యుహ్హ్హ్హా హహ్హ్హా! "టమేటా పులుసు"

11/21/2010 - రాసింది karthik at Sunday, November 21, 2010
హహ్హ్హాహ్హా.. అవును నేనే! 
వికట్టాట్టహాసం చేస్తున్నాను.. ప్రస్తుతం బ్లాగర్లకందరికీ పట్టిన ఈ వంట ఫీవర్ నన్ను కూడా తాకింది.. మధ్యాహ్నం పల్లకిగారి టపా చూసినప్పటి నుంచీ గుండె రగిలిపోతోంది.. ఏ బ్లాగు చూసినా కుటుంబరావులు, సక్కూబాయిలు వంటల మీద వంటలతో బుర్ర తోడేస్తున్నారు.. పైగా కుక్కర్లతో చపాతీలు, పెనం లో పూరీలు అంటూ బ్రహ్మచారుల మీద జోకులు.. ఇవన్నీ చూస్తూ సైలెంటుగా ఉంటే అఖిలభారత బ్రహ్మచారుల సంఘం నన్ను క్షమించదు.. కనుక వీళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి నేనే స్వయంగా పూనుకున్నాను.. పూర్వాశ్రమంలో నా వంట టాలెంటు తెలియని వారు ఇక్కడ లేదా ఇక్కడ నొక్కండి..
వంట చేద్దాం అని అనుకోవడం మొదలు నా వంటరాత్మ ఆవులిస్తూ నిద్రలేచి "ఆ..క..లి" అని అరిచింది..టపాలు రాయలేక నేనేడుస్తుంటే ఎవరో వచ్చి కొత్త అగ్రిగేటర్ మొదలుపెడదాం అన్నాడట.. ఒళ్ళుమండి  విజయేంద్ర వర్మ లో బాలయ్య బాబును గుర్తును తెచ్చుకుని ఒక చిన్న సైజు క్లాస్ పీకాను..   అప్పటికి వంటరాత్మకు కర్తవ్యం గుర్తుకు వచ్చి వెంటనే ఏ వంట చేయాలి అని బాల్కనీ కూర్చొని రోడ్డు మీదపొయ్యే అమ్మాయిలను చూస్తూ ఆలోచించసాగాను.. అలా కొంతమందిని చూశాక సారీ కొంతసేపయ్యాక, ఏ వంట చేయాలి అనేది డిసైడ్ చెయ్యాల్సింది బాల్కనీలో కాదు వంట రూంలో అని గుర్తుకువచ్చి వంట రూంలోకి వెళ్ళి అసలు సామాగ్రి ఏమున్నాయొ చూశాను.. ఒక నాలగు టమేటాలు, ఆరు పచ్చిమిరపకాయలు, రెండు ఉల్లగడ్డలు ఉన్నాయి..  సారీ ఉల్లగడ్డలంటే మీకు అర్థం కాదు కదూ.. వాటినే కోస్తా తెలుగులో బంగాళ దుంపలని హైదరాబాదు తెలుగులో ఆలుగడ్డలని అంటారు.. నా ఆర్సెనల్ అంతా కింద ఫోటోలో చూడండి..

ఉల్లగడ్డలతో మనం పెద్దగా పీకేదేం లేదు.. ఇక టమేటాతోనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను..ఇంతలో నా వంటరాత్మన్ పొయినవారం బుక్ ఎగ్జిబిషన్ లో  కొన్న రెండు వంటల పుస్తకాలను గుర్తు చేసింది.. వెంటనే ఆ పుస్తకాలు తీశా, వాటిలో చాలానే వంటలు గట్రా ఇచ్చారు.. కానీ టమేటాతో పెద్దగా ఏమీ ఇవ్వలేదు..  అసలే సింపుల్ వంటలు చేసి ఫోటోలు గట్రా బ్లాగుకు ఎక్కించడం నాకసలు ఇష్టం లేదు... శోధించగా శోధించగా "టమేటా పులుసు" కనిపించింది.. ఈ రోజుల్లో సినిమాకు కథకంటే కథనం ముఖ్యం.. ఏ రోజైనా వంటకు టేస్టే ముఖ్యం ..  సరే ఇక మొదలు పెడదాం అనుకొంటుండగా నాలోని పరోపకారి పాపన్న నిద్ర లేచాడు.. ఇలా చేసిన వంటకం ఒక్కడినే తినడం చాలా తప్పు ఇంకొక బక్రా సారీ మనిషి కావాలి అనుకున్నాను.. వెంటనే మారథహళ్ళి లో రకరకాల పనులు చేస్తున్న మన రాజ్‌కుమార్ కు ఫోన్ చేశాను.. ఆ సంభాషణ ఇలా జరిగింది..
నేను: హల్లో రాజ్‌కుమార్, ఎక్కడున్నావ్? బిజీగా ఉన్నావా?
రా: లేదు ఫ్రీగానే  ఇంట్లో ఉన్నాను కార్తీక్ గారూ (ఆ ప్రాంతం వాడు కదా అందుకని "గారు" "గారు" అని సోప్ వేస్తాడు, కానీ నేను పడనుగా)
నే: సరే ఐతే, బ్లాగుల్లో అందరూ వంటలు చేస్తున్నారు కదా నువ్వు కూడా మా ఇంటికి వచ్చేయ్, ఇక్కడే ఇద్దరం కలిసి రచ్చ రచ్చ చేసేద్దాం..
రా: సారీ కార్తీక్ గారూ, మేము ఆల్రెడీ ఇక్కడ మొదలు పెట్టేశాం, మీరు కనీసం ఇంకొక గంట ముందు ఫోన్ చెయ్యాల్సింది..
(స్వగతం: బ్రతికుంటే ఏ బెంగాలీ వంటలైనా తింటా కానీ నేను మాత్రం రాను)
నే: అవునా సరే అలాగే మాంచి చాన్స్ మిస్ అయిపోతున్నావ్ ఆలోచించుకో..
రా: మరోసారి కలుద్దాం..
(స్వగతం: దమ్మ పెబువులు, అంత వీజీగా ఒగ్గేశారు)..

సరే ఇంక రాజ్ కూడా రాలేదని నేనే బుక్ చదవడం మొదలు పెట్టాను.. మొదటి వాక్యమే చాలా కఠినంగా "టమేటాలు ఒకమాదిరి తరిగిపెట్టుకోవాలి" అని ఉంది.. "ఒక మాదిరి" అంటే ఏ మాదిరి కామ్రెడ్ అని గట్టిగా అరిచాను, కానీ మా ఇంటి పక్కనున్న లేడీస్ హాస్టెల్ లో కమ్యూనిష్టులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరూ పలక్లేదు..  సరే బుర్రకు పదును పెట్టి ఏ మాదిరో తెలియనప్పుడు ఒకమాదిరే తరిగి అది తప్పు కావడం కంటే రెండు మాదిరిలుగా తరుగుదాం అని ఒకటి నిలువుగా ఇంకొకటి అడ్డంగా తరిగాను.. ఫోటో చూపించాను కదా..

తర్వాత లైన్ లో చింతపండు పులుసు ఉడికించాలి అని ఉంది..  ఈ చింతపండు పులుసు అంటే, అదింకొక సబ్ వంటకమా అని డౌట్ వచ్చింది.. మరే, డెడ్‌లైన్ , ఇంటర్నల్ డెడ్‌లైన్ ఉంటాయి కదా అలాంటిదేమో అని అనుమానం.. గూగుల్ లో వెతికితే అదేం కాదని, సింపుల్ గా చింతపండులో నీళ్ళు పోసి కడిగి పిచ్చలు తీసేసి దాన్నే పులుసు అంటారు అని తెలిసింది.. ( అబ్బ! ఈ రోజు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో).. అలా ఒకవైపు చింతపండు ఉడికించి మరో వైపు తమేటా వేయించి సవ్యసాచిలా వంట చేసి బాల్కనీ లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నాను..  ఇంతలో మా నార్త్ ఇండియన్ మితౄడొకడు వంట రూములోకి పొయ్యి, "అబే, టమేటా ఫ్రై సహి బనాయ తూనే, పర్ బహుత్ దైల్యూట్ హోగయా" అన్నాడు..  నాకు చిన్నప్పటి నుంచీ విన్న బూతులన్నీ ఒకేసారి వచ్చాయి.. కానీ వాడికి తెలుగు అర్థం కాదని క్షమించేశా..  ఇదుగోండి ఫైనల్ వంటకం కొత్తిమీర తో డెకరేషన్ చేశాక ఇలా తయారయ్యింది..


మాదగ్గరే మైసూర్ కెమెరాలు లేవు కదా అందుకని ఏదో ఫోన్ కెమెరాతో పని జరిపించేశాను..   మరొక మాట వచ్చేవారం మా ఇంటికి వస్తానని మాటిచ్చిన సోదర బ్రహ్మి రాజ్‌కుమార్ కు ఈ టపా అంకితం.. ఈ రోజు చేసిన పులుసు వచ్చేవారం వరకూ ఉంచి మరీ తినిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను..

-కార్తీక్

ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

9/20/2010 - రాసింది karthik at Monday, September 20, 2010
నిన్న చెప్పుదెబ్బలు పూలదండలు బ్లాగులోని టపా చూశాక ఈ కవిత రాశాను..

విడగొడతా నేను
బొందలు పెడతా నేను
రక్తంపారిస్తా నేను
నెగడు ఎగదోస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

గనులను భోంచేస్తా నేను
పత్రికతో పాతరేస్తా నేను
ఆంధ్రా ఖోడా గా మారుతా నేను
ఏదీ కుదరకపోతే ఓదారుస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

సినిమాలను వొదిలేసా నేను
వీధి డ్రామాలు మొదలెట్టా నేను
ఝెండా పీకేస్తే ఊరుకోను నేను
జనాలను అంత సులభంగా వదలను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

సామంతుడిని నేను
కొరియర్ వాడిని నేను
అధిష్ఠానానికి మొక్కుతా నేను
ఫిర్యాదులు చేస్తా నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

ఏ ఎండకాగొడుగు పడతా నేను
మైండు బ్లాక్ అయ్యి వెర్రెత్తిపోతున్నా నేను
మహరాష్ట్రకుపోయాను నేను
మొహం పగలగొట్టించుకున్నాను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం!!

మేడం కు కాల్మొకుతా నేను,
ఢిల్లీ గల్లీలో సిల్లీగా నేను,
ఎలక్షనుపొయినా ఆశ వదల్లేదు నేను,
ఏమైనా చేస్తాను నేను
ఎందుకోసం?? నా కుర్చీకోసం..

-కార్తీక్

బ్రహ్మచారి బ్లాగర్ల దినం !!!

9/10/2010 - రాసింది karthik at Friday, September 10, 2010
టపా టైటిల్ మరోసారి చదవండి.. అది "బ్రహ్మచారి బ్లాగర్ల దినం" "బ్రహ్మచారి బ్లాగర్లకు దినం" కాదు..   ఇక విషయం ఏమిటంటే బ్లాగుల్లో బ్రహ్మచారుల మీద జరుగుతున్న దాష్టికాలకు వ్యతిరేకంగా "అఖిలభారత బ్రహ్మచారి బ్లాగర్ల సంఘం" ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడానికి నేను మిక్కిలి సంతోషిస్తున్నాను.. ఈ సంఘానికి అధ్యక్షులు సెగట్రీలు తొక్కా తోలు లేకుండా  ఒక బాధ్యతాయుతమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మచారులు తరతరాలుగా ఎదుర్కుంటున్న వివక్షను రూపుమాపటానికి కృషి చేస్తాం..  ఈ పరిణామం ప్రపంచ బ్లాగర్ల చరిత్రలో ఒక మేలి మలుపని పలువురు మేతావులు అభివర్ణిస్తున్నారు..   అసలు బ్రహ్మచారుల సంఘం ఎందుకు మొదలయ్యిందంటే:
1. ఇల్లు అద్దెకు అడిగితే ప్రతీ ఒక్క తాగుబోతు వెధవా "బ్యాచిలర్స్? నో హౌస్" అంటాడు.. అక్కడికి వాడేదో బ్రహ్మచారిగా బ్రతకనట్టు..
2. ఆఫీస్ నుంచీ లేటుగా ఇంటికి వస్తే, గేటు తాళం తీసే లోపు ఒక చిన్న సైజు భగవద్గీత వినాల్సి రావడం..
3. బ్రహ్మచారుల బ్లాగుల్లో కామెంట్లు బొత్తిగా లేకపోవడం..
4. బ్రహ్మచారులకు అగ్రిగేటర్లలో కోటా లేకపోవడం.. 

చెప్పుకుంటూపోతే ఒకటా రెండా, ఎన్నో వివక్షాపూరిత మాటలు, చేతలు  అభిజాత్యపు పొరల్లో నుంచీ వస్తున్నాయి..  వాటిని ఎదుర్కొనేందుకు పుట్టిందే ఈ సంఘం..  ఇక విధివిధానాల గురించి వస్తే, బ్రహ్మచారి సంఘం ఎవరికైనా అంశాల వారి మద్దతు మాత్రమే ఇస్తుంది..  అంటే ఇప్పుడెవరికైనా మాతో పని ఉంటే వాళ్ళు మాకు వేరొక రెండు అంశాలలో సహకరిస్తేనే మేము వాళ్ళకు సహకరించేది.. కుటుంబరావులైతే మాకు ధనవస్తువాహన సహాయం అందించాలి, ఇక సతీ సక్కూబాయిలైతే మాకు కనీసం రెండు రెసిపీలు చెప్పాలి..  ఇక అగ్రిగేటర్ల యజమానులు ఏదో ఒకటి చేసి మా బ్లాగుల్లో ఎక్కువ కామెంట్లు వచ్చేటట్లు చెయ్యాలి..  "పప్పన్నం ఎప్పుడు?", "ఫోటో జాతకం తయారు చేశావా ?"లాంటి  ప్రశ్నలడిగినవాళ్ళని తగు విధంగా శిక్షించాలి.. అప్పుడే మా సంఘాన్ని తమ సంఘానికి అనుభంధ సంఘంగా నడపమని కొందరు కుటుంబరావులు సలహాలిస్తున్నారు..  వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే తరతరాలుగా మీ వివక్షు గురై ఎంతో క్షోభ అనుభవించాం.. ఇప్పుడు మా ధిక్కారాన్ని చూసి మీరు శాంతిమంత్రం పఠిస్తున్నారని మాకు తెలుసు.. ధిక్కారం ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ధిక్కారం ఉంది..   మా న్యాయబద్దమైన డిమాండ్లకు మీరు తలొగ్గకపోతే మా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు..
 కావున బ్రహ్మచారులారా! ఇక నుంచీ మీరు నిర్భయంగా మీ బ్రహ్మ చర్యం గురించి ఎలుగెత్తి చాటండి.. మీకు తోడుగా, మీ వెన్నంటి నీడగా, మీ తల్లో పేనుగా మేముంటాం..  "బ్రహ్మచారి నైన నాజీవితం లో కూడా ఒక బ్రహ్మచారి కథ ఉంది" అందరూ చెప్పుకోవాలి..


మరొక మాట, ఈ రోజు అంటే సెప్టెంబర్ 10 బ్రహ్మచారుల దినం గా ప్రకటిస్తున్నాను.. ఎందుకంటే ఈ రోజు మన బ్రహ్మచారి మితృడైన రవిచంద్ర తన బ్రహ్మచర్యానికి "లాల్ సలాం " చేస్తున్నాడు కనుక ఈ చరితాత్మక రోజుని గుర్తుంచుకోవాలని ఇలా చేయడం జరిగింది..  కొద్ది సేపటి క్రితం ఫోన్ చేస్తే "మీరు ప్రయత్నిన్స్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు" అని రిప్లై వచ్చింది.. 

ఈ రోజు దాంపత్య జీవితం లోకి అడుగుపెడుతున్న రవిచంద్ర గారికి మా అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు..  

-కార్తీక్
 

నేను ,సైకిల్ చైను, ఓ తెల్లమ్మాయి!

8/17/2010 - రాసింది karthik at Tuesday, August 17, 2010
టైటిల్ చూసి ఇదేదో వికటకవి మొన్నటిదాకా రాసిన రొమాంటిక్ థ్రిల్లర్ ట్రాజెడీలకు కొనసాగింపు అనుకుంటే మీరు పైత్యావలోకనం లో కాలేసినట్టే..  ఇదొక కామిక్ ట్రాజెడీ అంటే చదివే వాళ్ళకు కామెడీ రాసేవాడికి అంటే నాకు ట్రాజెడీ..

ఇక విషయానికి వస్తే, అవి నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు..
అమ్మాయిలతో మాట్లాడినవాళ్ళాను మా సార్ వెదురు బొంగు తీసుకుని చితక్కొట్టుడు కొడుతున్న రోజులు.. 
కడపలో ఒకటవ తరగతి నుంచే ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కాలేజీలు/స్కూళ్ళు లేని రోజులు.. 
చంద్రబాబు ఇంకొక 20ఏళ్ళు సీ.యం. గా ఉంటాడని అందరూ అనుకుంటున్న రోజులు.. 
కే.సీ.ఆర్. కు తెలంగాణా సమస్య కనిపించని రోజులు.. 
నా అభిమాన గాయకుడి పదవి నుంచీ మహమద్ రఫీని నేనింకా పీకేయని రోజులు..

అటువంటి రోజులలో  ఒకానొక రోజు అష్టగ్రహకూటమి+మహాళయ అమావాస్యా కలిపి వచ్చాయన్నమాట.. (మరే! తెలుగు హీరోలకు కష్టాలు రావాలంటే ఆ మాత్రం డ్రామా లేకపోతే ఎలా?) .. అప్పుడు నేను ఎంసెట్ ప్రిపరేషన్ పొడిచేస్తున్నాని నా బలమైన నమ్మకం.. మరింతగా పొడిచేయడానికి "చంద్ర కోచింగ్ సెంటర్" అనే కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను.. ఈ కోచింగ్ సెంటర్ వరల్డ్ ఫేమస్ అని కడపంతా చెప్పుకుంటారు..  ఈ కోచింగ్ సెంటర్ నుండీ ఆ అమావాస్య రోజు మేము (అనగా అతి బుద్దిమంతుడినైన నేను మా కాలేజిలో పిల్లలని చెడగొట్టడానికి పుట్టిన ఇంకొక నలుగురు వెధవలు) సైకిళ్ళు తొక్కుకుంటూ రాజు వెడలె... అంటూ ఇంటికి వస్తున్నాం.. మా కోచింగ్ సెంటర్ సారుకు మా గురించి అంటే మిగతా వెధవల గురించి చాలా బాగా తెలుసు అందువల్ల అమ్మాయిలను ఇంటికి పంపించిన ఒక 20 నిమిషాలకు మమ్మల్ని వదిలేవాడు.. ఆ 20నిమిషాలలో మమ్మల్ని ఆ రోజు చెప్పినవి అడుగుతూ స్పెషల్ కోచింగ్ ఇచ్చేవాడు..  ఆరోజు ఎందుకో నేను అందరికంటే వెనుకగా వస్తున్నా కొంత దూరం పొయ్యాక మా కాలేజి అమ్మాయి ఒకరిది సైకిల్ చైన్ పడిపోతే దాన్ని వేయడానికి అవస్థలు పడుతూ కనిపించింది.. నేను దూరాన్నుంచే చూశాను కానీ వెదురుబొంగు గుర్తుకు వచ్చి మనకెందుకు వచ్చిన ఆడగోల అని వెళ్ళబోయాను.. అంతలో మా ఫ్రెండ్ చెల్లెలు ఒకమ్మాయి(ఆ అమ్మాయి కూడా మా క్లాసే) కనిపించి  సైకిల్ చైన్ అమ్మాయిని చూపిస్తూ చైన్ వేసివ్వమని అడిగింది.. సరే ఇక తప్పేదేముంది అని ఆ సైకిల్ చైన్ వెయ్యడానికి ఉపక్రమించాను.. ఆ సైకిల్ ఏ అశోకుడో గ్రీన్ డ్రైవ్ కోసం సైక్లథాన్ చేసినప్పటిదిలా ఉంది. అష్టగ్రహ కూటమి మహిమో లేక మహాళయ అమావాస్య పవరో తెలీదు కానీ ఆ చైన్ సరిగ్గా సర్దలేకపోయాను.. అప్పటికే 5,6ఏళ్ళ సైకిల్ అనుభవం సొంతం  అయినా కూడా చైన్ వెయ్యలేకపోయా!!  ఇక లాభం లేదనుకుని ఆ సైకిల్ ని అలాగే చంకలో పెట్టుకుని రోడ్డు పక్కకు తీసుకుని పోయా.. మోకాళ్ళ మీద కూచుని రెండు చేతులతో చైన్ అడ్జస్ట్ చేస్తూ దాన్ని సరి చేయడానికి ప్రయత్నించాను..ఊహూం ఏం లాభం లేదు.. అయినా కూడా అది పడలేదు.. ఒకవైపేమో మా కాలేజీ అమ్మాయిల ముందు మన ప్రిస్టేజి.. మరో వైపేమో మహాళయ అమావాస్యా.. ఏం చేస్తాం, కష్టాలు మనుషులకు కాక మా ప్రిన్సిపల్ కు వస్తాయా అనుకుని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించసాగాను..  ఆ సమయం లో సుమన్ కు ప్రభాకర్ దొరికినట్లు నాకు మా ఫ్రెండ్ ఇంకొకడెవడో కనిపించాడు.. వాడు నా గ్రీజుపట్టిన చేతులవంకా మట్టికొట్టుకుపొయిన ప్యాంటు వంకా చూసి పరిస్థితి అర్థం చేసుకున్నాడు.. వెంటనే ఆ అమ్మాయిలతో "ఈ సైకిల్ కు చైన్ చాలా కాంప్లెక్స్ సిస్టం, సార్ మొన్నొకసారి ఇలాంటి దాని గురించి చెప్పారు మీకు  గుర్తుందా?" అన్నాడు..  నాకు నిప్పురవ్వ సినిమా చూసిన ప్రేక్షకుడిలా మాట పడిపోయింది.. మళ్ళీ వాడే "నేను ఒకసారి ట్రై చేస్తాను" అని సైకిల్ దగ్గరికి వచ్చాడు.. ఎన్ని జన్మలు సైకిల్ షాపుల్లో పని చేశాడో తెలీదు కానీ, అంట్లకాకి వెధవ వెంటనే వేసి పడేశాడు..   నాకు కోపం తో కలిపిన మంట వల్ల ఏడుపొచ్చింది..  వాడేమో నువ్వే కావాలి లో తరుణ్ లా చైన్ లో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది అని ఆ అమ్మాయిలకు లెక్చర్ ఇస్తున్నాడు..   నాకు మండిపొయి వెదురుబొంగు గురించి గుర్తు చేసాను.. దండం దశగుణం భవేత్ అని ఊరికే అన్లేదు కదా.. అది పని చేసి వడెళ్ళిపోయాడు..ఇంతలో మా బ్యాచ్ అనగా మిగతా వెధవలు నేను ఎక్కడో దారి తప్పిపోయాననుకుని వెనక్కు వచ్చారు..    సరిగ్గా ఆ చైన్ అమ్మాయి నాకు "థాంక్స్" చెప్పింది..  అది విని వచ్చేజన్మలో రాధిక సీరియల్ లో హీరోయిన్ మొగుడిగా పుట్టినా బాగుండు అనిపించింది..  కానీ మా వాళ్ళు మాత్రం ఆ థాంక్స్ వల్లా, మట్టి కొట్టుకుపొయిన నా ప్యాంటు వల్లా ఆ సైకిల్ చైన్ నేనే వేసిచ్చానని అనుకున్నారు.. వెంటనే టెలీపతీ ద్వారా మా క్లాస్ అందరికీ తెలిసిపొయింది.. ఆ తర్వాత చెప్పేదేముంది.. ప్రతీ నెలతక్కువ వెధవా "కార్తీక్, సైకిల్ చైన్" అని గట్టిగా అరిచేవాడు..  నేను గానీ ఆ అమ్మాయి గానీ క్లాస్ లోకి అడుగు పెడుతుంటే  చాలు "సైకిల్ చైన్" అని తప్ప వేరే మాటే వినిపించేది కాదు..   కొన్ని రోజులకు తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. దాన్లో వాళ్ళు ఎగ్జాం పేపర్స్ ఇచ్చినప్పుడు అరిచినట్టు నా పేపర్ వచ్చిన ప్రతీసారీ "సైకిల్ చైన్" అని అరిచేవాళ్ళు..    బండ వెధవలు.. :(

-కార్తీక్