జడివాన

5/01/2008 - రాసింది karthik at Thursday, May 01, 2008
స్కూల్లో చదివే రొజుల్లో ఒక తెలుగు పాఠం 'జడివాన '. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తే ముందు కురిసిన వాన గురించి అందులో చదివాను. మొన్న మంగళవారం రాత్రి వాన సృష్టించిన భీభత్సం నాకు ద్వాపరయుగాన్ని గుర్తు చేసింది.

అలవాటుగా నేను రాత్రి 11గం.ల కు ఇంటికి చేరాను. ఆఫీస్ దగ్గర వర్షం పెద్దగా లేదు అందువల్ల తిన్నగ ఇంటికి వెళ్ళి పోయాను. మేము వుండేది కోరమంగల లో. అది చాలా హై క్లాస్ ఏరియా అని నా లాంటి వాళ్ళము కహానీలు చెబుతుంటాం.(ఒక గదికి వేలకు వేలు అద్దె కడతాం కదా, ఆ బాధ ఇలా వెళ్ళగక్కుతాం) .

కానీ ఇంటికి చేరేసరికి మా వీధి ఒక డంపింగ్ గ్రౌండ్ ల వుంది :( 3 కరెంట్ స్తంభాలు, 6 చెట్లు పడిపోయాయి. జాక్ పాట్ కొట్టినట్లు మా ఇంటి ముందు ఉన్న చెట్టు కూలిపొయి మా వాకిలి మీద పడింది. (దేవుడి దయ వల్ల ఇంటికి లేటుగా వెళ్ళాను, లేకపోతే ఈ పాటికి అమరుడిని అయ్యేవాడిని :) ) ఎలాగో ఆ చెట్టును సరి చేసి ఇంట్లొ వెళ్ళాను. మామూలుగానే కరెంట్ లేదు. ఆకలితో కడుపు మండిపోతొంది. కొవ్వొత్తి వెలిగించి వంటింట్లోకి వెళ్ళాను. అప్పుడు తెలిసింది నాది జాక్ పాట్ కాదు డబుల్ బంపర్ లక్కీ డ్రా అని, ఎందుకంటె మా వంటవాడు, పనిమనిషి ఇద్దరు రాలేదు. సింక్ నిండా వున్న గిన్నెలు స్వాగతం పలికాయి. చేసేది ఏమీ లేదు కనుక మొదట గిన్నెలు కడిగాను, తర్వాత వంట పని మొదలు పెట్టాను. ఎర్రగడ్డలు, టొమాటోలు తరిగే సమయానికి కొవ్వొత్తి ఐపోయింది. అల్మారా లో వెతకగా ఇంకొక విషయం బోధ పడింది: వున్నది ఒకేఒక కొవ్వొత్తి,దాన్ని ఇందాకే ముగించాను. కంపరం అంటారు కద, దాన్ని 100తో గుణిస్తే ఏమంటారో అది పుట్టింది.

ఎవరికైనా ఫోన్ చెయ్యాలనిపించింది కానీ ప్రజలు '12గం. తర్వాత ఫోన్ ఎత్తం' , 'నీ గొంతు వింటే ఫోన్ కట్ చేస్తాం' లాంటి రూల్ బేస్ లో ఉన్నారు కనుక ఫోన్ తియ్యలేదు. ఐనా చేసేది ఏమి లేదు కనుక మొబైల్ లైట్ తో పప్పు అన్నం చేసుకుని తిన్నాను. నా పరిస్థితి ఇలా వుంటే మా తాగుబోతు ఓనర్ నీళ్ళు దుబారా చేయ్యొద్దు అని ఒక 5పైసల సలహ ఇచ్చాడు. నీళ్ళు వుంటే కదరా దుబారా చెయ్యటానికి, నీ పిండాకూటికి కూడా లేవురా అంట్ల వెధవా అని చెప్పి నిద్ర పొయే సరికి 2:30 దాటిపోయింది.





ఏం జరుగుతోంది?

4/15/2008 - రాసింది karthik at Tuesday, April 15, 2008
ప్రసన్న లక్ష్మి- షేక్ సుభాని
శ్రీ లక్ష్మి- మనోహర్
మీనా కుమారి-సందీప్

వీరంతా రాష్ట్రం లొ పెద్ద సంచలనం సృష్టించిన వారు. ఒకరు మరణించి/గాయపడి, మరొకరు దాడి చేసి. ఈ సంఘటనలు జరిగాక అందరూ ఆ పని చేసిన అబ్బాయిలను తిట్టీ, శపించి వారి కోపాన్ని, భాధను వెళ్ళ గక్కారు.
కాని ఈ సంఘటనల తర్వాత మనం(మన సమాజం) ఏదన్నా నేర్చుకున్నమా?
పైన చెప్పిన సంఘటనలు జరిగిన తరువాత పేపర్లలో, టీవిలో, బ్లాగుల్లొ, అమ్మాయిలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పారు. కేవలం జాగ్రత్తలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? మనం ప్రభుత్వాన్ని తిడతాం, కాని ప్రతి ఒక్క అమ్మాయికి పోలీస్ రక్షణ సాధ్యమేనా?

ఒక ఇంగ్లీష్ సామెత చెప్పినట్టు 'society prepares the crime and the criminal commits it'
ఆ దారుణాలు చేసిన వారు కరడు కట్టిన తీవ్ర వాదులు కారు లేదా ఫైనాన్సె కంపెని పేరుతొ డబ్బు దోచుకున్న వారూ కాదు. వాళ్ళూ మన లాంటి వాళ్ళే. కాస్త సరైన దారిలో చూపించే వారు ఉండి ఉంటే ఏ సాఫ్ట్ వేర్ కంపని లోనో జాబ్ చేస్తు ఉండే వారు.

కాకతాళీయంగా నేనూ కూడా 2001 లో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యి తర్వాత ఐ.ఐ.టి లో చదివి ఇప్పుదు నెలకు 5 అంకెల జీతం తీసుకుంతున్నను. మరి అదే ఆశయం తో వున్న సందీప్ ఇప్పుదు రాజమండ్రి సెంట్రల్ జైలు లొ ఉన్నాదు :(
********************************************************************************
నాకు ఆ అమ్మయిల కుటుంబాలను కించపరిచే/బాధ పెట్టే ఉద్దేశ్యం లేదు. వారు చెసిన పనిని సమర్ధించటం లేదు. దయ చేసి అర్ధం చేసుకొగలరు
********************************************************************************
కాని వారు ఎందుకు అలా అయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు.
స్త్రీలకు 33% రిజర్వేషన్ గురించీ, వాళ్ళ హక్కుల గురించి, ఎక్కువ మట్లాడితె అర్ధనారీస్వర తత్వం గురించి లెక్చర్లు దంచుతాం. కాని మనలో ఎంత మందిమి మనతో పని చేసే మనకు కనిపించే ఆడవారిని 'అదీ 'ఇదీ అని కాకుండా మాములుగా సంభోధిస్తాం?

స్త్రీలను గౌరవించటం అనేది మన ఇంటి నుంచి మొదలు కావాలి. ఆ పరివర్తన వ్యక్తి నుంచి మొదలై సమాజం వరకు రావాలి. అది జరుగనంత వరకు మరెంతొ మంది మీనా కుమారి లను చూడక తప్పదు.

నేను ఒక ఫెమినిస్ట్ ను కాను
బెంగళూరు మహిళా సంఘ కార్యదర్సిని అంతకు ముందే కాను.
ఒక మనిషిని. పదహారణాల తెలుగు బిడ్డను.

నాకు నచ్చిన పాట

3/18/2008 - రాసింది karthik at Tuesday, March 18, 2008

ఇది నాకు చాలా నచ్చిన పాట. దీని ఆడియొ ఎవరి దగ్గరైన వుంటె దయ చేసి ఇవ్వ గలరు

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

విశ్రమించవద్దు ఏ క్షణం.
విస్మరించవద్దు నిర్ణయం.
అప్పుడే నీజయం నిశ్చయం రా.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు
తక్కువేనురా
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు
తక్కువేనురా
సంద్రమెంత పెద్ద దైన ఈదుతున్న మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండు రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి విండ సాగరాల నీదు కుంటు తూరుపింట తేలుతుందిరా
నిషావిలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుంత గుండె కూడ సూర్య గోళమంటిదేనురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరశించి నిలిచిపోతే మిముషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా...
ఆశ నీకు అస్త్రమవును..
శ్వాశ నీకు శస్త్ర మవును.
ఆశయమ్ము సారధవునురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక.
శవము పైన గెలుపు చాటురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

ఇన్సురెన్సె..

11/15/2007 - రాసింది karthik at Thursday, November 15, 2007
ఈ టపా లో కల్పితాలు ఏమీ లేవు. అన్ని మాటలు రెండు వారాల క్రితం జరిగినవి.
నాకు ఈ మధ్యనే వచ్చిన ఫొన్ కాల్ అచ్చ తెలుగులో

నేను:హల్లొ..
అటు వైపు:గుడ్ మార్నింగ్ సర్..థిస్ ఇజ్ శరవణన్ ఫ్రం యెస్.బి.ఐ.------ కాన్ ఐ స్పీక్ టు కార్తికేయన్? (ఈ అరవ మొహాలు నా పేరు శుద్దంగా వాళ్ళ జీవితం లో పలకలేరు :( )

నిజమైన అర్థం: ఆ.. కార్తికేయ దొరికినావు కద!! ఈ రోజు నువ్వు ఫినిష్.

నేను:ప్లీజ్ టెల్ మీ
అటు వైపు: సర్ వియ్ హ్యవ్ అ వెరి గుడ్ పాలసి ఫార్ యు. ఇఫ్ యు పే 340 పర్ మంత్ యువర్ మథర్ మిస్సెస్ భారతి విల్ గెట్ అన్ అమౌంట్ ఆఫ్ 4.5 లాఖ్స్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్.
నిజమైన అర్థం: మీరు నెలకు 340 రుపాయలు మాకు ఇస్తే మేము 1.5 సంవత్సరముల తరువాత మీ తల్లి గారికి 4.5 లక్షల రుపాయలు ఇస్తాం.

నేను: రియల్లి???
నిజమైన అర్థం: ఆహా యెస్.బి.ఐ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు!! మా అమ్మ గురించి తెలుసుకుని మరీ డబ్బులు ఇస్తున్నారు. జజ్జినక జజ్జినక!!!
అటు వైపు: యెస్ సర్ ..
నిజమైన అర్థం: పడ్డావురా.. రేయ్! నువ్వు ఖతం (ఇది తమిళ భాషలొ ఎందుకంటె వాళ్ళు హింది ద్వేషులు కద మరి)
అటు వైపు: ఆల్సొ వియ్ రికగ్నైజ్డ్ యు ఆజ్ ఆన్ ఎస్టీమడ్ కస్టమర్ సో వి య్ హ్యవ్ ఇంక్లూడెడ్ నాచురల్ డెత్ ఆల్సొ.
నిజమైన అర్థం: నువ్వు చచ్చె వరకు వదలం హే హే హే..
నేను: వాట్!!! వై షుడ్ ఇ డై?
నిజమైన అర్థం:నేను మా అమ్మకు ఒక్కగా నొక్కణ్ణి వర ప్రసాదిని!! నేను ఛస్తె చావను..
అటు వైపు: వాట్ కార్తికేయన్ సర్ హౌ విల్ యువర్ మథర్ గెట్ మనీ?
నిజమైన అర్థం: ఓరి నీ xxx(censored)..నువ్వు చస్తే కద మాకు మనశ్శాంతి (ఇది కూడా తమిళ భాష లో నే..కరుణ నిధి కళ్ళద్దాల మీద ఒట్టూ)
నేను: బట్ ఐ యాం నాట్ ఇంటెరెస్టెడ్.
నిజమైన అర్థం: నీ దుంపతెగ నాకు అదే పని మిగిలిందా!!
అటు వైపు: వాట్ సార్ ఆజ్ యు ఆర్ ఎ న్యు కస్టమర్ వియ్ హ్యవ్ ఇంక్లూడెడ్ సూసైడ్ ఆల్సొ
నిజమైన అర్థం: ఎలగోలా చావు లేక పోతే మేము చంపుతాం.
నేను: హెల్ విత్ యువర్ పాలసి!!!
ఫొన్ కట్..
---------------------------------
ప్రకటన: మద్రాసు లో తంగ వేల్, శరవణ వేల్, చిటికెన వేల్, బొటన వేల్, అని నలుగురు కోతి నాయళ్ళూ రాతి యూగం లో వుండేవారని తెలిసింది. ఇప్పుడు వాళ్ళ వంశీకులైన తంగ వేల్ పందికుమార్, చిటికెన వేల్ క్రోధనిధి ా నాయకత్వం లొ ఆ కోతి మూక ఇలా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నరు. కనుక 9144--- అని ఫొన్ లో క్నపడితె వెంటనె ఫొన్ కట్ చెయ్యండి.

నాడు- నేడు

10/01/2007 - రాసింది karthik at Monday, October 01, 2007
పురాణ కాలం:
గొడవ జరిగితే ఒక మంచి ప్రదేశం, ముహూర్తం, చూసుకుని నియమం తప్పకుండా యుద్దం లొ చంపేవారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది.
రాజుల కాలం:
యుద్దాలు జరిగేవి ఐనా వేరే మార్గాల్లొ కూడా మనిషిని చంపేవారు. ధర్మం ఎన్ని పాదాల మీద నడిచేదో తెలీదు కాని కనీసం రెండు పాదాలు అని ఒక నమ్మకం.
మహమ్మదీయుల కాలం:
రక రకాల మార్గాల్లొ హత్యలు జరిగేవి. ఐనా అక్బర్, తానిషా లంటి వారు వున్నారు కనుక ఒక పాదం మీద కొన్ని సార్లు రెండిటి మీద ధర్మం నడిచేది.
బ్రిటిష్ కాలం:

దుర్మార్గాలు చాల జరిగేవి. కాని కాటన్, సి.పి. బ్రౌన్ లాంటి వాళ్ళ వల్ల ధర్మం ఒక కాలు తో నడక అలవాటు చేసుకుంది.
ప్రస్తుతం:
ధర్మం ఒక కాలు మాత్రం మిగుల్చుకుంది కానీ దానికి చికెన్ గన్యా జ్వరం వచ్చింది. దాని వల్ల బాంబు తల్లులు, బాంబు తండ్రులు పుట్టుకొచ్చారు. ఇక ఆంధ్ర దేశం లొ మరో కొత్త పద్దతి కని పెట్టడం జరిగింది. అది ఏమనగా మనిషిని ఇంటికి పిలిచి ప్రభుత్వం చే గుర్తింపు పొందిన తుపాకి తో కాల్చటం!!!
ఒక వేళ ఎవరైన అడగటం అంటు జరిగితే అది ఆత్మహత్య అని మౄతునికి భవ సాగర 'బంధాల ' నుంచి విముక్తి కలిగించుటకు తుపాకి ఇవ్వడం జరిగింది అని చెప్పవచ్చు. ఒక వేళ అతను బతికి బట్టకట్ట్డం అంటు జరిగితే అది ఇంటి బయట నుంచి ఎవరో గుర్తు తెలియని వారు కాల్చారని, వారికి కూడా తుపాకి అద్దె కు ఇచ్చాం అని చెప్పవచ్చు.


రాయలసీమ లో చదువు లేని వాళ్ళు ఊరి కోసం, తిండి కోసం చంపుకుంటె ఫ్యాక్షనిజం అని సినిమాలు తీసి పెద్ద పెద్ద సందేశాలు ఇస్తారే, మరి రాజధాని నడిబొడ్డున ఏ.సి. రూముల్లొ వుంటూ, స్కాచ్ తాగుతూ మూఢ నమ్మకాలకోసం, భూమి కోసం అయిన వాళ్ళనే చంపుతుంటె దాన్ని ఏ పేరు తో పిలవాలి? దాని మీద ఎన్ని సినిమాలు తియ్యాలి?