సినిమా ఆట!!

2/18/2013 - రాసింది karthik at Monday, February 18, 2013

చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకుంటాం కానీ కొన్ని ఆటలు మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతాయి. 
ఏంటి, బొంగులో బ్లాగుకు ఇంత బిల్డప్ అవసరమా అనుకుంటున్నారా?? కికికి.. ఈరోజు భావావేశం పడిశం పట్టినట్టు పట్టింది.. అందులో నుంచీ వచ్చిందే ఇది.. 

సరే విషయానికి వస్తే చిన్నప్పుడు మేము సినిమా ఆట అనే ఒక చిత్రాతి చిత్రమైన ఆట ఒకటి ఆడుకునేవాళ్ళం.. ఇందులో రూల్ ఏమంటే కొత్తగా వచ్చిన ఏదైనా సినిమాని రీమేక్ చెయ్యాలి. అంటే కాపీ రైట్లు, మ్యూజిక్ రైట్లు కొనడం కాదు ఆ సినిమాలో జరిగినట్లు డైలాగులు, పాటలు, ఫైట్లు చెయ్యాలి.. మా కాంపౌండులో జనాలు చాలామందే ఉండేవారు..  కానీ మా కాంపౌండులో సినిమా ఆట అంటే జనాలు పక్క కాంపౌండ్ నుంచీ కూడా వచ్చేవాళ్ళు.. మా గ్యాంగులో  మా అక్కలు ఇద్దరు, మా పక్కింట్లో ఉండే ఒక అక్క ఒక బాబు, మా ముందింట్లో ఉండే ఒక అక్క.. పక్క కాంపౌండునుంచీ సరోజ అనే ఒక పాప. ఈ సినిమా ఆటగా ఆడటానికి నాకు ఎక్కువగా నచ్చే సినిమా మరణ మృదంగం.. ఎందుకంటే ఆ సినిమాలో డైలాగులు పాటలు ఏమీ ఉండేవి కాదు.. జట్టుకు ఇద్దరు చొప్పున జట్లుగా విడిపోయి, మెట్ల కిందా, బావి పక్కన దాక్కుని "ఢన్ ఢన్ ఢన్ ఢన్" అని అరుస్తూ ఉంటే కాసేపటికి బోరుకొట్టిన జట్టు చెప్పా పెట్టాకుండా ఇంటికి వెళ్ళిపోతుంది సినిమా ఆటోమేటిగ్గా అయిపోతుంది..  

మన సమాజంలో ఉన్న వివక్ష గురించి నాకు తెలిసింది ఈ సినిమా ఆటలోనే, ఎందుకంటే సినిమా ఏదైనా సరే విలన్ మాత్రం నేనే, ఎందుకంటే నేను వయసు ఆధారిత మైనార్టీని కాబట్టి.. అప్పటికి మా కాంపౌండ్లో ఐదుకంటే తక్కువ వయసున్న వాడిని నేను మాత్రమే.. అందుకని మరో ఆలోచన లేకుండా నన్నే విలన్ పాత్రకు ఫిక్స్ అయ్యేవాళ్ళు.. 
ఆటలో నాకు మాబాగా గుర్తున్న సినిమా "శివ".. నాగార్జున అనే హీరో ఒకడున్నాడని మా పక్కింటి సరోజ లాంటి చిన్నపిల్లలకు చాటిచెప్పిన సినిమా "శివ".. నాకు నాగార్జున ముందే తెలుసు, మా అమ్మ నన్ను విక్కిదాదా సినిమాకు రాయల్ హాల్ లో మాట్నీకి తీసుకెళ్ళింది.. ఐ యాం ఇంటెలిజెంట్ యు నో!! 

ఆ "శివ" ప్రభంజంలో అలవాటుగా మా కాంపౌండ్లో సినిమా ఆట మొదలుపెట్టారు, నన్ను మామూలుగానే విలన్ చేశారు అంటే "భవానీ" అన్న మాట..   ఆ భవాని మాటిమాటికీ ఒక చిన్న సీసా తీసి ఏదో తాగుతాడు.. నాకు ఏం తాగాడో తెలీదు కానీ నేను కూడా ఏదో ఒకటి తాగాలి అందులో బాటిల్ లాంటి దానిలో తాగాలి, అలాంటి సమయంలో నాకు రస్నా ఆడ్ గుర్తుకు వచ్చింది.. వెంటనే నా తెలివిని పూర్తిగా ఉపయోగించా! మా వంటింట్లో ఉండే మరచెంబు నిండా రస్నా పోసి తెచ్చుకున్నా..  ఇంక చూసుకో నా సామీ రంగా నా డైలాగ్ వచ్చినప్పుడల్లా గటగటా తాగి డైలాగులు చెప్పేవాడిని.. అప్పట్లో రియాల్టీ షోలూ టాలెంట్ షోలు లేవు కానీ లేకపోతే నాది కమలహాసన్ లెవెల్ యాక్టింగ్..  
అలానే మరొక సినిమా ఆఖరిపోరాటం.. అందులో నేను ఎక్కువగా బూటులో కత్తి పెట్టుకునే రౌడీ పాత్ర వేసేవాడిని.. మా అక్కలిద్దరిలో ఎవరికి నన్ను కొట్టాలనిపిస్తే వాళ్ళు హీరో పాత్ర వేసేవాళ్ళు.. నాగార్జున పేరు చెప్పుకుని నన్ను ఫుట్ బాల్ ఆడేసుకునేవాళ్ళు.. 

ఇవన్నీ కాదు గానీ సినిమా ఆటలో నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం నేను మెట్ల మీద నుంచీ దొర్లుకుంటూ కింద పడ్డం.. ఎవరో కొట్టారో తెలీదు కానీ విలన్ పాత్రను తన్నాలన్న ఉత్సాహం ఎక్కువై కొట్టారు.. నేను మిద్దె మీద నుంచీ దొర్లుకుంటూ కిందికి వచ్చి పడ్డాను.. ఏంతైనా మైనార్టీనీ కదా ఏమైనా చెప్పుకోలేను..

అన్నట్టు చెప్పడం మరిచిపోయా, మా పక్క కాంపౌండ్ జనాలు కూడా మా కాంపౌండ్ కి రావడానికి కారణం మా ఆర్కెస్ట్రా.. మా పెద్దక్క, మా పక్కింటి అక్కా మంచి సింగర్స్.. మా ముందింట్లో ఉండే అక్క పెద్ద సింగర్ అవ్వాలని వాళ్ళింట్లో వాళ్ళు హార్మోనియం కొనిచ్చారు.. ఇంక చెప్పేదేముంది?? అందరు కలిసి ఇరగదీసేవాళ్ళు.. 


-కార్తీక్