పుస్తక ప్రదర్శన !!!

11/12/2009 - రాసింది karthik at Thursday, November 12, 2009
తెలుగు పుస్తకాలు ఎగ్జిబిషన్ లో ఉన్నాయంటే, వీకెండ్ కల్లా అయిపోతాయేమోనని కక్కూర్తి పడి ఆఫీస్ నుంచీ ముందుగానే పరిగెత్తాను. ఆ ప్యాలెస్ గ్రౌండ్స్ దారి గురించి అందరిని అడుగుతూ అది కనుక్కొని అక్కడికి చేరేసరికి దాదాపుగా గంటన్నర సేపు పట్టింది, బెంగళూరు ట్రాఫిక్కా మజాకా.. ఆ గంటన్నరలో తలప్రాణం తోకకు సారీ, కాళ్ళలోకి వచ్చింది.ఐదు రూపాయలు పార్కింగుకు, ఇరవై రూపాయలు టికెటుకు సమర్పించుకుని వెళ్ళాను. అసలు నేను అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం పేరు "సావిరహే". మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ఒక గొప్ప నవల. దాని గొప్పతనం పూర్తిగా వివరించాలంటే ఇంకొక టపా రాయాలి.

లోపలికి వెళుతూనే కుడి వైపున అట్ట మీద సచిన్ బొమ్మ ఉన్న "వరల్డ్ కప్ 99" అనే పుస్తకం అయస్కాంతం లాగా నన్ను ఆకర్షించింది. ఆ స్టాల్ లోకి పొయి కొన్ని పుస్తకాలు చూశాను. అరవింద్ అడిగా "వైట్ టైగర్", విలియం డ్యార్లింపల్ "ముఘల్" వగైరా, వగైరా పుస్తకాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే చాలా కన్నడ స్టాల్స్ కనిపించాయి. ఆ స్టాల్స్ లో ఇంగ్లీష్ లేదా వేరే భాషలకు సంభందించిన పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వరుస చివరలొ ఒక తెలుగు స్టాల్ కనిపించింది. లోపలికి వెళ్ళి చూశాను చాలా పుస్తకాలు ఉన్నాయి, యండమూరి "విజయానికి ఐదు మెట్లు" నుంచీ "మరణ మృదంగం" దాకా, యద్దనపూడి "సెక్రెటరీ", రమణ "సాహితీయానం" యర్రం శెట్టి శాయి "హ్యుమరాలజి", చలం రాసిన ఒక పుస్తకం (పేరు గుర్తు లేదు) వగైరా వగైరా ఉన్నాయి. "సావిరహే" గురించి అడిగితే ఆ స్టాల్ అతను ఒక తట్టుకోలేని నిజం ఒకటి చెప్పాడు. ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నవలలు రాయకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తున్నారంటా. అయ్యో!! ఇంకొక రాజ్ కృష్ణని, మరో ఐరావతాన్ని, వేరొక సద్దాం ఆంటీని చూడలేమా అని గుండెలొ ఎక్కడొ కళ్ళక్కు మనింది. కాలం దేన్నైనా మారుస్తుంది అని ఒక సెంటిమెంటల్ డయలాగ్ గుర్తు తెచ్చుకుని ముందుకు సాగిపోయాను. మధ్యలో చిన్న పిల్లల స్టాల్స్, ఆధ్యాత్మిక విషయాలకు సంభందించినవి, మతపరమైన విషయాలకు సంబందించినవి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇస్లామిక్ ఏడుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం వాళ్ళ స్టాల్ వగైరా వగైరా. అవన్నీ క్రాస్ చేసి ముందుకు వెళితే అక్కడ విశాలాంధ్ర స్టాల్ కనిపించింది. హమ్మయ్య అని లోపలికి వెళ్ళాను. ఒక్కసారిగా అన్ని బుక్కులు చూస్తే ఏమి కొనాలో అర్థం కాలేదు. దీర్ఘంగా ఆలోచించి మా నాన్నకు ఫోన్ చేశా.
"నాన్నా, నేను విశాలాంధ్ర బుక్ స్టాల్ లో ఉన్నా ఏదైనా మంచి పుస్తకాల పేర్లు చెపూ"
"ఉన్నట్లుండి పేర్లు చెప్పమంటే ఎలా? మాన్యుమెంటల్ బుక్స్ ఏమన్నా ఉంటే తీసుకో"
"శరత్ సాహిత్యం తీసుకోనా?"
"మన ఇంట్లో 'శ్రీకాంత్ ' ఉన్నాడు. శరత్ అంతకంటే మంచి బుక్కులు ఏవీ రాయలేదు కాబట్టి వద్దులే"
"విశ్వనాథ సత్యనారాయణ బుక్స్ తీసుకునేనా?"
"నీకు అంత తెలుగు అర్థం చేసుకునే సీన్ లేదు. అవి నీకు అలమరలో పెట్టి నాదగ్గర అవి ఉన్నాయని చెప్పుకోను తప్పించి మరి దేనికీ పనికి రావు"
"హతవిధి! మా నాన్నకు నా గురించి ఎంత నమ్మకం"(స్వగతం)
" అక్కడా ఎవరెవరి బుక్స్ ఉన్నాయో చెప్పు"
"భమిడిపాటి కామెశ్వర రావు అంటా"
"భరాగో కథలు తీసుకో"
"సరేలే ఏవో ఒకటి తీసుకుంటాను"
నా సంభాషణ విన్న ఆ షాప్ అతను వెంటనే భరాగో కథలు తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు భమిడిపాటి కామేశ్వర రావు గారి బుక్కు కూడా ఒకటి తీసుకున్నాను. ఇంతలో యర్రం శెట్టి శాయి గుర్తుకు వచ్చాడు. "హ్యుమరాలజి" జెమినీ టివీలో చూశాము కదా అని ఇంకొక బుక్కు "ప్రేమకు ఫుల్ స్టాప్ లేదా" అనేబుక్కు తీసుకున్నాను. అదే చేత్తో మల్లాది "డబ్బెవరికి చేదు" కూడా కొన్నాను. రెండు నిముషాలలో నాలగు బుక్కులు ఐపోయాయి ఇంక చాలు అని వస్తూ ఉంటే చలం "స్త్రీ" కనిపించింది. అది చదవమని పొద్దునే ఒక ఉద్వేగపూరితమైన సలహా వచ్చింది :) :) కనుక అది కూడా తీసుకున్నాను. పక్కకు తిరిగితే రంగనాయకమ్మ బుక్కులు కనిపించాయి, వాటి సైజ్ చూసే నాకర్థమైపోయింది అవి నా తాలూకు కాదని.
విశాలాంధ్ర నుంచీ బయటకు వచ్చాక ఒక స్టాల్ లో ఏ బుక్కైనా వంద రూపాయలు మాత్రమే అని కనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళాను. అక్కడ Don Quixote కనపడ్డాడు. నేను వదల్లేదు. గబుక్కున ఆ బుక్కును కూడా తీసుకున్నాను. అక్కడికి ఈ రోజు కొన్న బుక్కుల సంఖ్య ఆరుకు చేరింది. అన్నిట్లోకి పాపం చలం "స్త్రీ" ఒక్కటే odd book out లాగా కనిపిస్తోంది. మంచి ముహూర్తం చూసి మొదలు పెడతాను. బాగుంటే రివ్యూ రాస్తాను బాలేక పోతే మార్తాండ లాగ కథ రాస్తాను, చలం కు ఒక బరువైన పాత్ర ఇచ్చి :) :)

-కార్తీక్