ఇదేమి అవతారం దేవుడా??

1/20/2010 - రాసింది karthik at Wednesday, January 20, 2010
అవతార్ సినిమా గురించీ అనుకుంటున్నారా? ఐతే మీకు నూటికి నూటా ఇరవై మార్కులు. నేను ఖచ్చితంగా దాని గురించే మాట్లాడుతున్నాను. 2009 లో నేను చాలానే చెత్త సినిమాలు చూశాను.. కానీ 2010 కూడా ఇంత చెత్త సినిమాతో మొదలైనందుకు నేను కడు చింతింత్ హూ!

నేను బేసిగ్గా విలన్ని, నాకు హీరోయిన్లు నచ్చరు..
నేనెప్పుడు థియేటరుకు పొయి సినిమా చూడడానికి అసలు ఇష్టపడను..
పై రెండు వాక్యాల మధ్య సంబంధం వెదుకుతున్నారా?? ప్చ్ ఏమాత్రం సంబంధం లేదు.. పది రోజులు ప్ర.పీ.స.స. కు దూరంగా ఉంటే ఇలాకాక ఎలా ఉంటాను చెప్పండి?

ఇక మన సినిమా విషయానికి వస్తే అందరూ ఆహా, ఓహో.. అంటే కనీసం "పర్లేదు" టైపులో ఉంటుంది అనుకున్నా.. కానీ అట్టర్ హోప్ లెస్!! అసలు ఆ సినిమాకు పోవటానికి పెద్ద ప్రహసనమే నడిచిందిలెండి. మా ఆఫీస్ టీముకు సంబంధించి ఒక కామన్ ఫండ్ ఉంటుంది ఒకానొక కాలంలో అది కంపెనీ భరించేది మాంద్యం దెబ్బకు ప్రస్తుతం టీం మెంబర్లంతా నెలకు వంద రూపాయలు వేసుకుని బండి లాగిస్తున్నాం.. ఆ డబ్బుతో సినిమాకు వెళదాం అని టికెట్ బుక్ చేశాం.. తీర బుక్ చేశాక ఆ ఐడియా ఇచ్చిన అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది.. పాపం ఇంకా సెయింట్ జాన్స్ లోనే ఉంది.. నాకైతే టికెట్ కాన్సిల్ చేద్దామనిపించింది కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని వెళ్ళాము.. ఇలాంటి శషభిషల మధ్య టీం మొత్తం అంటే నా బాసు, బాసుకు బాసు, ఆ బాసుకు బాసు ఇలా బాసులతో కలిసి వెళ్ళాను.. నాకు సినిమా ట్రైలర్ చూసే ఇదేదో తన్నేట్టుగా ఉందే అని డౌట్ వచ్చింది.. సినిమా మొదలౌతూనే అది కాస్తా నిజమని తేలిపొయింది..


ఒక అడవి జాతి ఉంటుంది..వాళ్ళల్లోకి ఒక బయట వ్యక్తి వస్తాడు.. ఆ జీవిని వాళ్ళంతా అభిమానిస్తారు.. కానీ ఆ కొత్త వ్యక్తి వల్లే ఆ జాతికి నష్టం కలిగింది అని వాళ్ళంటా అనుకుంటారు అప్పుడు ఆ కొత్త వ్యక్తి వాళ్ళకు హెల్ప్ చేసి తన నిజాయితీ చాటుకుంటాడు..

ఈ కథ నేను చిన్నప్పుడు చందమామ కథల్లో చదివాను.. కొంచెం పెద్దయ్యాక బుల్లెట్,షాడో నవలల్లో చదివాను... ఇంకా సినిమాల్లో కూడా ఎక్కడొ చూసినటున్నాను.. అందువల్ల నాకు కథా పరంగా చాలా ఆర్డినరీ అనిపించింది.. ఇక ప్రజలెవరైనా "కథ పాతదే ఐనా కథనం కొత్తగా ఉంది" అనే తెలుగు సినిమా డైరెక్టర్ల మాటలు చెబితే నేనస్సలు నమ్మను.. ఏ పక్క నుంచీ చూశినా అంత కొత్త దనం నాకు కనిపించలేదు (నువ్వంత ముదిరిపోయావు అంటే నేనేమి చెయ్యలేను)

ఇలాంటి కథల్లో నాకు బాగా నచ్చిన సినిమా లార్డ్ ఆఫ్ థి రింగ్స్.. ప్రతీ ఫ్రేములో ఎంతో సహజంగా Magnum Opus అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటుంది.. నాకు తెలియకుండానే నేను అవతార్ ను ఆ సినిమాతో పోల్చడం వల్ల ఇంకా చెత్తగా అనిపించింది.. ఇవన్నీ చాలవన్నట్టు 3D ఒకటి.. అదోక ఎక్స్ ట్రా క్షవరం.. 150 టికెట్ 300 కు కొన్నాము.. హై. లో ఉండే ఐమాక్స్ లో చూస్తే బాగుంటుంది అని మా ఫ్రెండ్ అన్నాడు..ఎంత మాత్రం నిజమో నాకు తెలీదు.. ఇక్కడైతే(Inox) అంత గొప్ప ఫీల్ రాలేదు..

ఏదో నా అంతకు నేను మా ఇటాలియన్ క్లయింటుతో కష్టాలు పడుతుంటే టిం బిల్డింగ్ అనే పేరుతో ఈ సినిమా చూపించారు 400 డబ్బులు + 3గంటల నా విలువైన సమయం వృధా అయ్యింది.. ఆ మూడు గంటలు ప్ర.పీ.స.స. లో కామెంట్లు రాసింటే కనీసం మా సభ్యులన్నా కొంచెం సంతోషపడేవారు..

కొసమెరుపు: రాం గోపాల్ వర్మ "అవతార్ చూడొద్దు, అనుభవించండి" అంటే అదేదో పొగడ్త అని తిక్క ప్రజలు ఫీల్ అయిపోయారు.. నేను అనుభవించాను మీరు కూడా మీ ఖర్మ అనుభవించండి అని అర్థం... ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో??