టైటిల్ చూసి ఇదేదో వికటకవి మొన్నటిదాకా రాసిన రొమాంటిక్ థ్రిల్లర్ ట్రాజెడీలకు కొనసాగింపు అనుకుంటే మీరు పైత్యావలోకనం లో కాలేసినట్టే.. ఇదొక కామిక్ ట్రాజెడీ అంటే చదివే వాళ్ళకు కామెడీ రాసేవాడికి అంటే నాకు ట్రాజెడీ..
ఇక విషయానికి వస్తే, అవి నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు..
అమ్మాయిలతో మాట్లాడినవాళ్ళాను మా సార్ వెదురు బొంగు తీసుకుని చితక్కొట్టుడు కొడుతున్న రోజులు..
కడపలో ఒకటవ తరగతి నుంచే ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కాలేజీలు/స్కూళ్ళు లేని రోజులు..
చంద్రబాబు ఇంకొక 20ఏళ్ళు సీ.యం. గా ఉంటాడని అందరూ అనుకుంటున్న రోజులు..
కే.సీ.ఆర్. కు తెలంగాణా సమస్య కనిపించని రోజులు..
నా అభిమాన గాయకుడి పదవి నుంచీ మహమద్ రఫీని నేనింకా పీకేయని రోజులు..
అటువంటి రోజులలో ఒకానొక రోజు అష్టగ్రహకూటమి+మహాళయ అమావాస్యా కలిపి వచ్చాయన్నమాట.. (మరే! తెలుగు హీరోలకు కష్టాలు రావాలంటే ఆ మాత్రం డ్రామా లేకపోతే ఎలా?) .. అప్పుడు నేను ఎంసెట్ ప్రిపరేషన్ పొడిచేస్తున్నాని నా బలమైన నమ్మకం.. మరింతగా పొడిచేయడానికి "చంద్ర కోచింగ్ సెంటర్" అనే కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను.. ఈ కోచింగ్ సెంటర్ వరల్డ్ ఫేమస్ అని కడపంతా చెప్పుకుంటారు.. ఈ కోచింగ్ సెంటర్ నుండీ ఆ అమావాస్య రోజు మేము (అనగా అతి బుద్దిమంతుడినైన నేను మా కాలేజిలో పిల్లలని చెడగొట్టడానికి పుట్టిన ఇంకొక నలుగురు వెధవలు) సైకిళ్ళు తొక్కుకుంటూ రాజు వెడలె... అంటూ ఇంటికి వస్తున్నాం.. మా కోచింగ్ సెంటర్ సారుకు మా గురించి అంటే మిగతా వెధవల గురించి చాలా బాగా తెలుసు అందువల్ల అమ్మాయిలను ఇంటికి పంపించిన ఒక 20 నిమిషాలకు మమ్మల్ని వదిలేవాడు.. ఆ 20నిమిషాలలో మమ్మల్ని ఆ రోజు చెప్పినవి అడుగుతూ స్పెషల్ కోచింగ్ ఇచ్చేవాడు.. ఆరోజు ఎందుకో నేను అందరికంటే వెనుకగా వస్తున్నా కొంత దూరం పొయ్యాక మా కాలేజి అమ్మాయి ఒకరిది సైకిల్ చైన్ పడిపోతే దాన్ని వేయడానికి అవస్థలు పడుతూ కనిపించింది.. నేను దూరాన్నుంచే చూశాను కానీ వెదురుబొంగు గుర్తుకు వచ్చి మనకెందుకు వచ్చిన ఆడగోల అని వెళ్ళబోయాను.. అంతలో మా ఫ్రెండ్ చెల్లెలు ఒకమ్మాయి(ఆ అమ్మాయి కూడా మా క్లాసే) కనిపించి సైకిల్ చైన్ అమ్మాయిని చూపిస్తూ చైన్ వేసివ్వమని అడిగింది.. సరే ఇక తప్పేదేముంది అని ఆ సైకిల్ చైన్ వెయ్యడానికి ఉపక్రమించాను.. ఆ సైకిల్ ఏ అశోకుడో గ్రీన్ డ్రైవ్ కోసం సైక్లథాన్ చేసినప్పటిదిలా ఉంది. అష్టగ్రహ కూటమి మహిమో లేక మహాళయ అమావాస్య పవరో తెలీదు కానీ ఆ చైన్ సరిగ్గా సర్దలేకపోయాను.. అప్పటికే 5,6ఏళ్ళ సైకిల్ అనుభవం సొంతం అయినా కూడా చైన్ వెయ్యలేకపోయా!! ఇక లాభం లేదనుకుని ఆ సైకిల్ ని అలాగే చంకలో పెట్టుకుని రోడ్డు పక్కకు తీసుకుని పోయా.. మోకాళ్ళ మీద కూచుని రెండు చేతులతో చైన్ అడ్జస్ట్ చేస్తూ దాన్ని సరి చేయడానికి ప్రయత్నించాను..ఊహూం ఏం లాభం లేదు.. అయినా కూడా అది పడలేదు.. ఒకవైపేమో మా కాలేజీ అమ్మాయిల ముందు మన ప్రిస్టేజి.. మరో వైపేమో మహాళయ అమావాస్యా.. ఏం చేస్తాం, కష్టాలు మనుషులకు కాక మా ప్రిన్సిపల్ కు వస్తాయా అనుకుని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించసాగాను.. ఆ సమయం లో సుమన్ కు ప్రభాకర్ దొరికినట్లు నాకు మా ఫ్రెండ్ ఇంకొకడెవడో కనిపించాడు.. వాడు నా గ్రీజుపట్టిన చేతులవంకా మట్టికొట్టుకుపొయిన ప్యాంటు వంకా చూసి పరిస్థితి అర్థం చేసుకున్నాడు.. వెంటనే ఆ అమ్మాయిలతో "ఈ సైకిల్ కు చైన్ చాలా కాంప్లెక్స్ సిస్టం, సార్ మొన్నొకసారి ఇలాంటి దాని గురించి చెప్పారు మీకు గుర్తుందా?" అన్నాడు.. నాకు నిప్పురవ్వ సినిమా చూసిన ప్రేక్షకుడిలా మాట పడిపోయింది.. మళ్ళీ వాడే "నేను ఒకసారి ట్రై చేస్తాను" అని సైకిల్ దగ్గరికి వచ్చాడు.. ఎన్ని జన్మలు సైకిల్ షాపుల్లో పని చేశాడో తెలీదు కానీ, అంట్లకాకి వెధవ వెంటనే వేసి పడేశాడు.. నాకు కోపం తో కలిపిన మంట వల్ల ఏడుపొచ్చింది.. వాడేమో నువ్వే కావాలి లో తరుణ్ లా చైన్ లో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది అని ఆ అమ్మాయిలకు లెక్చర్ ఇస్తున్నాడు.. నాకు మండిపొయి వెదురుబొంగు గురించి గుర్తు చేసాను.. దండం దశగుణం భవేత్ అని ఊరికే అన్లేదు కదా.. అది పని చేసి వడెళ్ళిపోయాడు..ఇంతలో మా బ్యాచ్ అనగా మిగతా వెధవలు నేను ఎక్కడో దారి తప్పిపోయాననుకుని వెనక్కు వచ్చారు.. సరిగ్గా ఆ చైన్ అమ్మాయి నాకు "థాంక్స్" చెప్పింది.. అది విని వచ్చేజన్మలో రాధిక సీరియల్ లో హీరోయిన్ మొగుడిగా పుట్టినా బాగుండు అనిపించింది.. కానీ మా వాళ్ళు మాత్రం ఆ థాంక్స్ వల్లా, మట్టి కొట్టుకుపొయిన నా ప్యాంటు వల్లా ఆ సైకిల్ చైన్ నేనే వేసిచ్చానని అనుకున్నారు.. వెంటనే టెలీపతీ ద్వారా మా క్లాస్ అందరికీ తెలిసిపొయింది.. ఆ తర్వాత చెప్పేదేముంది.. ప్రతీ నెలతక్కువ వెధవా "కార్తీక్, సైకిల్ చైన్" అని గట్టిగా అరిచేవాడు.. నేను గానీ ఆ అమ్మాయి గానీ క్లాస్ లోకి అడుగు పెడుతుంటే చాలు "సైకిల్ చైన్" అని తప్ప వేరే మాటే వినిపించేది కాదు.. కొన్ని రోజులకు తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. దాన్లో వాళ్ళు ఎగ్జాం పేపర్స్ ఇచ్చినప్పుడు అరిచినట్టు నా పేపర్ వచ్చిన ప్రతీసారీ "సైకిల్ చైన్" అని అరిచేవాళ్ళు.. బండ వెధవలు.. :(
-కార్తీక్