిని కాను, ఎందుకంటే చిరంజీవి బండిలో నుంచీ దూకి ఫైట్ చేశాడు. నేను మాత్రం రిక్షా లో నుంచీ దూకి నేలకు అతుక్కుపోయాను. మోకాళ్ళు, మోచేతులు పూర్తిగా దోక్కుపోయాయి.. క్రింద పెదవి దగ్గర నుంచీ రక్తం కారుతోంది. రాం చరణ్ కు పోటీకి వస్తానని చిరంజీవే ఏదైనా చేశాడేమో అని నా డౌట్. ;) 
కరెక్ట్ సమయానికి పక్క రిక్షావాళ్ళు బ్రేకులు వేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే PH కేటగిరీలో పరీక్షలు రాయాల్సివచ్చేది.
2. మా అమ్మ చాలా మంచిది, ఎందుకంటే నేను కావాలని దూకానని మా అమ్మకు అర్థం కాలేదు. ఏదో రోడ్డు మీద గుంతలకు జారి పడ్డాననుకొంది. అక్కడి నుంచీ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించింది. మా ఇప్పటికీ ప్రజలకు చెబుతూ ఉంటుంది మా వాడు ఒకసారి రిక్షాలోనుంచీ జారి పడ్డాడు అని.. కికికి

దేవుడు మేలు చేసి అప్పటికి నాకు తలక్రిందులుగా దూకడం రాదు.. వచ్చుంటే బహుశా అది కూడా ట్రై చేసేవాడిని.. అలా చేసుంటే మీకు ఈ సోదంతా చదివే భారం తప్పేది.

మరొక రహస్యం,
నేను 2006లో ఒక రెండు నెలలు మారుతీ ప్లాంట్ లో Summer Internship చేశాను. మే, జూన్ నెలల్ల్ ఢిల్లీ ఎండలకు ఆ మాయదారి ప్లాంట్ లో పని చెయ్యడమంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టడమే. మా సెక్షన్ లో నాతో పాటూ నాలాగే లాటరీ తగిలి పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్, ఐ.ఐ.టి. ఢిల్లీ వాళ్ళు ఇంకొక 4 ఉండేవాళ్ళు. అందరం కలిసి internship అంటే విహార యాత్ర అనే విధంగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. ప్లాంట్ లో ఏ.సీ. ఉండేది కాదు కనుక కూసింత సేద దీరడానికి ఒకానొక మాల్ కి వెళ్ళాం.. మరే!! రిలాక్స్ అవ్వడానికి పూర్తిగా ఆఫీస్ టైమే వాడేవాళ్ళం, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలి.. అఫీస్ పని వల్ల అలసిపోతాం కాబట్టి ఆఫీస్ టైం లోనే రిలాక్స్ అయ్యేవాళ్ళం. అలా  వెళ్ళి ఒక 2-3 గంటలు రిలాక్స్ అయ్యాక మా ఫ్రెండ్ ఒకడు బాత్రూం వెళ్ళాల్సి వచ్చింది. అటూ ఇటూ చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు.. అందుకని అక్కడున్న సెక్యూరిటీని బాత్రూం ఎన్నో ఫ్లోర్ లో ఉందని అడిగాడు.. వాడు ఒక దిక్కు చూపిస్తే అక్కడికి వెళ్ళాం, తీరా చూస్తే అది అక్కడ పని వాళ్ళు వాడే బాత్రూం.. తర్వాత ఆలోచిస్తే అర్థం అయిన విషయం ఏమంటే ఆ సెక్యూరిటీ యూనిఫర్మ్ లో ఉన్న మా జిడ్డు మొహాలని చూసి అక్కడ పని చేసేవాళ్ళమనుకున్నాడు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని నేను  పట్టించుకోలేదు కానీ మా గ్రూప్లో ఉన్న ఇంకొకడు మాత్రం  బాగా హర్ట్ అయ్యాడు..   ఏం చేస్తాం, ఇటీజ్ కర్మ! దట్సాల్!! 


- కార్తీక్