నాకు భయమేస్తోంది..

5/30/2010 - రాసింది karthik at Sunday, May 30, 2010
అవును నిజం నాకు భయమేస్తోంది.. కర్ణుడి చావుకి చాలా కారణాలు అలాగే నాకు భయమేయడానికి కూడా చాలానే కారణాలు.. వాటిల్లో కొన్ని ఇవి:

రాకెట్ ఎక్కాలంటే భయం.
ఇప్పుడు రాకెట్ ఎందుకు ఎక్కాలంటారా?? పచారి కొట్టులో ధరలను అందుకోవాలంటే రాకెట్లు, చంద్రయాన్ తప్పేలా లేవు..

రైలు ఎక్కాలంటే భయం.
ఏ అన్నకో కోపం వచ్చి కొన్ని పట్టాలను కోసుకొని పాత సామాన్లకు వేసుంటాడని భయం.

విమానం ఎక్కాలంటే భయం.
టెక్నాలజీ సౌజన్యంతో ఏ లోయలోకో తీసుకెళ్ళి బ్రతికుండగానే తగలబెడతారని భయం.

బస్సు ఎక్కాలన్నా భయం.
ఏ సందు మలుపులోనో పొంచి ఉన్న కరెంటు తీగ సున్నితంగా ముద్దాడి మక్కువ తీర్చుకుంటుందేమోనని భయం.

సాయంత్రం సరదాగా మాల్ కు పోవాలన్నా భయం.
ఏ జిహదీనో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆ మాల్ లో ఒక అరడజను బాంబులు పెట్టుంటాడని భయం.

భక్తి తో గుడికి వెళ్ళాలన్నా భయం.
ఏ గోపురాన్నో కూల్చి ఒకేసారి ముక్తిని ప్రసాదిస్తారని భయం.

ఇల్లు కొనాలంటే భయం.
రేప్పొదున ఏ రాజకీయ రావణుడొ వచ్చి కబ్జా చేస్తాడని భయం.

పత్రికలు చదవాలంటే భయం.
చావులు,రేపులు కాక ఇంకేమీ ఉండవని భయం.

 
ఇంట భయం బయట భయం
ముందు భయం వెనుక భయం
బ్రతుకంతా భయం భయం
ఇంత భయంగా మాట్లాడుతున్న నా పేరు చెప్పలేదు కదూ.. ఇదుగోండి:

మధ్య తరగతి మానవులం!
నిస్సహాయకులం నిష్ప్రయోజనులం!
దరిద్రులం దామోదరులం!
మా చిరునామా స్వార్థం, మా బ్రతుకు వ్యర్థం!
మా నేస్తం స్వప్రయోజనం, మా మరో పేరు మూర్ఖత్వం!
నిర్లక్ష్యం మా చుట్టం, నైరాశ్యం మా నైజం !
శనిదేవుడి సేవకులం, లక్ష్మీ ప్రసన్నత మాకు శూన్యం!
కర్మ భూమిన కుక్కలం, లేదు మాకు ఆత్మ బలం!

-కార్తీక్