నా ఇంజినీరింగ్ రోజులు-5: ర్యాగింగ్ గోల

11/22/2009 - రాసింది karthik at Sunday, November 22, 2009
నేను మా కాలేజీలో మొట్టమొదట అడుగుపెట్టినరోజు నవంబర్ 12,2001. ఆ రోజే కొందరు సీనియర్స్ ఫ్రెషర్స్ డే వరకూ ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పారు. కనుక నేను ఆ ఫ్రెషర్స్ డే అనేది ఒక గొప్ప పండుగ లాంటిది ఉంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత ఫ్రెషర్స్ అందరూ చొక్కా జేబులో పెన్నులూ,డబ్బులూ వగైరా పెట్టుకోవచ్చనుకున్నాను. నేను అందరిలా కాలేజీ బస్సులో కాకుండా ఆర్.టి.సి. బస్సులో కాలేజీకి వెళ్ళేవాడిని. అందువల్ల, సీనియర్ల బెడద కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే, బస్సులో అందరి ముందు తిక్క వేషాలు వేయించటం అంత వీజీ కాదు కదా.. కాలేజీ మొదలైన రెండవ వారం బస్సులో ఒక సోడా బుడ్డీ సీనియర్ తగిలాడు. ఆ జీవి ముందు కూర్చున్న ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసుకోమని నన్ను పంపించాడు. ఆ అమ్మాయిలు వీడి కన్నా టింగరి ప్రజానీకం ఉన్నాట్టున్నారు అందువల్ల ముందు వాడి గురించి కనుక్కుని చెప్పమన్నారు. మధ్యలో నేను తెలుగు సినిమాలో సెకండ్ హీరోయిన్లా అయిపోయాను. ఆఖరుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాను. (వసుదేవుడంతటి వాడే ఎవరి కాళ్ళో పట్టుకున్నాడట నేనెంత?? :) :)) అప్పుడు ఆ అమ్మాయి నన్ను రకరకాల ప్రశ్నలు వేసి చాల సేపు అక్కడే నిలబెట్టింది. ఇంతలో బస్ స్టాండ్ రావటం తో నేను ఆ రోజుకు పారిపోయాను.
మరుసటి రోజు కూడా మన వాడు నన్ను అదే అమ్మాయి గురించి కనుక్కుని చెప్పమనటం నేను పొయ్యి ఆ అమ్మాయితో మాట్లాడుతూ టైం గడపటాం. మూడో రోజు మనవాడికి చాలా కోపం వచ్చి వాళ్ళ గ్రూప్ లో ఉన్న ప్రజలందరికీ "వీడు రోజూ ఆ అమ్మాయితో బ్యాటింగ్ పెడతాడు" అని నన్ను పరిచయం చేశాడు. దెబ్బకు ఆ ప్రజలందరూ నన్ను రకరకాలుగా ఆడుకున్నారు.
"ఏరా ఇప్పటినుంచే సీనియర్లు కావాల్సి వచ్చారా?"
"మాతోనే కాంపిటిషనా??"
"ఎక్స్ట్రాలు తగ్గిస్తే మంచిది"
వగైరా, వగైరా..
మరుసటి రోజు ఆ అమ్మయి కాలేజిలో కనిపిస్తే మాట్లాడాను. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కూడా మా బ్రాంచ్ లోనే చదువుతోంది. ఇంక నేను రెచ్చిపోదామనుకున్నాను. ఆ రోజు బస్సులో డైరెక్ట్గా పొయ్యి ఆ అమ్మాయిలు ఉన్న సీట్ దగ్గరే కూర్చున్నాను. కానీ అక్కడ నేను గమనించని విషయం ఏమిటంటే ఆ రోజు ఆ అమ్మాయి ఒక్కటే రాలేదు. ఇంకొక ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. నన్ను చూస్తునే గుర్తు పట్టారు వెంటనే అంతా కలిసి నన్ను ఫుట్ బాల్ ఆడుకోవడం మొదలు పెట్టారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయ్యింది నా పరిస్థితి. నేను ఇంటర్మీడియట్ చదివిన రెండేళ్ళల్లో అమ్మాయిలతో మాట్లాడిన సందర్భాలు రెండు మూడుకు మించి లేవు. ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడుతుంటే కొంచెం సిగ్గేసింది (అంటే సిగ్గు వాళ్ళతో మాట్లాడినందుకు కాదు, బస్సులో అందరి ముందు పాటలు పాడాల్సి వచ్చి నందుకు) నేనిట్ల శంకరా నాధశరీరాపరా అని పాడటం మొదలు పెడుతూనే మా సోడా బుడ్డీ జీవి కూడా వచ్చెశాడు తన గ్రూప్ తో సహా. ఇక్కడ నాకు తెలియని చీకటి రహస్యం ఏమిటంటే వాళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళు , మంచి దోస్తులు. :( :( అప్పటివరకూ ఫుట్బాల్ లా ఉన్న బస్సు అప్పటి నుంచీ cricket మ్యచ్ లా తయారైంది. ప్రతి రోజూ నేను బస్సు ఎక్కడం ఈ ప్రజలు బ్యాటింగుకు దిగి నన్ను ఆడుకోవడం. ఇంతలో ఫ్రెషర్స్ డే జరిగింది అదికూడా ఒక దయనీయగాధ మరో సారి చెబుతాను. ఫ్రెషర్స్ డే తరువాతా నేను వళ్ళను ఆడుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలు, రికార్డులు, తొక్క తోలు మట్టి మశానం అన్నీ తీసుకున్నాను. వాళ్ళు కాలేజి వదిలి వెళ్ళిపోయే ముందు వరకూ కూడా నేను వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను.

ఇలాంటిదే మరొకటి కూడా జరిగింది. అది మరోసారి రాస్తాను..

-కార్తీక్

పుస్తక ప్రదర్శన !!!

11/12/2009 - రాసింది karthik at Thursday, November 12, 2009
తెలుగు పుస్తకాలు ఎగ్జిబిషన్ లో ఉన్నాయంటే, వీకెండ్ కల్లా అయిపోతాయేమోనని కక్కూర్తి పడి ఆఫీస్ నుంచీ ముందుగానే పరిగెత్తాను. ఆ ప్యాలెస్ గ్రౌండ్స్ దారి గురించి అందరిని అడుగుతూ అది కనుక్కొని అక్కడికి చేరేసరికి దాదాపుగా గంటన్నర సేపు పట్టింది, బెంగళూరు ట్రాఫిక్కా మజాకా.. ఆ గంటన్నరలో తలప్రాణం తోకకు సారీ, కాళ్ళలోకి వచ్చింది.ఐదు రూపాయలు పార్కింగుకు, ఇరవై రూపాయలు టికెటుకు సమర్పించుకుని వెళ్ళాను. అసలు నేను అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం పేరు "సావిరహే". మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ఒక గొప్ప నవల. దాని గొప్పతనం పూర్తిగా వివరించాలంటే ఇంకొక టపా రాయాలి.

లోపలికి వెళుతూనే కుడి వైపున అట్ట మీద సచిన్ బొమ్మ ఉన్న "వరల్డ్ కప్ 99" అనే పుస్తకం అయస్కాంతం లాగా నన్ను ఆకర్షించింది. ఆ స్టాల్ లోకి పొయి కొన్ని పుస్తకాలు చూశాను. అరవింద్ అడిగా "వైట్ టైగర్", విలియం డ్యార్లింపల్ "ముఘల్" వగైరా, వగైరా పుస్తకాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే చాలా కన్నడ స్టాల్స్ కనిపించాయి. ఆ స్టాల్స్ లో ఇంగ్లీష్ లేదా వేరే భాషలకు సంభందించిన పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వరుస చివరలొ ఒక తెలుగు స్టాల్ కనిపించింది. లోపలికి వెళ్ళి చూశాను చాలా పుస్తకాలు ఉన్నాయి, యండమూరి "విజయానికి ఐదు మెట్లు" నుంచీ "మరణ మృదంగం" దాకా, యద్దనపూడి "సెక్రెటరీ", రమణ "సాహితీయానం" యర్రం శెట్టి శాయి "హ్యుమరాలజి", చలం రాసిన ఒక పుస్తకం (పేరు గుర్తు లేదు) వగైరా వగైరా ఉన్నాయి. "సావిరహే" గురించి అడిగితే ఆ స్టాల్ అతను ఒక తట్టుకోలేని నిజం ఒకటి చెప్పాడు. ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నవలలు రాయకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తున్నారంటా. అయ్యో!! ఇంకొక రాజ్ కృష్ణని, మరో ఐరావతాన్ని, వేరొక సద్దాం ఆంటీని చూడలేమా అని గుండెలొ ఎక్కడొ కళ్ళక్కు మనింది. కాలం దేన్నైనా మారుస్తుంది అని ఒక సెంటిమెంటల్ డయలాగ్ గుర్తు తెచ్చుకుని ముందుకు సాగిపోయాను. మధ్యలో చిన్న పిల్లల స్టాల్స్, ఆధ్యాత్మిక విషయాలకు సంభందించినవి, మతపరమైన విషయాలకు సంబందించినవి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇస్లామిక్ ఏడుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం వాళ్ళ స్టాల్ వగైరా వగైరా. అవన్నీ క్రాస్ చేసి ముందుకు వెళితే అక్కడ విశాలాంధ్ర స్టాల్ కనిపించింది. హమ్మయ్య అని లోపలికి వెళ్ళాను. ఒక్కసారిగా అన్ని బుక్కులు చూస్తే ఏమి కొనాలో అర్థం కాలేదు. దీర్ఘంగా ఆలోచించి మా నాన్నకు ఫోన్ చేశా.
"నాన్నా, నేను విశాలాంధ్ర బుక్ స్టాల్ లో ఉన్నా ఏదైనా మంచి పుస్తకాల పేర్లు చెపూ"
"ఉన్నట్లుండి పేర్లు చెప్పమంటే ఎలా? మాన్యుమెంటల్ బుక్స్ ఏమన్నా ఉంటే తీసుకో"
"శరత్ సాహిత్యం తీసుకోనా?"
"మన ఇంట్లో 'శ్రీకాంత్ ' ఉన్నాడు. శరత్ అంతకంటే మంచి బుక్కులు ఏవీ రాయలేదు కాబట్టి వద్దులే"
"విశ్వనాథ సత్యనారాయణ బుక్స్ తీసుకునేనా?"
"నీకు అంత తెలుగు అర్థం చేసుకునే సీన్ లేదు. అవి నీకు అలమరలో పెట్టి నాదగ్గర అవి ఉన్నాయని చెప్పుకోను తప్పించి మరి దేనికీ పనికి రావు"
"హతవిధి! మా నాన్నకు నా గురించి ఎంత నమ్మకం"(స్వగతం)
" అక్కడా ఎవరెవరి బుక్స్ ఉన్నాయో చెప్పు"
"భమిడిపాటి కామెశ్వర రావు అంటా"
"భరాగో కథలు తీసుకో"
"సరేలే ఏవో ఒకటి తీసుకుంటాను"
నా సంభాషణ విన్న ఆ షాప్ అతను వెంటనే భరాగో కథలు తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు భమిడిపాటి కామేశ్వర రావు గారి బుక్కు కూడా ఒకటి తీసుకున్నాను. ఇంతలో యర్రం శెట్టి శాయి గుర్తుకు వచ్చాడు. "హ్యుమరాలజి" జెమినీ టివీలో చూశాము కదా అని ఇంకొక బుక్కు "ప్రేమకు ఫుల్ స్టాప్ లేదా" అనేబుక్కు తీసుకున్నాను. అదే చేత్తో మల్లాది "డబ్బెవరికి చేదు" కూడా కొన్నాను. రెండు నిముషాలలో నాలగు బుక్కులు ఐపోయాయి ఇంక చాలు అని వస్తూ ఉంటే చలం "స్త్రీ" కనిపించింది. అది చదవమని పొద్దునే ఒక ఉద్వేగపూరితమైన సలహా వచ్చింది :) :) కనుక అది కూడా తీసుకున్నాను. పక్కకు తిరిగితే రంగనాయకమ్మ బుక్కులు కనిపించాయి, వాటి సైజ్ చూసే నాకర్థమైపోయింది అవి నా తాలూకు కాదని.
విశాలాంధ్ర నుంచీ బయటకు వచ్చాక ఒక స్టాల్ లో ఏ బుక్కైనా వంద రూపాయలు మాత్రమే అని కనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళాను. అక్కడ Don Quixote కనపడ్డాడు. నేను వదల్లేదు. గబుక్కున ఆ బుక్కును కూడా తీసుకున్నాను. అక్కడికి ఈ రోజు కొన్న బుక్కుల సంఖ్య ఆరుకు చేరింది. అన్నిట్లోకి పాపం చలం "స్త్రీ" ఒక్కటే odd book out లాగా కనిపిస్తోంది. మంచి ముహూర్తం చూసి మొదలు పెడతాను. బాగుంటే రివ్యూ రాస్తాను బాలేక పోతే మార్తాండ లాగ కథ రాస్తాను, చలం కు ఒక బరువైన పాత్ర ఇచ్చి :) :)

-కార్తీక్

బ్లాగు బస్సు..బహుబాగు బస్సు ...

11/03/2009 - రాసింది karthik at Tuesday, November 03, 2009
అది ఒక బస్సు.
డొరు తెరిచి డ్రైవర్ ఎక్కాడు.
"హల్లొ, డ్రైవర్ గారూ.. మీ గురించి కొంత చెపుతారా?"
"నా పేరు వీవెన్
నేను లెఖిని,కూడలి సృష్టించెన్
తెలుగు బ్లాగులు ఒక సెన్సేషన్"
అదుర్స్ అదుర్స్
ఇక బస్సులో మిగతా వాళ్ళ గురించి చూద్దాం.
"నమస్తే సర్, ఫస్ట్ సీట్ లో ఉన్నారు. మీ పేరు?"
"నా పేరు చావా కిరణ్. నేను అందరికంటే ముందు బస్సు ఎక్కాను"
"ఒహో అలాగా!! కంగ్రాట్స్ సర్"
రెండవ సీట్ లో ఒకాయన బిజీగా రాస్తున్నాడు.
"సర్, మీరు...??"
" నేను ఒకసారి వాడిన పెన్ను ని రెండవసారి వాడను అందుకే నా పేరు కొత్తపాళి."
ఇంతలో ఒక చిన్న పాపను ఎత్తుకుని ఒక ఆవిడ బస్సు ఎక్కింది.
"మేడం మీరు..."
"నా పేరు లక్ష్మి ఊరు హైదరాబాదు."
"మీ పాప చాల ముద్దుగా ఉంది. పేరేమిటి మేడం?"
"మా పాప పేరుతో నీకేమి పని నాయనా..
పాతబస్తీ లో పసుపు కుంకుమలు అమ్ముకునే మొహమూ నువ్వూను"
ఇంకాస్త ముందుకు వెళితే ఒకాయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
"సార్"
"సార్ మీ పేరు, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం కదండి?"
"లలితా బాలసుబ్రహ్మణ్యం అన్నా నేనే"
"మీ గురించి ఏదో చదివాను సార్"
"నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం"
"తెలుగులో మాట్లాడండి సార్"
ఆ పక్కగా కూర్చున్న కండక్టర్ గారు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నారు.
"కండక్టర్ గారు.. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?"
"మాయావతి అందంగా ఉంటుందా లేక విజయకాంత్ అందంగా ఉంటాడా అని అలోచిస్తున్నాను"
"ఆ..."
"అవును దేవుడు నాకు 23 టలెంట్స్ ఇచ్చాడు. ఒకొక్కసారి ఒక్కొటి వాడుతుంటాను"
"కొంపదీసి మీరు..."
"నన్ను అందరూ the nakar అని పిలుస్తారు. కొందరు దినకర్ అని, ప్రసాద్ అని కూడా పిలుస్తారు"
ఇంతలో నన్ను తోసుకుంటు ఎవరో ముందుకు వెళ్ళారు. తిరిగి చూస్తే ఒకాయన గళ్ళ లుంగి, చారల బనీను బుర్ర మీసాలతో కనపడ్డాడు.
"హల్లో గురూ ఏ ఏరియా మనది?"
"మలక్ పేట"
"వెళ్ళి కూర్చోండి"
వెనుక సీట్లు నిండడనికి ఇంకా టైం ఉంది కదా అని లేడీస్ సీత్ల వైపు అడుగు వెనక్కు వేశాను. ఎవరో అమ్మాయి నిలుచుకుని ఉంది.
"ఏంటండీ మీకు సీట్ దొరకలేదా?"
"నా పేరు మహిత, నేను కామెంట్లు రాస్తాను కానీ టపాలు రాయను. అందుకే కూర్చోలేదు"
"ఒహో!!"
ఇంతలో ఆ పక్క సీట్లో ఉన్న కళ్ళజోడు ఆవిడ నన్నే చూస్తున్నట్టు అనిపించింది.
"ఒక్కా, మీరు..."
"నా పేరు జ్యొతి. చాలా విషయాల మీద బ్లాగులో రాస్తుంటాను"
"ఓహో అలాగా! మీ ఓపిక కి నా జోహార్లు"
"మీ పక్కన ఉన్న ఆవిడ ఎవరు జ్యోతక్కా?"
"ఈమె పేరు సౌమ్య. నిస్యాలోచనాపథం గురించి ఆలోచిస్తూ ఉంటుంది"
ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఒకమ్మాయి తనలోతనే మాట్లాడుకుంటు కనిపించింది.
"మీరు..."
"నేను నేనే.. నాలో 'నేను' మాట్లాడుకుంటూ ఉంటాను తప్పించి బయటి వాళ్ళతో ఎవరితో మాట్లాడను"
"మీ పేరు మేధ కదూ!!"
వెనకల నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూశాను. ఒక పెద్ద వెలుగు కనిపించింది.
"మీరూ.."
"కూడలి జల్లెడా తెలికీ కనిపిచే మూడు సిమ్హాలైతే, ఆ కనిపించే నాలుగో సింహమే ఈ బ్లాగాగ్ని"
"సూపర్ సూపర్"
ఇంతలో ఎవారో వెనుక సీట్లోకి పరిగెత్తూకుంటు వచ్చి కూర్చున్నారు.
అక్కడికి వెళ్ళి చూడగా ఎర్ర ప్యంటూ ఎర్ర షర్ట్ ఎర్ర కళ్ళజోడు తో ఒక వ్యక్తి కూర్చోని ఉన్నాడు.
"మీ పేరు...."
"ఆస్తిక,అగ్రవర్ణ,భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ఇప్పుడే ఒక కథ రాస్తాను"
"'ఓహో మీరు కథలు రాస్తారా?"
"బైరాగి తెలితేటలు అంటే అవే మరి"
"నేను బైరాగినా?"
"నా పేరు ప్రవీణ్/మార్తాండ/ISP Administrator/నాదెండ్ల/PKMCT"
"చాలు బాబూ చాలు. నీ డ్రస్ చూసినప్పుడే నిన్ను గుర్తుపట్టాల్సింది"
"నా పేరు మార్తాండ
ఇంటి పేరు మూర్ఖాండ
నా తోటి ఉన్నసేన మూలిగేటి ఎర్రసేన"
"అయ్య బాబోయ్..నీ పాటలు ఆపు బాబూ.."
"సరే ఐతే. పాటలు ఆపి కథ రాస్తాను"
"హమ్మయ్య బ్రతికిపోయాను"
వెనకాల ఎవరో కూర్చొని నా వైపు సందేహంగా చూస్తూ ఉన్నాడు.
"ఇంత సందేహంగా చూస్తూ ఉన్నావంటే నువ్వు కచ్చితంగా నాగప్రసాద్ అయ్యుంటావు"
"అవును. ఇంతకూ నీ గురించి చెప్పలేదు"
"నా పేరు కార్తీక్..
నేను పుట్టింది రాయలసీమలో..చదివింది ఉత్తరభారత దేశం లో
ప్రస్తుతం ఉండేది ఉద్యాన నగరిలో
ఎక్కడ ఉన్నా...పదహారణాల తెలుగు బిడ్డని... ఒక భాషాభిమానిని"
-----------------------------------------------------------------------------------------------
సమకాలిన సామాజిక/రాజకీయ అంశాల మీద టపాలు రాసే కత్తి మహెష్ గారిని, చదువరి గారిని బస్సులో ఇమద్చలేకపోయాను.

నేను తెలుగు బ్లాగు రాయటం మొదలు పెట్టి రెండేళ్ళా కొన్ని నెలలు అయ్యింది. ఈ రెండేళ్ళ కాలంలో నేను రెగులర్గా చదివే బ్లాగులతో ఈ టపా రాశాను. ఏదో సరదాకి రాశాను తప్పించి ఎవరిని నొప్పించే ఉద్దేస్యం నాకు లేదు. అందరికంటే చిన్న వాడిని కదా అందుకని క్షమించెయ్యండి. మనసుబాగాలేకపొయినా, లేక నిద్ర రాకపొయినా నేను చేసే మొదటి పని బ్లాగులు చదవటం. నాకు ఎన్నో సార్లు సహాయపడ్డ బ్లాగ్ మిత్రులందరికి బ్లాగుముఖంగా నెనర్లు తెలుపుకుంటున్నాను.

-కార్తీక్