నా ఇంజినీరింగ్ రోజులు-5: ర్యాగింగ్ గోల

11/22/2009 - రాసింది karthik at Sunday, November 22, 2009
నేను మా కాలేజీలో మొట్టమొదట అడుగుపెట్టినరోజు నవంబర్ 12,2001. ఆ రోజే కొందరు సీనియర్స్ ఫ్రెషర్స్ డే వరకూ ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పారు. కనుక నేను ఆ ఫ్రెషర్స్ డే అనేది ఒక గొప్ప పండుగ లాంటిది ఉంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత ఫ్రెషర్స్ అందరూ చొక్కా జేబులో పెన్నులూ,డబ్బులూ వగైరా పెట్టుకోవచ్చనుకున్నాను. నేను అందరిలా కాలేజీ బస్సులో కాకుండా ఆర్.టి.సి. బస్సులో కాలేజీకి వెళ్ళేవాడిని. అందువల్ల, సీనియర్ల బెడద కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే, బస్సులో అందరి ముందు తిక్క వేషాలు వేయించటం అంత వీజీ కాదు కదా.. కాలేజీ మొదలైన రెండవ వారం బస్సులో ఒక సోడా బుడ్డీ సీనియర్ తగిలాడు. ఆ జీవి ముందు కూర్చున్న ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసుకోమని నన్ను పంపించాడు. ఆ అమ్మాయిలు వీడి కన్నా టింగరి ప్రజానీకం ఉన్నాట్టున్నారు అందువల్ల ముందు వాడి గురించి కనుక్కుని చెప్పమన్నారు. మధ్యలో నేను తెలుగు సినిమాలో సెకండ్ హీరోయిన్లా అయిపోయాను. ఆఖరుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాను. (వసుదేవుడంతటి వాడే ఎవరి కాళ్ళో పట్టుకున్నాడట నేనెంత?? :) :)) అప్పుడు ఆ అమ్మాయి నన్ను రకరకాల ప్రశ్నలు వేసి చాల సేపు అక్కడే నిలబెట్టింది. ఇంతలో బస్ స్టాండ్ రావటం తో నేను ఆ రోజుకు పారిపోయాను.
మరుసటి రోజు కూడా మన వాడు నన్ను అదే అమ్మాయి గురించి కనుక్కుని చెప్పమనటం నేను పొయ్యి ఆ అమ్మాయితో మాట్లాడుతూ టైం గడపటాం. మూడో రోజు మనవాడికి చాలా కోపం వచ్చి వాళ్ళ గ్రూప్ లో ఉన్న ప్రజలందరికీ "వీడు రోజూ ఆ అమ్మాయితో బ్యాటింగ్ పెడతాడు" అని నన్ను పరిచయం చేశాడు. దెబ్బకు ఆ ప్రజలందరూ నన్ను రకరకాలుగా ఆడుకున్నారు.
"ఏరా ఇప్పటినుంచే సీనియర్లు కావాల్సి వచ్చారా?"
"మాతోనే కాంపిటిషనా??"
"ఎక్స్ట్రాలు తగ్గిస్తే మంచిది"
వగైరా, వగైరా..
మరుసటి రోజు ఆ అమ్మయి కాలేజిలో కనిపిస్తే మాట్లాడాను. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కూడా మా బ్రాంచ్ లోనే చదువుతోంది. ఇంక నేను రెచ్చిపోదామనుకున్నాను. ఆ రోజు బస్సులో డైరెక్ట్గా పొయ్యి ఆ అమ్మాయిలు ఉన్న సీట్ దగ్గరే కూర్చున్నాను. కానీ అక్కడ నేను గమనించని విషయం ఏమిటంటే ఆ రోజు ఆ అమ్మాయి ఒక్కటే రాలేదు. ఇంకొక ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. నన్ను చూస్తునే గుర్తు పట్టారు వెంటనే అంతా కలిసి నన్ను ఫుట్ బాల్ ఆడుకోవడం మొదలు పెట్టారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయ్యింది నా పరిస్థితి. నేను ఇంటర్మీడియట్ చదివిన రెండేళ్ళల్లో అమ్మాయిలతో మాట్లాడిన సందర్భాలు రెండు మూడుకు మించి లేవు. ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడుతుంటే కొంచెం సిగ్గేసింది (అంటే సిగ్గు వాళ్ళతో మాట్లాడినందుకు కాదు, బస్సులో అందరి ముందు పాటలు పాడాల్సి వచ్చి నందుకు) నేనిట్ల శంకరా నాధశరీరాపరా అని పాడటం మొదలు పెడుతూనే మా సోడా బుడ్డీ జీవి కూడా వచ్చెశాడు తన గ్రూప్ తో సహా. ఇక్కడ నాకు తెలియని చీకటి రహస్యం ఏమిటంటే వాళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళు , మంచి దోస్తులు. :( :( అప్పటివరకూ ఫుట్బాల్ లా ఉన్న బస్సు అప్పటి నుంచీ cricket మ్యచ్ లా తయారైంది. ప్రతి రోజూ నేను బస్సు ఎక్కడం ఈ ప్రజలు బ్యాటింగుకు దిగి నన్ను ఆడుకోవడం. ఇంతలో ఫ్రెషర్స్ డే జరిగింది అదికూడా ఒక దయనీయగాధ మరో సారి చెబుతాను. ఫ్రెషర్స్ డే తరువాతా నేను వళ్ళను ఆడుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలు, రికార్డులు, తొక్క తోలు మట్టి మశానం అన్నీ తీసుకున్నాను. వాళ్ళు కాలేజి వదిలి వెళ్ళిపోయే ముందు వరకూ కూడా నేను వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను.

ఇలాంటిదే మరొకటి కూడా జరిగింది. అది మరోసారి రాస్తాను..

-కార్తీక్